కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతికూల భావాలను మనమెలా అధిగమించవచ్చు?

ప్రతికూల భావాలను మనమెలా అధిగమించవచ్చు?

ప్రతికూల భావాలను మనమెలా అధిగమించవచ్చు?

మీరు ప్రతికూల భావాలతో బాధపడుతున్నారా? నిజానికి, ప్రతీ ఒక్కరూ ప్రతికూల భావాలతో బాధపడుతుంటారు. ఈ రోజుల్లో మనం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం, మన చుట్టూ హింస, అన్యాయం అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. అందుకే, చాలామంది ఎంతో దుఃఖంతో, తీవ్రమైన అపరాధ భావాలతో, ఎందుకూ పనికిరాని వాళ్లమనుకుంటూ కృంగిపోతున్నారు.

అలాంటి భావాలు చాలా ప్రమాదకరం. వాటివల్ల మన ఆత్మవిశ్వాసం కుంటుపడుతుంది, ఆలోచనా సామర్థ్యం దెబ్బతింటుంది, సంతోషం హరించుకుపోతుంది. ‘కష్టకాలంలో ధైర్యం చెడితే బలం’ లేకుండా పోతుందని బైబిలు చెబుతోంది. (సామెతలు 24:10, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) సమస్యలున్న ఈ లోకంలో నెగ్గుకు రావాలంటే మనకు బలం, శక్తి అవసరం. కాబట్టి, ప్రతికూల భావాలను మనం అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. a

ప్రతికూల భావాలను అధిగమించడానికి సహాయం చేసే ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి. అన్నిటినీ సృష్టించి, కాపాడుతున్న యెహోవా దేవునికి మీరు నిరాశానిస్పృహలతో కృంగిపోవడం ఇష్టంలేదు. (కీర్తన 36:9) ఆయన వాక్యమైన బైబిల్లో ఉన్న విషయాలు, ప్రతికూల భావాలను అధిగమించడానికి ఏ మూడు విధాలుగా సహాయం చేస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవునికి మీరంటే పట్టింపు ఉందని తెలుసుకోండి

దేవుడు తమను పట్టించుకోలేనంతగా వేరే పనుల్లో మునిగిపోయి ఉన్నాడని కొంతమంది అనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? నిజానికి మన సృష్టికర్త మన భావాలను పట్టించుకుంటాడని బైబిలు హామీ ఇస్తోంది. కీర్తనకర్త ఇలా చెప్పాడు, ‘విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవాళ్లను ఆయన రక్షిస్తాడు.’ (కీర్తన 34:18) మనం బాధల్లో ఉన్నప్పుడు సర్వశక్తుడైన సర్వాధిపతి మన వెన్నంటే ఉంటాడని తెలుసుకోవడం నిజంగా ఎంతో ఓదార్పునిస్తుంది.

దేవుడు ఎలాంటి భావాలూ లేనివాడు కాదు, మనకు దూరంగా ఉండేవాడూ కాదు. “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 4:8) ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు, బాధపడేవాళ్ల బాధను ఆయన అర్థంచేసుకుంటాడు. ఉదాహరణకు, దాదాపు 3,500 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులు ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు, ఆయనిలా చెప్పాడు, ‘ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా ప్రజలను బాధపెట్టినప్పుడు వాళ్లు మొరపెట్టడం నేను విన్నాను. వాళ్ళ బాధ నాకు తెలుసు. ఈజిప్టు వాళ్ల బారి నుండి నా ప్రజలను రక్షించేందుకు ఇక నేను దిగివస్తాను.’—ఏటవాలు ముద్దక్షరాలు మావి; నిర్గమకాండము 3:7, 8, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

దేవుడు మన భావాలను చక్కగా అర్థంచేసుకుంటాడు. ‘ఆయనే మనలను పుట్టించాడు. మనలను మనమే సృజించుకోలేదు.’ (కీర్తన 100:3, అధస్సూచి) అందుకే, తోటి వాళ్లు మనల్ని అర్థంచేసుకోరని మనకు అనిపించినప్పుడు, దేవుడైతే మనల్ని అర్థం చేసుకుంటాడని నమ్మవచ్చు. బైబిలు ఇలా చెబుతోంది, “మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేది. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు.” (1 సమూయేలు 16:7, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) చివరకు, మన అంతర్గత భావాలు కూడా దేవునికి తెలుసు.

