కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గిలాదు గుగ్గిలం స్వస్థపర్చే తైలం

గిలాదు గుగ్గిలం స్వస్థపర్చే తైలం

గిలాదు గుగ్గిలం స్వస్థపర్చే తైలం

బైబిలు పుస్తకమైన ఆదికాండములో ఉన్న ఒక ప్రసిద్ధ వృత్తాంతం, యోసేపు అన్నలు ఐగుప్తుకు వెళ్తున్న ఇష్మాయేలీయులైన కొంతమంది వర్తకులకు ఆయనను అమ్మేయడం గురించి చెప్తోంది. గిలాదు నుండి వస్తున్న ఆ వర్తకుల బృందం, గుగ్గిలాన్ని ఇతర సరుకులను ఒంటెల మీద వేసుకుని ఐగుప్తుకు తీసుకువెళ్తున్నారు. (ఆదికాండము 37:25) క్లుప్తమైన ఈ వృత్తాంతం నుండి, గిలాదు గుగ్గిలాన్ని ప్రాచీన మధ్య ప్రాచ్య ప్రజలు ఎంతో ఇష్టపడేవాళ్లని, దానికున్న ప్రత్యేకమైన స్వస్థపర్చే గుణాలనుబట్టి దాన్ని చాలా విలువైనదిగా ఎంచేవాళ్లని అర్థమవుతోంది.

అయితే, సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో యిర్మీయా ప్రవక్త, ‘గిలాదులో గుగ్గిలమే లేదా?’ అని విచారంగా అడిగాడు. (యిర్మీయా 8:22) ఎందుకు యిర్మీయా ఆ ప్రశ్న వేశాడు? అసలు గుగ్గిలం అంటే ఏమిటి? ఈరోజుల్లో స్వస్థపర్చడానికి ఉపయోగపడే గుగ్గిలం ఏదైనా ఉందా?

బైబిల్లో కాలాల్లో గుగ్గిలం

వివిధ రకాల చెట్లు, పొదల నుండి వచ్చే సుగంధభరితమైన జిగురు పదార్థాన్ని గుగ్గిలం అంటారు, సాధారణంగా ఇది తైలంలా ఉంటుంది. ధూపం వేయడానికి, సుగంధ ద్రవ్యాలు తయారు చేయడానికి ఉపయోగించబడే గుగ్గిల తైలం ప్రాచీన మధ్య ప్రాచ్య దేశాల్లో ఎంతో విలాసవంతమైనదిగా పరిగణించబడేది. ఇది పరిశుద్ధమైన అభిషేక తైలాన్ని తయారుచేయడంలో ఉపయోగించబడేది, అంతేకాదు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన కొంతకాలానికి గుడారంలో ధూపం వేయడానికి ఉపయోగించే పదార్థాలలో కూడా ఇది ఉండేది. (నిర్గమకాండము 25:6; 35:7, 8) షేబదేశపు రాణి సొలొమోను రాజు కోసం తీసుకొచ్చిన ఖరీదైన బహుమానాల్లో గుగ్గిల తైలం కూడా ఉంది. (1 రాజులు 10:2, 10) ఎస్తేరు పర్షియా రాజైన అహష్వేరోషు దగ్గరకు వెళ్లే ముందు, ‘ఆరు మాసాల వరకు సుగంధవర్గములను’ ఆమె వంటికి పట్టించి, ఆమెకు సౌందర్య చికిత్స చేశారు.—ఎస్తేరు 1:1; 2:12.

గుగ్గిల తైలం మధ్య ప్రాచ్య దేశాల్లోని చాలా ప్రాంతాల్లో దొరికేది. కానీ, గిలాదు గుగ్గిలమైతే వాగ్ధాన దేశంలో మాత్రమే దొరికేది. అందులో, గిలాదు అనే ప్రాంతం యొర్దాను నదికి తూర్పున ఉండేది. పూర్వీకుడైన యాకోబు గుగ్గిలాన్ని, ‘ఆ దేశంలో ప్రసిద్ధములైన వాటిలో’ ఒకటిగా పరిగణించాడు. అందుకే ఆయన దాన్ని ఐగుప్తుకు కానుకగా పంపించాడు. (ఆదికాండము 43:11) యూదా, ఇశ్రాయేలు దేశాలు తూరుకు ఎగుమతి చేసిన సరుకుల్లో యెహెజ్కేలు ప్రవక్త గుగ్గిలాన్ని కూడా పేర్కొన్నాడు. (యెహెజ్కేలు 27:17) గుగ్గిలం ముఖ్యంగా దానికున్న ఔషధ గుణాలకు పేరు పొందింది. ప్రాచీన సాహిత్యంలో గుగ్గిలానికున్న స్వస్థపర్చే, బలాన్నిచ్చే శక్తి గురించి, ముఖ్యంగా గాయాలను బాగుచేయడానికి సంబంధించి తరచూ పేర్కొనబడింది.

