కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు
పిల్లలు తమ బాధ్యత తెలుసుకునేలా వాళ్లను ఎలా పెంచాలి?
అశోక్: a “మా అబ్బాయి పృథ్వికి నాలుగు సంవత్సరాలు. వాడు తన ఆట బొమ్మలను ఇల్లంతా పరుస్తాడు. వాణ్ణి పడుకోబెట్టే ముందు వాడితో ఆ బొమ్మలు తీసినచోటే పెట్టించాలని చూస్తాను. కానీ వాడు పిచ్చిపట్టినట్టు గట్టిగా అరుస్తాడు, ఆ పని చేయనని మొరాయిస్తాడు. కొన్నిసార్లు నాకెంత కోపం వస్తుందంటే ఆ కోపంలో వాడిమీద గట్టిగా కేకలేస్తాను, దాంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది. పడుకునే ముందు వాడితో సంతోషంగా గడపాలని నాకనిపిస్తుంది. అందుకే, విసుగొచ్చి ఆ బొమ్మలన్నీ నేనే సర్దుతాను. ప్రతీరోజు ఇదే తంతు.”
సంధ్య: “నా కూతురు కళ్యాణికి 13 సంవత్సరాలు. టీచరు ఇచ్చిన హోంవర్క్ ఎలా చేయాలో దానికి అర్థం కాలేదు. అది స్కూలు నుండి ఇంటికి వచ్చాక దాదాపు గంటసేపు ఏడుస్తూనే ఉంది. టీచరు సహాయం కోసం అడగమని నేను చెప్పాను కానీ వాళ్ల టీచరు చాలా కఠినంగా ఉంటుందని, ఆమెను అడిగేంత ధైర్యం తనకు లేదని కళ్యాణి అంది. అది వినగానే, వెంటనే వాళ్ల స్కూలుకు వెళ్లి ఆ టీచరును చెడామడా తిడదామన్నంత కోపమొచ్చింది. నా కూతురును అంతగా బాధపెట్టే హక్కు ఎవ్వరికీ లేదని నాకనిపించింది.”
అశోక్, సంధ్య అనుకున్నట్లు మీరు కూడా ఎప్పుడైనా అనుకున్నారా? ఆ తల్లిదండ్రుల్లాగే చాలామంది, తమ పిల్లలు ఏదైనా సమస్యతో సతమతమవుతున్నా లేదా ఏడుస్తున్నా చూసి తట్టుకోలేరు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ కష్టం రాకుండా కాపాడలనుకోవడం ఎంతో సహజం. అయితే, పైన ప్రస్తావించిన పరిస్థితుల్లో, పిల్లలు తమ బాధ్యత తెలుసుకునేలా వాళ్లకు ఒక విలువైన పాఠం నేర్పించే అవకాశం తల్లిదండ్రులకు దొరికింది. అయితే, నాలుగేళ్ల బాబు నేర్చుకోవాల్సిన పాఠం వేరు, పదమూడేళ్ల అమ్మాయి నేర్చుకోవాల్సిన పాఠం వేరు.
నిజమేమిటంటే, జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి మీ పిల్లలను కాపాడడానికి మీరు ఎప్పుడూ వాళ్లతోనే ఉండరు. ఎప్పటికైనా పిల్లలు తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి, తమ బాధ్యత అనే ‘బరువు తామే భరించుకుంటారు.’ (గలతీయులు 6:5; ఆదికాండము 2:24) పిల్లలు తమ గురించి తాము శ్రద్ధ తీసుకోగలిగేలా తల్లిదండ్రులు వాళ్లను సిద్ధం చేయాలంటే, ముందు వాళ్లు నిస్వార్థంగా, ఇతరులపట్ల శ్రద్ధ చూపించే విధంగా, బాధ్యత తెలిసిన వ్యక్తులుగా తయారయ్యేలా వాళ్లకు బోధించడం మీద దృష్టి పెట్టాలి. అది అంత సులువైన పనేమీ కాదు!
మత్తయి 28:19, 20) యేసు సాధించిన లక్ష్యం, పిల్లలు తమ బాధ్యత తెలుసుకునేలా వాళ్లను పెంచాలనుకుంటున్న తల్లిదండ్రులు సాధించాలనుకునే లక్ష్యంలాంటిదే. యేసును ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులు నేర్చుకోగల విషయాల్లో మూడింటిని పరిశీలిద్దాం.