నిజమే, మనం చేసే తప్పులు, మన బలహీనతలు కూడా యెహోవాకు తెలుసు. అయితే మన ప్రేమగల సృష్టికర్త క్షమించే దేవుడు, కాబట్టి మనమెంతో కృతజ్ఞత కలిగివుండవచ్చు. దైవ ప్రేరణతో బైబిల్లోవున్న కొన్ని కీర్తనలను రాసిన దావీదు ఇలా చెప్పాడు, ‘తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు. అదేవిధంగా, యెహోవా తన అనుచరుల పట్ల కూడా దయగా ఉంటాడు. మన గురించి దేవునికి అంతా తెలుసు. మనం మట్టితో చేయబడ్డామని దేవునికి తెలుసు.’ (కీర్తన 103:13, 14, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మనలో ఉన్న బలహీనతలే మనకు కనిపిస్తాయి. అయితే, దేవుడు వాటిని పట్టించుకోకుండా మనలో మంచి కోసం చూస్తాడు. మనం చేసిన తప్పులకు పశ్చాత్తాపపడితే ఆయన మనలో ఉన్న చెడు మీద అంతగా దృష్టి పెట్టడు.—కీర్తన 139:1-3, 23, 24.

మనం ఎందుకూ పనికిరాని వాళ్లమనే భావాలతో సతమతమవుతుంటే, వాటిని అధిగమించాలని మనం గట్టిగా నిర్ణయించుకోవాలి. దేవుడు మనల్ని ఎలా చూస్తాడో మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి.—1 యోహాను 3:19, 20.

దేవునితో మంచి స్నేహాన్ని పెంచుకోండి

దేవుడు మనల్ని పరిగణించినట్టు మనల్ని మనం పరిగణించుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? ప్రతికూల భావాలను అధిగమించడానికి అవసరమైన మరో చర్య తీసుకోవడం సులువవుతుంది. అదే ఆయనతో మంచి స్నేహం పెంచుకోవడం. కానీ అది నిజంగా సాధ్యమేనా?

ఒక ప్రేమగల తండ్రిగా యెహోవా దేవుడు, తనతో మంచి స్నేహాన్ని పెంచుకోవడానికి మనకు సహాయం చేయాలని ఎంతో కోరుకుంటున్నాడు. ‘దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు’ అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (యాకోబు 4:8) ఆశ్చర్యపర్చే ఈ నిజాన్ని పరిశీలించండి: మనం బలహీనులం, పాపులం అయినా కూడా విశ్వ సర్వాధిపతితో వ్యక్తిగతంగా మంచి స్నేహాన్ని ఏర్పర్చుకునే అవకాశముంది.

దేవుడు తన గురించి బైబిల్లో రాయించిపెట్టాడు, అందుకే ఆయన ఎలాంటివాడో మనం తెలుసుకోవచ్చు. మనం రోజూ బైబిలు చదివితే ఆయనకున్న చక్కని లక్షణాలను తెలుసుకోగలుగుతాం. b మనం వాటి గురించి లోతుగా ఆలోచిస్తే, ఆయనకెంతో దగ్గరవుతాం. అప్పుడు ఆయన ప్రేమ, కనికరం చూపించే తండ్రి అని మరింత స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఆయన నిజంగా అలాంటివాడే.

