కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు
పిల్లలు పుట్టినప్పుడు దంపతులకు ఎదురయ్యే సవాళ్లు
ప్రతాప్: a “మా పాప పుట్టినప్పుడు నేను, నా భార్య లత ఎంతో పులకించిపోయాం. అయితే పాప పుట్టాక కొన్ని నెలలు నాకు సరిగ్గా నిద్రలేదు. అప్పట్లో మా పాపను ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి అనే విషయంలో మేమెన్నో అనుకున్నాం కానీ త్వరలోనే వాటి గురించి పూర్తిగా మర్చిపోయాం.”
లత: “మా పాప పుట్టాక నా జీవితం నా చేతుల్లో లేదు. పాపకు పాలు పట్టడం, డైపర్లు మార్చడం, పాపను ఊరడించడం అవే నా జీవితం అయిపోయాయి. నేనెన్నో సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చింది. నా భర్తతో ముందులా ఉండడానికి కొన్ని నెలలు పట్టింది.”
జీవితంలోని అత్యంత సంతోషకరమైన విషయాల్లో ఒకటి, తల్లిదండ్రులు కావడమని చాలామంది అంగీకరిస్తారు. పిల్లలు దేవుడు ఇచ్చే ‘బహుమానం’ అని బైబిలు చెబుతోంది. (కీర్తన 127:3) పిల్లలు పుట్టాక వివాహ జీవితం ఊహించని రీతిలో మలుపు తిరుగుతుందని ప్రతాప్ లతల్లాగే కొత్తగా తల్లిదండ్రులైన వాళ్లకు తెలుసు. ఉదాహరణకు, ఒక స్త్రీ మొదటిసారి తల్లి అయినప్పుడు అనుక్షణం తన బిడ్డ గురించే ఆలోచిస్తుంది, ఆ బిడ్డ చిన్నచిన్న అవసరాలు తీర్చడానికి తన శరీరం, హృదయం స్పందించే తీరు చూసి ఆమెకే ఆశ్చర్యం కలగవచ్చు. అలాగే ఒక వ్యక్తి మొదటిసారి తండ్రి అయినప్పుడు తన భార్యకూ బిడ్డకూ మధ్య ఏర్పడిన బంధాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు, అయితే ఉన్నట్టుండి భార్య తనను పట్టించుకోవడం లేదని బాధపడే అవకాశం కూడా లేకపోలేదు.
నిజానికి మొదటి బిడ్డ పుట్టినప్పుడు వివాహంలో తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. తల్లిదండ్రులు అయిన తర్వాత ఎదురయ్యే ఒత్తిడి వల్ల వాళ్లలోని అభద్రతాభావాలు, వాళ్ల మధ్యవున్న పరిష్కరించుకోని వివాదాలు స్పష్టంగా కనిపిస్తాయి.
మొదటి కొన్ని నెలల్లో నవజాత శిశువుకు తల్లిదండ్రులు తమ అవధానమంతా ఇవ్వాల్సివుంటుంది, ఆ పరిస్థితిలో వాళ్లేమి చేస్తే బాగుంటుంది? తమ మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే దంపతులు ఏమి చేయాలి? తమ బిడ్డను పెంచే విషయంలోవున్న అభిప్రాయ భేదాలను వాళ్లెలా పరిష్కరించుకోవచ్చు? ఈ సవాళ్ల గురించి, వాటిని ఎదుర్కోవడానికి బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేస్తాయనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
మొదటి సవాలు: ఉన్నట్టుండి జీవితం పాప చుట్టే తిరుగుతుంది.
నవజాత శిశువు కోసం తల్లి ఎంతో సమయం వెచ్చిస్తుంది, ఆ బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ బిడ్డను చూసుకోవడంలో ఎంతో సంతృప్తి పొందుతుంది. అయితే భర్త విషయానికొస్తే ఆయన తన భార్య తనను నిర్లక్ష్యం చేస్తోందని అనుకునే అవకాశముంది. “నా భార్య నాకన్నా మా బిడ్డ గురించే ఎక్కువగా ఆలోచించడం నేను తట్టుకోలేకపోయాను. బిడ్డ పుట్టకముందు ఆమె నా గురించే ఆలోచించేది కానీ తర్వాత, బిడ్డ గురించే ఎక్కువగా ఆలోచించేది” అని బ్రెజిల్లో నివసిస్తున్న మాన్వెల్ అన్నాడు. ఈ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలి?
సాఫల్యానికి మెట్టు: ఓర్పు చూపించండి.