అయితే, ఈ విషయంలో తల్లిదండ్రులు యేసును ఆదర్శంగా తీసుకుని, ఆయన తన శిష్యులతో వ్యవహరించిన తీరు నుండి ఎంతో నేర్చుకోవచ్చు. నిజమే, యేసుకు తన సొంత పిల్లలు లేరు. కానీ, యేసు తను వెళ్లిపోయాక తన శిష్యులు, తమకు అప్పగించబడిన పనిని సమర్థవంతంగా చేయాలన్న లక్ష్యంతో ఆయన వాళ్లను ఎంపిక చేసుకున్నాడు, వాళ్లకు శిక్షణ ఇచ్చాడు. (మీ పిల్లలకు “ఆదర్శంగా” ఉండండి
యేసు తన జీవితపు చివరి సమయంలో తన శిష్యులకు ఇలా చెప్పాడు, “నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని, నేను చేసినట్లు మీరు కూడా చేయాలి.” (యోహాను 13:15, ఈజీ-టు-రీడ్ వర్షన్) అలాగే, బాధ్యతగా ఉండడమంటే ఖచ్చితంగా ఏమిటో తల్లిదండ్రులు వివరించాలి, అంతేకాదు ఈ విషయంలో వాళ్లు ఆదర్శంగా కూడా ఉండాలి.
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి తరచూ మంచిగా మాట్లాడుతున్నానా?’ వేరేవాళ్ల కోసం కష్టపడి పనిచేస్తున్నందుకు నాకు కలిగే సంతృప్తి గురించి మాట్లాడుతున్నానా? లేదా, సుఖంగా ఉన్నట్లు కనిపించేవాళ్లతో నన్ను నేను పోల్చుకుంటూ తరచూ ఫిర్యాదు చేస్తున్నానా?
నిజమే, మనలో ఎవ్వరం పరిపూర్ణులం కాదు. మనందరం కొన్నిసార్లు చాలా పనులతో సతమతమవుతుంటాం. కానీ, బాధ్యతగా ప్రవర్తించడం ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువైనదో మీ పిల్లలు గ్రహించడానికి మీ ఉదాహరణనే చాలా తోడ్పడుతుంది.
ఇలా చేసి చూడండి: వీలైతే, మీరు పనిచేసే దగ్గరకు మీ పిల్లలను అప్పుడప్పుడు తీసుకువెళ్లి, కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి మీరు ఏమి చేస్తున్నారో చూపించండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి వెళ్తున్నప్పుడు, వీలైతే మీ పిల్లలను కూడా మీతోపాటు తీసుకువెళ్లండి. ఆ తర్వాత, అలా సహాయం చేసినప్పుడు మీకు కలిగిన ఆనందం గురించి వాళ్లతో మాట్లాడండి.—అపొస్తలుల కార్యములు 20:35.
వాళ్ల పరిమితులను అర్థంచేసుకోండి
యేసు, తన శిష్యులు తాను వాళ్లనుండి ఆశిస్తున్నదాన్ని చేయడానికి, తను అప్పగించిన బాధ్యతల్ని తీసుకోవడానికి సిద్ధమవ్వాలంటే వాళ్లకు కొంత సమయం అవసరమని అర్థంచేసుకున్నాడు. ఆయన ఒకసారి వాళ్లతో ఇలా అన్నాడు, ‘నేను మీతో చెప్పాల్సినవి ఇంకా అనేక సంగతులున్నాయి. కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు.’ (యోహాను 16:12) యేసు ఏదైనా సొంతగా చేసేయమని వెంటనే తన శిష్యులకు చెప్పలేదు. కానీ, ఆయన వాళ్లకు ఎన్నో విషయాలు బోధిస్తూ వాళ్లతో ఎక్కువ సమయం గడిపాడు. వాళ్లు చేయగలరని ఆయనకు నమ్మకం కుదిరిన తర్వాతనే వాళ్లను పంపించాడు.
