దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవడంలో ఉన్న సవాళ్లు
దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవడంలో ఉన్న సవాళ్లు
యెహోవా పేరు తెలుసుకుని, ఆయనకు దగ్గరవకుండా ఆపాలని చూసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ దుష్టుడు? ‘ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వాళ్ల మనో నేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసెను’ అని బైబిలు వివరిస్తోంది. నేటి భక్తిహీన లోకానికి దేవత అపవాది అయిన సాతాను. ‘దేవుని మహిమను గురించిన జ్ఞానం’ తెలుసుకోకుండా మనల్ని అజ్ఞానంలో ఉంచాలన్నది అతడి ఉద్దేశం. మనం యెహోవాను పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవడం సాతానుకు ఇష్టంలేదు. ప్రజల మనో నేత్రాలకు సాతాను ఎలా గుడ్డితనం కలుగజేస్తున్నాడు, అంటే వాళ్లను ఎలా తప్పుదారి పట్టిస్తున్నాడు?—2 కొరింథీయులు 4:4-6.
దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోకుండా ప్రజలను అడ్డుకోవడానికి సాతాను అబద్ధ మతాన్ని ఉపయోగిస్తున్నాడు. ఉదాహరణకు, పూర్వకాలాల్లో కొంతమంది యూదులు దేవుడు రాయించిన లేఖనాలను పట్టించుకోకుండా, దేవుని పేరు ఉపయోగించకూడదనే ఆచారాన్ని పాటించడానికి ఇష్టపడ్డారు. సామాన్య శకంలోని మొదటి శతాబ్దంకల్లా, పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న దేవుని పేరును చదవకుండా దాని స్థానంలో “ప్రభువు” అనే అర్థమున్న అదోనాయి అనే పదాన్ని ఉపయోగించాలని సమాజ మందిరంలో బహిరంగంగా లేఖనాలను చదివి వినిపించే యూదులకు ఉపదేశించబడినట్టు తెలుస్తోంది. విచారకరమైన విషయమేమిటంటే, ఈ ఆచారం వల్ల ప్రజలు దేవునికి దూరమైపోయారు. దేవునికి దగ్గరవడం వల్ల కలిగే ప్రయోజనాలను చాలామంది పొందలేకపోయారు. మరి యేసు విషయమేమిటి? యెహోవా పేరు గురించి ఆయన అభిప్రాయమేమిటి?
యేసు ఆయన అనుచరులు దేవుని పేరును తెలియజేశారు
యేసు తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు, ‘వాళ్లకు నీ నామము తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.’ (యోహాను 17:26) యేసు చాలా సందర్భాల్లో, ఆ ప్రాముఖ్యమైన పేరున్న హీబ్రూ లేఖనాల్లోని భాగాలను చదువుతున్నప్పుడు, ప్రస్తావిస్తున్నప్పుడు లేదా వివరిస్తున్నప్పుడు దేవుని పేరును ఖచ్చితంగా ఉచ్ఛరించివుంటాడు. యేసు ఆయనకు ముందున్న ప్రవక్తలంతా ఉపయోగించినట్టు దేవుని పేరును ఎన్నోసార్లు ఉపయోగించివుంటాడని చెప్పవచ్చు. యేసు పరిచర్య చేసిన కాలంలో యూదులు ఎవరైనా అప్పటికే దేవుని పేరును వాడకుండా ఉండివుంటే, యేసు ఖచ్చితంగా వాళ్లలా చేసివుండడు. ‘మీరు మీ పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు’ అంటూ ఆయన మత నాయకులను తీవ్రంగా విమర్శించాడు.—మత్తయి 15:6.
