కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సాత్వికులను అమూల్యమైనవారిగా ఎంచుతాడు

యెహోవా సాత్వికులను అమూల్యమైనవారిగా ఎంచుతాడు

దేవునికి దగ్గరవ్వండి

యెహోవా సాత్వికులను అమూల్యమైనవారిగా ఎంచుతాడు

సంఖ్యాకాండము 12:1-15

గర్వం, అసూయ, అధికారకాంక్ష. ఈ లోకంలో విజయవంతులయ్యేవారికి సాధారణంగా ఆ లక్షణాలే ఉంటాయి. కానీ అలాంటి లక్షణాలు మనం యెహోవా దేవునికి దగ్గరవ్వడానికి సహాయం చేస్తాయా? చేయవు! యెహోవా తన ఆరాధకుల్లో సాత్వికులను అమూల్యమైనవారిగా ఎంచుతాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఉన్న వృత్తాంతం నుండి ఈ విషయం స్పష్టమవుతుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చి సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడు అది జరిగింది.

మోషే అక్క మిర్యాము, ఆయన అన్న అహరోను తమ తమ్ముడికి “విరోధముగా మాటలాడిరి.” (1వ వచనం) వాళ్లు మోషేతో మాట్లాడే బదులు ఆయనకు విరోధంగా మాట్లాడుతూ పాళెములో అందరికీ ఫిర్యాదు చేసి ఉంటారు. మిర్యాము మొదట ప్రస్తావించబడింది కాబట్టి ఆమే ఇదంతా మొదలుపెట్టి ఉంటుందని తెలుస్తోంది. వాళ్లు సణగడానికి మొదటి కారణం, మోషే కూషీయురాలిని పెళ్లి చేసుకోవడం. ఇశ్రాయేలీయులు తనను కాదని మరో స్త్రీకి, అదీ ఒక ఇశ్రాయేలీయురాలు కాని స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారేమోనని మిర్యాము ఆసూయపడి ఉంటుందా?

అయితే ఫిర్యాదు చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మిర్యాము, అహరోను ఇలా చెప్పేవారు, “మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా?” (2వ వచనం) నిజానికి వాళ్లు సణగడానికి అసలు కారణం, మరింత అధికారం, మరింత గుర్తింపు పొందాలనే కోరికనా?

ఈ సందర్భంలో, ఫిర్యాదు చేసినవారికి మోషే స్వయంగా సమాధానం చెప్పలేదు. ఆయన దాన్నంతటినీ నిశ్శబ్దంగా సహించాడని తెలుస్తోంది. ఆయన అలా సహించడం, ‘భూమిమీదనున్న వారందరిలో ఆయన మిక్కిలి సాత్వికుడు’ అని బైబిలు ఆయన గురించి వర్ణిస్తున్నది నిజమని నిరూపించింది. a (3వ వచనం) మోషే తనను తాను సమర్థించుకోవలసిన అవసరం లేదు. యెహోవా అంతా విన్నాడు, ఆయన మోషే పక్షాన మాట్లాడాడు.

ఇశ్రాయేలీయులు తనపైనే సణుగుతున్నట్లు యెహోవా భావించాడు. ఎంతైనా మోషేను నియమించింది ఆయనే కదా. యెహోవా దేవుడు, “ముఖాముఖిగా అతనితో మాటలాడుదును” అని చెప్తూ మోషేతో తనకున్న విశేషమైన సంబంధాన్ని గుర్తుచేసి, సణుగుతున్నవారిని గద్దించాడు. ఆయన ఆ తర్వాత మిర్యాము, అహరోనులను ఇలా అడిగాడు: “మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదు?” (8వ వచనం) మోషేకు విరోధంగా మాట్లాడడం ద్వారా నిజానికి వాళ్లు దేవునికి విరోధంగా మాట్లాడారు. వాళ్లు అలా అగౌరవం చూపించినందుకు, దేవుని ఆగ్రహానికి గురయ్యారు.

దీనికంతటికీ మూల కారకురాలైన మిర్యాముకు కుష్ఠువ్యాధి వచ్చింది. ఆమె పక్షాన యెహోవాను వేడుకోమని అహరోను వెంటనే మోషేను కోరాడు. అంటే మిరియాముకు తాము నిందించిన మోషే సహాయమే అవసరమైంది. మోషే సాత్వికంతో, అహరోను తనను అడిగినట్లుగానే చేశాడు. ఈ సంఘటనలో మొదటిసారిగా మాట్లాడుతూ, మోషే తన అక్క తరఫున యెహోవాను వేడుకున్నాడు. మిర్యాము స్వస్థత పొందింది, కానీ ఆమె ఏడు రోజులు పాళెం వెలుపల ఉండడం వల్ల కలిగే అవమానాన్ని సహించాల్సివచ్చింది.

ఈ వృత్తాంతం, యెహోవా ప్రాముఖ్యమైనవని ఎంచే లక్షణాల గురించి, ఆయనకు ఇష్టంలేని లక్షణాల గురించి తెలియజేస్తుంది. మనం దేవునికి దగ్గరవ్వాలంటే, మనలో ఏమాత్రం గర్వం, అసూయ, అధికారకాంక్ష తలెత్తినా దాన్ని కూకటి వేళ్ళతో పెకిలించివేయడానికి కృషి చేయాలి. యెహోవా ప్రేమించేది సాత్వికులనే. ఆయన ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11; యాకోబు 4:6. (w09 08/01)

[అధస్సూచి]

a సాత్వికం చాలా బలమైన లక్షణం, అది పగతీర్చుకోకుండా ఓర్పుగా అన్యాయాన్ని సహించడానికి కావలసిన బలాన్ని ఇస్తుంది.