మనం బైబిల్లో చదివిన దాని గురించి బాగా ఆలోచిస్తే ఇంకా ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. మన పరలోక తండ్రి ఆలోచనలను బాగా అర్థంచేసుకుని వాటి ప్రకారం మనల్ని మనం సరిదిద్దుకుంటే, వాటి వల్ల ఓదార్పు పొందితే, వాటి నిర్దేశాన్ని అనుసరిస్తే మనం ఆయనకు ఇంకా దగ్గరవుతాం. మనల్ని బాధపెట్టే, కలవరపర్చే ఆలోచనలతో, భావాలతో మనం సతమతమవుతున్నప్పుడు అలా చేయడం ఇంకా ప్రాముఖ్యం. బైబిల్లో ఉన్న కొన్ని కీర్తనలు రాసిన ఒక వ్యక్తి ఇలా రాశాడు, ‘నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుంది.’ (కీర్తన 94:19) దేవుని వాక్యమైన బైబిలు ఎంతో నెమ్మది కలుగజేస్తుంది. మనం ఆయన వాక్యంలోని సత్యాన్ని వినయంగా ఒప్పుకుంటే, మనలో ఉన్న ప్రతికూల భావాలు మెల్లమెల్లగా తొలగిపోయి, దేవుడు మాత్రమే ఇవ్వగల ఓదార్పును, శాంతిని పొందుతాం. ఆ విధంగా, గాయపడిన లేదా బాధతోవున్న పిల్లవాణ్ణి ప్రేమగల తల్లిదండ్రులు బుజ్జగించినట్టు యెహోవా మనల్ని ఓదారుస్తాడు.

దేవునితో స్నేహం చేయడానికి అవసరమైన మరో ముఖ్యమైన విషయమేమిటంటే, ఆయనతో మనం తరచూ మాట్లాడాలి. ‘ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు’ అని బైబిలు మనకు హామీ ఇస్తోంది. (1 యోహాను 5:14) మనకు ఎలాంటి భయాలు, చింతలు ఉన్నా సహాయం కోసం దేవునికి ప్రార్థన చేయవచ్చు. దేవుని ముందు మన హృదయాన్ని కుమ్మరిస్తే మనకు మనశ్శాంతి దొరుకుతుంది. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, ‘ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలివుంటుంది.’ఫిలిప్పీయులు 4:6, 7.

మీరు బైబిలు చదవడం, ధ్యానించడం, వ్యక్తిగతంగా ప్రార్థించడం వంటివి క్రమంగా చేస్తే, మీ పరలోక తండ్రితో దగ్గరి సంబంధాన్ని ఏర్పర్చుకుంటారు. ఆ బంధం ప్రతికూల భావాలను అధిగమించడానికి శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. ప్రతికూల భావాలను అధిగమించడానికి ఇంకా ఏది కూడా సహాయం చేస్తుంది?

భవిష్యత్తు గురించిన నిశ్చయమైన నిరీక్షణ మీద దృష్టిపెట్టండి

మనం ఎంతో కష్ట పరిస్థితుల్లో ఉన్నా మంచి విషయాలమీద దృష్టి పెట్టవచ్చు. ఎలా? దేవుడు మనకు భవిష్యత్తు గురించి నిశ్చయమైన నిరీక్షణ ఇస్తున్నాడు. అపొస్తలుడైన పేతురు ఆ అద్భుతమైన నిరీక్షణ గురించి క్లుప్తంగా ఇలా చెప్పాడు, ‘దేవుని వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశాల కోసం, కొత్త భూమి కోసం కనిపెట్టుకుని ఉన్నాం; వాటిలో నీతి నివసిస్తుంది.’ (2 పేతురు 3:13) అంటే దాని అర్థమేమిటి?

‘కొత్త ఆకాశాలు’ అనే పదబంధం పరిపాలనను, అంటే యేసుక్రీస్తు రాజుగా పరిపాలించే దేవుని పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది. ‘కొత్త భూమి’ ఈ భూమ్మీద నివసించే, దేవుని ఆమోదం పొందిన మానవ సమాజాన్ని సూచిస్తుంది. ‘కొత్త ఆకాశాల’ పరిపాలన కింద భూమ్మీద నివసించే కొత్త సమాజంలో ప్రతికూల భావాలకు కారణమయ్యేవి ఏవీ ఉండవు. అప్పుడు నివసించబోయే నమ్మకమైన మానవుల గురించి బైబిలు ఇలా హామీ ఇస్తోంది, ‘దేవుడు వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాడు, మరణం ఇక ఉండదు. దుఃఖం, ఏడ్పు, వేదన ఇక ఉండవు.’—ప్రకటన 21:4.

