మీ ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోండి
ఐదవది
మీ ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోండి
దీని గురించి బైబిలు ఏమి చెబుతుంది? ‘తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించిన వాళ్లు ధన్యులు.’—మత్తయి 5:3, NW.
దీన్ని పాటించడం ఎందుకు కష్టం? లోకంలో కొన్ని వేల మతాలున్నాయి, వాటిలో చాలా మతాలు ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చడానికి ఒకదానితో ఒకటి పొంతనలేని మార్గాలను బోధిస్తున్నాయి. ఏ మతం సత్యాన్ని బోధిస్తోందో, ఏ మతాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడో ఎలా తెలుసుకోవచ్చు? దేవుణ్ణి నమ్మడం, ఆయన మీద భయభక్తులు కలిగివుండడం సమంజసం కాదని, అంతేకాదు అలా చేయడం ప్రమాదకరమైనదని కొంతమంది ప్రముఖ రచయితలు చెబుతారు. ఒక ప్రముఖ నాస్తికుడి అభిప్రాయం గురించి మాక్లీన్స్ పత్రిక ఇలా చెబుతోంది, “అటు విజ్ఞానశాస్త్రం ఇటు మనుష్యులు అర్థం చేసుకోలేనిది ఏదో ఉందనే క్రైస్తవ సిద్ధాంతం . . . మనకున్న ఒక్కగానొక్క జీవితాన్ని విలువలేనిదిగా చేస్తుంది. అంతేకాదు అది మనం హింసకు పాల్పడేలా చేస్తుంది.”
మీరేమి చేయవచ్చు? దేవుడు ఉన్నాడని చూపించే రుజువును పరిశీలించండి. (రోమీయులు 1:20; హెబ్రీయులు 3:3, 4) ఈ ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి: మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? చనిపోయాక మనం ఎక్కడికి వెళ్తాం? మనం ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాం? దేవుడు నన్ను ఏమి చేయమంటున్నాడు? ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోకుండా ఆపాలని చూసినా మీరు పట్టుదలతో వాటిని తెలుసుకోండి. మీరు చిరకాలం సంతృప్తిగా ఉండాలంటే ఆ ప్రశ్నలకు సరైన జవాబులు తెలుసుకోవడం అవసరం.
అయినా, ఇతరులు చెప్పేది గుడ్డిగా నమ్మకండి. దేవుని దృష్టిలో సరైనది చేయడానికి ‘వివేకాన్ని’ ఉపయోగించమని ఆయన వాక్యం ప్రోత్సహిస్తుంది. (2 తిమోతి 2:7) కృషికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. బైబిలు అధ్యయనం చేయడానికి సమయం వెచ్చించి, దానిలో ఉన్న మన జీవితానికి అవసరమయ్యే సలహాలను పాటిస్తే, సమస్యలను తప్పించుకోవచ్చు, చింతలను తక్కువ చేసుకోవచ్చు, జీవితంలో ఎక్కువ సంతోషాన్ని పొందవచ్చు. అది ఉట్టి వాగ్దానం కాదు. వివిధ జీవన నేపథ్యాల నుండి వచ్చిన లక్షలాదిమంది ప్రజలు దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి సత్యం తెలుసుకుని ప్రయోజనం పొందారు.
బైబిల్లోని జ్ఞానవంతమైన సలహాను పాటిస్తూ దాని నుండి ప్రయోజనం పొందితే దేవుని పట్ల మీకున్న భక్తి ఇంకా ఎక్కువవుతుంది. బైబిలు అధ్యయనం చేయమని యెహోవాసాక్షులు ఇస్తున్న ఆహ్వానాన్ని ఎందుకు స్వీకరించకూడదు? అలా చేస్తే, ‘తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభమే’ అని చెప్పిన అపొస్తలుడైన పౌలుతో ఏకీభవించినట్టవుతుంది.—1 తిమోతి 6:6, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం. (w10-E 11/01)
[8వ పేజీలోని చిత్రం]
దేవుని దృష్టిలో సరైనది చేయండి