కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అది నిజంగా మోసమేనా?

అది నిజంగా మోసమేనా?

అది నిజంగా మోసమేనా?

“మీ ఆక్సిడెంట్‌ రిపోర్టును కొంచెం మారిస్తే చాలు, అంతా సర్దుకుంటుంది.”

“పన్ను అధికారులకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు.”

“తప్పు చేసినా దొరికిపోకుండా ఉండడమే ముఖ్యం.”

“ఉచితంగా దొరుకుతున్నప్పుడు డబ్బు కట్టడం దేనికి?”

ఆర్థిక విషయాల గురించి ఎవరినైనా సలహాలు అడిగితే, వాళ్లు మీకు అలాంటి సలహాలు ఇస్తుండవచ్చు. కొంతమంది దగ్గర ప్రతీదానికి తెలివైన “పరిష్కారాలు” ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ప్రశ్నేమిటంటే, ఆ పరిష్కారాలు నిజంగా సరైనవేనా?

ఈ రోజుల్లో నిజాయితీ ఎంతగా లోపిస్తుందంటే, ప్రజలు శిక్ష తప్పించుకోవడానికి, డబ్బు సంపాదించడానికి, పైకి రావడానికి అబద్దాలు చెప్పడం, మోసగించడం, దొంగతనం చేయడం తప్పేమీ కాదనుకుంటున్నారు. సమాజంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నవాళ్లు నిజాయితీగా ఉండే విషయంలో ఆదర్శంగా లేరు. ఐరోపాలోని ఒక దేశంలో 2005, 2006 సంవత్సరాల్లో మోసాల రేటు 85 శాతం కన్నా ఎక్కువ పెరిగిపోయింది. అందులో, కొంతమంది ప్రజలు పొరపాట్లు లేదా “చిన్న పాపాలు” అని పిలిచే చాలా చిన్న కేసులు లెక్కపెట్టనేలేదు. ఆ దేశంలోని పెద్ద వ్యాపారస్థులు, రాజకీయ నాయకులు ఒక కుంభకోణంలో చిక్కుకున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. వాళ్లు తమ రంగాల్లో పైకి రావడానికి దొంగ సర్టిఫికేట్లు ఉపయోగించినట్లు బయటపడింది.

లోకమంతటా నిజాయితీ అనేదే లేకుండా పోయినా, చాలామంది సరైనదాన్నే చేయాలనుకుంటారు. బహుశా మీరు కూడా అలాగే అనుకుంటుండవచ్చు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నందుకు కావచ్చు, ఆయన దృష్టిలో ఏది సరైనదో అదే మీరు చేయాలనుకుంటారు. (1 యోహాను 5:3) మీరు కూడా అపొస్తలుడైన పౌలులాగే అనుకుంటుండవచ్చు. ఆయనిలా రాశాడు, ‘మేము అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తించాలని కోరుకుంటూ, మంచి మనస్సాక్షి కలిగివున్నామని నమ్ముతున్నాము.’ (హెబ్రీయులు 13:18) ‘అన్ని విషయాల్లో యోగ్యంగా’ ప్రవర్తించాలని కోరుకునే వ్యక్తిని పరీక్షంచగల కొన్ని పరిస్థితులను పరిశీలిద్దాం. అంతేకాదు, అలాంటి పరిస్థితుల్లో సహాయపడే బైబిలు సూత్రాలను కూడా పరిశీలిద్దాం.

ఆక్సిడెంట్‌ వల్ల కలిగిన నష్టాన్ని ఎవరు భరించాలి?