అలాగే, తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెద్దవాళ్ల బాధ్యతలు నిర్వర్తించమని తమ పిల్లలకు చెప్పడం సమంజసం కాదు. అయినా, పిల్లలు పెద్దవారవుతున్నకొద్దీ, ఎలాంటి పనులు వాళ్లకు అప్పగిస్తే బాగుంటుందనేది తల్లిదండ్రులే నిర్ణయించాలి. ఉదాహరణకు, శరీరాన్ని, గదిని శుభ్రంగా ఉంచుకోవడం, సమయాన్ని ఖచ్చితంగా పాటించడం, డబ్బు జాగ్రత్తగా ఖర్చుపెట్టడం వంటి విషయాల్లో బాధ్యతగా ఉండడాన్ని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. పిల్లలు స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టినప్పుడు, వాళ్లు స్కూల్లో టీచరు ఇచ్చే పని చేయడం తమ బాధ్యత అని గుర్తించేలా వాళ్లకు సహాయం చేయాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతలు అప్పగిస్తే మాత్రమే సరిపోదు. వాటిని నిర్వర్తించడానికి వాళ్లు చేసే ప్రయత్నాల్లో తల్లిదండ్రులు వాళ్లకు చేయూతను కూడా ఇవ్వాలి. మనం ముందు మాట్లాడుకున్న అశోక్ తన కొడుకుకు ఆట బొమ్మలను సర్దడం పెద్ద పనిలా అనిపించినందుకే వాడు ఆ పని చేయడానికి మొరాయించాడని అర్థంచేసుకున్నాడు. “ఆట బొమ్మలను తీసి సర్దమని వాడిమీద అరవడం మానేసి, ఆ పనిని ఒక పద్ధతి ప్రకారం ఎలా చేయాలో వాడికి నేర్పించాను” అని అశోక్ చెప్తున్నాడు.
అశోక్ అసలు ఏంచేశాడు? ఆయనిలా చెప్తున్నాడు, “రోజూ రాత్రి ఈ సమయానికల్లా బొమ్మలు తీసి సర్దిపెట్టాలని పృథ్వికి చెప్పాను. వాడు ఆ పని చేస్తున్నప్పుడు బొమ్మలన్నీ వాటివాటి స్థలాల్లో పెట్టడానికి నేను కూడా వాడికి సహాయం చేశాను. ఎవరు త్వరగా సర్దుతారో చూద్దామంటూ పోటీ పెట్టి, ఆ పని ఆడుతూ పాడుతూ చేసేలా చూశాను. త్వరలోనే, పృథ్వి పడుకునేముందు ఆ పని చేయడం అలవాటు చేసుకున్నాడు. ఒకవేళ ఆ పని త్వరగా చేస్తే, పడుకునే ముందు అదనంగా మరో కథ చదివి వినిపిస్తానని చెప్పేవాణ్ణి. సమయానికి చేయలేకపోతే, కథ చెప్పే సమయాన్ని తగ్గించేవాణ్ణి.”
ఇలా చేసి చూడండి: మీ ఇంటి పని సాఫీగా జరగడానికి మీ పిల్లల్లో ప్రతీ ఒక్కరూ ఏమేమి పనులు చేయగలరో ఆలోచించండి. ‘వాళ్లు సొంతగా చేసుకోగల పనులను కూడా నేనింకా చేసిపెడుతున్నానా?’ అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకవేళ అలా జరుగుతుంటే, మీ పిల్లలు ఆ పనులను సొంతగా చేసుకోగలరన్న నమ్మకం మీకు కలిగేంతవరకు వాళ్లతో కలిసి ఆ పనులను చేయండి. ఇచ్చిన పనిని వాళ్లు సరిగ్గా చేస్తే బహుమతులిస్తామని, సరిగ్గా చేయకపోతే శిక్ష తప్పదని స్పష్టంగా చెప్పండి. ఆ తర్వాత మీరు చెప్పినట్టే చేయండి.
స్పష్టమైన నిర్దేశాలివ్వండి నేర్చుకోవడానికి చక్కని మార్గం స్వయంగా చేయడమే అన్న విషయం, ప్రతి మంచి బోధకునిలా, యేసుకు కూడా తెలుసు. ఉదాహరణకు, యేసు సరైన సమయమని అనుకున్నప్పుడు తన శిష్యులను, ‘తాను వెళ్లబోయే ప్రతీ ఊరికి, ప్రతీ చోటుకు తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపించాడు.’ (లూకా 10:1) అయితే, ఆయన ఎలాంటి నిర్దేశాలు ఇవ్వకుండా వాళ్లను పంపించి వేయలేదు. వాళ్లను పంపించే ముందు ఆయన వాళ్లకు చాలా స్పష్టమైన నిర్దేశాలిచ్చాడు. (లూకా 10:2-12) శిష్యులు తిరిగి వచ్చి, తాము సాధించిన వాటి గురించి చెప్పినప్పుడు ఆయన వాళ్లను మెచ్చుకున్నాడు, ప్రోత్సహించాడు. (లూకా 10:17-24) యేసు తన శిష్యుల సామర్థ్యం మీద తనకు నమ్మకముందని వాళ్లతో చెప్పాడు. అంతేకాదు, వాళ్లంటే తనకు ఇష్టమని కూడా ఆయన చెప్పాడు.
