కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విరిగిన హృదయంగలవాళ్లకు ఓదార్పు

విరిగిన హృదయంగలవాళ్లకు ఓదార్పు

దేవునికి దగ్గరవ్వండి

విరిగిన హృదయంగలవాళ్లకు ఓదార్పు

‘యెహోవా నన్ను ఎప్పటికీ ప్రేమించలేడు’ అని చాలాకాలంపాటు మానసికంగా కృంగిపోయిన ఒక క్రైస్తవ స్త్రీ అంది. యెహోవా తనకు దూరంగా ఉన్నాడని ఆమె బలంగా నమ్మింది. కృంగుదలతో బాధపడుతున్న తన ఆరాధకులకు యెహోవా నిజంగానే దూరంగా ఉంటాడా? దావీదు రాసిన కీర్తనల్లో దానికి ఓదార్పుకరమైన జవాబు ఉంది. ఆ ప్రేరేపిత మాటలను కీర్తన 34:18లో చూడవచ్చు.

తీవ్రమైన కృంగుదల నమ్మకమైన యెహోవా ఆరాధకుల మీద ఎలాంటి ప్రభావం చూపించగలదో దావీదుకు తెలుసు. దావీదు యౌవనస్థునిగా ఉన్నప్పుడు, తనను చంపడానికి పట్టువిడవకుండా ప్రయత్నిస్తున్న అసూయపరుడైన సౌలు రాజు నుండి తప్పించుకోవడానికి చాలాకాలంపాటు పారిపోతూనే ఉన్నాడు. సౌలు తనను వెదకడానికి రాడనుకున్న ప్రదేశంలో అంటే ఫిలిష్తీయలోవున్న గాతు అనే శత్రువుల పట్టణంలో ఆయన తలదాచుకున్నాడు. అయితే, అక్కడివాళ్లు తనను గుర్తుపట్టడంతో దావీదు పిచ్చివానిలా నటించి వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. తనను తప్పించినందుకు దావీదు యెహోవాను మహిమపరిచాడు, ఆ అనుభవంతోనే 34వ కీర్తన రాశాడు.

కృంగుదలతో బాధపడేవాళ్లకు లేదా దేవుని దయను పొందడానికి అర్హులం కాదని అనుకునేవాళ్లకు దేవుడు దూరంగా ఉంటాడని దావీదు నమ్మాడా? ‘విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవాళ్లను ఆయన రక్షిస్తాడు’ అని ఆయన రాశాడు. (18వ వచనం) ఈ మాటలు మనకెలా ఓదార్పు, ఆశ కలిగిస్తాయో చూద్దాం.

“యెహోవా ఆసన్నుడు.” ఆసన్నుడు అనే పదం, “ప్రభువు శ్రద్ధగలవాడని, గమనించేవాడని, తన ప్రజలకు సహాయం చేయడానికి, వాళ్లను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని విపులంగా తెలియజేస్తుంది” అని ఒక గ్రంథం చెబుతోంది. యెహోవా తన ప్రజలను గమనిస్తూ ఉంటాడని తెలుసుకోవడం ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ వాళ్లు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆయన చూస్తున్నాడు, వాళ్ల అంతరంగ భావాలు ఆయనకు తెలుసు.—2 తిమోతి 3:1; అపొస్తలుల కార్యములు 17:26, 27.

‘విరిగిన హృదయం గలవాళ్లు.’ కొన్ని సంస్కృతుల్లో, “విరిగిన హృదయానికీ” ప్రేమలో విఫలమవడానికీ సంబంధం ఉంది. అయితే కీర్తన రచయిత మాటలు, “మరింత సాధారణ దుఃఖాన్ని, విచారాన్ని” సూచిస్తాయని ఒక పండితుడు చెబుతున్నాడు. అవును, దేవుని నమ్మకమైన ఆరాధకులకు కూడా కొన్నిసార్లు తమ హృదయాన్ని విరిచేసేంత తీవ్రమైన కష్టాలు ఎదురౌతాయి.

‘నలిగిన మనస్సు గలవాళ్లు.’ నిరుత్సాహానికి గురైనవాళ్లు తమను తాము ఎంత తక్కువ అంచనా వేసుకుంటారంటే కొంతకాలంపాటు వాళ్లు ఆశలన్నీ వదిలేసుకుంటారు. ఈ పదబంధాన్ని, “ఎదురుచూడడానికి మంచిదేదీ లేనివాళ్లు” అని తర్జుమా చేయవచ్చని బైబిలు అనువాదకుల కోసం తయారుచేయబడిన ఒక పుస్తకం చెబుతోంది.

‘విరిగిన హృదయం గలవాళ్ల,’ ‘నలిగిన మనస్సు గలవాళ్ల’ విన్నపాలకు యెహోవా ఎలా స్పందిస్తాడు? వాళ్లు తన ప్రేమకు, శ్రద్ధకు అర్హులు కారని వాళ్లకు దూరంగా ఉంటాడా? లేదు! బాధపడుతున్న బిడ్డను దగ్గరకు తీసుకుని ఓదార్చే ప్రేమగల తండ్రిలా, సహాయం కోసం ప్రార్థించే తన ఆరాధకులకు యెహోవా సమీపంగా ఉంటాడు. వాళ్లను ఓదార్చాలనీ వాళ్ల విరిగిన హృదయానికి, నలిగిన మనసుకు ఉపశమనం కలిగించాలనీ ఆయన ఆతురతతో ఉన్నాడు. వాళ్లకు ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించడానికి కావాల్సిన జ్ఞానం, బలం ఆయన ఇవ్వగలడు.—2 కొరింథీయులు 4:7; యాకోబు 1:5.

మీరు యెహోవాకు దగ్గరవ్వాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి. ఈ దయగల దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు, ‘వినయం గలవాళ్ల ప్రాణాన్ని, నలిగిన వాళ్ల ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడానికి వినయం గలవాళ్లయొద్ద, దీనమనస్సు గలవాళ్లయొద్ద నేను నివసిస్తాను.’—యెషయా 57:15. (w11-E 06/01)