లిసా a అనే యువతి కారు నడుపుతూ పొరపాటున ఇంకో కారును గుద్దేసింది. ఎవరికీ గాయాలు కాలేదు కానీ, రెండు కార్లూ దెబ్బతిన్నాయి. వాళ్ల దేశంలో చిన్న వయస్సు డ్రైవర్లు కారు ఇన్సూరెన్స్‌కు ఎక్కువ ప్రీమియం కడతారు, ఆక్సిడెంటు చేసిన ప్రతీసారి ఆ ప్రీమియం పెరుగుతూవుంటుంది. ఆక్సిడెంటు అయినప్పుడు లిసా బంధువు, వయసులో పెద్దవాడు అయిన గ్రెగోర్‌ కూడా కారులోనే ఉన్నాడు కాబట్టి, అతనే కారు నడిపిస్తున్నట్లు రిపోర్టులో రాయమని ఒక స్నేహితుడు సలహా ఇచ్చాడు. అలాచేస్తే, లిసా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్సు ప్రీమియం కట్టాల్సిన అవసరముండదు. అది చాలా తెలివైన పరిష్కారంలా కనిపిస్తుంది. లిసా ఏమిచేయాలి?

ఇన్సూరెన్సు కంపెనీలు బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి, పాలసీ కట్టినవాళ్ల ప్రీమియమ్‌లను ఉపయోగిస్తాయి. అయితే, లిసా తన స్నేహితుని సలహాను పాటిస్తే, ఆమె తను చేసిన ఆక్సిడెంట్‌ వల్ల తను ఎక్కువ ప్రీమియం కట్టకుండా తప్పించుకుని, ఆ నష్టం ఇతర పాలసీదారుల మీదపడేలా చేస్తుంది. అలా ఆమె దొంగ రిపోర్టు ఇచ్చినట్లే కాదు, ఇతరుల డబ్బు దోచుకున్నట్లు కూడా అవుతుంది. ఆక్సిడెంటు అయినప్పుడు ఇన్సూరెన్సు కంపెనీ ఎక్కువ డబ్బు ఇచ్చేలా తప్పుడు వివరాలు ఇవ్వడం కూడా దోచుకోవడంతో సమానమే.

చట్టం విధించే జరిమానాలు అలాంటి మోసాలు జరగకుండా అడ్డుకట్టవేస్తాయి. కానీ మోసం చేయకుండా ఉండడానికి మరింత ప్రాముఖ్యమైన కారణాన్ని బైబిలు వివరిస్తోంది. దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞల్లో ఒకటి ‘దొంగిలించకూడదు’ అని చెప్తోంది. (నిర్గమకాండము 20:15) ‘దొంగిలించేవాడు ఇకమీదట దొంగిలించకూడదు’ అని చెప్తూ అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఆ ఆజ్ఞను నొక్కిచెప్పాడు. (ఎఫెసీయులు 4:27, 28) అలాంటి ఇన్సూరెన్సు విషయాల్లో బైబిలు చెప్పేది వింటే, దేవుడు ఖండించే దానిని మీరు చేయకుండా ఉంటారు. అంతేకాదు, దేవుని నియమాల పట్ల, పొరుగువాళ్ల పట్ల ప్రేమ, గౌరవం ఉన్నాయని కూడా మీరు చూపిస్తారు.—కీర్తన 119:97.

“కైసరువి కైసరుకు”

ప్రశాంత్‌ ఒక వ్యాపారస్థుడు. ఆయన దగ్గర పనిచేసే అకౌంటెంట్‌, ఖరీదైన కంప్యూటర్‌ పరికరాల “కొనుగోలు” మీద పన్ను తగ్గించమని కోరితే బాగుంటుందని ఆయనకు సలహా ఇచ్చాడు. ప్రశాంత్‌ చేస్తున్నలాంటి వ్యాపారానికి అలా కొనడం మామూలే. అయితే, ప్రశాంత్‌ అలా కొనకపోయినా, నిజంగా అంత డబ్బు ఖర్చు అయిందా లేదా అని ప్రభుత్వం తనిఖీ చేయకపోవచ్చు. ప్రశాంత్‌ అడిగినట్లు కొనుగోలు మీద పన్ను తగ్గిస్తే, ఆయన కట్టాల్సిన పన్ను చాలావరకు తగ్గుతుంది. ఆయన ఏమిచేయాలి? నిర్ణయం తీసుకోవడానికి ఆయనకేది సహాయం చేయగలదు?

అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఇలా చెప్పాడు, ‘ప్రతి ఒక్కరు పై అధికారులకు లోబడాలి; ఎవరికి పన్నో వారికి పన్ను, ఎవరికి సుంకమో వారికి సుంకం చెల్లించండి.’ (రోమీయులు 13:1, 7) దేవుడు తమను ఇష్టపడాలని కోరుకునే వాళ్లు ప్రభుత్వం అడిగే పన్నులన్నీ కడతారు. అయితే, చట్టం ఒకవేళ కొంతమంది వ్యక్తులకు లేదా కొన్ని వ్యాపారాలకు పన్ను రాయితీ మంజూరు చేస్తే, అవి పొందడానికి చట్టబద్ధంగా అర్హత ఉన్నప్పుడు అలాంటి ప్రయోజనాలు పొందడంలో తప్పేమీ లేదు.

పన్ను కట్టాల్సిన మరో పరిస్థితి గురించి చూద్దాం. విజయ్‌ ఒక కంపెనీలో వడ్రంగిగా పనిచేస్తున్నాడు. ఆయన స్నేహితులు, పొరుగువాళ్లు తమకోసం కొంత సామాగ్రి చేసిపెట్టమని అడుగుతారు, ఆయన పనివేళల తర్వాత వాళ్లు అడిగినవి చేసిపెడతాడు. ఆయనకు మామూలుగా ఉద్యోగంలో వచ్చేదాని కన్నా ఎక్కువ డబ్బు ఇవ్వడానికి వాళ్లు సిద్ధపడతారు. అయితే, ఆయన ఆ డబ్బు తీసుకున్నట్లు తన పై అధికారులకు చెప్పకూడదని వాళ్లు ఆశిస్తారు. కాబట్టి, ఫలానా వస్తువులు తయారు చేయబడినట్లు పుస్తకాల్లో నమోదు కాదు, దానికి ఎవరూ పన్ను చెల్లించరు. ఇలాచేస్తే అందరికీ ప్రయోజనం ఉంటుంది కాబట్టి, ఇలా చేయడం మంచిదేనని చాలామంది అనుకుంటారు. దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలని విజయ్‌ కోరుకుంటున్నాడు కాబట్టి, పుస్తకాల్లో నమోదు కానీ అలాంటి పనిని ఆయనెలా పరిగణించాలి?

అలా పనిచేసే వ్యక్తి పట్టుబడకపోయినా, న్యాయంగా ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను అతను కట్టడం లేదు. ‘కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి’ అని యేసు ఆజ్ఞాపించాడు. (మత్తయి 22:17-21) పన్ను కట్టే విషయంలో తన శ్రోతల ఆలోచనను సరిదిద్దడానికి యేసు అలా చెప్పాడు. యేసు ‘కైసరు’ అని చెప్పిన ప్రభుత్వాధికారులు పన్ను కట్టడం ప్రతీ పౌరుని బాధ్యతగా ఎంచుతారు. కాబట్టి, క్రీస్తు అనుచరులు అన్నిరకాల పన్నులు కట్టడం బైబిలు ప్రకారం తమ బాధ్యతగా పరిగణిస్తారు.

పరీక్షల్లో కాపీ కొట్టడం

ఉన్నత పాఠశాల విద్యార్థి అయిన మాధవి ఫైనల్‌ పరీక్షలకు సిద్ధపడుతోంది. ఆమెకు మంచి మార్కులు వస్తేనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఆమె ఎన్నో గంటలు కష్టపడి చదువుకుంది. ఆమె తోటి విద్యార్థులు కూడా సిద్ధపడ్డారు. కానీ వాళ్లు మరోలా సిద్ధపడ్డారు. వాళ్లు, మంచి మార్కులు సంపాదించుకోవడానికి ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించి పరీక్షల్లో కాపీ కొడతారు. అయితే మాధవి మంచి మార్కులు సంపాదించుకోవడానికి “అందరూ” చేసినట్టు చేయాలా?

