కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

మీ జీవిత భాగస్వామిని గౌరవించండి

మీ జీవిత భాగస్వామిని గౌరవించండి

వినయ్‌ a ఇలా చెబుతున్నాడు: “మా ఆవిడ రమ్యకు బాధేస్తే చాలాసేపు ఏడుస్తుంది. తనతో మాట్లాడడానికి పోతే కోపగించుకుంటుంది లేదా మాట్లాడడం మానేస్తుంది. ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు, దాంతో నా ఓపిక నశిస్తుంది.”

రమ్య ఇలా చెబుతోంది: “మావారు ఇంటికి వచ్చేసరికి ఏడుస్తున్నాను. నేనెందుకు బాధపడుతున్నానో చెబుతుంటే మధ్యలోనే ఆపేసి, అదంత పెద్ద విషయమేమీ కాదంటూ మర్చిపొమ్మన్నారు. దాంతో నాకు ఇంకా బాధేసింది.”

అప్పుడప్పుడు మీకు కూడా వాళ్లకు అనిపించినట్లే అనిపిస్తుందా? వాళ్లిద్దరూ చక్కగా మాట్లాడుకోవాలనుకుంటారు కానీ చాలాసార్లు అది బెడిసికొడుతుంది. ఎందుకని?

స్త్రీపురుషులు మాట్లాడే పద్ధతి ఒకేలా ఉండదు. వాళ్ల అవసరాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. స్త్రీలు తరచూ తమ భావాలన్నీ బయటకు చెప్పుకోవాలనుకుంటారు. కానీ, చాలామంది పురుషులు సమస్యలను వెంటనే పరిష్కరించి, అదే ముల్లులాంటి సమస్యలనైతే పక్కనబెట్టి శాంతికి భంగం కలగకుండా చూడాలనుకుంటారు. ఇలాంటి తేడాలున్నా మీ భాగస్వామితో సరిగ్గా మాట్లాడాలంటే ఏమి చేయాలి? తనను గౌరవించాలి.

ఇతరులను గౌరవించే వ్యక్తులు ఎదుటివాళ్లకు విలువిస్తారు, వాళ్ల భావాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అధికారంలో ఉన్నవాళ్లను లేదా మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవాళ్లను గౌరవించాలని మీరు చిన్నప్పటినుండే నేర్చుకుని ఉంటారు. కానీ వివాహం విషయానికి వచ్చేసరికి, దాదాపు ఒకే స్థాయిలోవున్న వ్యక్తిని అంటే మీ భాగస్వామిని గౌరవించడం ఒక సవాలుగా ఉంటుంది. ప్రణయ్‌కు, కవితకు పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. కవిత ఇలా అంటోంది: “నాకు తెలిసినంత వరకు మావారు తనతో ఎవరు మాట్లాడినా ఓపిగ్గా వింటారు, వాళ్లను అర్థంచేసుకుంటారు. ఆయన నాతో కూడా అలాగే ఉండాలని కోరుకున్నాను.” బహుశా మీరు మీ స్నేహితులతో, ఆఖరికి పరిచయంలేని వ్యక్తులతో కూడా గౌరవంగా మాట్లాడుతుండవచ్చు, వాళ్లు చెప్పేది ఓపిగ్గా వింటుండవచ్చు. మరి మీ భాగస్వామితో కూడా అలాగే ఉంటున్నారా?

కుటుంబంలో ఒకరినొకరు గౌరవించుకోకపోతే అలజడి రేగి, గొడవలు జరుగుతాయి. ‘జగడంతో నిండిన ఇంట్లో సంతృప్తిగా తినడం కన్నా ప్రశాంతంగా వట్టి రొట్టెముక్క తినడం మేలు’ అని జ్ఞానియైన ఒక రాజు చెప్పాడు. (సామెతలు 17:1, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) తమ భార్యలను సన్మానించమని లేదా గౌరవించమని భర్తలకు బైబిలు చెబుతోంది. (1 పేతురు 3:7) ‘భార్యలు’ కూడా ‘తమ భర్తల పట్ల ప్రగాఢ గౌరవం చూపించాలి.’—ఎఫెసీయులు 5:33, NW.

ఒకరితో ఒకరు గౌరవంగా ఎలా మాట్లాడుకోవచ్చు? బైబిల్లో ఉన్న ఉపయోగపడే కొన్ని సలహాలు ఇప్పుడు చూద్దాం.

మీ భాగస్వామి ఏదైనా చెబుతుంటే . . .