‘ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది’ అని బైబిలు చెబుతోంది. ప్రేమ ‘స్వప్రయోజనం విచారించుకోదు. త్వరగా కోపపడదు.’ (1 కొరింథీయులు 13:4, 5) మొదటి బిడ్డ పుట్టినప్పుడు భార్యాభర్తలు ఆ సలహాను ఎలా పాటించవచ్చు?
బిడ్డను కన్న తర్వాత స్త్రీలో శారీరకంగా, మానసికంగా ఎలాంటి మార్పులు వస్తాయో బాగా తెలుసుకోవడం ద్వారా తెలివైన భర్త తన భార్యను ప్రేమిస్తున్నానని చూపిస్తాడు. అలా చేస్తే తన భార్య మూడ్ అకస్మాత్తుగా ఎందుకు మారిపోతోందో అర్థం చేసుకోగలుగుతాడు. b ఫ్రాన్స్‌లో ఉంటున్న ఆడమ్‌కు 11 నెలల పాప ఉంది. ఆయన, “కొన్నిసార్లు నా భార్య మూడ్ ఎందుకు మారిపోతుందో నాకర్థం కాదు, అప్పుడు ఓర్పు చూపించడం నాకు కష్టమనిపిస్తుంది. అయితే ఆమె చిరాకు నామీద కాదని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కొత్త పరిస్థితిలో ఎదురయ్యే ఒత్తిళ్ల వల్లే ఆమె అలా చేస్తోంది.”
కొన్నిసార్లు, సహాయం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలను మీ భార్య సరిగ్గా అర్థం చేసుకోవడం లేదా? అలాగైతే తొందరపడి కోప్పడకండి. (ప్రసంగి 7:9) ఓర్పుతో మీ అవసరాలకన్నా ఆమె అవసరాలకు ప్రాముఖ్యతనిస్తే నిరాశపడకుండా ఉంటారు.—సామెతలు 14:29.
తన భర్త మంచి తండ్రిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తెలివైన భార్య సహకరించాలనుకుంటుంది. పాప డైపర్లు మార్చడం, పాల సీసా సిద్ధం చేయడం వంటి పనులు ఎలా చేయాలో భర్తకు ఓపిగ్గా చూపిస్తుంది, మొదట్లో వాటిని చేయడం ఆయనకు అంత బాగా రాకపోయినా పాపకు సంబంధించిన కొన్ని పనులు అప్పగిస్తుంది.
తన భర్తతో వ్యవహరించే తీరులో తను కొన్ని మార్పులు చేసుకోవాలని 26 ఏళ్ల విజయకు అనిపించింది. “పాప నాకే సొంతం అన్నట్లు ప్రవర్తించకూడదని అర్థంచేసుకున్నా. అంతేకాదు, పాపను ఎలా చూసుకోవాలనే విషయంలో నేనిచ్చే సూచనలు నా భర్త పాటించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాగే చేయాలని పట్టుబట్టకూడదని గుర్తుచేసుకునేదాన్ని” అని ఆమె చెబుతోంది.
ఇలా చేసి చూడండి: భార్యలారా, మీ పాపకు సంబంధించి ఒకానొక పనిని మీ భర్త మీలా కాకుండా వేరేలా చేసినప్పుడు ఆయనను తప్పుపట్టకండి లేదా ఆ పనిని మళ్లీ చేయమని చెప్పకండి. ఆయన అప్పటికే చేసినదాన్ని మెచ్చుకోండి. అలాచేస్తే ఆయనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దాంతో మీకు అవసరమైన సహాయం చేయాలని ఆయన కోరుకుంటాడు. భర్తలారా, బిడ్డ పుట్టిన మొదటి కొన్ని నెలల్లో మీ భార్యకు సహాయం చేయడానికి వీలైనంత ఎక్కువ సమయం ఉండేలా అంత ముఖ్యం కాని విషయాలకు ఎక్కువ సమయం వెచ్చించకండి.
రెండో సవాలు: భార్యాభర్తల బంధం బలహీనమౌతుంది.
కొత్తగా తల్లిదండ్రులైన చాలామంది నిద్ర సరిపోకపోవడం వల్ల, ఊహించని సమస్యల వల్ల ఎంతో అలసిపోతుంటారు. దాంతో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఫ్రాన్స్ దేశస్థురాలైన వీవీయన్కు ఇద్దరు పిల్లలున్నారు. ఆమె ఇలా అంది: “మొదట్లో, తల్లిగా నాకున్న బాధ్యతలకు ఎంత ప్రాముఖ్యతనిచ్చానంటే భార్యగా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలను దాదాపు మర్చిపోయాను.”
