కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు
దంపతులుగా క్రైస్తవ ఆలోచనా విధానాన్ని వృద్ధిచేసుకోండి
ప్రసాద్ a: “మా పెళ్లయిన కొత్తలో, ఇద్దరం కలిసి బైబిలు చదవాలని పట్టుబట్టేవాణ్ణి. మా బైబిలు అధ్యయనమప్పుడు తను ఏకాగ్రత నిలిపేలా చూడాలని నిర్ణయించుకున్నాను. కానీ నా భార్య శాంత అస్సలు కుదురుగా కూర్చునేది కాదు. మా అధ్యయనమప్పుడు నేను ఏదైనా ప్రశ్న అడిగితే అవుననో, కాదనో మాత్రమే జవాబిచ్చేది. అలా కాకుండా తను పూర్తి జవాబు చెప్పాలని నాకనిపించేది.”
శాంత: “మా పెళ్లయినప్పుడు నాకు 18 ఏళ్లు. మేమిద్దరం కలిసి క్రమంగా బైబిలు అధ్యయనం చేసేవాళ్లం. అధ్యయనం చేసే ప్రతీసారి మావారు నా తప్పులన్నీ ఎత్తిచూపించడానికి, భార్యగా నేను ఏయే విషయాల్లో మార్పులు చేసుకోవాలో చెప్పడానికి చూసేవారు. దాంతో చాలా నిరుత్సాహం, బాధ కలిగేవి.”
వాళ్ల వివాహ జీవితంలో ఉన్న అసలు సమస్య ఏమిటని మీకనిపిస్తోంది? వాళ్ల ఉద్దేశాలు మంచివే. ఇద్దరికీ దేవుని మీద ప్రేమ ఉంది. బైబిలు అధ్యయనం చేయడం ప్రాముఖ్యమని ఇద్దరికీ తెలుసు. కానీ, వాళ్లిద్దర్నీ దగ్గర చేసేదే వాళ్లను దూరం చేస్తున్నట్లు అనిపిస్తోంది. వాళ్లు కలిసి అధ్యయనం చేస్తుండవచ్చు కానీ క్రైస్తవ లక్షణాలను వృద్ధిచేసుకోవడానికి కలిసి కృషిచేయడం లేదు.
క్రైస్తవుల ఆలోచనా విధానం ఎలా ఉండాలి? దాన్ని వృద్ధిచేసుకోవడానికి దంపతులు ఎందుకు ప్రయాసపడాలి? ఈ విషయంలో వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు? వాటిని వాళ్లు ఎలా అధిగమించవచ్చు?
క్రైస్తవుల ఆలోచనా విధానం ఎలా ఉండాలి?
జీవితం విషయంలో ప్రజలకుండే వివిధ ఆలోచనా విధానాల గురించి బైబిలు చెబుతోంది. (యూదా 17-19) ఉదాహరణకు, దేవుని ప్రమాణాలకు విలువిచ్చే వ్యక్తికీ శరీర కోరికల ప్రకారం నడుచుకునే వ్యక్తికీ మధ్యవున్న తేడా గురించి అపొస్తలుడైన పౌలు రాశాడు. శరీర కోరికలకు ప్రాధాన్యతనిచ్చే వాళ్లు, ఇతరులకన్నా తమ గురించే ఎక్కువగా ఆలోచిస్తారని ఆయన అన్నాడు. వాళ్లు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడానికి ప్రయత్నించే బదులు తమకు ఏది సరైనదనిపిస్తే అదే చేస్తారు.—1 కొరింథీయులు 2:14; గలతీయులు 5:19, 20.
క్రైస్తవ ఆలోచనా విధానం ఉన్న వాళ్లయితే, దేవుని ప్రమాణాలను విలువైనవిగా ఎంచుతారు. వాళ్లు యెహోవా దేవుణ్ణి తమ స్నేహితునిగా చూస్తారు, ఆయన లక్షణాలను ఎఫెసీయులు 5:1) కాబట్టి, వాళ్లు ఇతరులతో ప్రేమగా, దయగా, మృదువుగా వ్యవహరిస్తారు. (నిర్గమకాండము 34:6) దేవునికి లోబడడం కష్టమనిపించే సమయాల్లో కూడా ఆయనకు లోబడతారు. (కీర్తన 15:1, 4) కెనడావాసి డ్యారన్కు పెళ్లయి 35 ఏళ్లయింది. ఆయనిలా అంటున్నాడు: “నాకు తెలిసినంతవరకు, క్రైస్తవ ఆలోచనా విధానం ఉన్న వ్యక్తి ఎల్లప్పుడు తన మాటలు, ప్రవర్తన దేవునితో తనకున్న స్నేహాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచిస్తాడు.” ఆయన భార్య జేన్ తన ఆలోచన గురించి ఇలా చెబుతోంది: “క్రైస్తవ ఆలోచనా విధానం ఉన్న స్త్రీ, దేవుని ఆత్మ ఫలంలోని లక్షణాలను తన వ్యక్తిత్వంలో భాగంగా చేసుకోవడానికి ప్రతీరోజు ప్రయాసపడుతుంది.”—గలతీయులు 5:22, 23.