యేసు చనిపోయి, పునరుత్థానం చేయబడిన తర్వాత ఆయన నమ్మకమైన అనుచరులు దేవుని పేరును వేరేవాళ్లకు తెలియజేస్తూనే ఉన్నారు. (“తొలి క్రైస్తవులు దేవుని పేరును ఉపయోగించారా?” అనే బాక్సు చూడండి.) సా.శ. 33 పెంతెకొస్తు పండుగ రోజున క్రైస్తవ సంఘం స్థాపించబడినప్పుడు, అపొస్తలుడైన పేతురు యోవేలు ప్రవచించిన ఒక ప్రవచనాన్ని ప్రస్తావిస్తూ అసంఖ్యాకమైన యూదులతో, యూదామత ప్రవిష్టులతో ఇలా చెప్పాడు, ‘యెహోవా నామాన్నిబట్టి ప్రార్థన చేసేవాళ్లంతా రక్షించబడతారు.’ (అపొస్తలుల కార్యములు 2:21; యోవేలు 2:32) తొలి క్రైస్తవులు అనేక ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లకు యెహోవాను పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవడానికి సహాయం చేశారు. అందుకే, యెరూషలేములోవున్న అపొస్తలులు, పెద్దలతో సమావేశమైనప్పుడు శిష్యుడైన యాకోబు ఇలా అన్నాడు, ‘అన్యజనులలో నుండి దేవుడు తన నామం కోసం ఒక జనమును ఏర్పర్చుకునేందుకు కటాక్షించాడు.’—అపొస్తలుల కార్యములు 15:14.
దేవుని పేరును ద్వేషించే ఆ దుష్టుడు అంతటితో ఊరుకోలేదు. ఒక్కసారి అపొస్తలులు చనిపోయాక, సాతాను వెంటనే మతభ్రష్టత్వాన్ని వ్యాపింపజేశాడు. (మత్తయి 13:38, 39; 2 పేతురు 2:1) ఉదాహరణకు, అపొస్తలుల్లో చివరివాడైన యోహాను చనిపోయిన కాలం దరిదాపుల్లో, నామకార్థ క్రైస్తవుడైన జస్టిన్ మార్టిర్ పుట్టాడు. అయితే, అన్నీ సమకూర్చేవాడు ‘సరైన పేరులేని దేవుడు’ అని జస్టిన్ తరచూ తన రాతల్లో నొక్కిచెప్పాడు.
మతభ్రష్ట క్రైస్తవులు క్రైస్తవ గ్రీకు లేఖనాలను నకలు చేసేటప్పుడు యెహోవా పేరును తీసేసి అదివున్న చోటల్లా “ప్రభువు” అని అర్థమున్న కెరియోస్ అనే గ్రీకు పదాన్ని పెట్టుకుంటూ వచ్చారని తెలుస్తోంది. హీబ్రూ లేఖనాల విషయంలో కూడా అలాగే జరిగింది. మతభ్రష్ట యూదా శాస్త్రులు దేవుని పేరును బిగ్గరగా చదవడం మానేసి, తమ లేఖనాల్లో 130 కన్నా ఎక్కువసార్లు అదోనాయి
అనే పదాన్ని పెట్టుకున్నారు. జెరోమ్ సా.శ. 405లో లాటిన్ భాషలోకి అనువదించడం పూర్తి చేసిన వల్గేట్ అని పిలువబడిన ప్రసిద్ధ బైబిల్లో కూడా దేవుని పేరు లేదు.దేవుని పేరును తీసివేయడానికి జరుగుతున్న ఆధునిక ప్రయత్నాలు
యెహోవా పేరు బైబిల్లో దాదాపు 7,000 సార్లు ఉందని మనకాలంలోని పండితులకు తెలుసు. అందుకే, క్యాథలిక్ జెరూషలేమ్ బైబిల్, స్పానిష్‌లోవున్న క్యాథలిక్ లా బిబ్లియా లాటినోమెరికా, స్పానిష్‌లోనే ఉన్న ప్రసిద్ధ రేన వలెర వర్షన్ వంటి విస్తృతంగా ఉపయోగించబడే కొన్ని అనువాదాలు దేవుని పేరును విరివిగా ఉపయోగిస్తున్నాయి. కొన్ని అనువాదాల్లో దేవుని పేరు “యావే” అని ఉంది.
