కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాపం గురించిన సత్యం

పాపం గురించిన సత్యం

పాపం గురించిన సత్యం

జ్వరం ఉన్న ఒక వ్యక్తి, థర్మామీటరు పగులగొట్టి తనకు జ్వరం లేదని నిరూపించుకోగలడా? ఎంతమాత్రం నిరూపించుకోలేడు! అలాగే చాలామంది, దేవుడు పాపం గురించి చెప్తున్నదాన్ని పెడచెవినపెట్టినంత మాత్రాన పాపం లేదని చెప్పలేం. ఈ విషయం గురించి దేవుని వాక్యమైన బైబిలు ఎంతో వివరిస్తోంది. పాపం గురించి బైబిలు ఖచ్చితంగా ఏమి చెప్తోంది?

అందరూ పాపం చేస్తారు

దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం అపొస్తలుడైన పౌలు, ‘నేను చేయాలనుకున్న మేలు చేయకుండా, చేయకూడదనుకున్న కీడు చేస్తున్నాను’ అని వాపోయాడు. (రోమీయులు 7:19) మనం నిజాయితీపరులమైతే మన పరిస్థితి కూడా అలాగే ఉందని మనం ఒప్పుకోవాలి. బహుశా మనం పది ఆజ్ఞల ప్రకారం లేదా ప్రవర్తనకు సంబంధించిన కొన్ని ఇతర ప్రమాణాల ప్రకారం నడుచుకోవాలనుకుంటాం, కానీ మనకు నచ్చినా నచ్చకపోయినా నిజం ఏమిటంటే, ఎవ్వరూ తాము అనుకున్నట్టు నడుచుకోలేరు. ఏదైనా ఒక ప్రమాణాన్ని మనం కావాలనే ఉల్లంఘించాలని కోరుకోం, కానీ మనం బలహీనులం. దానికి కారణమేమిటి? పౌలే దాని గురించి ఇలా చెప్తున్నాడు, ‘నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేసేది నాలో నివసించే పాపమే గానీ ఇకను నేను కాదు.’—రోమీయులు 7:20.

పౌలులాగే, మనుషులందరూ తమలోవున్న బలహీనతలతో బాధపడుతున్నారు, ఆ బలహీనతలు మనకు పాపము, అపరిపూర్ణత వారసత్వంగా వచ్చాయని నిరూపిస్తున్నాయి. “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని అపొస్తలుడు చెప్పాడు. ఈ పరిస్థితికి కారణమేమిటి? దాని గురించి పౌలు ఇంకా ఇలా చెప్తున్నాడు, ‘ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున, మరణము అందరికిని సంప్రాప్తమాయెను.’—రోమీయులు 3:23; 5:12.

అయితే, మన మొదటి తల్లిదండ్రులు తప్పు చేసినందుకు మనం దేవునికి దూరమై, మనం పొందాల్సిన పరిపూర్ణతను పొందలేకపోయామనే విషయాన్ని చాలామంది ఒప్పుకోరు. కానీ బైబిలు బోధిస్తున్నది అదే. యేసు, ఆదికాండములోని మొదటి అధ్యాయాలను ఆధారంగా తీసుకుని, వాటిలోవున్న విషయాలను ప్రస్తావించడం ద్వారా, తాను ఆదాముహవ్వల గురించి బైబిలు చెప్తున్నదాన్ని నమ్ముతున్నానని చూపించాడు.—ఆదికాండము 1:27; 2:24; 5:2; మత్తయి 19:1-5.

బైబిలు సందేశానికి మూలాధారంగా ఉన్నవాటిల్లో ఒకటేమిటంటే, యేసు తనపై విశ్వాసముంచే వాళ్లను వాళ్ల పాపభరితమైన స్థితి నుండి విడిపించడానికి భూమ్మీదకు వచ్చాడన్న విషయం. (యోహాను 3:16) మనుషులు తమ సొంతగా తప్పించుకోలేని దురావస్థలో చిక్కుకున్నారు. అయితే, కృతజ్ఞతగల మనుషులను కాపాడడానికి యెహోవా చేసిన ఏర్పాటును మనం అంగీకరిస్తే భవిష్యత్తులో నిత్యజీవాన్ని పొందగలుగుతాం. దేవుడు దేన్ని పాపంగా పరిగణిస్తాడో మనకు సరిగ్గా తెలీకపోతే, దాని నుండి మనల్ని కాపాడడానికి ఆయన చేసిన ఏర్పాటును అర్థంచేసుకోలేం, దానిపట్ల కృతజ్ఞత చూపించలేం.