మరోవైపు, తన భార్య గర్భం దాల్చడం వల్ల ఆమెలో వచ్చిన శారీరక, భావోద్రేక మార్పులను భర్త గుర్తించలేకపోతుండవచ్చు. భావోద్వేగాలను పంచుకోవడానికి, లైంగికంగా సన్నిహితంగా ఉండడానికి వెచ్చించే సమయాన్ని, శక్తిని ఇప్పుడు కొత్తగా పుట్టిన బిడ్డకు ఇవ్వాల్సిరావచ్చు. ముద్దుగా,
నిస్సహాయంగా ఉన్న తమ బిడ్డ తమ మధ్య అడ్డు గోడ కాకుండా దంపతులు ఎలా చూసుకోవచ్చు?సాఫల్యానికి మెట్టు: మీ జతను ప్రేమిస్తున్నారని అభయమివ్వండి.
వివాహం గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వాళ్లు ఏక శరీరమైవుంటారు.’ c (ఆదికాండము 2:24) యెహోవా ఉద్దేశం ప్రకారం పిల్లలు చివరకు తమ తల్లిదండ్రులను విడిచిపెడతారు. కానీ భార్యాభర్తల ఏక శరీర బంధం జీవితాంతం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. (మత్తయి 19:3-9) కొత్తగా బిడ్డ పుట్టిన దంపతులు సరైన విషయాలకు ప్రాధాన్యతనివ్వడానికి దీన్ని అర్థం చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
ముందు ప్రస్తావించబడిన వీవీయన్ ఇలా అంటోంది: “ఆదికాండము 2:24లోని మాటల గురించి ఆలోచించాను, అప్పుడు నేను నా బిడ్డతో కాదుగానీ నా భర్తతో ‘ఏక శరీరం’ అయ్యానని గుర్తించాను. మా వివాహ బంధాన్ని బలపర్చుకోవాల్సిన అవసరముందని నాకు అనిపించింది.” రెండేళ్ల పాప ఉన్న కల్పన ఇలా అంటోంది: “నా భర్తకు దూరమౌతున్నానని అనిపిస్తే వెంటనే ఆయనకు పూర్తి శ్రద్ధనివ్వడానికి ప్రయత్నిస్తాను, రోజూ కొద్దిసేపైనా అలా చేస్తాను.”
వివాహ బంధాన్ని బలపర్చుకోవడానికి ఒక భర్తగా మీరేమి చేయవచ్చు? మీ భార్యను ప్రేమిస్తున్నారని చెప్పండి. ఆమెతో మృదువుగా వ్యవహరిస్తూ ఆ ప్రేమను వ్యక్తంచేయండి. మీ భార్యలో ఉండే అభద్రతా భావాలను తీసివేయడానికి శాయశక్తులా కృషిచేయండి. 30 ఏళ్ల జయ ఇలా అంటోంది: “గర్భం దాల్చడం వల్ల శరీరంలో మార్పులు వచ్చినా ముందులాగే భర్త తనకు విలువ ఇవ్వాలనీ తనను ప్రేమించాలనీ భార్య కోరుకుంటుంది.” జర్మనీలో నివసిస్తున్న ఆల్లన్కు ఇద్దరు కొడుకులు, తన భార్య భావోద్వేగ అవసరాలను తీర్చడం అవసరమనే విషయాన్ని ఆయన గమనించాడు. ఆయన ఇలా చెబుతున్నాడు: “నా భార్య విచారంతో ఉన్నప్పుడల్లా ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాను.”
నిజమే, బిడ్డ పుట్టాక దంపతుల మధ్య లైంగిక సంబంధంలో అంతరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో తమ అవసరాల గురించి భార్యాభర్తలు మాట్లాడుకోవాలి. ‘ఉభయుల సమ్మతితోనే’ దంపతులు లైంగిక సంబంధంలో మార్పులు చేసుకోవాలని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 7:1-5) దానికి వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం అవసరం. అయితే మీరు పెరిగిన తీరు వల్ల లేదా మీ సాంస్కృతిక నేపథ్యం వల్ల లైంగిక విషయాల గురించి మీ వివాహ జతతో మాట్లాడడానికి అంతగా ఇష్టపడకపోతుండవచ్చు. కానీ దంపతులు తల్లిదండ్రులుగా తమ బాధ్యతలకు అలవాటుపడుతున్నప్పుడు అలా మాట్లాడుకోవడం చాలా ప్రాముఖ్యం. మీ జతను అర్థంచేసుకోండి, ఓర్పు చూపించండి, నిజాయితీగా ఉండండి. (1 కొరింథీయులు 10:24) అలాచేస్తే మీమధ్య అపార్థాలు రాకుండా ఉంటాయి, ఒకరి మీద ఒకరికున్న ప్రేమ ఇంకా ఎక్కువౌతుంది.—1 పేతురు 3:7, 8.