అనుకరించడానికి కృషిచేస్తారు. (అయితే, వివాహితులే క్రైస్తవ ఆలోచనా విధానాన్ని వృద్ధి చేసుకోవాలనేమీ లేదు. నిజానికి, దేవుని గురించి నేర్చుకుని ఆయనను అనుకరించాల్సిన బాధ్యత ప్రతీ వ్యక్తికి ఉందని బైబిలు బోధిస్తోంది.—అపొస్తలుల కార్యములు 17:26, 27.
దంపతులుగా క్రైస్తవ ఆలోచనా విధానాన్ని ఎందుకు వృద్ధిచేసుకోవాలి?
మరైతే, క్రైస్తవ ఆలోచనా విధానాన్ని వృద్ధిచేసుకోవడానికి భార్యాభర్తలు కలిసి ఎందుకు కృషిచేయాలి? ఈ ఉదాహరణను గమనించండి: ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక తోటను కొనుక్కున్నారు. వాళ్లు దానిలో కూరగాయలు పండించాలనుకుంటారు. ఒక వ్యక్తి, సంవత్సరంలోని ఫలానా సమయంలో విత్తనాలు నాటాలనుకుంటాడు, ఇంకొక వ్యక్తి వాటిని తర్వాత నాటాలనుకుంటాడు. మొదటి వ్యక్తి ఒక ప్రత్యేక రకమైన ఎరువు వేయాలనుకుంటాడు, రెండో వ్యక్తి అసలు మొక్కలకు ఎరువే అవసరం లేదనుకొని ససేమిరా వద్దంటాడు. మొదటి వ్యక్తి ప్రతీరోజు తోటలో పనిచేయాలనుకుంటాడు, రెండో వ్యక్తి పనిచేయకుండానే పంట కోసం ఎదురుచూడాలని అనుకుంటాడు. అలాంటి పరిస్థితిలో, ఎంతోకొంత పంటైతే వాళ్ల చేతికి వస్తుంది. కానీ తాము చేయాల్సిన పనుల విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి, ఆ లక్ష్యాలను సాధించడానికి కలిసి కృషిచేస్తే వచ్చేంత పంట మాత్రం రాదు.
భార్యాభర్తల విషయంలో కూడా అంతే. ఇద్దరిలో ఒక్కరే క్రైస్తవ లక్షణాలు వృద్ధి చేసుకున్నా వాళ్ల బంధం బలపడవచ్చు. (1 పేతురు 3:1, 2) కానీ, దేవుని ప్రమాణాల ప్రకారం జీవించే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఉండి, దేవుని సేవలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడానికి కష్టపడి పనిచేస్తే ఇంకెంత ప్రయోజనం పొందుతారో కదా! జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా రాశాడు: “ఒకరికంటె ఇద్దరు మెరుగు. ఇద్దరు కలిసి పనిచేస్తే, తాము చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం పొందుతారు. ఒకడు పడిపోతే రెండోవాడు అతనికి సహాయం చెయ్యగలుగుతాడు.”—ప్రసంగి 4:9, 10, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
మీ వివాహజతతో కలిసి క్రైస్తవ లక్షణాలు వృద్ధి చేసుకోవాలని మీరు కోరుకుంటుండవచ్చు. అయితే, పై ఉదాహరణలో చూసినట్లు, కేవలం కోరిక ఉంటేనే సరిపోదు. ఈ విషయంలో మీకు ఎదురుకాగల రెండు సవాళ్లేమిటో, వాటినెలా అధిగమించవచ్చో పరిశీలించండి.
మొదటి సవాలు: మాకు సమయం చాలడం లేదు.
ఈ మధ్యే పెళ్లయిన శ్రావణి ఇలా అంటోంది: “మావారు సాయంత్రం ఏడింటికి నన్ను పనినుండి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికొచ్చేసరికి చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. శరీరానికి మనసుకు మధ్య సంఘర్షణ జరుగుతుంది. మా మనసులేమో దేవుని గురించి కలిసి నేర్చుకోవడానికి సమయం వెచ్చించాలని చెబుతాయి, కానీ శరీరాలు మాత్రం విశ్రాంతి కోసం పరితపిస్తాయి.”