విచారకరంగా, బైబిలు అనువాదాలు చేయించే చాలా చర్చీలు తమ బైబిలు అనువాదాల్లో నుండి దేవుని పేరును తీసివేయమని పండితుల మీదకు ఒత్తిడి తీసుకువస్తాయి. ఉదాహరణకు, క్యాథలిక్ బిషప్‌ల సమావేశాలకు అధ్యక్షత వహించేవారికి క్యాథలిక్ చర్చి అధినేతలు 2008, జూన్ 29న రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు, “ఇటీవలి సంవత్సరాల్లో, ఇశ్రాయేలీయుల దేవుని పేరును ఉచ్ఛరించే ఆచారం మెల్లిగా ప్రవేశించింది.” ఆ లేఖ సూటిగా ఇలా ఆదేశించింది, “దేవుని పేరును . . . ఉపయోగించకూడదు, ఉచ్ఛరించకూడదు.” అంతేకాదు, ఆ లేఖ ఇంకా ఇలా ఆదేశించింది, “బైబిలు లేఖనాలను ఆధునిక భాషల్లోకి అనువదించాలంటే, . . . దేవుని పేరును సూచించే నాలుగు అక్షరాలను అదోనాయి/కెరియోస్‌లకు సమానమైన ‘ప్రభువు’ అని అనువదించాలి.” దేవుని పేరును ఉపయోగించడం మానేసేలా చేయాలన్న ఉద్దేశంతోనే ఆ ఆదేశం ఇవ్వబడిందని స్పష్టమవుతోంది.
ఈ విషయంలో ప్రొటస్టెంట్లు కూడా తక్కువేమీ తినలేదు. ప్రొటస్టెంట్ల సహకారంతో 1978లో ఆంగ్లంలో ప్రచురించబడిన న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ తరఫున మాట్లాడుతూ ఒక వ్యక్తి ఇలా రాశాడు, “యెహోవా అనేది దేవుని విశిష్టమైన పేరు. దాన్ని మేము ఉపయోగించి ఉండవలసింది. కానీ ఈ అనువాదం చేయడానికి మేము ఇరవై రెండున్నర లక్షల డాలర్లు ఖర్చు చేశాము. ఉదాహరణకు, 23వ కీర్తనను ‘యావే నా కాపరి’ అని అనువదిస్తే ఆ డబ్బంతా బుగ్గిపాలయ్యేది.”
అంతేకాదు చర్చీలు, లాటిన్ అమెరికన్లు దేవుణ్ణి పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోకుండా చేశాయి. యునైటెడ్ బైబిల్ సొసైటీస్ (యుబిఎస్) కోసం పనిచేసే అనువాద సలహాదారుడైన స్టీవెన్ వోట్ ఇలా రాశాడు, “లాటిన్ అమెరికన్ ప్రొటస్టెంట్ల మధ్య సాధారణంగా జెహోవా అనే పేరును ఉపయోగించడం గురించే చర్చలు జరుగుతుంటాయి . . . ఆసక్తికరమైన ఒక విషయమేమిటంటే, అంతకంతకు విస్తరిస్తున్న నియో పెంటెకొస్టల్ అనే చాలా పెద్ద చర్చి, రేన వలెర 1960 ఎడిషన్ కావాలని అడిగారు. అయితే, దానిలో జెహోవా అనే పేరుకు బదులు సెనోర్ [ప్రభువు] అనే పదం ఉండాలని కోరారు.” ఈ విజ్ఞప్తిని యుబిఎస్ మొదట్లో త్రోసిపుచ్చింది కానీ ఆ తర్వాత అంగీకరించి, “జెహోవా అనే పదం
లేకుండా” రేన వలెర బైబిలు ఎడిషన్‌ను ప్రచురించిందని వోట్ రాశాడు.బైబిల్లో నుండి దేవుని పేరు తీసివేసి, అది ఉన్న చోటల్లా “ప్రభువు” అని పెడితే చదివేవాళ్లకు దేవుని పేరు తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది. అది గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఉదాహరణకు, “ప్రభువు” అనే పదం యెహోవాను సూచిస్తుందో, ఆయన కుమారుడైన యేసును సూచిస్తుందో చదువుతున్న వ్యక్తి గ్రహించలేకపోవచ్చు. నూతనలోక అనువాదం ప్రకారం, ‘“నా కుడిపార్శ్వమున కూర్చో” అని యెహోవా నా ప్రభువుతో [పునరుత్థానం చేయబడిన యేసుతో] చెప్పాడు’ అని దావీదు చెప్తున్నట్టు అపొస్తలుడైన పేతురు ప్రస్తావించిన లేఖనాన్ని చాలా బైబిళ్లు “ప్రభువు నా ప్రభువుతో చెప్పెను” అని అనువదించాయి. (అపొస్తలుల కార్యములు 2:35) “యావే మరియు క్రైస్తవ మత ధర్మశాస్త్రంలోని దేవుడు” అనే తన వ్యాసంలో డేవిడ్ క్లైన్స్ ఇలా పేర్కొన్నాడు, “క్రైస్తవ పదజాలంలో నుండి యావే అనే పదం లేకుండా పోవడంతో క్రీస్తుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది.” అందుకే, చర్చికి వెళ్లే చాలామందికి యేసు ప్రార్థించిన సత్య దేవుడు ఒక నిజమైన వ్యక్తి అని, ఆయనకు యెహోవా అనే పేరు ఉందని తెలియదు.