రోగంతోవున్న ప్రజలకు గుగ్గిలం

మరైతే, యిర్మీయా ‘గిలాదులో గుగ్గిలమే లేదా?’ అనే ప్రశ్న ఎందుకు వేశాడు? దాన్ని అర్థం చేసుకోవడానికి, పూర్వకాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మనం ఒకసారి గమనించాలి. యిర్మీయా అలా ప్రశ్నించడానికి కొంతకాలం ముందు, యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులున్న దయనీయమైన ఆధ్యాత్మిక స్థితిని స్పష్టంగా ఇలా వివరించాడు, ‘అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు. తైలంతో మెత్తన చేయబడలేదు.’ (యెషయా 1:6) వాళ్లు, తమ దయనీయమైన స్థితిని గ్రహించి, స్వస్థత పొందడానికి ప్రయత్నించే బదులు తమ చెడు మార్గంలో అలాగే కొనసాగారు. యిర్మీయా కాలం వచ్చేసరికి, ‘వాళ్లు యెహోవా వాక్యాన్ని నిరాకరించారు, వాళ్లకు ఏపాటి జ్ఞానం ఉంది?’ అని ఆయన విలపించే పరిస్థితి ఏర్పడింది, వాళ్లు యెహోవా దగ్గరకు తిరిగివచ్చివుంటే, ఆయన వాళ్లను స్వస్థపర్చివుండేవాడు. ‘గిలాదులో గుగ్గిలమే లేదా?’ అనేది నిజంగా ఆలోచన రేకెత్తించే ప్రశ్నే. —యిర్మీయా 8:9.

ఎన్నో విధాలుగా, ఈనాటి లోకం ‘గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లతో’ బాధపడుతోంది. ప్రజలు ఆకలి, అన్యాయం, స్వార్థం, కఠినత్వం వంటివాటి వల్ల ఎన్నో బాధలు పడుతున్నారు. దీనంతటికీ కారణం దేవుని మీద, పొరుగువాళ్ల మీద ప్రేమ లేకపోవడమే. (మత్తయి 24:12; 2 తిమోతి 3:1-5) చాలామంది తమ జాతి, తెగ, వయస్సులను బట్టి వేరేవాళ్లు తమను తిరస్కరిస్తున్నట్టు భావిస్తున్నారు. దానికితోడు కరువులు, రోగాలు, యుద్ధాలు, చావులు వాళ్ల బాధను మరింత పెంచుతున్నాయి. యిర్మీయాలా, నిజాయితీపరులైన చాలామంది విశ్వాసులు, బాధపడుతున్నవాళ్ల మానసిక, ఆధ్యాత్మిక గాయాలను మాన్పడానికి “‘గిలాదు గుగ్గిలం’ ఏదైనా ఉందా?” అని అడుగుతున్నారు.

స్వస్థపర్చే సువార్త

యేసు కాలంలో వినయస్థుల మనస్సుల్లో ఇదే ప్రశ్న మెదిలింది. అయితే, వాళ్ల ప్రశ్నకు జవాబు దొరికింది. సా.శ. 30వ సంవత్సర ఆరంభంలో, నజరేతులోవున్న సమాజ మందిరంలో యేసు యెషయా గ్రంథం నుండి ఇలా చదివాడు, ‘దీనులకు సువర్తమానాన్ని ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి నన్ను పంపించాడు.’ (యెషయా 61:1, 3) ఆ తర్వాత యేసు ఆ మాటలను తనకు అన్వయించుకుని, ఓదార్పు సందేశాన్ని ప్రకటించే బాధ్యత అప్పగించబడిన మెస్సీయగా తనను తాను పరిచయం చేసుకున్నాడు.—లూకా 4:16-21.