ఒక పరిష్కారం: పరిస్థితికి తగ్గట్టు మారడానికి సిద్ధంగా ఉండండి, ఒకరికొకరు సహకరించుకోండి. శ్రావణి ఇలా అంటోంది: “పెందలకడ లేవాలని, ఉద్యోగానికి వెళ్లేముందు ఇద్దరం కలిసి బైబిల్లోని కొంతభాగం చదివి, చర్చించాలని మేము నిర్ణయించుకున్నాం. అంతేకాదు, మావారు ఇంటిపనుల్లో నాకు సహాయం చేయడంవల్ల ఆయనతో కొంత సమయం గడపగలుగుతున్నాను.” ఈ విధంగా అదనపు కృషిచేయడం వల్ల వచ్చే ప్రయోజనాలేమిటి? శ్రావణి వాళ్లాయన రాకేష్ ఇలా అంటున్నాడు: “నేనూ మా ఆవిడా కలిసి క్రమంగా దేవుని విషయాల గురించి చర్చించినప్పుడు, సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతున్నామని, ఆందోళనలను తగ్గించుకోగలుగుతున్నామని నేను గమనించాను.”
కలిసి మాట్లాడుకోవడానికే కాకుండా, కలిసి ప్రార్థించడానికి కూడా ప్రతీరోజు కొన్ని నిమిషాలు వెచ్చించడం చాలా ముఖ్యం. దానివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? పెళ్లయి 16 ఏళ్లయిన భాస్కర్ ఇలా అంటున్నాడు: “కొంతకాలం క్రితం, నాకూ నా భార్యకూ మధ్య పెద్ద సమస్య వచ్చింది. అయితే, మా బాధలను దేవునికి చెప్పుకోవడానికి ప్రతీరోజు కొంత సమయం కేటాయించేవాళ్లం. అలా కలిసి ప్రార్థించడం వల్లే మేము మా సమస్యలను పరిష్కరించుకోగలిగామని, వివాహ జీవితాన్ని మునుపటిలా ఆనందించగలుగుతున్నామని నాకనిపిస్తుంది.”
ఇలా చేసి చూడండి: ప్రతీరోజు రాత్రి కొన్ని నిమిషాలు వెచ్చించి, ఆ రోజు మీకు ఏ మేలులు జరిగాయో, వేటి గురించి దేవునికి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నారో చర్చించుకోండి. సహించడానికి, వీలైతే పరిష్కరించుకోవడానికి దేవుని సహాయం ఎంతగానో
అవసరమయ్యే సమస్యల గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోండి. అయితే ఈ విషయంలో జాగ్రత్త వహించండి: మీ జతలోని లోపాలను ఎత్తిచూపించడానికి దాన్నొక అవకాశంగా తీసుకోకండి. మీరు కలిసి ప్రార్థిస్తున్నప్పుడు, ఇద్దరూ మెరుగుపర్చుకోవాల్సిన విషయాల గురించే ప్రస్తావించండి. తర్వాతి రోజు, మీరు వేటి గురించైతే ప్రార్థించారో వాటిని మెరుగుపర్చుకునే దిశగా కృషిచేయండి.రెండవ సవాలు: మా సామర్థ్యాలు వేరు.
“పుస్తకాలు చదవడమంటే నాకిష్టం లేదు” అని నవీన్ అంటున్నాడు. ఆయన భార్య నమ్రత ఇలా అంటోంది: “చదవడమన్నా, నేర్చుకున్నవాటి గురించి ఇతరులకు చెప్పడమన్నా నాకెంతో ఇష్టం. మేము బైబిలు ఆధారిత ప్రచురణల నుండి చర్చిస్తున్నప్పుడు మావారు నావల్ల కొద్దిగా జంకుతున్నారని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది.”
ఒక పరిష్కారం: పోటీపడకుండా, విమర్శించుకోకుండా ఒకరికొకరు సహకరించుకోండి. మీ జత చేసే ఏయే పనులను మీరు ఇష్టపడతారో తనకు చెప్పండి. ఎప్పుడూ యెహోవా దృష్టిలో సరైనదే చేయాలన్న కృతనిశ్చయంతో ఉండమని ప్రోత్సహించండి. నవీన్ ఇలా అంటున్నాడు: “కొన్నిసార్లు, బైబిలు అంశాలను చర్చించే విషయంలో నా భార్య చూపించే అత్యుత్సాహం వల్ల నాకు కొంత ఇబ్బందిగా అనిపించేది. గతంలో దేవుని విషయాల గురించి తనతో మాట్లాడడానికి కొద్దిగా వెనకాడేవాణ్ణి. కానీ నమ్రత నాకు ఎంతో సహకరిస్తుంది. ఇప్పుడు మేమిద్దరం కలిసి క్రమంగా దేవుని గురించిన విషయాలను చర్చిస్తాం, ఈ విషయంలో భయపడాల్సిందేమీ లేదని నాకు అర్థమైంది. ఇలాంటి విషయాల గురించి తనతో మాట్లాడడమంటే ఇప్పుడు నాకు ఇష్టం. అంతేకాదు మేమెంతో హాయిగా, ప్రశాంతంగా ఉన్నాం.”