కాపీ కొట్టడం సర్వసాధారణంగా జరుగుతుంది కాబట్టి, అలా చేయడంలో తప్పేమీ లేదని చాలామంది అనుకుంటారు. “తప్పు చేసినా దొరికిపోకుండా ఉండడమే ముఖ్యం” అని వాళ్లు అంటారు. కానీ నిజమైన క్రైస్తవులు అలా ఆలోచించకూడదు. కాపీ కొడుతున్న వాళ్లను టీచరు గమనించకపోవచ్చు, కానీ వాళ్లను గమనించే వ్యక్తి ఒకరున్నారు. యెహోవా దేవునికి మనం చేసేవి తెలుసు కాబట్టి, ఆయన మనల్ని జవాబు అడుగుతాడు. పౌలు ఇలా చెప్పాడు, ‘ఆయన దృష్టికి కనిపించని సృష్టి ఏదీ లేదు. మనమెవరికి లెక్క ఒప్పచెప్పాల్సివుందో, ఆ దేవుని కన్నులకు సమస్తం మరుగులేక తేటగా ఉంది.’ (హెబ్రీయులు 4:13) మనం సరైనది చేయాలని కోరుకుంటున్నందుకే దేవుడు మనల్ని గమనిస్తుంటాడని మనం గ్రహించాలి. అలా గ్రహించడమే, మనకు ఏదైనా పరీక్ష ఎదురైనప్పుడు నిజాయితీగా ఉండడానికి సహాయం చేస్తుంది. కాదంటారా?

మీరు ఏంచేస్తారు?

లిసా, గ్రెగోర్‌, ప్రశాంత్‌, విజయ్‌, మాధవి తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల గంభీరతను గ్రహించారు. వాళ్లు నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే వాళ్లు తమ మనస్సాక్షి ఒప్పుకోని దాన్ని చేయకుండా, తమ నైతికతను కాపాడుకున్నారు. అలాంటి పరిస్థితులు ఒకవేళ మీకే ఎదురైతే మీరు ఏంచేస్తారు?

మీ తోటి ఉద్యోగస్థులు, విద్యార్థులు, పొరుగువాళ్లు అబద్ధం చెప్పడం, కాపీ కొట్టడం, దొంగతనం చేయడం పెద్ద తప్పేమీ కాదనుకోవచ్చు. అంతేకాదు, మీతో కూడా అలాంటి పనులు చేయించడానికి వాళ్లు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. ఎవరైనా మీతో మోసం చేయించాలని ఎంత ప్రయత్నించినా, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?

దేవుడు చెప్పినట్లు నడుచుకుంటే, మన మనస్సాక్షి నిష్కల్మషంగా ఉంటుందని, దేవుడు మనల్ని ఇష్టపడతాడని, ఆయన అనుగ్రహం మనమీద ఉంటుందని గుర్తుంచుకోండి. దావీదు రాజు ఇలా రాశాడు, ‘యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగినవారెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవారెవరు? యథార్థమైన ప్రవర్తనతో, నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలికేవారే. ఈ ప్రకారం చేసేవారు ఎన్నడూ కదల్చబడరు.’ (కీర్తన 15:1-5) మోసంతో సంపాదించుకునే వేటికన్నా నిష్కల్మషమైన మనస్సాక్షి, పరలోకంలో ఉన్న దేవునితో స్నేహం ఎంతో విలువైనవి. (w10-E 06/01)

[అధస్సూచి]

a అసలు పేర్లు కావు.

[18వ పేజీలోని బ్లర్బ్‌]

‘దొంగిలించేవాడు ఇకమీదట దొంగిలించకూడదు.’