సవాలు:

చాలామంది వినడం కన్నా మాట్లాడడానికే ఎక్కువ ఇష్టపడతారు. మీరు కూడా అంతేనా? ‘పూర్తిగా వినకముందే జవాబిచ్చే’ వ్యక్తి తెలివితక్కువ వాడని బైబిలు చెబుతోంది. (సామెతలు 18:13) అందుకే మాట్లాడే ముందు వినండి. ఎందుకు? కావ్యకు పెళ్లయి 26 ఏళ్లు అవుతోంది, ఆమె ఇలా అంటోంది: “మావారు అప్పటికప్పుడే నా సమస్యలను తీర్చడానికి ప్రయత్నించకుండా ఉంటే మంచిదని నాకనిపిస్తుంది. నేను చెప్పేది ఆయన ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, సమస్య అసలు ఎందుకు తలెత్తిందో తెలుసుకొని పరిష్కరించమని నేను అడగడం లేదు. ఆయన నేను చెప్పేది వింటే చాలు, నా భావాలకు విలువిస్తే చాలు.”

అయితే, కొంతమంది స్త్రీపురుషులు తమ భావాలను పైకి చెప్పుకోవడానికి ఇష్టపడరు, ఒకవేళ చెప్పమని పట్టుబట్టినా చెప్పడానికి ఇబ్బందిపడతారు. లహరికి ఈ మధ్యే పెళ్లయింది, తన భర్త త్వరగా మనసులో ఉన్నది పైకి చెప్పడని ఆమె గమనించింది. “నేను ఎంతో ఓపిగ్గా, తన భావాలను ఎప్పుడెప్పుడు పైకి చెబుతాడా అని ఎదురుచూస్తాను” అని ఆమె అంటోంది.

పరిష్కారం:

పొంచివున్న ప్రమాదం గురించి మీరు మీ భాగస్వామితో మాట్లాడాల్సివస్తే ఇద్దరూ నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడండి. మీ భాగస్వామికి దాని గురించి మాట్లాడడం ఇష్టం లేకపోతే అప్పుడేం చేస్తారు? ‘నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకి దాన్ని పైకి చేదుతాడు’ అని గుర్తించండి. (సామెతలు 20:5) బావిలో నుండి నీళ్లు త్వరత్వరగా చేదితే బాల్చీ నుండి చాలా నీళ్లు ఒలికిపోతాయి. అలాగే, మీ భాగస్వామి మీద ఒత్తిడి తీసుకొస్తే తను సమర్థించుకునే అవకాశం ఉంది. అప్పుడు తనలోని భావాలను తెలుసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే, మీ భాగస్వామి మనసులో ఏముందో గౌరవపూర్వకంగా మృదు స్వరంతో అడిగి తెలుసుకోండి. తన భావాలను మీరనుకున్నంత త్వరగా పైకి చెప్పకపోతే ఓపికపట్టండి.

మీ భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు, ‘వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోప్పడడానికి నిదానించాలి.’ (యాకోబు 1:19) జాగ్రత్తగా వినే వ్యక్తి ఎదుటివాళ్లు చెప్పేది వినడమే కాదుగానీ ఆ మాటల వెనుకవున్న భావాలను అర్థంచేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాడు. మీ భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు తన భావాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు వినే తీరును బట్టి మీరు తనను గౌరవిస్తున్నారో లేదో మీ భాగస్వామికి తెలుస్తుంది.

మనం ఎలా వినాలో యేసు నేర్పించాడు. ఉదాహరణకు, సహాయం కోసం ఒక రోగి తన దగ్గరకు వచ్చినప్పుడు యేసు వెంటనే ఆ సమస్యను తీసివేయలేదు. ముందుగా అతను చెప్పింది విన్నాడు, విన్నదాన్ని బట్టి చలించిపోయాడు. ఆ తర్వాత, అతణ్ణి బాగుచేశాడు. (మార్కు 1:40-42) మీ భాగస్వామి మీతో మాట్లాడుతున్నప్పుడు అలాగే చేయండి. బహుశా తను, సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలని కాదుగానీ తన బాధను మీరు అర్థంచేసుకోవాలని కోరుకుంటున్నారని గుర్తుంచుకోండి. అందుకే జాగ్రత్తగా వినండి. తన భావాలను అర్థంచేసుకోవడానికి మీరు తన పరిస్థితుల్లో ఉండి ఆలోచించండి. ఆ తర్వాతే మీ భాగస్వామి అవసరాలకు స్పందించండి. ఇవన్నీ చేస్తే మీరు మీ భాగస్వామిని గౌరవిస్తున్నారని చూపిస్తారు.

