కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు దుష్టత్వాన్ని, బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

దేవుడు దుష్టత్వాన్ని, బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి

దేవుడు దుష్టత్వాన్ని, బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

ఈ ఆర్టికల్‌ సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్‌ తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

1. దుష్టత్వం ఎలా మొదలైంది?

సాతాను మొదటి అబద్ధం చెప్పినప్పుడు భూమ్మీద దుష్టత్వం మొదలైంది. దేవుడు సాతానును దుష్టునిగా సృష్టించలేదు. మొదట్లో అతడు పరిపూర్ణ దూతగా ఉన్నాడు కానీ, తర్వాత ‘సత్యంలో నిలవలేదు.’ (యోహాను 8:44) దేవునికే చెందాల్సిన ఆరాధనను తను పొందాలని కోరుకున్నాడు. సాతాను మొదటి స్త్రీ అయిన హవ్వతో అబద్ధం చెప్పి, దేవుడు చెప్పింది కాకుండా తను చెప్పింది చేసేలా ఆమెను మోసగించాడు. ఆదాము కూడా ఆమెతో చేతులు కలిపాడు. ఆదాము తీసుకున్న నిర్ణయం వల్ల బాధలు, మరణం వచ్చాయి.—ఆదికాండము 3:1-6, 17-19 చదవండి.

హవ్వ దేవుని మాట మీరేలా చేసినప్పుడు దేవుని సర్వాధిపత్యానికి తిరుగుబాటు చేసేలా సాతాను ఆమెను రెచ్చగొట్టాడు. మానవుల్లో చాలామంది సాతానుతో చేతులు కలిపి దేవుణ్ణి తమ పరిపాలకునిగా అంగీకరించడం లేదు. అలా సాతాను “ఈ లోకాధికారి” అయ్యాడు.—యోహాను 14:30; ప్రకటన 12:9 చదవండి.

2. దేవుని సృష్టిలో లోపం ఉందా?

దేవుడు తమ నుండి కోరేవాటిని చేయగల పరిపూర్ణ సామర్థ్యం ఆయన సృష్టించిన మానవులకు, దేవదూతలకు ఉంది. (ద్వితీయోపదేశకాండము 32:4, 5) మంచి చేయాలో చెడు చేయాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛతో దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ స్వేచ్ఛ వల్లే దేవుని మీద మనకున్న ప్రేమను చూపించగలుగుతాం.—యాకోబు 1:13-15; 1 యోహాను 5:3 చదవండి.

3. దేవుడు బాధలను ఎందుకు అనుమతించాడు?

తన సర్వాధిపత్యం మీద జరిగిన తిరుగుబాటును యెహోవా కొంతకాలంపాటు అనుమతించాడు. ఎందుకు? తన సహాయం లేకుండా ప్రజలు తమను తామే ఎప్పటికీ సరిగ్గా పరిపాలించుకోలేరని చూపించడానికే అలా అనుమతించాడు. (యిర్మీయా 10:23) మానవ చరిత్రలో 6,000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ విషయం రుజువైంది. మానవ పరిపాలకులు అన్యాయాన్ని, యుద్ధాలను, నేరాలను, రోగాలను తీసివేయలేకపోయారు.—ప్రసంగి 7:29; 8:9; రోమీయులు 9:17 చదవండి.

అయితే, దేవుణ్ణి తమ పరిపాలకునిగా అంగీకరించే వాళ్లు ప్రయోజనం పొందుతారు. (యెషయా 48:17, 18) త్వరలో యెహోవా మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసేస్తాడు. దేవుణ్ణి తమ పరిపాలకునిగా ఎంపికచేసుకునే వాళ్లు మాత్రమే ఈ భూమ్మీద ఉంటారు.—యెషయా 2:3, 4; 11:9; దానియేలు 2:44 చదవండి.

4. దేవుడు ఇంతకాలం ఓపిక పట్టడం వల్ల ఏ అవకాశం దొరికింది?

మానవులు దేవుని ఆజ్ఞలు పాటించేది ఆయన మీద ప్రేమతో కాదని సాతాను వాదించాడు. దేవుడు ఇంతకాలం ఓపిక పట్టడం వల్ల, మనం ఆయన పరిపాలనను కోరుకుంటున్నామా లేకపోతే మానవుల పరిపాలనను కోరుకుంటున్నామా అనేది చూపించే అవకాశం అందరికీ దొరికింది. మన జీవన విధానం బట్టి మనం దేన్ని కోరుకుంటున్నామో చూపిస్తాం.—యోబు 1:8-11; సామెతలు 27:11 చదవండి.

5. దేవుణ్ణి మన పరిపాలకునిగా ఎలా చేసుకుంటాం?

సరైన ఆరాధన గురించి ఆయన వాక్యమైన బైబిలు ఏమి చెబుతుందో తెలుసుకుని, దాన్ని పాటించడం ద్వారా దేవుణ్ణి మన పరిపాలకునిగా అంగీకరిస్తాం. (యోహాను 4:23) యేసులాగే మనమూ రాజకీయాల్లో, యుద్ధాల్లో పాల్గొనం.—యోహాను 17:14 చదవండి.

అనైతికమైన, హానికరమైన పనులను చేయించడానికి సాతాను తన శక్తిని ఉపయోగిస్తాడు. ఆ పనులు చేయడానికి మనం నిరాకరించినప్పుడు మన స్నేహితుల్లో, బంధువుల్లో కొంతమంది మనల్ని హేళన చేయవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. (1 పేతురు 4:3, 4) దేవుణ్ణి ప్రేమించే ప్రజలతో మనం సహవాసం చేస్తామా? ప్రేమతో ఆయనిచ్చే జ్ఞానయుక్తమైన ఆజ్ఞలను పాటిస్తామా? మనమలా చేస్తే, ఎవరూ దేవుడు చెప్పినట్లు చేయరంటూ సాతాను వేసిన నింద తప్పని రుజువుచేస్తాం.—1 కొరింథీయులు 6:9, 10; 15:33 చదవండి. (w11-E 05/01)

ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలోని, బిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, 11వ అధ్యాయం చూడండి.

[18వ పేజీలోని చిత్రం]

ఆదాము సరైన ఎంపిక చేసుకోలేదు

[19వ పేజీలోని చిత్రం]

దేవుడు మనల్ని పరిపాలించాలని కోరుకుంటున్నామా లేదా అనేది మన ఎంపికలను బట్టే తెలుస్తుంది