కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నీ రాజ్యం నిత్యం స్థిరపర్చబడును’

‘నీ రాజ్యం నిత్యం స్థిరపర్చబడును’

దేవునికి దగ్గరవ్వండి

‘నీ రాజ్యం నిత్యం స్థిరపర్చబడును’

2 సమూయేలు 7:1-16

చరిత్రలో ఎంతోమంది మానవపరిపాలకులు తమ స్థానం నుండి తొలగించబడ్డారు. కొందరు ఎన్నికల్లో ఓడిపోయి అధికారం నుండి దిగిపోవలసివస్తే, మరికొందరిని బలవంతంగా దించేశారు. మరి దేవుని పరలోక రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు విషయమేమిటి? దేవుడు నియమించిన రాజుగా అధికారాన్ని చేపట్టకుండా ఆయనను ఏదైనా ఆపగలదా? ఒకప్పుడు ఇశ్రాయేలును పరిపాలించిన దావీదు రాజుతో యెహోవా చెప్పిన మాటల్లో దానికి సమాధానం తెలుసుకోవచ్చు. దాని గురించి రెండవ సమూయేలు 7వ అధ్యాయంలో ఉంది.

ఆ అధ్యాయం మొదట్లో, దేవుని మందసం నిరాడంబరమైన గుడారంలో ఉండగా, మామూలు మానవరాజైన తాను అందమైన కోటలో ఉంటున్నందుకు దావీదు ఎంతో కలవరపడినట్లు చదువుతాం. a యెహోవాకు తగిన ఇంటిని లేదా ఆలయాన్ని కట్టించాలనుకుంటున్నట్లు దావీదు చెప్పాడు. (2వ వచనం) కానీ ఆలయాన్ని కట్టించేది దావీదు కాదు. దావీదు కుమారుల్లో ఒకరు ఆ ఆలయాన్ని కట్టిస్తారని నాతాను ప్రవక్త ద్వారా యెహోవా దావీదుకు చెప్పాడు.—4, 5, 12, 13 వచనాలు.

దావీదు అలా మనస్ఫూర్తిగా కోరుకోవడం యెహోవాకు ఎంతో నచ్చింది. దావీదు అలాంటి భక్తి చూపించినందుకుగాను, అలాగే ప్రవచనానికి అనుగుణంగాను దేవుడు దావీదుతో ఒక నిబంధన చేస్తూ నిరంతరం పరిపాలించే ఒకరు దావీదు రాజవంశంలోనే పుట్టేలా చూస్తానని మాటిచ్చాడు. దేవుడు చేసిన ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని దావీదుకు చెప్తూ నాతాను ఇలా అన్నాడు: “నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును.” ((16వ వచనం) ఈ నిబంధన శాశ్వత వారసుడు అంటే నిరంతరం పరిపాలించే పాలకుడు ఎవరు?—కీర్తన 89:20, 29, 34, 35.

నజరేతువాడైన యేసు దావీదు వంశంలో పుట్టాడు. యేసు జననం గురించి ప్రకటిస్తూ ఒక దూత ఇలా చెప్పాడు, “ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” (లూకా 1:32, 33) దావీదుతో చేసిన నిబంధన యేసుక్రీస్తు విషయంలో నిజమైంది. కాబట్టి ఆయన మనుష్యులు ఎన్నుకోవడంవల్ల కాదుగానీ నిరంతరం పరిపాలించే హక్కు ఇస్తాననే ప్రాముఖ్యమైన వాగ్దానం దేవుడు ఆయనకు చేయడంవల్లే పరిపాలిస్తాడు. దేవుడు చేసిన వాగ్దానాలు ఎప్పుడూ నిజమౌతాయని మనం గుర్తుంచుకుందాం.—యెషయా 55:10, 11.

రెండవ సమూయేలు 7వ అధ్యాయం నుండి మనం రెండు విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది, పరిపాలించకుండా యేసుక్రీస్తును ఎవ్వరూ, ఏదీ ఆపలేదనే నమ్మకంతో మనం ఉండొచ్చు. దేవుని చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు భూమి మీద కూడా జరిగేలా చూడడానికే పరిపాలించబోతున్నానని ఆయన చెప్పినట్లే తప్పకుండా చేస్తాడని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు.—మత్తయి 6:9, 10.

రెండవది, ఈ సంఘటన యెహోవా గురించి మనసులను ఉప్పొంగజేసే విషయం నేర్పిస్తుంది. యెహోవా దావీదు హృదయంలోని ఆలోచనలను చూశాడని, వాటికి విలువిచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. తనను ఆరాధించడంలో మనకున్న భక్తిని యెహోవా చూసి, దానికి విలువిస్తాడని మనకిది హామీ ఇస్తుంది. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడం, వయసు పైబడడం వంటివి మనం అదుపు చేయలేని విషయాలు. అలాంటి కొన్ని పరిస్థితుల్లో దేవుని సేవలో మనం చేయాలనుకున్నదంతా చేయలేకపోవచ్చు. మన విషయంలో కూడా అలా జరుగుతుంటే, యెహోవా తనను ఆరాధించాలనే భక్తితో నిండిన హృదయాన్ని, దానిలోని ఆలోచనలను కూడా చూస్తాడనే వాస్తవాన్ని గుర్తుచేసుకుని ఓదార్పు పొందుదాం. (w10-E 04/01)

[అధస్సూచి]

a నిబంధన మందసం అంటే యెహోవా ఇచ్చిన నమూనా నిర్దేశాల ప్రకారం తయారుచేసిన ఒక పవిత్రమైన పెట్టె. అది ప్రాచీన ఇశ్రాయేలులో యెహోవా సన్నిధికి ప్రాతినిధ్యం వహించేది.—నిర్గమకాండము 25:22.