కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రవచనాల అర్థాన్ని ఎవరు తెలియజేయగలరు?

ప్రవచనాల అర్థాన్ని ఎవరు తెలియజేయగలరు?

ప్రవచనాల అర్థాన్ని ఎవరు తెలియజేయగలరు?

అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ కాలంలో గార్డీయన్‌ నాట్‌ అనేది అత్యంత కష్టమైన చిక్కుముడి అని అనుకునేవాళ్లు. దాన్ని విప్పినవాళ్లు జ్ఞానవంతులని, ఎన్నో రాజ్యాలను జయిస్తారని ప్రజలు నమ్మేవాళ్లు. * అయితే, అలెగ్జాండర్‌ తన కత్తి దూసి ఒకే ఒక్క దెబ్బతో దాన్ని తెంచేశాడని ఆ పురాణం చెబుతోంది.

ఎన్నో శతాబ్దాలుగా జ్ఞానులు, కష్టమైన ముడులను, పొడుపు కథలను విప్పడానికి, ప్రవచనాల అర్థాన్ని తెలియజేయడానికి, చివరకు భవిష్యత్తు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.

అయితే చాలా సందర్భాల్లో, వాటిని పరిష్కరించడం వారివల్ల కాలేదు. ఉదాహరణకు, బబులోనులోని జ్ఞానులనే తీసుకోండి. బెల్షస్సరు రాజు ఏర్పాటు చేసిన ఒక గొప్ప విందులో, గోడ మీద అద్భుతరీతిలో కనిపించిన చేతిరాతకు వారు అర్థం వివరించలేకపోయారు. యెహోవా దేవుని వృద్ధ ప్రవక్త దానియేలు మాత్రమే ఆ ప్రవచన సందేశపు అర్థాన్ని వివరించగలిగాడు. ఆయనకు, ‘ముడులను విప్పేవాడు’ అనే మంచిపేరు ఉండేది. (దానియేలు 5:12, NW) బబులోను సామ్రాజ్యం పతనమౌతుందని చెప్పిన ఆ ప్రవచనం అదే రాత్రి నెరవేరింది!—దానియేలు 5:1, 4-8, 25-30.

ప్రవచనం అంటే ఏమిటి?

ప్రవచనం అంటే భవిష్యత్తును తెలియజేయడం, జరగబోయే సంఘటనలను ముందే రాయడం. దేవుని ప్రేరేపిత సందేశమే నిజమైన ప్రవచనం. అది దేవుని చిత్తాన్ని, ఉద్దేశాన్ని వెల్లడిచేస్తుంది. అది రాతల్లోగానీ మాటల్లోగానీ ఉండవచ్చు. మెస్సీయ గురించిన, “ఈ యుగసమాప్తి” గురించిన ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి, అలాగే దేవుని తీర్పు సందేశాలు కూడా ఉన్నాయి.—మత్తయి 24:3; దానియేలు 9:25.

విజ్ఞానశాస్త్రం, ఆర్థికశాస్త్రం, ఆరోగ్యం, రాజకీయం, పర్యావరణం వంటి ఎన్నో రంగాల్లో ప్రవీణులైన నేటి “జ్ఞానులు” భవిష్యత్తు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లు చెప్పిన అలాంటి విషయాలెన్నో ప్రసారమాధ్యమాల ద్వారా ఎక్కువమంది ప్రజలకు చేరుతున్నాయి, ప్రజలు కూడా వాటిని ఆసక్తిగా వింటున్నారు. కానీ అవి, జ్ఞానులు తమకున్న కాస్తోకూస్తో అనుభవంతో చేసే ఊహాగానాలు, వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. అంతేకాదు, వాళ్లు చెప్పే ప్రతీ అభిప్రాయానికి ఇతరుల నుండి ఎంతో వ్యతిరేకత, ఎన్నో ప్రతికూల వాదనలు తప్పకుండా ఎదురౌతాయి. నిజానికి, భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ఎవరూ తెలుసుకోలేరు కాబట్టి దాని గురించి చెప్పడం కత్తిమీద సాములాంటిదే!

నిజమైన ప్రవచనానికి మూలం

నిజమైన ప్రవచనాలకు మూలం ఎవరు? వాటికి అర్థం ఎవరు చెప్పగలుగుతారు? ‘ఒకడు తన ఊహనుబట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనమూ పుట్టదు’ అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (2 పేతురు 1:20) “ఊహను బట్టి చెప్పడం” అని అనువదించబడిన గ్రీకు పదానికి “పరిష్కారం, వెల్లడిచేయడం” అనే అర్థాలున్నాయి, అది అక్షరార్థంగా “వదులుచేయడం లేదా విడుదల చేయడం” అనే అర్థమున్న క్రియాపదం నుండి వచ్చింది. అందుకే ఒక బైబిలు దీన్ని “వదులుచేయడం” అని అనువదించింది.