ప్రజలకు దేవుని గురించి తెలీకుండా చేయడానికి సాతాను చాలా శ్రమపడ్డాడు. అయినా సరే, మీరు యెహోవా గురించి తెలుసుకుని ఆయనకు దగ్గరవ్వవచ్చు.
యెహోవాను పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవడం సాధ్యమే
దేవుని పేరును తుడిచిపెట్టడానికి సాతాను పెద్ద పోరాటమే చేశాడు, దీనికోసం ఆయన అబద్ధమతాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకున్నాడు. సర్వాధిపతి అయిన యెహోవా తన పేరు గురించి, నమ్మకస్థుల కోసం భవిష్యత్తులో ఆయన చేయబోయేదాని గురించి తెలుసుకోవాలని కోరుకునే ప్రజలకు తన పేరును తెలియజేయకుండా అటు పరలోకంలోగానీ ఇటు భూమ్మీదగానీ ఉన్న ఏ శక్తీ ఆయనను ఆపలేదు.
బైబిలు అధ్యయనం చేసి దేవునికి ఎలా దగ్గరవ్వవచ్చో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు. ‘వాళ్లకు నీ నామము తెలియజేశాను’ అని చెప్పిన యేసును వాళ్లు ఆదర్శంగా తీసుకుంటారు. (యోహాను 17:26) మానవజాతిని ఆశీర్వదించడానికి యెహోవా పోషించిన వివిధ పాత్రల గురించి తెలియజేసే లేఖనాలను పరిశీలిస్తున్నప్పుడు, ఆయన వ్యక్తిత్వంలోని ఎన్నో అందమైన కోణాలను మీరు తెలుసుకుంటారు.
పూర్వీకుడు, నమ్మకస్థుడు అయిన యోబు ‘దేవునితో సన్నిహిత స్నేహాన్ని’ ఆనందించాడు, మీరు కూడా అలాగే ఆనందించవచ్చు. (యోబు 29:4, ఈజీ-టు-రీడ్ వర్షన్) బైబిలు పరిజ్ఞానంతో మీరు యెహోవాను పేరుతో సంబోధించేంతగా ఆయనను తెలుసుకోవచ్చు. అలాంటి జ్ఞానం పొందితే, ‘నేను ఎలా కావాలంటే అలా అవుతాను’ అన్నది తన పేరుకు అర్థమని చెప్పిన యెహోవా తాను చెప్పిన దానికి అనుగుణంగా చర్య తీసుకుంటాడనే నమ్మకం మనకు కలుగుతుంది. (నిర్గమకాండము 3:14, NW) అలా, ఆయన తాను చేసిన మంచి వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడు. (w10-E 07/01)
[18వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
తొలి క్రైస్తవులు దేవుని పేరు ఉపయోగించారా?
సా.శ. మొదటి శతాబ్దంలో, యేసు అపొస్తలులున్న రోజుల్లో చాలా ప్రాంతాల్లో క్రైస్తవ సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ సంఘాల సభ్యులు లేఖనాలను అధ్యయనం చేయడానికి క్రమంగా కలుసుకునేవాళ్లు. అయితే ఆ తొలి క్రైస్తవులు ఉపయోగించే లేఖన ప్రతుల్లో యెహోవా పేరు ఉండేదా?