బైబిలు చదవడానికి, అధ్యయనం చేయడానికి ప్రతీవారం కొంత సమయం వెచ్చించడం వల్ల తమ బంధం బలపడుతోందని చాలామంది దంపతులు గమనించారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి: మీరు లేఖనాల్లో ఏదైనా సలహా చదివినప్పుడు, వాటిని మీ జత ఎలా పాటించవచ్చని కాకుండా మీరెలా పాటించవచ్చని ఆలోచించండి. (గలతీయులు 6:4) మీ వివాహానికి సంబంధించిన ఏవైనా విషయాలు గొడవకు దారితీస్తాయనుకుంటే వాటిని అధ్యయనమప్పుడు కాకుండా వేరే సమయంలో చర్చించండి. ఎందుకు?
ఉదాహరణకు, చీము కారుతున్న గాయానికి కట్టుకట్టడానికి, మీరు కుటుంబమంతా కలిసి భోజనం చేసే సమయాన్ని ఎంచుకుంటారా? అస్సలు ఎంచుకోరు. అలాచేస్తే, అక్కడున్న వాళ్లందరి ఆకలి చచ్చిపోతుంది. దేవుని గురించి నేర్చుకోవడాన్ని, ఆయన చిత్తం చేయడాన్ని యేసు ఆహారం తినడంతో పోల్చాడు. (మత్తయి 4:4; యోహాను 4:34) మీరు బైబిలు తెరిచిన ప్రతీసారి మానసిక గాయాల గురించే మాట్లాడితే దేవుని విషయాలు తెలుసుకోవాలని మీ భాగస్వామికున్న కోరిక చచ్చిపోతుంది. సమస్యల గురించి మాట్లాడుకోవడం అవసరమే. అయితే, వాటికి కేటాయించిన సమయంలోనే వాటిని చర్చించండి.—సామెతలు 10:19; 15:23.
ఇలా చేసి చూడండి: మీ భాగస్వామిలో మీకెంతో నచ్చే రెండుమూడు లక్షణాలను రాసిపెట్టుకోండి. తర్వాత, బైబిలు అధ్యయనంలో ఆ లక్షణాల గురించి చర్చిస్తున్నప్పుడు, తను వాటిని చూపించే పద్ధతిని మీరెంతగా ఇష్టపడతారో చెప్పండి.
మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు
మీరు దంపతులుగా క్రైస్తవ ఆలోచనా విధానాన్ని వృద్ధి చేసుకుంటే ముందుముందు మరింత ప్రశాంతమైన, సంతోషకరమైన వివాహ జీవితాన్ని అనుభవిస్తారు. నిజానికి, ‘మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు’ అని దేవుని వాక్యం హామీ ఇస్తోంది.—గలతీయులు 6:7.
బైబిల్లోని ఆ మాటలు ఎంత వాస్తవమో, ఈ ఆర్టికల్ మొదట్లో చెప్పుకున్న ప్రసాద్, శాంత దంపతులు గ్రహించారు. వాళ్ల పెళ్లయి ఇప్పటికి 45 ఏళ్లయింది. క్రైస్తవ లక్షణాలను వృద్ధిచేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించడం వల్ల వాళ్లు ఎంతో ప్రయోజనం పొందారు. ప్రసాద్ ఇలా అంటున్నాడు: “నా భార్య సరిగ్గా మాట్లాడదని తనను ఎప్పుడూ తప్పుపట్టేవాణ్ణి. కానీ, నేను కూడా మారాల్సిన అవసరముందని తర్వాత్తర్వాత అర్థంచేసుకున్నాను.” శాంత ఇలా అంటోంది: “కష్టాలు ఎదురైనప్పుడు, దేవుని పట్ల మా ఇద్దరికీ ఉన్న ప్రేమవల్లే వాటిని అధిగమించగలిగాం. గడిచిన సంవత్సరాలన్నిటిలో మేము క్రమంగా కలిసి అధ్యయనం చేశాం, కలిసి ప్రార్థించాం. మావారు క్రైస్తవ లక్షణాలను ఇంకా చక్కగా చూపించడానికి కృషి చేస్తున్నారు, దాంతో నేను ఆయనను ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాను.” (w11-E 11/01)
a అసలు పేర్లు కావు.
ఇలా ప్రశ్నించుకోండి . . .
-
ఈ మధ్యకాలంలో మేము ఎప్పుడు కలిసి ప్రార్థించాం?
-
దేవుని విషయాల గురించి నాతో చర్చించడానికి నా భాగస్వామి మరింత సుముఖంగా ఉండాలంటే నేనేమి చేయాలి?