కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను”

“మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను”

దేవునికి దగ్గరవ్వండి

“మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను”

లేవీయకాండము 19వ అధ్యాయం

‘యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.’ (ప్రకటన 4:8) బైబిలు ఈ మాటలతో యెహోవా పరిశుద్ధుడనీ అంటే ఆయన పవిత్రుడనీ, నిర్మలమైనవాడనీ, ఈ విషయంలో మరెవరూ ఆయనకు సాటిరాలేరనీ వివరిస్తోంది. దేవుడు పాపరహితుడు; పాపం ఆయనను ఏ విధంగానూ మలినపరచలేదు. అయితే, అపరిపూర్ణ మానవులు ఎంతో పరిశుద్ధ దేవుడైన యెహోవాకు దగ్గరయ్యే అవకాశమే లేదా? కచ్చితంగా ఉంది! లేవీయకాండము 19వ అధ్యాయంలో మనకు హామీనిచ్చే మాటలను పరిశీలిద్దాం.

“ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము” అని యెహోవా మోషేకు చెప్పాడు. ఆయన ఆ తర్వాత చెప్పిన మాటలు ఆ జనాంగంలోని ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. మోషే వాళ్లకు ఏమి చెప్పాలని దేవుడు ఆజ్ఞాపించాడు? “మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను” అని చెప్పమన్నాడు. (2వ వచనం) ప్రతీ ఇశ్రాయేలీయుడు పవిత్రమైన ప్రవర్తన కలిగివుండాలి. ‘ఉండవలెను’ అనే పదం, ఇది ఒక సలహా కాదుగానీ ఒక ఆజ్ఞ అని చూపిస్తోంది. అసాధ్యమైనది చేయమని దేవుడు కోరుతున్నాడా?

పరిశుద్ధత విషయంలో తనతో సమానంగా ఉండాలని కాదుగానీ పరిశుద్ధంగా ఉండాలని తానెందుకు కోరుతున్నాడో తెలియజేయడానికే యెహోవా తన పరిశుద్ధతను ప్రస్తావించాడు. మరోలా చెప్పాలంటే, ఇశ్రాయేలులోవున్న తన అపరిపూర్ణ ఆరాధకులు తనంత పరిశుద్ధంగా ఉండాలని ఆయన వాళ్లకు చెప్పలేదు. అలా ఉండడం అసాధ్యం. ‘పరిశుద్ధ దేవుడైన’ యెహోవా పరిశుద్ధత విషయంలో అందరికన్నా ఉన్నతుడు. (సామెతలు 30:3) అయితే, యెహోవా పరిశుద్ధుడు కాబట్టి, తన ఆరాధకులు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. అంటే అపరిపూర్ణ మానవులుగా వాళ్లకు సాధ్యమైనంత మేరకు పరిశుద్ధులై ఉండాలని కోరుతున్నాడు. తాము పరిశుద్ధంగా ఉన్నట్లు వాళ్లెలా నిరూపించుకోవచ్చు?

పరిశుద్ధంగా ఉండమని ఆజ్ఞాపించిన తర్వాత, జీవితంలోని ప్రతీ రంగంలో ఎలా పరిశుద్ధంగా ఉండాలో యెహోవా మోషే ద్వారా తెలియజేశాడు. ఇశ్రాయేలీయులలో ప్రతీ ఒక్కరు ఈ ప్రవర్తనా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి: తల్లిదండ్రులను, పెద్దవారిని గౌరవించాలి (3, 32 వచనాలు); చెవిటివారిని, గుడ్డివారిని, బాధపడుతున్న ఇతరులను ఆదరించాలి (9, 10, 14 వచనాలు); ఇతరులతో నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి (11-13, 15, 35, 36 వచనాలు); తనలాగే తన తోటి ఆరాధకులను ప్రేమించాలి. (18వ వచనం) ఇశ్రాయేలీయులు వీటికీ, పేర్కొనబడిన ఇతర ప్రమాణాలకూ కట్టుబడి ఉండడం ద్వారా, ‘దేవునికి ప్రతిష్ఠితులై ఉంటారు.’—సంఖ్యాకాండము 15:39.

పరిశుద్ధత గురించి యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞ, ఆయన ఆలోచనా విధానం గురించి, మార్గాల గురించి మనకు ఎంతో విలువైన విషయాలను తెలియజేస్తుంది. ఒక విషయమేమిటంటే, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగివుండాలంటే, పరిశుద్ధ ప్రవర్తన విషయంలో ఆయన ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి శాయశక్తులా కృషి చేయాలని తెలుసుకుంటాం. (1 పేతురు 1:14-16) ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నప్పుడు, మనం సాధ్యమైనంత మంచి జీవితాన్ని జీవిస్తాం.—యెషయా 48:17.

పరిశుద్ధంగా ఉండమని యెహోవా ఇచ్చిన ఆజ్ఞ, ఆయనకు తన ఆరాధకులపై నమ్మకముందని కూడా చూపిస్తుంది. మనం చేయగలిగినదానికంటే ఎక్కువ చేయమని యెహోవా ఎన్నడూ అడగడు. (కీర్తన 103:13, 14) తన స్వరూపంలో సృష్టించబడిన మనం, కనీసం కొంతవరకైనా పరిశుద్ధంగా ఉండగలమని ఆయనకు తెలుసు. (ఆదికాండము 1:26) ఇది చదివిన తర్వాత, పరిశుద్ధ దేవుడైన యెహోవాకు ఎలా దగ్గర కావచ్చనే దాని గురించి మరింత తెలుసుకోవాలని మీరనుకుంటున్నారా? (w09 07/01)

[30వ పేజీలోని చిత్రం]

ఇతరులకు సేవచేయడం ద్వారా పరిశుద్ధంగా ఉండగలుగుతాం