గ్రీకు అంతర్జాతీయ భాష కావడంతో చాలా సంఘాలు సెప్టువజింటును ఉపయోగించేవి. సా.శ.పూ. రెండవ శతాబ్దంలో గ్రీకులోకి అనువదించడం పూర్తైన హీబ్రూ లేఖనాలను సెప్టువజింటు అంటారు. సెప్టువజింటు అనువదించబడినప్పటి నుండి దానిలో ఎప్పుడూ దేవుని పేరుకు బదులు కెరియోస్ [ప్రభువు] అనే గ్రీకు పదమే ఉపయోగించబడిందని కొంతమంది పండితులు అంటారు. కానీ నిజాలు వేరుగా ఉన్నాయి.
ఇక్కడ చూపించబడిన కొన్ని ప్రాచీన ప్రతుల చిన్న ముక్కలు సా.శ.పూ. మొదటి శతాబ్దానికి చెందిన గ్రీకు సెప్టువజింటులోనివి. వాటిల్లో యెహోవా పేరు గ్రీకు అక్షరాల మధ్యలో יהוה (యహ్‌వహ్) అనే నాలుగు హీబ్రూ అక్షరాలతో స్పష్టంగా ఉంది. ప్రొఫెసర్ జార్జ్ హోవర్డ్ ఇలా రాశాడు, “మన దగ్గర క్రీస్తు పూర్వ గ్రీకు సెప్టువజింటు బైబిలు విడి ప్రతులు మూడు ఉన్నాయి, యెహోవా పేరును సూచించే నాలుగు హీబ్రూ అక్షరాలు కెరియోస్ అని వాటిల్లో ఎక్కడా అనువదించబడలేదు. నిజానికి అవి అనువదించబడనే లేదు. కొత్త నిబంధన కాలానికి ముందు, ఆ కాలంలో, ఆ తర్వాతి కాలంలో లేఖనాలను గ్రీకు భాషలో రాసేటప్పుడు దేవుని పేరును ఉన్నదున్నట్టు ఎత్తిరాయడం యూదుల ఆచారమని ఇప్పుడు కాస్త గట్టిగానే చెప్పవచ్చు.”—బిబ్లికల్ ఆర్కియాలజీ రివ్యూ.
యేసు అపొస్తలులు, ఆయన శిష్యులు దేవుడు వాళ్లతో రాయించిన పుస్తకాల్లో దేవుని పేరు ఉపయోగించారా? ప్రొఫెసర్ హోవర్డ్ ఇలా పేర్కొంటున్నాడు, “కొత్త నిబంధనలో వివరించబడిన సంఘం ఉపయోగించిన, ప్రస్తావించిన సెప్టువజింటులో దేవుని పేరు హీబ్రూ అక్షరాల్లో ఉందంటే, కొత్త నిబంధన రాసిన వాళ్లు దాన్ని ఖచ్చితంగా ఉపయోగించి ఉంటారని చెప్పవచ్చు.”
కాబట్టి, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు హీబ్రూ లేఖనాల అనువాదాల్లో అలాగే క్రైస్తవ గ్రీకు లేఖనాల ప్రతుల్లో దేవుని పేరు చదివి ఉంటారని మనం ధైర్యంగా చెప్పవచ్చు.
[క్రెడిట్ లైను]
ఫోటోలన్నీ: Société Royale de Papyrologie du Caire
[17, 18వ పేజీలోని చిత్రం]
మృత సముద్రపు చుట్టల్లో యెషయా పుస్తకంలోని కొంతభాగం, దేవుని పేరు వృత్తాల్లో చూపించబడింది
[క్రెడిట్ లైను]
ష్రైన్ ఆఫ్ ద బుక్, ఫోటో © The Israel Museum, Jerusalem
[19వ పేజీలోని చిత్రం]
యూదా ఆచారం వల్ల లేదా స్వలాభం కోసం చర్చీలు దేవుని పేరు బైబిల్లో లేకుండా చేశాయి
[20వ పేజీలోని చిత్రం]
వేరేవాళ్లకు దేవుని పేరు తెలియజేసే విషయంలో యేసు మనకు ఆదర్శంగా ఉన్నాడు