పేదరికాన్ని రూపుమాపడానికి చేసిన ప్రయత్నాలు
పేదరికాన్ని రూపుమాపడానికి చేసిన ప్రయత్నాలు
ధనవంతులు ఎప్పుడో పేదరికం నుండి బయటపడ్డారు. కానీ మొత్తం మానవజాతిని పేదరికం నుండి విడిపించడానికి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఎందుకంటే, తమ హోదాను ఎవరైనా లేదా ఏదైనా పాడుచేయడం సంపన్నులకు ఇష్టముండదు. ప్రాచీనకాలంలో ఇశ్రాయేలును ఏలిన సొలొమోను రాజు ఇలా రాశాడు: ‘బాధించబడినవాళ్లు ఆదరించే దిక్కు లేక కన్నీళ్లు విడుస్తారు, వాళ్లను బాధపెట్టేవాళ్లు బలవంతులు.’—ప్రసంగి 4:1.
అధికారం, పలుకుబడి ఉన్నవాళ్లు లోకంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపగలరా? సొలొమోను దైవ ప్రేరణతో ఇలా రాశాడు: ‘అవన్నీ వ్యర్థమే, అవి ఒకడు గాలికి ప్రయాసపడినట్టు ఉన్నాయి. వంకరగా ఉన్న దాన్ని చక్కపర్చడం శక్యం కాదు.’ (ప్రసంగి 1:14, 15) మన కాలాల్లో పేదరిక నిర్మూలన కోసం చేసిన ప్రయత్నాలను పరిశీలిస్తే ఇది అర్థమౌతుంది.
అందరి సమృద్ధి కోసం రూపొందించిన సిద్ధాంతాలు
19వ శతాబ్దంలో, కొన్ని దేశాలు వర్తకం ద్వారా, పరిశ్రమల ద్వారా ముందెప్పుడూ లేనంత సంపదను కూడగట్టుకున్నాయి, దాంతో కొందరు ప్రముఖులు పేదరికం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే భూవనరులను అందరికీ సమానంగా పంచడం వీలౌతుందా?
సామ్యవాదం లేదా కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా వర్గరహిత సమాజాన్ని తీసుకురాగలదనీ, ఆ సమాజంలో సంపద అందరికీ సమానంగా పంచిపెట్టబడుతుందనీ కొందరు అనుకున్నారు. అయితే, ఆ ఆలోచన ధనవంతులకు అస్సలు మింగుడుపడలేదు. కానీ, “ప్రతి ఒకరినుంచీ అతని సామర్థ్యాలనుబట్టి [కోరబడుతుంది], ప్రతి ఒకరికీ అతని అవసరాలనుబట్టి
[ఇవ్వబడుతుంది]” అన్న సూత్రం చాలామందికి నచ్చింది. ప్రపంచం ఒక పరిపూర్ణ సమాజం అయ్యేలా అన్ని దేశాలు సామ్యవాద సిద్ధాంతాన్ని పాటిస్తాయని చాలామంది ఆశించారు. కొన్ని సంపన్న దేశాలు సామ్యవాదంలోని కొన్ని అంశాలను పాటించి, సంక్షేమ రాష్ట్రాలను స్థాపించాయి. “పుట్టిన దగ్గర నుండి చనిపోయేంతవరకు” తమ పౌరులందరి బాధ్యత తీసుకుంటామని అవి వాగ్దానం చేశాయి. తమ పౌరులను ప్రాణాంతకమైన పేదరికం నుండి కాపాడామని అవి చెప్పుకుంటున్నాయి.అయితే, నిస్వార్థ సమాజాన్ని తీసుకురావాలనే తన లక్ష్యాన్ని సామ్యవాదం ఎప్పుడూ చేరుకోలేకపోయింది. పౌరులు తమ కోసం కాకుండా సమాజం కోసం కష్టపడాలనే ఆలోచనను చాలామంది జీర్ణించుకోలేకపోయారు. పేదవాళ్లకు కావాల్సినవి ఉదారంగా ఇస్తుంటే వాళ్లలో కొందరు పనిదొంగలుగా తయారౌతున్నారని కొంతమంది గమనించారు. అందుకే పేదవాళ్ల కోసం పని చేయడానికి వీళ్లు ఇష్టపడలేదు. ‘పాపం చేయకుండా మేలు చేస్తూ ఉండే నీతిమంతుడు భూమ్మీద ఒక్కడైనా లేడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వాళ్లు వివిధ తంత్రాలను [“పథకాలను,” NW] కల్పించుకున్నారు’ అని బైబిలు చెబుతున్న మాటలు అక్షరసత్యాలని తేలిపోయింది.—ప్రసంగి 7:20, 29.