ఒక నావికుడు తన పడవను దేనికైనా కడుతున్నట్లు ఊహించుకోండి. ఆయన తాడుతో నేర్పుగా క్లిష్టమైన ముడి వేస్తాడు. అయితే నైపుణ్యంలేని ఒక వ్యక్తి ఆ ముడిని చూసినప్పుడు తాడు మెలికలు తిరిగివుండడం గమనించగలుగుతాడు కానీ దాన్ని ఎలా విప్పాలో అతనికి తెలియదు. అలాగే క్లిష్టమైన సమస్యలకు కొన్ని కారణాలను ప్రజలు చూడగలుగుతారు, కానీ భవిష్యత్తు ఖచ్చితంగా ఎలా మారుతుందో వాళ్లకు తెలియదు.

ప్రాచీనకాలంలోని దేవుని ప్రవక్తలు అంటే దానియేలు వంటివాళ్లు తమ కాలంలోని పరిస్థితులను వ్యక్తిగతంగా పరిశీలించి ఆ తర్వాత భవిష్యత్తు గురించి ప్రవచించాలని చూడలేదు. వాళ్లు తాము ప్రవచించినదానికి తగినట్లు భవిష్యత్తును మలచడానికి ప్రయత్నించి ఉంటే అది దేవుని నుండి వచ్చిన ప్రవచనం కాదని చెప్పవచ్చు. అది మానవుల ఊహను బట్టి చెప్పినది, దానికి సరైన ఆధారం లేదు. అయితే, పేతురు ఇంకా ఇలా చెప్పాడు: ‘ప్రవచనం ఎప్పుడూ మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు.’—2 పేతురు 1:21.

‘భావాలు చెప్పడం దేవుని అధీనంలో’ ఉంది

దాదాపు 3,700 సంవత్సరాల క్రితం ఐగుప్తులో ఇద్దరు వ్యక్తులను ఒక చెరసాలలో వేశారు. ఇద్దరూ విచిత్రమైన కలలు కన్నారు. ఆ దేశంలోని జ్ఞానులతో సంప్రదించే అవకాశం వాళ్లకు లేదు కాబట్టి వాళ్లు తమ ఆందోళనను తమ తోటి ఖైదీ అయిన యోసేపుతో చెప్పుకుంటూ ఇలా అన్నారు: ‘మేము కలలు కన్నాం. వాటి భావం చెప్పగలవాళ్లెవరూ లేరు.’ అప్పుడు ఆ దేవుని సేవకుడు, ‘భావాలు చెప్పడం దేవుని అధీనమే గదా’ అంటూ తమ కలలేమిటో చెప్పమన్నాడు. (ఆదికాండము 40:8) నైపుణ్యంగల నావికుడు క్లిష్టమైన ముడులను విప్పగలిగినట్లే ప్రవచనాల అర్థాన్ని యెహోవా దేవుడు మాత్రమే వివరించగలడు. నిజానికి, ఆ ప్రవచనాలను ముడి వేసింది ఆయనే. కాబట్టి ఆయన విప్పితేనే వాటి అర్థాన్ని తెలుసుకోగలుగుతాం. అవును, యోసేపు దేవునికి ఘనత ఇవ్వడం సరైనదే.

మరి ‘భావాలు చెప్పడం దేవుని అధీనంలో’ ఉందని ఎందుకు చెప్పవచ్చు? అలా చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్ని బైబిలు ప్రవచనాల విషయానికొస్తే, ప్రవచనాలే కాదు అవి ఎలా నెరవేరాయో కూడా రాయబడ్డాయి. మిగతా వాటితో పోలిస్తే, ఇలాంటి ప్రవచనాలను అర్థంచేసుకోవడం సులువే. ఇవి నావికుడు ఎలా విప్పాలో చెప్పిన ముడులలాంటివి.—ఆదికాండము 18:14; 21:2.

ఇతర ప్రవచనాలను, వాటి సందర్భాన్ని పరిశీలిస్తే అర్థంచేసుకోవచ్చు లేదా వివరించవచ్చు. దానియేలు ప్రవక్తకు ఒక ప్రవచనార్థక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో, ‘రెండు కన్నుల మధ్య పెద్ద కొమ్ము’ ఉన్న ‘బొచ్చుగల మేకపోతు’ ‘రెండు కొమ్ములుగల పొట్టేలును’ కిందపడవేయడం ఆయన చూశాడు. ఆ సందర్భాన్ని పరిశీలిస్తే, రెండు కొమ్ములుగల పొట్టేలు ‘మాదీయుల, పారసీకుల రాజులను’ సూచించిందని, ఆ మేకపోతు, ‘గ్రేకుల రాజును’ సూచించిందని తెలుస్తుంది. (దానియేలు 8:3-8, 20-22) 200 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత “పెద్దకొమ్ము” అంటే అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ పారసీక రాజ్యాన్ని జయించడం మొదలుపెట్టాడు. అలెగ్జాండర్‌ యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనకు ఆ ప్రవచనాన్ని చూపించారనీ, అది తననే సూచించిందని ఆయన నమ్మాడనీ యూదా చరిత్రకారుడైన జోసిఫస్‌ రాశాడు.