దంపతులు ఒకరికొకరు కృతజ్ఞత వ్యక్తం చేసుకున్నా వాళ్ల మధ్య ప్రేమ ఎక్కువౌతుంది. మొదటిసారి తల్లి అయిన తన భార్య చేసే చాలా పనులు తన దృష్టికి రావని తెలివైన భర్త గ్రహిస్తాడు. వీవీయన్ ఇలా అంటోంది: “రోజంతా బిడ్డను చూసుకోవడంలో బిజీగావున్నా, సాయంత్రమయ్యే సరికి నేను ఏమీ సాధించలేదని నాకు తరచూ అనిపిస్తుంది!” తెలివైన భార్య బిజీగావున్నా, కుటుంబం కోసం భర్త చేసే పనులను చులకన చేయకుండా జాగ్రత్తపడుతుంది.—సామెతలు 17:17.
ఇలా చేసి చూడండి: తల్లులారా, బిడ్డ పడుకున్నప్పుడే వీలైతే మీరు కూడా కునుకు తీయండి. అలాచేస్తే మీరు నూతనోత్తేజాన్ని, మీ వివాహ బంధాన్ని బలపర్చుకోవడానికి అవసరమైన శక్తిని పొందుతారు. తండ్రులారా, వీలైనప్పుడల్లా మీ భార్యకు విశ్రాంతి దొరికేలా రాత్రిళ్లు మీ పాపకు పాలు పట్టండి, డైపర్లు మార్చండి. పేపరు మీద రాసిగానీ మెసేజ్‌లు పంపించి గానీ ఫోన్లో మాట్లాడి గానీ మీ భార్యను ప్రేమిస్తున్నారని
భరోసా ఇస్తూ ఉండండి. మీరిద్దరూ మాట్లాడుకోవడానికి సమయం వెచ్చించండి. మీ బిడ్డ గురించే కాదు మీ గురించి కూడా మాట్లాడుకోండి. మీ ఇద్దరి మధ్యవున్న స్నేహాన్ని బలపర్చుకుంటే, తల్లిదండ్రులుగా మీకు ఎదురయ్యే సవాళ్లను మరింత బాగా పరిష్కరించుకోగలుగుతారు.మూడో సవాలు: పిల్లల్ని పెంచే విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు.
నేపథ్యాలు వేరైనందువల్లే తాము వాదులాడుకుంటున్నామని దంపతులకు కొన్నిసార్లు అనిపించవచ్చు. జపాన్ దేశస్థురాలైన ఆసామీ, ఆమె భర్త కాట్స్యూరో ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఆసామీ ఇలా అంటోంది: “నా భర్త మా పాపను మరీ గారాభం చేస్తున్నాడని నాకనిపించింది, నా భర్తకేమో నేను మా పాప విషయంలో మరీ నిక్కచ్చిగా ఉంటున్నానని అనిపించింది.” మరి ఇద్దరూ చెరోవిధంగా ప్రవర్తించకుండా ఉండాలంటే ఏమి చేస్తే బాగుంటుంది?
సాఫల్యానికి మెట్టు: మీ భాగస్వామితో మాట్లాడండి, ఒకరికొకరు సహకరించుకోండి.
జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా రాశాడు: ‘గర్వం వల్ల జగడమే పుడుతుంది, ఆలోచన వినే వానికి జ్ఞానం కలుగుతుంది.’ (సామెతలు 13:10) పిల్లలను పెంచే విషయంలో మీ భాగస్వామి అవలంభిస్తున్న పద్ధతి గురించి మీకు ఎంత తెలుసు? పిల్లలను పెంచడానికి సంబంధించిన విషయాల గురించి మీ బిడ్డ పుట్టకముందే మాట్లాడుకోకపోతే, మీరు సమస్యను పరిష్కరించే బదులు ఒకరితోఒకరు గొడవపడే ప్రమాదముంది.
