కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు నేర్పించండి

యేసు గురించి రాసిన వ్యక్తులు

యేసు గురించి రాసిన వ్యక్తులు

యేసు గురించి చదవడం మీకు ఇష్టమేనా?— a బైబిల్లోని ఏ ఒక్క పుస్తకాన్ని యేసు రాయలేదని తెలుసుకుని కొంతమంది ఆశ్చర్యపోతారు. అయితే, బైబిలును రాసినవాళ్లలో ఎనిమిదిమంది యేసు గురించి చాలా రాశారు. వీళ్లంతా యేసు జీవించిన కాలంలోనే జీవించారు, ఆయనేమి బోధించాడో వాళ్లు చెప్పారు. ఆ ఎనిమిదిమంది పేర్లు చెప్పగలరా?— వాళ్లలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఉన్నారు. మిగతావాళ్ల పేర్లు పేతురు, యాకోబు, యూదా, పౌలు. వీళ్ల గురించి మీకేం తెలుసు?—

వీళ్లలో ముగ్గురి గురించి ముందు తెలుసుకుందాం. యేసు 12 మంది అపొస్తలుల్లో వీళ్లు కూడా ఉన్నారు. వీళ్ల పేర్లు మీకు తెలుసా?— పేతురు, యోహాను, మత్తయి. పేతురు తోటి క్రైస్తవులకు రెండు పత్రికలను రాశాడు. అందులో ఆయన యేసు చేసిన వాటి గురించి, చెప్పిన వాటి గురించి తనకు తెలిసినవి రాశాడు. మీరు మీ బైబిల్లో 2 పేతురు 1:16-18 తీసి, పరలోకం నుండి యెహోవా దేవుడు యేసుతో మాట్లాడినప్పుడు తాను విన్నదాన్ని పేతురు ఎలా వివరిస్తున్నాడో చదవండి.—మత్తయి 17:5.

అపొస్తలుడైన యోహాను బైబిల్లోని ఐదు పుస్తకాలను రాశాడు. శిష్యులు తమ బోధకునితో కలిసి చివరిసారిగా భోజనం చేస్తున్నప్పుడు యోహాను ఆయన పక్కనే కూర్చుని ఉన్నాడు. యేసు చనిపోయినప్పుడు కూడా యోహాను ఆయనతోనే ఉన్నాడు. (యోహాను 13:23-26; 19:26) యేసు జీవిత వృత్తాంతాలను వివరించే నాలుగు బైబిలు పుస్తకాల్లో ఒకదానిని యోహాను రాశాడు, వీటినే మనం సువార్తలు అంటాం. యేసు తనకు ఇచ్చిన ప్రత్యక్షత గురించి కూడా యోహాను రాశాడు, దాని పేరు ప్రకటన గ్రంథం. అంతేకాదు, తన పేరుతో ఉన్న మూడు పత్రికలను కూడా ఆయన రాశాడు. (ప్రకటన 1:1) యేసు అపొస్తలుడైన మూడో వ్యక్తి మత్తయి. ఆయన ఒక సుంకరి, అంటే పన్ను వసూలుచేసేవాడు.

మరో ఇద్దరు రచయితలకు యేసు చాలా ప్రత్యేకమైన విధంగా తెలుసు. వీళ్లు ఆయన తమ్ముళ్లు, యోసేపు, మరియల పిల్లలు. (మత్తయి 13:55) మొదట్లో వీళ్లు యేసు శిష్యులు కాలేదు. యేసు చాలా ఉత్సాహంగా ప్రకటించడం చూసి వీళ్లు ఆయనకు పిచ్చిపట్టిందనుకున్నారు. (మార్కు 3:21) ఇంతకీ వీళ్ల పేర్లు ఏమిటి?— ఒకాయన పేరు యాకోబు. ఈయన బైబిల్లో తన పేరుతో ఉన్న పుస్తకాన్ని రాశాడు. మరొకాయన యూదా. ఈయన కూడా బైబిల్లో తన పేరుతోవున్న పుస్తకాన్ని రాశాడు.—యూదా 1.