మీ పిల్లలు కష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు మీరెలా స్పందిస్తారు? పిల్లలు భయపడే విషయాల నుండి వాళ్లను తప్పించడానికి ప్రయత్నిస్తారా, వాళ్లు నిరాశను, అపజయాన్ని చవిచూడకుండా వాళ్లను కాపాడడానికి ప్రయత్నిస్తారా? వెంటనే మీకు వాళ్లను “కాపాడాలి” అన్న తలంపే రావచ్చు లేదా భారమంతా మీమీదే వేసుకోవాలని మీకు అనిపించవచ్చు.
కానీ దీన్ని పరిశీలించండి: మీరు ప్రతీసారి ఏదో రకంగా మీ పిల్లలను “కాపాడితే,” మీరు వాళ్లకు ఏమి తెలియజేస్తున్నట్టు? మీకు వాళ్ల మీద, వాళ్ల సామర్థ్యం మీద నమ్మకముందని చూపించినట్టు అవుతుందా? లేదా వాళ్లు ప్రతీదానికి మీమీద ఆధారపడాల్సిన నిస్సహాయులైన పసిబిడ్డలేనని మీరు అనుకుంటారని చూపించినట్టు అవుతుందా?
ఉదాహరణకు, ముందు చెప్పుకున్న సంధ్య తన కూతురుకు సమస్య ఎదురైనప్పుడు ఏమిచేసింది? తను జోక్యం చేసుకునే బదులు, తన కూతురే స్వయంగా టీచరు దగ్గరకు వెళ్లి మాట్లాడేలా చేసింది. వాళ్లిద్దరూ కలిసి, కళ్యాణి టీచరును ఏమేమి ప్రశ్నలు అడగాలో రాశారు. ఆ తర్వాత టీచరును ఎప్పుడు కలిస్తే బాగుంటుందో వాళ్లు మాట్లాడుకున్నారు. వాళ్లు, సంభాషణ ఎలా కొనసాగవచ్చనేది కూడా చాలాసార్లు ప్రాక్టీసు చేశారు. సంధ్య ఇలా అంటోంది, “కళ్యాణి టీచరుతో మాట్లాడానికి ధైర్యం తెచ్చుకుంది, కళ్యాణి తనే ముందుకొచ్చి అడిగినందుకు వాళ్ల టీచరు దాన్నెంతో మెచ్చుకుంది. కళ్యాణిలో ఆత్మ విశ్వాసం పెరిగింది. దాన్ని చూసి నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను.”
ఇలా చేసి చూడండి: మీ పిల్లలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒక సమస్యను రాయండి. దాని పక్కనే, మీ పిల్లల్ని మీరు “కాపాడకుండా,” వాళ్లంతట వాళ్లే ఆ సమస్యను పరిష్కరించుకునేలా మీరు వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో రాయండి. ఆ సమస్యను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను మీ పిల్లలతో కలిసి ప్రాక్టీసు చేయండి. మీ పిల్లల సామర్థ్యం మీద మీకు నమ్మకముందని చెప్పండి.
మీ పిల్లలకు ఏ కష్టం రాకుండా ఎప్పుడూ మీరు వాళ్లను కాపాడుతూవుంటే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తమంతట తామే ఎదుర్కొనే సామర్థ్యం వాళ్లలో పెరగకుండా చేసినవాళ్లవుతారు. అలా కాకుండా ఉండాలంటే, మీ పిల్లలు తమ బాధ్యత తెలుసుకునేలా వాళ్లకు తర్ఫీదునిస్తూ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. అలా చేశారనుకోండి, నిజంగా మీరు వాళ్లకు చాలా విలువైన బహుమతి ఇచ్చినవాళ్లవుతారు. (w10-E 05/01)
a అసలు పేర్లు కావు.
మీరిలా ప్రశ్నించుకోండి . . .
-
నా పిల్లల నుండి నేను ఆశిస్తున్నది సమంజసంగానే ఉందా?
-
సమస్యలను చక్కగా పరిష్కరించుకోవాలంటే వాళ్లు ఏంచేయాలో చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నానా?
-
నా పిల్లలను ప్రోత్సహించి లేదా మెచ్చుకుని ఎంత కాలమైంది?