ఇలా చేసి చూడండి: ఈసారి మీ భాగస్వామి మీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే స్పందించకుండా తను పూర్తిగా చెప్పేంతవరకు ఆగండి, తను చెప్పింది అర్థంచేసుకోండి. ఆ తర్వాత, “నేను జాగ్రత్తగా విన్నానని నీకు అనిపించిందా? లేదా ఈ విషయంలో నేను ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలా?” అని తనను అడగండి.

మీరేమైనా చెప్పాలనుకుంటే . . .

సవాలు:

“భాగస్వామి గురించి చెడుగా, అవమానకరంగా, వ్యంగ్యంగా మాట్లాడడం సహజమే అన్నట్టు హాస్యానికి సంబంధించిన టీవీ కార్యక్రమాల్లో చూపిస్తుంటారు” అని ముందు ప్రస్తావించిన కవిత అంటోంది. ఒకరినొకరు గౌరవించుకోని కుటుంబాల్లో కొందరు పెరుగుతారు. అయితే పెళ్లయ్యాక, ఆ పద్ధతి మానుకోవడం వాళ్లకు కష్టమనిపిస్తుంది. కెనడాలో నివసిస్తున్న ఐవీ ఇలా చెబుతోంది: “వ్యంగ్యంగా మాట్లాడడం, అరవడం, కించపరచడం వంటివి సర్వసాధారణంగా ఉండే వాతావరణంలో నేను పెరిగాను.”

పరిష్కారం:

ఇతరులతో మీ భాగస్వామి గురించి చెబుతున్నప్పుడు, ‘వినే వాళ్లకు మేలు కలిగేలా అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన’ మంచి మాటలే మాట్లాడండి. (ఎఫెసీయులు 4:29) ఇతరులకు మీ భాగస్వామి మీద సదభిప్రాయం కలిగేలా మాట్లాడండి.

మీరిద్దరే ఉన్నప్పుడు కూడా వ్యంగ్యంగాగానీ కించపర్చే విధంగాగానీ మాట్లాడుకోకండి. ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలులో, దావీదు రాజు భార్య మీకాలుకు ఆయన మీద కోపమొచ్చింది. ఆయన, ‘వ్యర్థునిలా’ ప్రవర్తించాడు అంటూ ఆమె హేళన చేసింది. ఆమె మాటలు దావీదు మనసును నొప్పించాయి, దేవునికి కూడా కోపం తెప్పించాయి. (2 సమూయేలు 6:20-23) దీన్నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మీ భాగస్వామితో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడండి. (ఎఫెసీయులు 4:29) ప్రణయ్‌కు పెళ్లయి ఎనిమిదేళ్లయినా, ఇప్పటికీ తనకూ తన భార్యకూ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నాడు. కొన్నిసార్లు తన మాటల వల్ల పరిస్థితి ఇంకా ఘోరంగా తయారౌతుందని ఆయన గమనించాడు. “వాదాన్ని ‘గెలవాలనుకుంటే’ నష్టమే జరుగుతుందని అర్థమైంది. దానికన్నా, మా బంధాన్ని బలపర్చడానికి ప్రయత్నించడమే మంచిదని, అందులోనే ఎక్కువ సంతోషముందని నాకనిపిస్తుంది” అని ఆయన అంటున్నాడు.

పూర్వం ఒక వృద్ధ విధవరాలు తన కోడళ్లతో ఇలా అంది: ‘పెళ్లి చేసికొని మీ ఇళ్లలో నెమ్మది పొందండి.’ (రూతు 1:9) భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు వాళ్ల ఇల్లు నిజంగానే శాంతికి నిలయంగా ఉంటుంది.

ఇలా చేసి చూడండి: మీ భాగస్వామితో కలిసి ఈ ఉపశీర్షికలో ఇచ్చిన సలహాలను చర్చించండి. మీ భాగస్వామిని ఇలా అడగండి: “నలుగురిలో నేను నీ గురించి మాట్లాడుతున్నప్పుడు నీకేమనిపిస్తుంది, నేను నిన్ను గౌరవిస్తున్నానని అనిపిస్తుందా? కించపరుస్తున్నానని అనిపిస్తుందా? నేనింకా ఏ మార్పులు చేసుకుంటే బాగుంటుంది?” మీ భాగస్వామి తన భావాలను మీతో వ్యక్తం చేస్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. తను చెప్పిన సలహాలు పాటించడానికి ప్రయత్నించండి.

అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు వేర్వేరుగా ఉన్నా ఒకరినొకరు గౌరవించుకోండి

సవాలు:

భార్యాభర్తలు “ఏకశరీరము” అని బైబిలు చెప్పినప్పుడు ఇద్దరికీ ఒకేలాంటి అభిప్రాయం లేదా వ్యక్తిత్వం ఉండాలని కొత్తగా పెళ్లయిన కొంతమంది తప్పుగా అనుకుంటారు. (మత్తయి 19:5) కానీ అది సాధ్యమయ్యే పని కాదని త్వరలోనే తెలుసుకుంటారు. పెళ్లయిన కొంతకాలానికే, వాళ్లలో ఉన్న తేడాలు తరచూ గొడవలకు దారితీస్తాయి. కవిత ఇలా చెబుతోంది: “మావారికీ నాకూ ఉన్న ఒక పెద్ద తేడా ఏమిటంటే, ఆయన ఏ విషయం గురించీ నా అంత దిగులుపడరు. నేను ఏదైనా విషయం గురించి ఆందోళన పడుతున్నప్పుడు కొన్నిసార్లు ఆయన అంతగా పట్టనట్టు ఉంటారు, ఆ విషయం గురించి నాకున్నంత శ్రద్ధ ఆయనకు లేదన్నట్లు అనిపిస్తుంది. అందుకే నాకు చాలా కోపమొస్తుంది.”

పరిష్కారం:

మీ భాగస్వామిని తనను తననుగా ఇష్టపడండి. తన అభిప్రాయాల్లో, వ్యక్తిత్వంలో ఉన్న తేడాలను గౌరవించండి. ఉదాహరణకు, మీ కళ్లు మీ చెవులు వేర్వేరుగా పనిచేస్తాయి, కానీ అవి రెండూ సమన్వయంతో పనిచేయడం వల్లే మీరు జాగ్రత్తగా రోడ్డు దాటగలుగుతారు. అమలకు పెళ్లయి దాదాపు 30 ఏళ్లయింది. ఆమె ఇలా అంటోంది: “మా అభిప్రాయాలు దేవుని వాక్యాన్ని మీరనంతవరకు మేము ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవించుకుంటాం. ఎంతైనా మేము పెళ్లి మాత్రమే చేసుకున్నాం గానీ క్లోన్‌ చేయబడలేదు కదా!”

మీ భాగస్వామి అభిప్రాయం, ప్రవర్తన మీకు వేరుగా ఉన్నప్పుడు మీ గురించే కాదు తన గురించి కూడా ఆలోచించండి. తన భావాలను పట్టించుకోండి. (ఫిలిప్పీయులు 2:4) అమల భర్త సాగర్‌ ఇలా చెబుతున్నాడు: “కొన్నిసార్లు నా భార్య అభిప్రాయాలు నాకు అర్థంకావు, ఇంకొన్నిసార్లు వాటిని ఒప్పుకోను. అలాంటప్పుడు, నా అభిప్రాయం కన్నా తనను ఎక్కువ ప్రేమిస్తున్నానని గుర్తు చేసుకుంటాను. ఆమె సంతోషంగా ఉంటే నేనూ సంతోషంగా ఉంటాను.”

ఇలా చేసి చూడండి: ఏయే విషయాల్లో మీ భాగస్వామి అభిప్రాయం లేదా వ్యవహరించే తీరు మీకన్నా మెరుగ్గా ఉందో ఒక పేపరు మీద రాయండి.—ఫిలిప్పీయులు 2:3.

వివాహ జీవితం చిరకాలం సంతోషంగా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ప్రాముఖ్యం. కవిత ఇలా అంటోంది: “భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటే వైవాహిక జీవితంలో సంతృప్తి, భద్రత ఉంటాయి. అందుకే ఆ లక్షణాన్ని వృద్ధి చేసుకోవడం చాలా మంచిది.” (w11-E 08/01)

a అసలు పేర్లు కావు.

ఇలా ప్రశ్నించుకోండి . . .

  • నా భాగస్వామి అభిప్రాయాల్లో, వ్యక్తిత్వంలో ఉన్న తేడా వల్ల మా కుటుంబానికి ఎలా మేలు జరిగింది?

  • బైబిలు సూత్రాలను మీరనంతవరకూ నా భాగస్వామి అభిప్రాయాలను గౌరవించడం ఎందుకు మంచిది?