ది అమెరికన్ డ్రీమ్ కూడా ప్రజల్లో ఆశను నింపింది, అంటే కష్టపడి పనిచేస్తే ఎవరైనా సంపన్నులయ్యే అవకాశం ఉందని చాలామంది అనుకున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా వ్యాపార రంగం, స్వేచ్ఛా వర్తకం వంటి విధానాలే అమెరికాను సంపన్న దేశంగా మలిచాయనుకుని చాలా దేశాలు వాటిని అవలంబించాయి. ‘అమెరికన్ డ్రీమ్’ పద్ధతిని అన్ని దేశాలు అనుసరించలేకపోయాయి, ఎందుకంటే ఉత్తర అమెరికా సంపద దాని రాజకీయ విధానంవల్లే రాలేదు. దానికి ఆ సంపద ముఖ్యంగా దాని సహజ వనరుల వల్ల, సులువైన అంతర్జాతీయ వర్తక మార్గాల వల్ల వచ్చింది. అంతేకాదు, పోటీపడే ప్రపంచ ఆర్థిక విధానం వల్ల లాభం పొందేవాళ్లే కాదు నష్ట పోయేవాళ్లు కూడా ఉన్నారు. మరైతే, పేద దేశాలకు సహాయం చేయడానికి సంపన్న దేశాలను ముందుకు రమ్మంటే పరిస్థితి మారుతుందా?
మార్షల్ ప్లాన్ పేదరికాన్ని రూపుమాపిందా?
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ అతలాకుతలమైంది, దానిలోని చాలామంది ఆకలితో అలమటించారు. యూరప్‌లో సామ్యవాదం ప్రసిద్ధిచెందడం చూసి అమెరికా ప్రభుత్వం ఆందోళనపడింది. అందుకే, అమెరికా విధానాలను అవలంబించే యూరప్ దేశాల్లో పరిశ్రమల, వ్యవసాయ పునరుద్ధరణ కోసం అమెరికా నాలుగు సంవత్సరాలు ఎంతో డబ్బు ఇచ్చింది. మార్షల్ ప్లాన్ అనే ఈ యూరోపియన్ పునరుద్ధరణ కార్యక్రమం కొంతమేర విజయం సాధించిందని చెప్పవచ్చు. పశ్చిమ యూరప్‌లో అమెరికా ప్రభావం ఎక్కువైనందువల్ల అక్కడ ప్రాణాంతకమైన పేదరికం దాదాపు కనుమరుగైంది. అయితే ఈ పద్ధతితో ప్రపంచవ్యాప్త పేదరికాన్ని రూపుమాపగలమా?
మార్షల్ ప్లాన్ వల్ల అనుకున్న ఫలితాలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద దేశాల్లో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా వంటి రంగాల వృద్ధి కోసం అమెరికా ప్రభుత్వం సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ స్వప్రయోజనం కోసమేనని అమెరికా స్వయంగా ఒప్పుకుంది. వేరే దేశాలు కూడా ఇతర దేశాలకు సహాయం చేసి తమ ప్రభావాన్ని పెంచుకోవాలని చూశాయి. ఆరు సంవత్సరాల తర్వాత, మార్షల్ ప్లాన్‌లో వెచ్చించిన మొత్తానికి ఎన్నోరెట్లు ఎక్కువ వెచ్చించిన తర్వాత ఫలితాలు నీరుగార్చేలా ఉన్నాయి. తూర్పు ఆసియా దేశాల వంటి ఒకప్పటి పేద దేశాలు ఎంతో సంపద ఆర్జించాయన్నది నిజమే. ఇతర దేశాల్లో, అలాంటి సహాయంతో పిల్లల మరణాల సంఖ్య తగ్గింది, ఎక్కువమందికి విద్య అందింది. అయినా చాలా దేశాలు కడు పేదరికంలోనే మగ్గిపోయాయి.
