మీ పిల్లలకు నేర్పించండి
వేరేవాళ్లు మిమ్మల్ని తమతో కలుపుకోవడం లేదని మీకెప్పుడైనా అనిపించిందా?
కొంతమంది వేరేవాళ్లను తమతో కలుపుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్లు వేరే దేశానికి చెందిన వాళ్లని, వాళ్ల రంగు, మాట్లాడే పద్ధతి, ప్రవర్తించే తీరు వేరుగా ఉందని అలా చేస్తారు. వేరేవాళ్లు మిమ్మల్ని కలుపుకోవడం లేదని మీకెప్పుడైనా అనిపించిందా?— a
అలా అనిపించిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు చూద్దాం. ఆయన పేరు మెఫీబోషెతు. ఆయన ఎవరో, ఆయనకు ఎందుకలా అనిపించిందో తెలుసుకుందాం. వేరేవాళ్లు మిమ్మల్ని కలుపుకోవడం లేదని మీకెప్పుడైనా అనిపిస్తే, మీరు మెఫీబోషెతు నుండి ఎంతో నేర్చుకోవచ్చు.
ఆయన దావీదు ప్రియ స్నేహితుడైన యోనాతాను కుమారుడు. యోనాతాను యుద్ధంలో చనిపోకముందు, ‘నా పిల్లలతో మంచిగా ఉండు’ అని దావీదుతో అన్నాడు. ఆ తర్వాత దావీదు రాజయ్యాడు. యోనాతాను తనతో అన్న మాటలను దావీదు ఎన్నో సంవత్సరాల తర్వాత గుర్తు తెచ్చుకున్నాడు, అప్పటికి మెఫీబోషెతు ఇంకా బ్రతికేవున్నాడు. మెఫీబోషెతు చిన్నప్పుడు కిందపడి పెద్ద దెబ్బ తగలడంతో జీవితాంతం సరిగ్గా నడవలేకపోయాడు. వేరేవాళ్లు తమతో కలుపుకోవడం లేదని మెఫీబోషెతుకు ఎందుకు అనిపించి ఉంటుందో మీకర్థమైందా?—
యోనాతాను కుమారునికి దావీదు మేలు చేయాలనుకున్నాడు. అందుకే ఆయన, యెరూషలేములోని తన ఇంటికి దగ్గర్లో మెఫీబోషెతు ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేశాడు. అంతేకాదు మెఫీబోషెతు ఎప్పటికీ తన బల్ల దగ్గరే భోజనం చేసేలా ఏర్పాటు చేశాడు. సీబా అనే వ్యక్తిని, అతని కుమారులను, అతని దాసులను మెఫీబోషెతుకు సేవకులుగా నియమించాడు. యోనాతాను కుమారుణ్ణి దావీదు నిజంగా ఘనపర్చాడు! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసా?—
దావీదు ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. దావీదు కుమారుల్లో
ఒకడైన అబ్షాలోము ఆయనకు వ్యతిరేకంగా రాజు అవడానికి ప్రయత్నించాడు. దావీదు తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. ఆయనతోపాటు చాలామంది వెళ్లారు, వాళ్లతో మెఫీబోషెతు కూడా వెళ్లాలనుకున్నాడు. రాజుగా ఉండే హక్కు దావీదుకే ఉందని ఆయన స్నేహితులైన వీళ్లకు తెలుసు. అయితే, మెఫీబోషెతు సరిగ్గా నడవలేడు కాబట్టి వెళ్లలేకపోయాడు.అప్పుడు సీబా, మెఫీబోషెతు నిజంగా రాజవ్వాలనుకున్నాడు కాబట్టే రాకుండా అక్కడ ఉండిపోయాడని దావీదుతో చెప్పాడు. దావీదు ఆ అబద్ధాన్ని నమ్మాడు! దాంతో ఆయన మెఫీబోషెతు ఆస్తినంతటినీ సీబాకు ఇచ్చాడు. త్వరలోనే దావీదు అబ్షాలోముతో చేసిన యుద్ధంలో గెలిచి యెరూషలేముకు తిరిగి వచ్చాడు. అప్పుడు దావీదు, మెఫీబోషెతు ఎందుకు రాలేదో ఆయన నుండే తెలుసుకొని ఆస్తిని మెఫీబోషెతు, సీబా కలిసి పంచుకోవాలని దావీదు నిర్ణయించాడు. అప్పుడు మెఫీబోషెతు ఏమి చేశాడు?—
దావీదు నిర్ణయం తప్పని మెఫీబోషెతు ఫిర్యాదు చేయలేదు. రాజు తన పని సరిగ్గా నిర్వహించాలంటే ప్రశాంతంగా ఉండడం అవసరమని ఆయనకు తెలుసు. అందుకే ఆస్తినంతా సీబానే ఉంచుకోవచ్చని చెప్పాడు. యెహోవా సేవకుడైన దావీదు మళ్లీ రాజుగా యెరూషలేముకు తిరిగి రావడమే ఆయనకు కావాల్సింది.
మెఫీబోషెతు చాలా బాధలు పడ్డాడు. వేరేవాళ్లు తమతో కలుపుకోవడం లేదని ఆయనకు తరచూ అనిపించింది. అయితే యెహోవా ఆయనను ప్రేమించి, ఆయన గురించి శ్రద్ధ తీసుకున్నాడు. దీన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు?— మనం సరైనది చేసినా కొంతమంది మన మీద అబద్దాలు చెప్పవచ్చు. యేసు ఇలా అన్నాడు, ‘లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు నన్ను ద్వేషించిందని మీకు తెలుసు.’ ప్రజలు యేసును చంపేశారు కూడా! మనం సరైనది చేస్తే సత్యదేవుడైన యెహోవా, ఆయన కుమారుడైన యేసు మనల్ని తప్పకుండా ప్రేమిస్తారు. (w11-E 06/01)
మీ బైబిల్లో చదవండి
a మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే గీత ఉన్నచోట ఆగి, అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.