మీ స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి
నాలుగవది
మీ స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి
దీని గురించి బైబిలు ఏమి చెబుతోంది? ‘జ్ఞానులతో సహవాసం చేసేవాళ్లు జ్ఞానంగలవాళ్లవుతారు.’—సామెతలు 13:20.
దీన్ని పాటించడం ఎందుకు కష్టం? మన స్నేహితులు మనం సంతృప్తి కలిగివుండడానికి దోహదపడతారు లేదా మనకు అసంతృప్తి కలిగేలా చేస్తారు. వాళ్ల ప్రవర్తన వల్ల, మాటల వల్ల జీవితం గురించి మనకున్న ఆలోచనా తీరు మారే అవకాశం ఉంది.—1 కొరింథీయులు 15:33.
ఉదాహరణకు, కనానును చూడ్డానికి వెళ్లి వచ్చిన 12 మంది గురించి బైబిల్లో ఉన్న వృత్తాంతాన్ని పరిశీలించండి. వాళ్లలో ఎక్కువమంది ‘తాము సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలీయులకు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు.’ అయినా, వాళ్లలో ఇద్దరు కనాను గురించి సానుకూలంగా చెబుతూ అది ‘చాలా మంచి దేశం’ అన్నారు. కానీ, ఇశ్రాయేలీయులు మాత్రం పదిమంది వేగుల వాళ్లు చూపించిన ప్రతికూల స్వభావాన్నే చూపించడం మొదలుపెట్టారు. ‘అప్పుడు ఆ సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేసింది, ఇశ్రాయేలీయులందరూ సణగడం మొదలుపెట్టారు’ అని ఆ వృత్తాంతం చెబుతోంది.—సంఖ్యాకాండము 13:30–14:9.
ఈ రోజుల్లో కూడా, ‘సణిగేవాళ్లు, తమ గతిని గురించి నిందించేవాళ్లు’ ఎక్కువగా ఉన్నారు. (యూదా 15) ఎప్పుడూ సంతృప్తిపడని స్నేహితులతో సహవాసం చేస్తే మనం కూడా వాళ్లలా తయారవుతాం.
మీరేమి చేయవచ్చు? మీరూ మీ స్నేహితులూ ఏ విషయాల గురించి మాట్లాడుకుంటారో పరిశీలించుకోండి. మీ స్నేహితులు వాళ్ల దగ్గరున్న వస్తువుల గురించి గొప్పలు చెప్పుకుంటారా, లేదా అవి లేవు ఇవి లేవని సణుగుతుంటారా? మీరు వాళ్లకు ఎలాంటి స్నేహితులు? మీ స్నేహితులు మిమ్మల్ని చూసి అసూయపడేలా మీరు గొప్పలు చెప్పుకుంటారా, లేకపోతే ఉన్నవాటితో తృప్తిగా ఉండమని వాళ్లను ప్రోత్సహిస్తారా?
రాజు కావాల్సిన దావీదు, సౌలు రాజు కుమారుడైన యోనాతాను ఉదాహరణలను పరిశీలించండి. దావీదు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి పారిపోతున్నాడు. సౌలు తన అధికారాన్ని దావీదు ఎక్కడ చేజిక్కించుకుంటాడోనని భయపడి దావీదును చంపాలనుకున్నాడు. సౌలు తర్వాత సహజంగా యోనాతానే రాజైవుండేవాడు. అయితే దేవుడు దావీదును తర్వాతి రాజుగా అభిషేకించాడని యోనాతాను గుర్తించాడు. ఈయన దావీదు సన్నిహిత స్నేహితుల్లో ఒకడయ్యాడు, తన స్నేహితునికి మద్దతివ్వడానికి ఇష్టపడ్డాడు.—1 సమూయేలు 19:1, 2; 20:30-33; 23:14-18.
అలాంటి స్నేహితులు అంటే సంతృప్తిగా ఉండడానికి కృషిచేసే, మీ శ్రేయస్సును కోరుకునే స్నేహితులు మీకు ఉండాలి. (సామెతలు 17:17) అయితే, అలాంటి స్నేహితులు మీకు ఉండాలంటే మీలో కూడా అలాంటి లక్షణాలే ఉండాలి.—ఫిలిప్పీయులు 2:3, 4. (w10-E 11/01)
[7వ పేజీలోని చిత్రం]
మీ స్నేహితులు మీరు సంతృప్తి కలిగివుండడానికి దోహదపడతారా లేక మీకు అసంతృప్తి కలిగేలా చేస్తారా?