యేసు బలి, అదెందుకు అవసరమైంది?

యెహోవా మొదటి మానవుడైన ఆదాముకు ఎప్పటికీ జీవించే అవకాశాన్ని ఇచ్చాడు. అతను దేవుని ఆజ్ఞను మీరితే ఆ గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంటాడు. ఆదాము అదే చేశాడు, అలా చేసినప్పుడు అతను పాపి అయ్యాడు. (ఆదికాండము 2:15-17; 3:6) ఆదాము దేవునికి ఇష్టంలేని విధంగా ప్రవర్తించి అపరిపూర్ణుడయ్యాడు, దేవునితో తనకున్న సంబంధాన్ని చెడగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి అతను పాపం చేసినందుకు క్రమేణా వృద్ధుడై, చివరకు చనిపోయాడు. ఆదాము పిల్లలందరూ పాపంలో పుట్టారు, దానివల్ల తప్పకుండా చనిపోతారు. మనం కూడా ఆదాము పిల్లలమే కాబట్టి మన పరిస్థితి కూడా అదే. ఎందుకు?

దానికి కారణం చాలా చిన్న విషయం. అపరిపూర్ణులైన తల్లిదండ్రులు పరిపూర్ణులైన పిల్లలను కనలేరు. ఆదాము పిల్లలందరూ పాపంలోనే పుట్టారు, అపొస్తలుడైన పౌలు చెప్తున్నట్లు, “పాపమువలన వచ్చు జీతము మరణము.” (రోమీయులు 6:23) అయితే, ఆ వచనంలోని రెండవ భాగం మనకు ఊరటనిస్తుంది, “దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” అంటే, యేసు తన జీవితాన్ని బలి అర్పించాడు కాబట్టి దాని ద్వారా, విధేయత చూపించే, కృతజ్ఞతగల మనుషులు ఆదాము చేసిన పాపంవల్ల వచ్చే పర్యవసానాల నుండి విముక్తులయ్యే అవకాశం ఉంది. a (మత్తయి 20:28; 1 పేతురు 1:18, 19) అది తెలుసుకున్నప్పుడు మీకెలా అనిపించాలి?

క్రీస్తు ప్రేమ ‘మనల్ని ప్రేరేపిస్తోంది’

ఆ ప్రశ్నకు దేవుడిచ్చే సమాధానం గురించి, పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, ‘క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది [“ప్రేరేపిస్తోంది,” NW]; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెను.’ (2 కొరింథీయులు 5:14, 15) ఒక వ్యక్తి, యేసు అర్పించిన బలికి పాపంవల్ల వచ్చే పర్యవసానాలను తీసివేయగల శక్తి ఉందని ఒప్పుకుంటే, దేవుడు చేసిన ఆ ఏర్పాటు పట్ల కృతజ్ఞత చూపించాలని కోరుకుంటే, ఆయన దేవుడు చెప్పినట్టు నడుచుకోవడానికి కృషిచేయాలి. అలా చేయాలంటే, ఆయన దేవుడు ఏమి కోరుతున్నాడో తెలుసుకుని దాన్ని అర్థంచేసుకోవాలి, బైబిలు ప్రమాణాల ప్రకారం తన మనస్సాక్షిని మలచుకోవాలి, వాటి ప్రకారం జీవించాలి.—యోహాను 17:3, 17.

