కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘విరిగి నలిగిన హృదయం’ క్షమాపణ అడిగితే?

‘విరిగి నలిగిన హృదయం’ క్షమాపణ అడిగితే?

దేవునికి దగ్గరవ్వండి

‘విరిగి నలిగిన హృదయం’ క్షమాపణ అడిగితే?

2 సమూయేలు 12:1-14

మనందరం ఎన్నోసార్లు పాపాలు చేస్తాం. మనమెంత పశ్చాత్తాపపడినా, ‘నేను నిజంగా పశ్చాత్తాపపడి చేసే ప్రార్థనలను దేవుడు వింటాడా? ఆయన నన్ను క్షమిస్తాడా?’ అని మనం అనుకోవచ్చు. బైబిలు మనకు ఓదార్పునిచ్చే ఈ సత్యాన్ని బోధిస్తోంది, దేవుడు పాపాన్ని ఎప్పుడూ ఆమోదించకపోయినా, పశ్చాత్తాపపడుతున్న పాపిని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ సత్యం, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు విషయంలో స్పష్టంగా రుజువైంది. దాని గురించి 2 సమూయేలు 12వ అధ్యాయంలో ఉంది.

ఏమి జరిగిందో గమనించండి. దావీదు ఘోరమైన పాపాలు చేశాడు. ఆయన బత్షెబతో వ్యభిచారం చేశాడు. తను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమవ్వడంతో ఆమె భర్తను చంపించే ఏర్పాటు చేశాడు. దావీదు తన పాపాల గురించి ఎవ్వరికీ చెప్పలేదు. చాలా నెలల వరకు, ఏమీ జరగనట్లే ప్రవర్తించాడు. అయితే, యెహోవా ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. దావీదు చేసిన పాపాలు ఆయన చూశాడు. అంతేకాదు, దావీదు హృదయం పశ్చాత్తాపం చూపించలేనంత చెడ్డది కాదని కూడా ఆయన చూశాడు. (సామెతలు 17:3) అప్పుడు యెహోవా ఏమి చేశాడు?

యెహోవా నాతాను ప్రవక్తను దావీదు దగ్గరకు పంపించాడు. (1వ వచనం) నాతాను పరిశుద్ధాత్మ నడిపింపుతో, తను చాలా జాగ్రత్తగా మాట్లాడాలని గ్రహించి, రాజు దగ్గర ఎంతో నేర్పుగా సంభాషణ మొదలుపెట్టాడు. దావీదు తనను తాను మోసపుచ్చుకుంటున్నాడని, ఆయన చేసిన పాపాలు చాలా ఘోరమైనవని ఆయన గ్రహించేలా నాతాను ఎలా చేయగలడు?

దావీదు తనను తాను సమర్థించుకునే అవకాశమే లేకుండా చేస్తూ నాతాను, ఒకప్పుడు కాపరి అయిన దావీదు హృదయానికి చేరే ఒక కథ చెప్పాడు. ఆ కథలో ఇద్దరు వ్యక్తులుంటారు, ఒకడు ధనవంతుడు, మరొకడు పేదవాడు. ధనవంతుడి దగ్గర ‘విస్తారమైన గొర్రెలు, గొడ్లు’ ఉన్నాయి, కానీ పేదవాడి దగ్గర ‘ఒక్క చిన్న ఆడ గొర్రెపిల్లే’ ఉంది. ధనవంతుని ఇంటికి ఒక బంధువు వచ్చాడు, ఆయన ఆ బంధువు కోసం భోజనం సిద్దంచేయాలనుకున్నాడు. ఆయన తన దగ్గరున్న గొర్రెల్లో ఒకదానిని తీసుకునే బదులు, పేదవాడి దగ్గరున్న ఒక్కగానొక్క గొర్రెపిల్లను తీసుకున్నాడు. దావీదు ఇది నిజంగా జరిగిందనుకుని వెంటనే ఎంతో కోపంగా, ‘ఈ కార్యం చేసిన మనిషి మరణపాత్రుడు!’ అన్నాడు. దావీదు ఎందుకలా అన్నాడు? ఎందుకంటే, ‘ఆ ధనవంతునికి కనికరం లేదు’ అని దావీదు వివరించాడు. a2-6 వచనాలు.

నాతాను చెప్పిన కథ ఆయన అనుకున్నదాన్ని నెరవేర్చింది. ఒకవిధంగా చెప్పాలంటే, దావీదు తనను తానే దోషిగా చేసుకున్నాడు. అప్పుడు నాతాను దావీదుతో సూటిగా, ‘ఆ మనిషివి నువ్వే’ అన్నాడు. (7వ వచనం) నాతాను దేవుని తరఫున మాట్లాడుతున్నాడు కాబట్టి, దావీదు చేసిన పనులు యెహోవాను చాలా బాధపెట్టివుంటాయని తెలుస్తుంది. దావీదు దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘించి, ఆ ఆజ్ఞలిచ్చిన దేవునిపట్ల తనకు గౌరవం లేదని చూపించాడు. ‘నన్ను అలక్ష్యం చేశావు’ అని దేవుడు అన్నాడు. (10వ వచనం) ఆ మాటలు దావీదు హృదయంలో గుచ్చుకున్నాయి, దానితో దావీదు, ‘నేను పాపం చేశాను’ అని తన తప్పు ఒప్పుకున్నాడు. యెహోవా క్షమిస్తాడని నాతాను దావీదుకు ధైర్యం చెప్పాడు. కానీ దావీదు తను చేసిన పనులకు పర్యవసానాలను అనుభవించాలి.—13, 14 వచనాలు.

దావీదు చేసిన పాపం బట్టబయలు అయ్యాక, ఆయన రాసిన కీర్తనే ఇప్పుడు బైబిల్లోవున్న 51వ కీర్తన. దానిలో దావీదు తనెంతగా పశ్చాత్తాపపడుతున్నాడో చూపిస్తూ తన హృదయాన్ని కుమ్మరించాడు. దావీదు తను చేసిన పాపాలతో యెహోవాను అలక్ష్యం చేశాడు. కానీ పశ్చాత్తాపపడిన రాజు దేవుని క్షమాపణను చవిచూసిన తర్వాత యెహోవాతో ఇలా చెప్పగలిగాడు, “దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” (కీర్తన 51:17) యెహోవా కనికరం పొందాలనుకునే పశ్చాత్తపపడిన వ్యక్తికి ఆ మాటలు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి. (w10-E 05/01)

[అధస్సూచి]

a వచ్చినవాళ్ల కోసం గొర్రెపిల్ల మాంసాన్ని సిద్ధం చేయడం ఆతిథ్యం ఇవ్వడంలో భాగం. కానీ గొర్రెపిల్లను దొంగిలించడమనేది నేరం, అలా చేసినవాళ్లు దానికి నాలుగింతలు తిరిగి చెల్లించాల్సివుంటుంది. (నిర్గమకాండము 22:1) ఆ ధనవంతుడు గొర్రెపిల్లను తీసుకుని కనికరం లేని వ్యక్తిలా ప్రవర్తించాడని దావీదు ఉద్దేశం. పేదవాడి గొర్రెపిల్ల అతని కుటుంబానికి పాలు, ఉన్ని ఇచ్చివుండేది, అది ఒక పెద్ద మందగా తయారైవుండేది. కానీ ధనవంతుడు ఆ పేదవానికి అవన్నీ లేకుండా చేశాడు.