ఉదాహరణకు, మీరిద్దరూ కలిసి ఈ కింది విషయాల మీద ఏ అభిప్రాయానికి వచ్చారు: “బిడ్డకు మంచి ఆహార అలవాట్లు, నిద్రపోయే అలవాట్లు ఎలా నేర్పాలి? రాత్రిపూట ఏడ్చిన ప్రతీసారి బిడ్డను ఎత్తుకోవాలా? టాయిలెట్‌కు వెళ్లడం గురించి బిడ్డకు ఎలా నేర్పాలి?” ఈ విషయాల్లో మీ నిర్ణయాలు ఇతర దంపతుల నిర్ణయాలకు వేరుగా ఉంటాయి. ఇద్దరు పిల్లల తండ్రి రాజు ఇలా అంటున్నాడు: “ఏకాభిప్రాయానికి రావాలంటే మీరిద్దరూ మాట్లాడుకోవడం అవసరం. అలాచేస్తే మీ బిడ్డ అవసరాలు కలిసి చూసుకోగలుగుతారు.”
ఇలా చేసి చూడండి: మిమ్మల్ని పెంచేటప్పుడు మీ తల్లిదండ్రులు ఎలాంటి పద్ధతులను ఉపయోగించారో ఆలోచించండి. పిల్లలను పెంచే విషయంలో వాళ్ల ఏ వైఖరులను, ఏ పనులను మీరు అనుసరించాలని లేదా అనుసరించకూడదని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను మీ జతతో చర్చించండి.
బిడ్డ పుట్టడం వివాహం మీద సానుకూల ప్రభావం చూపించవచ్చు
ఇద్దరు అనుభవంలేని స్కేటర్లు మంచు మీద సమన్వయంతో కలిసి స్కేటింగ్ చేయాలంటే సమయం పడుతుంది, అంతేకాదు వాళ్లకు ఓపిక కూడా అవసరమౌతుంది. అలాగే తల్లిదండ్రులుగా మీరు మీ బాధ్యతలకు అలవాటుపడాలంటే మీకూ సమయం పడుతుంది. కానీ, తర్వాత్తర్వాత మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
బిడ్డను పెంచడం ఒక పెద్ద సవాలే. అది మీ జతతో మీకున్న సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ అది, మీరు విలువైన లక్షణాలను పెంపొందించుకోవడానికి అవకాశాన్ని కూడా ఇస్తుంది. బైబిలు ఇచ్చే జ్ఞానయుక్తమైన సలహాలు పాటిస్తే మీరు కూడా రాజేష్ పొందినలాంటి అనుభవాన్నే పొందుతారు. ఆయన ఇలా అంటున్నాడు: “పిల్లలను పెంచడం నా భార్య మీద, నా మీద సానుకూల ప్రభావం చూపించింది. ఇప్పుడు మేము మా గురించే ఎక్కువ ఆలోచించుకోవడం లేదు. మేము ఇంకా ఎక్కువ ప్రేమించడం, బాగా అర్థం చేసుకోవడం నేర్చుకున్నాం.” అలాంటి మార్పులు వివాహ జీవితంలో సంతోషానికి ఎంతో దోహదపడతాయి. (w11-E 05/01)
a ఈ ఆర్టికల్‌లో ఉన్నవి అసలు పేర్లు కావు.
b చాలామంది తల్లులు బిడ్డను ప్రసవించాక కొన్ని వారాలపాటు కొద్దిగా కృంగిపోతారు. కొంతమంది మాత్రం ఎంతో తీవ్రమైన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌తో బాధపడతారు. దీన్ని ఎలా గుర్తించవచ్చో, ఎలా ఎదుర్కోవచ్చో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన, జూలై 22, 2002 తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికలోని “ప్రసూతి తర్వాతి కృంగుదలతో నా పోరాటంలో విజయం సాధించాను” అనే ఆర్టికల్, జూన్ 8, 2003 తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికలోని “ప్రసూతి తర్వాతి కృంగుదలను అర్థం చేసుకోవడం” అనే ఆర్టికల్ చూడండి.
c ఆదికాండము 2:24 లో “హత్తుకొను” అని అనువదించబడిన హీబ్రూ పదానికి ‘ఒక వ్యక్తిని ప్రేమతో, నమ్మకంగా అంటిపెట్టుకొని ఉండడం అనే అర్థముంది’ అని ఒక విద్వాంసుడు అంటున్నాడు.
ఇలా ప్రశ్నించుకోండి . . .
-
కుటుంబం కోసం నా భార్య లేక భర్త చేసేవాటిని విలువైనవిగా ఎంచుతున్నానని చూపించడానికి పోయిన వారంలో నేనేమి చేశాను?
-
బిడ్డను పెంచడం గురించి కాకుండా మా ఇద్దరి గురించి ఈ మధ్యకాలంలో నా జతతో మనస్ఫూర్తిగా ఎప్పుడు మాట్లాడాను?