చెడు పనులు చేస్తే, మనం దేవునితో ఉన్న సంబంధాన్ని పాడుచేసుకుంటాం. దావీదు రాజు బత్షెబతో వ్యభిచారం చేసి, ఆమె భర్తను చంపించి తనెంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకుని చాలా సిగ్గుపడ్డాడు. కానీ తను చేసిన తప్పులు దేవుణ్ణి బాధపెట్టాయనే విషయమే ఆయనను ఎక్కువగా కృంగదీసింది. ఆయన అలా ఆలోచించడం సరైనదే. ఆయన పశ్చాత్తాపంతో యెహోవా ముందు ఇలా ఒప్పుకున్నాడు, “నీకు, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను. నీ దృష్టి యెదుట నేను చెడుతనము చేసియున్నాను.” (కీర్తన 51:4) అలాగే, వ్యభిచారం చేయమనే ఒత్తిడి యోసేపు మీదకు వచ్చినప్పుడు ఆయన మనస్సాక్షి ఆయన ఇలా అడిగేలా చేసింది, “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?”—ఆదికాండము 39:9.

కాబట్టి పాపమంటే, తప్పు చేస్తూ దొరికిపోయినందుకు సిగ్గుపడడం మాత్రమే కాదు. తప్పుచేసినందుకు సమాజానికి సంజాయిషీ చెప్పుకోవడమూ కాదు. లైంగిక సంబంధాలు, నిజాయితీ, గౌరవం, ఆరాధన వంటి విషయాల్లో దేవుని నియమాలు మీరితే మనం దేవునితో ఉన్న సంబంధాన్ని పాడుచేసుకుంటాం. మనం కావాలని పాపం చేస్తూ ఉంటే, మనకు మనం దేవునికి శత్రువులమయ్యే అవకాశముంది. ఇది చాలా గంభీరంగా ఆలోచించాల్సిన సత్యం.—1 యోహాను 3:4, 8.

కాబట్టి, పాపానికి ఏమైంది? నిజం చెప్పాలంటే, పాపానికి ఏమీ కాలేదు. పాపం నిజంగా ఎంతో గంభీరమైనదే అయినా అది అంత గంభీరంగా కనిపించకూడదని, ప్రజలు దాని గురించి చెప్పడానికి వేర్వేరు పదాలు ఉపయోగించడం మొదలుపెట్టారు. వాళ్లలో చాలామంది తమ మనస్సాక్షి మొద్దుబారిపోయేలా చేసుకున్నారు లేదా దాన్ని పట్టించుకోవడం మానేశారు. దేవుని అనుగ్రహం కావాలనుకునే వాళ్లందరూ అలా చేయకూడదు. పాపంవల్ల వచ్చే ఫలితం అహం దెబ్బతినడమో లేదా సిగ్గుపడడమో మాత్రమే కాదు. కానీ, దానివల్ల వచ్చే ఫలితం మరణం. పాపం అనేది జీవన్మరణాలకు సంబంధించింది.

సంతోషకరమైన విషయం ఏమిటంటే, మనం చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెడితే, యేసు బలికివున్న విమోచనా శక్తి వల్ల మన పాపాలకు క్షమాపణ దొరికే అవకాశముంది. పౌలు ఇలా రాశాడు, ‘తన అతిక్రమాలకు పరిహారం పొందినవాడు తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా నిర్దోషియని ఎంచినవాడు ధన్యుడు.’—రోమీయులు 4:7, 8. (w10-E 06/01)

[అధస్సూచి]

a విధేయత చూపించే మానవజాతిని రక్షించే శక్తి యేసు అర్పించిన బలికి ఎలా ఉందో వివరంగా తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 47 నుండి 54 పేజీలను చూడండి.

[16వ పేజీలోని బాక్సు/ చిత్రం]

ఒక బోధ విషయంలో పెద్ద మార్పు

క్యాథలిక్‌ చర్చికి వెళ్లేవాళ్లలో చాలామందికి లింబో (నరకలోకపు సరిహద్దు ప్రదేశం) ఎప్పుడూ అంత స్పష్టంగా అర్థంకాలేదు. ఇటీవలి దశాబ్దాల్లో, లింబో క్రమేణా లేకుండా పోయింది. కాటకిసమ్‌లో (ప్రశ్నోత్తర రూపంలో జరిపే బోధ) దాని గురించిన ఆలోచన ఇప్పుడిక లేదు. క్యాథలిక్‌ చర్చి 2007లో, “బాప్తిస్మానికి ముందే చనిపోయిన పసిబిడ్డలు రక్షించబడి, నిత్య సంతోషం ఉండే స్థలానికి తీసుకెళ్లబడతారని నిరీక్షించడానికి మత సంబంధిత, చర్చి సంబంధిత కారణాలను” తెలియజేసే ఒక పత్రంపై సంతకం చేయడం ద్వారా లింబో “మరణ ధృవీకరణ పత్రం” మీద అధికారికంగా సంతకం చేసింది.—ఇంటర్నేషనల్‌ థియోలాజికల్‌ కమీషన్‌.