ఆ మాటలు నిజంగా ఎంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అందుకే నిజ క్రైస్తవుల కోసం దేవుడు చేసిన ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ బైబిలు ‘సంతోషకరమైన నిరీక్షణ’ అని చెప్తోంది. (తీతు 2:13, NW) మానవుల భవిష్యత్తు కోసం దేవుడు చేసిన వాగ్దానాల గురించి, వాటిని ఎందుకు నమ్మవచ్చో, అవి తప్పకుండా ఎందుకు నెరవేరతాయో ఆలోచిస్తే మనం ప్రతికూల భావాలను అధిగమించవచ్చు.—ఫిలిప్పీయులు 4:8.

మన రక్షణ నిరీక్షణను బైబిలు ఒక శిరస్త్రాణంతో పోలుస్తోంది. (1 థెస్సలొనీకయులు 5:8) ప్రాచీన కాలంలో ఒక సైనికుడు శిరస్త్రాణం లేకుండా యుద్ధంలో పాల్గొనడానికి తెగించేవాడు కాదు. ఎందుకంటే అది తలకు తగిలే దెబ్బల తీవ్రతను తగ్గిస్తుందని, బాణాలవల్ల గాయాలు అవకుండా కాపాడుతుందని ఆయనకు తెలుసు. శిరస్త్రాణం తలను కాపాడినట్లే నిరీక్షణ మన మనసును కాపాడుతుంది. మనకు నిరీక్షణ కలిగించే విషయాల గురించి ఆలోచిస్తే ప్రతికూలంగా ఆలోచించకుండా, భయపడకుండా, నిరాశపడకుండా ఉండగలుగుతాం.

ప్రతికూల భావాలను అధిగమించడం సాధ్యమే. అది మీకు కూడా సాధ్యమవుతుంది! దేవుడు మిమ్మల్ని ఎలా పరిగణిస్తాడో ఆలోచించండి, దేవునికి దగ్గరవ్వండి, భవిష్యత్తు నిరీక్షణ మీద దృష్టి పెట్టండి. అలాచేస్తే ప్రతికూల భావాలనేవేవీ ఉండని కాలంలో మీరు జీవించవచ్చు.—కీర్తన 37:29. (w10-E 10/01)

[అధస్సూచీలు]

a చాలాకాలంగా ప్రతికూల భావాలతో లేదా తీవ్రమైన మానసిక కృంగుదలతో బాధపడుతున్న వాళ్లు మానసిక వైద్యుణ్ణి సంప్రదించాల్సి ఉంటుంది.—మత్తయి 9:12.

b బైబిలు చదవడానికి ఆచరించదగిన, ఉపయోగపడే పట్టిక కావలికోట ఆగస్టు 1, 2009 సంచికలో ఇవ్వబడింది.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

‘వాళ్ళ బాధ నాకు తెలుసు.’ నిర్గమకాండము 3:7, 8

[10వ పేజీలోని బ్లర్బ్‌]

‘నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుంది.’ కీర్తన 94:19

[11వ పేజీలోని బ్లర్బ్‌]

‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు, మీ తలంపులకు కావలివుంటుంది.’ ఫిలిప్పీయులు 4:7

[10, 11వ పేజీలోని బాక్సు/చిత్రం]

యెహోవా దేవునికి సంబంధించిన ఓదార్పుకరమైన లేఖనాలు

“యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు.”—నిర్గమకాండము 34:6.

“తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.”—2 దినవృత్తాంతములు 16:9.

“విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” —కీర్తన 34:18.

