కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు

మనం వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు

దేవునికి దగ్గరవ్వండి

మనం వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు

యెహోషువ 1:6-9

ప్రే మగల తల్లిదండ్రులు తమ పిల్లలు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ వర్ధిల్లాలని కోరుకుంటారు. పరలోకంలోవున్న మన తండ్రియైన యెహోవా కూడా భూమ్మీదున్న తన పిల్లలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. మనమెలా వర్ధిల్లాలో వివరిస్తూ మనమీద తనకున్న ప్రేమను చూపిస్తున్నాడు. ఉదాహరణకు, యెహోషువ 1:6-9 వచనాల్లో ఆయన యెహోషువతో అన్న మాటలను పరిశీలిద్దాం.

కుడివైపునున్న చిత్రంలోని సన్నివేశాన్ని ఊహించుకోండి. మోషే చనిపోయిన తర్వాత లక్షలాదిమంది ఇశ్రాయేలీయులకు యెహోషువ నాయకుడయ్యాడు. ఇశ్రాయేలీయులు తమ పితరులకు దేవుడు ఇస్తానని చెప్పిన దేశంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. దేవుడు యెహోషువకు కొన్ని సలహాలిచ్చాడు. వాటిని పాటిస్తే ఆయన తన పనిలో వర్ధిల్లుతాడు. ఈ సలహాలు ఇచ్చింది, యెహోషువ ఒక్కడి ప్రయోజనం కోసమే కాదు. వాటిని పాటిస్తే మనం కూడా వర్ధిల్లవచ్చు.—రోమీయులు 15:4.

నిబ్బరంగా, ధైర్యంగా ఉండమని యెహోవా యెహోషువతో ఒక్కసారి కాదుగానీ మూడుసార్లు చెప్పాడు. (6, 7, 9 వచనాలు) ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఇస్తానన్న దేశంలోకి నడిపించాలంటే యెహోషువకు నిబ్బరం, ధైర్యం తప్పకుండా అవసరం. ఈ చక్కని లక్షణాల్ని పెంపొందించుకోవడానికి ఆయనేమి చేయాలి?

దేవుడు ప్రేరేపించి రాయించిన లేఖనాలను చదవడంవల్ల యెహోషువ నిబ్బరాన్ని, ధైర్యాన్ని పెంపొందించుకోగలడు. “నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను” అని యెహోవా ఆయనతో చెప్పాడు. (7వ వచనం) అప్పటికి బైబిల్లోని కొన్ని పుస్తకాలు మాత్రమే యెహోషువకు అందుబాటులో ఉండివుంటాయి. a ఏదేమైనా, దేవుని వాక్యం మన దగ్గర ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా వర్ధిల్లుతామని చెప్పలేము. దాని నుండి ప్రయోజనం పొందాలంటే యెహోషువ రెండు పనులు చేయాలి.

మొదటిగా, యెహోషువ తన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకోవడానికి దాన్ని క్రమంగా చదవాలి. ‘దివారాత్రము దానిని ధ్యానించాలి’ అని యెహోవా చెప్పాడు. (8వ వచనం) “యెహోషువ ధర్మశాస్త్రాన్ని గుర్తుంచుకోవడానికి, తనకు వినబడేటట్లు దాన్ని ‘నెమ్మదిగా చదువుకోవాలని’ దేవుడు ఆయనకు ఆజ్ఞాపించాడు” అని ఒక రెఫరెన్సు పుస్తకం చెబుతోంది. దేవుని వాక్యాన్ని ప్రతీరోజు చదివి, ధ్యానిస్తే యెహోషువ మున్ముందు వచ్చే సమస్యలను చక్కగా పరిష్కరించగల్గుతాడు.

రెండవదిగా, దేవుని వాక్యం నుండి నేర్చుకున్నదాన్ని యెహోషువ ఆచరణలో పెట్టాలి. ‘ధర్మశాస్త్రంలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి జాగ్రత్తపడాలి, [అప్పుడు] నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుంటావు’ అని యెహోవా ఆయనతో అన్నాడు. (8వ వచనం) దేవుడు చెప్పింది చేస్తేనే యెహోషువ వర్ధిల్లుతాడు. అలాగని ఎలా చెప్పవచ్చు? ఆయన చెప్పింది తప్పక జరుగుతుంది.—యెషయా 55:10, 11.

యెహోవా ఇచ్చిన సలహాలను యెహోషువ పాటించాడు. అందుకే ఆయన చివరి వరకు నమ్మకంగా యెహోవాను ఆరాధిస్తూ, సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలిగాడు.—యెహోషువ 23:14; 24:15.

యెహోషువలాగే మీరు కూడా సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? యెహోవా మనం వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. అయితే బైబిలు మన దగ్గర ఉండడం మాత్రమే సరిపోదు. ఎంతోకాలం నుండి నమ్మకంగా యెహోవాను సేవిస్తున్న ఒక క్రైస్తవుడు, “మీ హృదయాలపై ముద్రించుకుపోయేలా బైబిలును చదవండి, చదివినదాన్ని పాటించండి” అని సలహా ఇస్తున్నాడు. మీరు దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ దాన్ని మీ హృదయాల్లో నింపుకుని, నేర్చుకున్న వాటిని పాటిస్తే యెహోషువలాగే మీరు కూడా ‘మీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుంటారు.’ (w09-E 12/01)

[అధస్సూచి]

a దేవుడు ప్రేరేపించి రాయించిన పుస్తకాల్లో మోషే రాసిన ఐదు పుస్తకాలు (ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము), యోబు గ్రంథము, ఒకటో రెండో కీర్తనలు యెహోషువ దగ్గర ఉండివుంటాయి.