యేసు జీవితం గురించి రాసినవాళ్లలో మరో ఇద్దరు మార్కు, లూకా. మార్కు తల్లి పేరు మరియ. వీళ్లకు యెరూషలేములో పెద్ద ఇల్లు ఉండేది. అపొస్తలుడైన పేతురుతోపాటు, తొలి క్రైస్తవులు వీళ్ల ఇంట్లోనే కూడుకునేవాళ్లు. (అపొస్తలుల కార్యములు 12:11, 12) దానికి చాలా సంవత్సరాల ముందు, యేసు తన అపొస్తలులతో కలిసి చివరిసారి పస్కాను జరుపుకున్న రాత్రి, వాళ్లు గెత్సేమనే తోటకు వెళ్లినప్పుడు బహుశా మార్కు కూడా వాళ్లతోపాటు వెళ్లివుంటాడు. యేసును బంధించినప్పుడు సైనికులు మార్కును కూడా పట్టుకున్నారు, కానీ మార్కు తన వస్త్రాన్ని వదిలేసి పారిపోయాడు.—మార్కు 14:51, 52.

లూకా బాగా చదువుకున్న వైద్యుడు. బహుశా ఆయన యేసు చనిపోయిన తర్వాత శిష్యుడయ్యుంటాడు. ఆయన యేసు జీవితం గురించి జాగ్రత్తగా పరిశోధన చేసి, వివరాలను స్పష్టంగా ఖచ్చితంగా రాశాడు. లూకా అపొస్తలుడైన పౌలుతో కలిసి ప్రకటనా పనిమీద ఎన్నో ప్రాంతాలకు వెళ్లాడు. అంతేకాదు, ఈయన అపొస్తలుల కార్యములు అనే పుస్తకాన్ని కూడా రాశాడు.—లూకా 1:1-3; అపొస్తలుల కార్యములు 1:1.

యేసు గురించి రాసిన ఎనిమిదో వ్యక్తి పౌలు. ఒకప్పుడు ఈయనను సౌలు అని పిలిచేవాళ్లు. ఈయన బాగా పేరుపొందిన గమలీయేలు అనే ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర చదువుకున్నాడు. పరిసయ్యుల చేతుల్లో పెరిగి, వాళ్ల దగ్గరే చదువుకున్న పౌలు యేసు శిష్యులను ద్వేషించాడు, వాళ్లను చంపించడంలో భాగం వహించాడు. (అపొస్తలుల కార్యములు 7:58–8:3; 22:1-5; 26:4, 5) యేసు గురించిన సత్యం పౌలుకు ఎలా తెలిసిందో మీకు తెలుసా?—

ఒకరోజు పౌలు యేసు శిష్యులను బంధించడానికి దమస్కుకు వెళ్తుండగా, దారిలో ఒక పెద్ద వెలుగు ప్రకాశించడంతో, ఆయనకు కళ్లు కనిపించలేదు. ‘సౌలా, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు?’ అని ఒక స్వరం అడగడం ఆయనకు వినిపించింది. అది యేసు స్వరం! దమస్కుకు వెళ్లమని ఆయన పౌలుకు చెప్పాడు. యేసు తన శిష్యుడైన అననీయను పౌలుతో మాట్లాడడానికి పంపించాడు, తర్వాత పౌలు యేసు శిష్యుడయ్యాడు. (అపొస్తలుల కార్యములు 9:1-18) పౌలు, రోమీయులకు రాసిన పత్రిక నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక వరకున్న 14 బైబిలు పుస్తకాలను రాశాడు.

యేసు గురించి వివరించే బైబిలు పుస్తకాలను చదవడం మొదలుపెట్టారా, లేదా ఎవరైనా చదివి వినిపిస్తున్నారా?— యేసు గురించి బైబిలు ఏమి చెప్తుందో చిన్నప్పటి నుండే తెలుసుకోవడం మంచిది. అది, మీ జీవితంలో మీరు చేసే మంచి పనుల్లో ఒకటి. (w10-E 06/01)

a మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.