“ప్రభువా, నీవు దయాళుడవు. క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు.”—కీర్తన 86:5.

“యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి.”—కీర్తన 145:9.

“నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.” —యెషయా 41:13.

“కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు . . . స్తుతింపబడునుగాక.”—2 కొరింథీయులు 1:3.

“దేవుడు మన హృదయము కంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.”—1 యోహాను 3:19, 20.

[12వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ప్రతికూల భావాలను విజయవంతంగా అధిగమిస్తున్నారు

“మా నాన్న ఒక తాగుబోతు, ఆయన వల్ల నేను చాలా బాధలుపడ్డాను. నేను ఎందుకూ పనికిరానిదాన్నని నాకు ఎప్పుడూ అనిపించేది. అయితే ఒక యెహోవాసాక్షి నాతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టినప్పుడు భూమ్మీద నిత్యం జీవించడం గురించి దేవుడు చేసిన వాగ్దానం నాకు తెలిసింది. అప్పుడు నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను. అప్పటి నుండి బైబిలు క్రమంగా చదవడం మొదలుపెట్టాను. దాన్నెప్పుడూ నా దగ్గరే ఉంచుకుంటాను. ప్రతికూల భావాలు నన్ను ముంచెత్తుతున్నట్లు అనిపించినప్పుడు బైబిలు తెరచి ఓదార్పునిచ్చే లేఖనాలు చదువుతాను. దేవుని మంచి లక్షణాల గురించి చదువుతున్నప్పుడు ఆయన నన్ను అమూల్యమైన వ్యక్తిగా ఎంచుతున్నాడనే నమ్మకం నాకు కలుగుతుంది.”—కావ్య, 33 ఏళ్లు. c

“నేను విపరీతంగా తాగడం, గంజాయి, కొకైన్‌ లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం, హానికరమైన వాసనలు పీల్చడం (గ్లూ స్నిఫ్ఫింగ్‌) వంటి దురలవాట్లకు బానిసనయ్యాను. దాదాపు నా ఆస్తి అంతా పోగొట్టుకుని చివరకు అడుక్కుతినే స్థితికి చేరుకున్నాను. అప్పుడు యెహోవాసాక్షులు నాతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేనెన్నో మార్పులు చేసుకుని, దేవునికి చాలా దగ్గరయ్యాను. తప్పు చేశాననే ఆలోచనలతో, ఎందుకూ పనికిరాననే భావాలతో నేనింకా బాధపడుతున్నా నా మీద దేవుడు కనికరం చూపిస్తున్నాడని, నన్ను ప్రేమిస్తున్నాడని నాకు అర్థమైంది. ప్రతికూల భావాలను అధిగమించడానికి కావాల్సిన శక్తి దేవుడు నాకు ఇస్తూనే ఉంటాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా జీవితంలో జరిగిన ఒకే ఒక మంచి పని బైబిలు సత్యాన్ని తెలుసుకోవడం.”—రోహిత్‌, 37 ఏళ్లు.

“చిన్నప్పుడు నన్ను నేను మా అన్నయ్యతో పోల్చుకునేదాన్ని. ఎప్పుడూ ఆయన కంటే తక్కువదాన్నని నాకనిపించేది. ఇప్పటికీ అభద్రతా భావం నన్ను వెంటాడుతూనేవుంది, నా శక్తిసామర్థ్యాల మీద నాకంత నమ్మకం లేదు. కానీ ఎలాగైనా ప్రతికూల భావాలను అధిగమించాలని తీర్మానించుకున్నాను. పట్టుదలతో యెహోవాకు ప్రార్థించాను, ప్రతికూల భావాలను అధిగమించడానికి ఆయన నాకు సహాయం చేశాడు. దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని, ఆయనకు నా మీద శ్రద్ధ ఉందని తెలుసుకోవడం నాకెంతో ఊరటనిస్తుంది.”—రేవతి, 45 ఏళ్లు.

[అధస్సూచి]

c అసలు పేర్లు కావు.