విదేశీ సహాయం పేదరికాన్ని ఎందుకు రూపుమాపలేకపోయింది?
యుద్ధం నుండి తేరుకోవడానికి సంపన్న దేశాలకు సహాయం చేయడం కన్నా, పేదరికాన్ని రూపుమాపడానికి పేద దేశాలకు సహాయం చేయడం కష్టమనిపించింది. యూరప్‌లో అప్పటికే పరిశ్రమలు, వర్తకం, రవాణా సౌకర్యం వంటివి ఉన్నాయి. దానికి కొద్దిపాటి ఆర్థిక సహాయం అందిస్తే సరిపోతుంది. పేద దేశాల్లో, విదేశీ నిధులతో రోడ్లు వేసినా,
పాఠశాలలు, ఆస్పత్రులు కట్టించినా అక్కడ వ్యాపారం, సహజ వనరులు, వర్తక మార్గాలు లేవు కాబట్టి ప్రజలు కడు పేదరికంలోనే మగ్గిపోయారు.పేదరికానికి దారితీసే పరిస్థితులను, పేదరికం వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడం అంత సులువేమీకాదు. ఉదాహరణకు, రోగాల వల్ల పేదరికం, పేదరికం వల్ల రోగాలు వస్తాయి. కుపోషణతో బాధపడుతున్న పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎంత బలహీనంగా తయారవుతారంటే, పెద్దయ్యాక వాళ్లు కనీసం తమ పిల్లలను చూసుకునే స్థితిలో కూడా ఉండరు. సంపన్న దేశాలు “సహాయం” పేరుతో పేద దేశాలకు ఆహారాన్ని కుప్పలు తెప్పలుగా సరఫరా చేస్తే స్థానిక రైతులు, చిల్లర వ్యాపారులు వ్యాపారం లేక నష్టపోతారు. దానివల్ల పేదరికం ఇంకా పెరుగుతుంది. పేద దేశాల ప్రభుత్వాలకు ధన సహాయం చేస్తే వేరే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదేమిటంటే సహాయం కోసం ఇచ్చిన డబ్బును సులువుగా దోచుకునే అవకాశముంది, అలా అవినీతి పెరుగుతుంది, చివరకు పేదరికం ఇంకా ఎక్కువౌతుంది. చెప్పాలంటే, పేదరికానికి అసలు కారణాన్ని పరిష్కరించనందువల్లే విదేశీ సహాయం దాన్ని రూపుమాపలేకపోయింది.
పేదరికానికి అసలు కారణమేమిటి?
దేశాలు, ప్రభుత్వాలు, వ్యక్తులు స్వప్రయోజనం చూసుకోవడంవల్లే కడు పేదరికం ఏర్పడుతుంది. ఉదాహరణకు, సంపన్న దేశాల ప్రభుత్వాలు తమను ఎన్నుకున్న ప్రజలను తృప్తిపర్చాలి కాబట్టి అవి ప్రపంచవ్యాప్త పేదరికాన్ని రూపుమాపడానికి అంత ప్రాముఖ్యతనివ్వవు. సంపన్న దేశాల ప్రభుత్వాలు తమ రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో పేద దేశాల్లోని రైతుల ఉత్పత్తులను తమ దేశాల్లో అమ్మకుండా అడ్డుకుంటాయి. సంపన్న దేశాల పాలకులు, తమ రైతులు పేద దేశాల రైతుల కన్నా ఎక్కువగా ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఎంతో మద్దతిస్తారు.