యేసు తన పరిచర్య అంతటిలో దేవుని రాజ్య సువార్తను ఉత్సాహంగా ప్రకటించాడు. (మత్తయి 4:17) కొండమీద ఇచ్చిన ప్రసంగంలో, ‘ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు’ అని చెప్తూ బాధపడుతున్నవారి పరిస్థితి మారుతుందని వాళ్లకు వాగ్ధానం చేశాడు. (లూకా 6:21) నిరీక్షణా సందేశాన్ని అంటే దేవుని రాజ్యం వస్తుందనే విషయాన్ని ప్రకటించడం ద్వారా యేసు ‘నలిగిన హృదయం గలవారిని దృఢపర్చాడు.’

ఈ రోజుల్లో కూడా “రాజ్య సువార్త” మనకు అలాగే ఓదార్పునిస్తుంది. (మత్తయి 6:9, 10; 9:35) ఉదాహరణకు, రోజర్‌, లిలియన్‌ల విషయమే తీసుకోండి. వాళ్లు 1961 జనవరిలో నిత్యజీవం గురించి దేవుడు చేస్తున్న వాగ్ధానాన్ని మొట్టమొదటిసారి తెలుసుకున్నారు. అది వాళ్లకు ఉపశమనమిచ్చే తైలంలా అనిపించింది. లిలియన్‌ ఇలా గుర్తు తెచ్చుకుంటోంది, “నేను తెలుసుకున్న విషయాలను బట్టి కలిగిన ఆనందంతో నేను వంట గది అంతా చిందులేశాను.” ఆ సమయంలో, పది సంవత్సరాల పాటు పక్షవాతంతో బాధపడిన రోజర్‌ ఇలా చెప్తున్నాడు, “నాకెంతో సంతోషం కలిగింది. చనిపోయినవాళ్లు పునరుత్థానం చేయబడతారనే, బాధలూ రోగాలూ అంతమవుతాయనే అద్భుతమైన నిరీక్షణవల్ల జీవితంలో ఆనందమంటే ఏమిటో నాకు తెలిసింది.”—ప్రకటన 21:4.

1970లో పదకొండేళ్లున్న వాళ్లబ్బాయి చనిపోయాడు. కానీ వాళ్లు నిరుత్సాహంతో కృంగిపోలేదు. యెహోవా “గుండె చెదరినవారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు” అని వాళ్లు స్వయంగా చవిచూశారు. (కీర్తన 147:3) వాళ్ల నిరీక్షణ వాళ్లకు ఓదార్పునిచ్చింది. ఇప్పటికి దాదాపు యాభై సంవత్సరాలుగా, రాబోయే దేవుని రాజ్య సువార్త వాళ్లకు సమాధానాన్ని, సంతృప్తిని ఇస్తోంది.

ఇంకా జరగాల్సిన స్వస్థత

మరి ఇప్పుడు, “గిలాదు గుగ్గిలం” ఉందా? అవును, ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక గుగ్గిలం అందుబాటులో ఉంది. రాజ్య సువార్త ఇచ్చే ఓదార్పు, నిరీక్షణ నలిగిన హృదయం గలవారిని దృఢపరుస్తున్నాయి. మీరు కూడా అలాంటి స్వస్థత పొందాలనుకుంటున్నారా? దానికి మీరు చేయాల్సినది ఏమిటంటే, మీరు ఎలాంటి సంకోచాలు పెట్టుకోకుండా, దేవుని వాక్యంలోవున్న ఓదార్పునిచ్చే సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మలచనివ్వండి. లక్షలాదిమంది ఇప్పటికే అలా చేశారు.

ఈ గుగ్గిలం ఇస్తున్న స్వస్థత రానున్న గొప్ప స్వస్థత, ఎలా ఉంటుందో చూఛాయగా తెలియజేస్తోంది. నిత్యజీవం పొందగలిగేలా, యెహోవా దేవుడు ‘జనములను స్వస్థపర్చే’ సమయం త్వరగా సమీపిస్తోంది. అప్పుడు, “నాకు దేహములో బాగులేదు” అని ఎవ్వరూ అనరు. అవును ‘గిలాదు గుగ్గిలం’ ఇప్పటికీ అందుబాటులో ఉంది.—ప్రకటన 22:2; యెషయా 33:24. (w10-E 06/01)

[27వ పేజీలోని చిత్రం]

ఈ రోజుల్లో కూడా నలిగిన హృదయం గలవారు దేవుని రాజ్య సువార్తకున్న స్వస్థపర్చే శక్తివల్ల తమ బాధ నుండి ఉపశమనం పొందుతూనే ఉన్నారు