ఎందుకింత పెద్ద మార్పు? ఎందుకంటే ఈ మార్పువల్ల, “భారమైన వారసత్వం” అని ఫ్రెంచ్‌ పత్రికా విలేఖరి హెన్రీ టెంక్‌ చెప్పిన లింబో నుండి చర్చి విముక్తి పొందగలిగింది. ఆయన దాని గురించి ఇంకా ఇలా చెప్పాడు, “తల్లిదండ్రులు తమ పిల్లలకు వీలైనంత త్వరగా బాప్తిస్మం ఇప్పించేలా చేయడానికి, మధ్యయుగాల నుండి 20వ శతాబ్దం వరకు చర్చి, లింబోను ఒక అస్త్రంలా ఉపయోగిస్తూ దానిని సమర్థిస్తూ వచ్చింది.” అయితే, లింబో అంతరించిపోవడం వల్ల ఇతర ప్రశ్నలు తలెత్తుతాయి.

మనుషుల నమ్మకాలా, లేఖనాలా? చారిత్రకంగా, 12వ శతాబ్దంలో పాపవిమోచన లోకం (పర్‌గెటరీ) గురించి జరిగిన మతపరమైన చర్చల వల్ల లింబో నమ్మకం ఉనికిలోకి వచ్చింది. చనిపోయిన తర్వాత ఆత్మ బ్రతికివుంటుందని క్యాథలిక్‌ చర్చి బోధించింది. అందుకే, బాప్తిస్మం ఇవ్వబడకముందే చనిపోయిన పిల్లలు పరలోకానికి వెళ్లలేరు, అలాగని వాళ్లు నరకానికి వెళ్లడానికి కూడా అర్హులు కాదు కాబట్టి, వాళ్ల ఆత్మల కోసం చర్చి ఒక స్థలాన్ని కనిపెట్టాల్సివచ్చింది. దానితో లింబో బోధ ఉనికిలోకి వచ్చింది.

అయితే, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని శరీరంలోని ఏదో ఒక అదృశ్యభాగం ఇంకా జీవిస్తూ ఉంటుందని బైబిలు బోధించడం లేదు. కానీ చనిపోయిన వాళ్లు నిద్రపోతున్నవారిలా, స్పృహలో ఉండరని అది చెప్తోంది. (ప్రసంగి 9:5, 10; యోహాను 11:11-14) చనిపోయిన తర్వాత శరీరంలోని అదృశ్య భాగమేదీ బత్రికివుండదు కాబట్టి లింబో లాంటి స్థలం ఉండే అవకాశం లేదు.

క్రైస్తవ తల్లిదండ్రుల పిల్లలను దేవుడు పవిత్రులుగా పరిగణిస్తాడని బైబిలు సూచిస్తోంది. (1 కొరింథీయులు 7:14) పిల్లల రక్షణకు బాప్తిస్మం అవసరమైతే, బైబిలు అలా చెప్పడంలో అర్థముండదు.

లింబో బోధ దేవుణ్ణి నిజంగా అవమానపరుస్తుంది. ఎందుకంటే నిజానికి ఆయన న్యాయవంతుడు, ప్రేమగల తండ్రి. కానీ ఆ బోధ ఆయనను అలా కాకుండా, నిర్దోషులను శిక్షించే క్రూరుడన్నట్లు చూపిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 32:4; మత్తయి 5:45; 1 యోహాను 4:8) కాబట్టి, లేఖనాల్లో లేని ఈ బోధ, నిజాయితీ గల క్రైస్తవులకు ఎప్పుడూ సమంజసమైనదిగా అనిపించలేదంటే అందులో ఆశ్చర్యం లేదు!

[15వ పేజీలోని చిత్రాలు]

దేవుని వాక్య ప్రకారం జీవిస్తే దేవునితో, మనుషులతో మంచి సంబంధాలు కలిగివుండవచ్చు