దేవుని నియమాల పట్ల గౌరవం, పొరుగువారి మీద ప్రేమ ఉంటే ఇన్సూరెన్సు విషయాల్లో నిజాయితీగా ఉంటాం

[18వ పేజీలోని బ్లర్బ్‌]

‘ఎవరికి పన్నో వారికి పన్ను, ఎవరికి సుంకమో వారికి సుంకం చెల్లించండి.’

దేవుని అనుగ్రహం పొందాలంటే, చట్టం విధించే పన్నులన్నీ కట్టాలి

[19వ పేజీలోని బ్లర్బ్‌]

‘మనమెవరికి లెక్క ఒప్పచెప్పాల్సివుందో, ఆ దేవుని కన్నులకు సమస్తం మరుగులేక తేటగా ఉంది.’

మనం కాపీ కొట్టడం టీచర్లు చూడకపోయినా, దేవుని దృష్టిలో మనం నిజాయితీగా ఉండాలని కోరుకుంటాం

[20వ పేజీలోని బాక్సు/ చిత్రాలు]

“ఎవరి దృష్టికీ రాని” దొంగతనం

మీ స్నేహితుడు ఒక కొత్త కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ను కొనుక్కున్నాడు. అది మీకు కూడా కావాలి. ఆ సాఫ్ట్‌వేర్‌ని కాపీ చేసుకుని డబ్బు ఆదా చేసుకోమని మీ స్నేహితుడు చెప్పాడు. అది మోసం అవుతుందా?

ఒక సాఫ్ట్‌వేర్‌ని కొనుక్కున్నవాళ్లు ఆ ప్రోగ్రామ్‌ లైసెన్సులో ఇవ్వబడిన ఆంక్షలకు కట్టుబడివుండాలి. ఆ లైసెన్సు, దాన్ని కొనుక్కున్నవాళ్లు ఆ ప్రోగ్రామ్‌ను ఒక్క కంప్యూటర్‌లో మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకుని దాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తుండవచ్చు. అలాంటప్పుడు, దాన్ని వేరేవాళ్లకు కాపీ చేసి ఇస్తే, లైసెన్సు ఒప్పందాన్ని మీరినట్లే అవుతుంది. అది చట్ట వ్యతిరేకమైన పని. (రోమీయులు 13:3, 4) అలా కాపీ చేసుకోవడం కూడా దొంగతనమే అవుతుంది, ఎందుకంటే ఆ కాపీరైట్‌ ఉన్న వ్యక్తికి రావాల్సిన రాబడి రాకుండా పోతుంది.—ఎఫెసీయులు 4:27, 28.

‘అది ఎవరికీ తెలీదు’ అని కొంతమంది అనవచ్చు. అది నిజమే కావచ్చు, కానీ యేసు చెప్పిన ఈ మాటలు మనం గుర్తుంచుకోవాలి, ‘మనుష్యులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి.’ (మత్తయి 7:12) మనం చేసిన పనికి తగిన ప్రతిఫలం రావాలని, ఇతరులు మన సొత్తును విలువైనదిగా ఎంచాలని మనందరం కోరుకుంటాం. మనం కూడా వేరేవాళ్ల విషయంలో అలాగే ఉండాలి. కాబట్టి, ముద్రిత రూపంలో లేదా ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న సంగీతం, పుస్తకాలు, సాఫ్ట్‌వేర్‌ వంటి మనవి కాని, కాపీరైట్‌ చేయబడినవాటిని తీసుకోకుండా ఉన్నప్పుడు, “ఎవరి దృష్టికీ రాని” దొంగతనం చేయకుండా ఉంటాం. ట్రేడ్‌ మార్కులు, పేటెంట్లు, వ్యాపార రహస్యాలు, ప్రచార హక్కులు వంటివి కూడా ఈ కోవకే చెందుతాయి.—నిర్గమకాండము 22:7-9.