పేదరికానికి కారణం మనుషులే. అంటే, స్వార్థపూరిత నైజం ఉన్న ప్రజలు, ప్రభుత్వాలే. సొలొమోను ఇలా రాశాడు: ‘ఒకడు మరి ఒకనిపై అధికారియై తనకు హాని తెచ్చుకుంటాడు.’—ప్రసంగి 8:9.
మరి పేదరికాన్ని రూపుమాపడం ఎలా? ఏ ప్రభుత్వమైనా మనుషుల స్వభావాన్ని మార్చగలదా? (w11-E 06/01)
[6వ పేజీలోని బాక్సు]
ధర్మశాస్త్రం చేసిన ప్రయత్నం
యెహోవా దేవుడు ప్రాచీన ఇశ్రాయేలీయులకు కొన్ని నియమాలు విధించాడు, వాటిని పాటిస్తే పేదరికాన్ని చాలావరకు తగ్గించవచ్చు. ధర్మశాస్త్రం ప్రకారం, యాజకులుగా సేవచేసే లేవీ గోత్రం మినహా ప్రతీ కుటుంబం కొంత భూమిని పొందింది. కుటుంబాలు తమ భూములను శాశ్వతంగా అమ్మకూడదు కాబట్టి వాళ్లు వాటిని పోగొట్టుకునే అవకాశమే ఉండేది కాదు. అనారోగ్యం, విపత్తు లేకపోతే సోమరితనం వల్ల ఎవరైనా తమ భూమిని అమ్ముకోవాల్సివస్తే, సునాద సంవత్సరంలో ఏమీ చెల్లించకుండానే తమ భూమిని తిరిగి పొందుతారు. అంటే ప్రతీ 50 సంవత్సరాలకు భూములను వాటి సొంతదారులకు లేదా వాళ్ల కుటుంబాలకు తిరిగి ఇచ్చేయాలి. ఈ ఏర్పాటు వల్ల, ఏ కుటుంబమూ తరాలపాటు పేదరికం బారినపడేది కాదు.—లేవీయకాండము 25:10, 23.
దేవుని ధర్మశాస్త్రం దయతో ఇంకో ఏర్పాటు కూడా చేసింది. అదేమిటంటే, కష్టాల వల్ల ఒకవ్యక్తి తనను తాను బానిసగా అమ్ముకునే వీలు కల్పించింది. అలా అమ్ముకునే వ్యక్తికి, అప్పులు తీర్చుకోవడం కోసం ముందే కొంత డబ్బు ముట్టేది. ఏడవ సంవత్సరానికల్లా ఆ వ్యక్తి తనను తాను విడిపించుకోలేకపోతే, ముందులా వ్యవసాయం చేసుకోవడానికి విత్తనాలు, పశువులు ఇచ్చి అతన్ని విడుదల చేయాలి. అంతేకాదు, తోటి ఇశ్రాయేలీయుడు పేదరికంవల్ల డబ్బు అప్పుగా తీసుకుంటే, వడ్డీ వసూలు చేయకూడదనే నియమం కూడా ధర్మశాస్త్రంలో ఉంది. ప్రజలు తమ పొలాలను అంచుల వరకు కోయకుండా, పేదవాళ్ల కోసం దాన్ని విడిచిపెట్టాలని ధర్మశాస్త్రంలో దేవుడు ఆజ్ఞాపించాడు. అలా, ఏ ఇశ్రాయేలీయునికీ అడుక్కునే పరిస్థితి రాదు.—ద్వితీయోపదేశకాండము 15:1-14; లేవీయకాండము 23:22.
అయినా కొంతమంది ఇశ్రాయేలీయులు పేదలయ్యారని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అలా ఎందుకు జరిగింది? ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. చివరకు, చాలా చోట్ల జరిగినట్లే, కొంతమంది గొప్ప భూస్వాములయ్యారు, ఇంకొంతమంది భూముల్లేని పేదవాళ్లయ్యారు. కొంతమంది దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకుండా స్వార్థం చూసుకోవడంతో ఇశ్రాయేలీయులు కూడా పేదరికం బారినపడ్డారు.—మత్తయి 22:37-40.