కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవదూతలు మనకెలా సహాయం చేస్తారు?

దేవదూతలు మనకెలా సహాయం చేస్తారు?

యేసు నుండి మనం నేర్చుకోగల అంశాలు

దేవదూతలు మనకెలా సహాయం చేస్తారు?

యేసు ‘ఈ ప్రపంచం ఉనికిలోకి రాకముందు’ తన తండ్రితో పాటు పరలోకంలో ఉన్నాడు. (యోహాను 17:5, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) కాబట్టి ఆయన ఈ కింది ప్రశ్నలకు సమాధానం చెప్పగలడు.

దేవదూతలకు మనమంటే ఆసక్తి ఉందా?

▪ దేవదూతలకు మనమంటే ఆసక్తి ఉందని యేసు మాటలను బట్టి తెలుస్తుంది. ఆయన ఇలా చెప్పాడు, ‘ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు.’—లూకా 15:10. పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

దేవుని సేవకుల ఆధ్యాత్మిక విషయాల గురించి శ్రద్ధ తీసుకునే బాధ్యత దేవదూతలకు ఉందని యేసు తెలియజేశాడు. అందుకే, ఇతరులను అభ్యంతరపెట్టడం గురించి యేసు తన శిష్యులను హెచ్చరించినప్పుడు ఇలా చెప్పాడు, ‘ఈ చిన్నవారిలో ఎవరినీ చిన్నచూపు చూడకండి! మీతో నేను చెప్పేదేమిటంటే, పరలోకంలో ఉన్న వీరి దేవదూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు.’ (మత్తయి 18:10, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) యేసు ఇలా చెప్పినప్పుడు, తన అనుచరుల్లో ప్రతీ ఒక్కరినీ కాపాడడానికి ఒక్కొక్క దేవదూత నియమించబడతారన్నది ఆయన ఉద్దేశమని అనుకోనవసరం లేదు. అయితే, దేవునితో కలిసి పనిచేసే దేవదూతలకు నిజ క్రైస్తవుల మీద చాలా ఆసక్తి ఉందని యేసు చూపించాడు.

అపవాదియైన సాతాను మనకెలా హాని చేస్తాడు?

▪ దేవుని గురించిన సత్యం తెలుసుకోకుండా ప్రజలను ఆపడానికి సాతాను ప్రయత్నిస్తాడని యేసు తన అనుచరులను హెచ్చరించాడు. ‘ఎవరైనా రాజ్యం గురించిన వాక్యం విని గ్రహించకపోతే, దుష్టుడు వచ్చి వాళ్ల హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు’ అని యేసు చెప్పాడు.—మత్తయి 13:19.

యేసు, ఒక వ్యక్తి తన పొలంలో గోధుమలను విత్తిన ఉపమానం చెబుతున్నప్పుడు సాతాను ప్రజలను మోసం చేసే ఒక విధానం గురించి తెలియజేశాడు. ఆ వ్యక్తి యేసును సూచిస్తున్నాడు, గోధుమలు యేసుతో పాటు పరలోకంలో పరిపాలన చేసే నిజ క్రైస్తవులను సూచిస్తున్నాయి. అయితే, ఒక శత్రువు వచ్చి ‘గోధుమల మధ్య గురుగులు విత్తాడు’ అని యేసు చెప్పాడు. గురుగులు అబద్ధ క్రైస్తవులను సూచిస్తున్నాయి. “వాటిని విత్తిన శత్రువు అపవాది.” (మత్తయి 13:25, 39) గురుగుల మొలకలు గోధుమ మొలకల్లా కనిపించవచ్చు, అలాగే క్రైస్తవులమని చెప్పుకునే వాళ్లు నిజమైన ఆరాధకుల్లాగే ఉండవచ్చు. అబద్ధ సిద్ధాంతాలను బోధించే మతాలు దేవుని మాట వినకుండా ఉండేలా ప్రజలను మోసం చేస్తున్నాయి. ప్రజలకు యెహోవాతో ఉన్న స్నేహాన్ని పాడుచేయడానికి సాతాను అబద్ధమతాన్ని ఉపయోగిస్తాడు.

సాతాను మనకు హాని చేయకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?

▪ యేసు సాతానును “ఈ లోకాధికారి” అన్నాడు. (యోహాను 14:30) యేసు ఒకసారి దేవునికి చేసిన ప్రార్థనలో, సాతాను నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో తెలియజేశాడు. ఆయన తన శిష్యుల గురించి తన పరలోక తండ్రికి ఇలా ప్రార్థన చేశాడు, ‘దుష్టుని నుండి వారిని కాపాడుము. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.’ (యోహాను 17:15-17) దేవుని వాక్యం గురించిన జ్ఞానం ఉంటే, సాతాను పరిపాలిస్తున్న ఈ లోక ప్రభావం నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం.

దేవదూతలు ఈ రోజుల్లో మనకెలా సహాయం చేస్తున్నారు?

▪ ‘యుగసమాప్తిలో దేవదూతలు నీతిమంతుల నుండి దుష్టులను వేరుచేస్తారు’ అని యేసు చెప్పాడు. (మత్తయి 13:49) ఇప్పుడు మనం ‘యుగసమాప్తిలో’ ఉన్నాం, లక్షలాదిమంది దేవుని రాజ్య సువార్తకు స్పందిస్తున్నారు.—మత్తయి 24:3, 14.

అయితే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టిన వాళ్లంతా ఆయన ఆమోదం పొందుతారని కాదు. యెహోవా సేవకుల పనికి దేవదూతలు మద్దతు ఇస్తున్నారు. దేవుణ్ణి నిజంగా ప్రేమించేవాళ్లు, తాము నేర్చుకున్నవాటిని పాటించడానికి ఇష్టపడని ప్రజల నుండి వేరుచేయబడుతున్నారు. దేవుని ఆమోదం పొందే ప్రజల గురించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు, ‘వాళ్లు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని, దానిని అవలంబించి ఓపికతో ఫలిస్తారు.’—లూకా 8:15. (w10-E 11/01)

ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలోని 10వ అధ్యాయం చూడండి.

[24వ పేజీలోని చిత్రం]

సత్యం తెలుసుకోవాలనుకుంటున్న యథార్థ ప్రజలను కనుగొనడానికి దేవదూతలు సహాయం చేస్తున్నారు