‘భావాలు చెప్పడం దేవుని అధీనంలో’ ఉందని చెప్పడానికి ఇంకో కారణం ఉంది. యెహోవా దేవుని సేవకుడైన యోసేపు పరిశుద్ధాత్మ సహాయంతో, తన తోటి ఖైదీలు చెప్పిన క్లిష్టమైన కలల భావాలను అర్థంచేసుకోగలిగాడు. (ఆదికాండము 41:38) కొన్ని ప్రవచనాల అర్థం ఏమిటో ఖచ్చితంగా తెలియనప్పుడు నేటి దేవుని సేవకులు ఆయన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తారు, తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు, పరిశోధిస్తారు. దేవుని నిర్దేశంతో వాళ్లు కొన్ని ప్రవచనాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే లేఖనాలను కనుగొంటారు. అంతేకానీ ఏ మానవుడూ తన సొంత సామర్థ్యంతో ప్రవచనాల అర్థాన్ని వివరించలేడు. తన పరిశుద్ధాత్మ ద్వారా, తన వాక్యం ద్వారా ప్రవచనాల అర్థాన్ని దేవుడే తేటతెల్లం చేస్తాడు. ఆయన దీన్ని, భవిష్యత్తు గురించి చెప్పే మనుషుల ద్వారా కాకుండా బైబిలు ద్వారానే చేస్తాడు.—అపొస్తలుల కార్యములు 15:12-21.

‘భావాలు చెప్పడం దేవుని అధీనంలో’ ఉందని చెప్పడానికి మరో కారణం, ఒక ప్రవచనం భూమ్మీదున్న తన నమ్మకమైన సేవకులకు ఎప్పుడు అర్థమయ్యేలా చేయాలనేది ఆయనే నిర్ణయిస్తాడు, నిర్దేశిస్తాడు. ప్రవచనం అర్థాన్ని ఎప్పుడైనా అంటే అది నెరవేరక ముందుగానీ నెరవేరే సమయంలోగానీ నెరవేరిన తర్వాతగానీ తెలుసుకుంటాం. ప్రవచనాలను ముడివేసింది దేవుడే కాబట్టి ఆయన వాటిని సరైన సమయంలో అదీ తను అనుకున్న సమయంలో విప్పుతాడు.

యోసేపు, ఇద్దరు ఖైదీల వృత్తాంతంలోనైతే కలలు నెరవేరడానికి మూడు రోజుల ముందు యోసేపు వాటి అర్థాన్ని తెలియజేశాడు. (ఆదికాండము 40:13, 19) ఆ తర్వాత, శక్తివంతుడైన ఫరో కలల అర్థాన్ని వివరించడానికి యోసేపును పిలిపించినప్పుడు సస్యసమృద్ధి ఉండే ఏడు సంవత్సరాలు ఆరంభం కావచ్చాయి. దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో యోసేపు ఫరో కలల అర్థాన్ని వివరించాడు, దాంతో సమృద్ధిగా పంటలు పండినప్పుడు వాటిని సమకూర్చడానికి ఏర్పాట్లు చేయడం వీలైంది.—ఆదికాండము 41:29, 39, 40.

మరికొన్ని ప్రవచనాలనైతే, అవి నెరవేరిన తర్వాతే దేవుని సేవకులు వాటిని పూర్తిగా అర్థంచేసుకుంటారు. యేసు జీవితంలో జరిగే ఎన్నో సంఘటనల గురించి ఆయన పుట్టడానికి ఎన్నో శతాబ్దాల ముందే ప్రవచించబడింది, కానీ యేసు పునరుత్థానమయ్యాకే శిష్యులు వాటిని పూర్తిగా అర్థంచేసుకున్నారు. (కీర్తన 22:18; 34:20; యోహాను 19:24, 36) అయితే దానియేలు 12:4 ప్రకారం, ఇంకొన్ని ప్రవచనాలు ‘తెలివి అధికమయ్యే’ కాలం వరకు అంటే ‘అంత్యకాలం వరకు ముద్రించబడ్డాయి.’ ఆ ప్రవచనాలు మన కాలంలో నెరవేరుతున్నాయి. *

బైబిలు ప్రవచనాలు, మీరు

యోసేపు, దానియేలు తమ కాలంలోని రాజుల ముందు నిలబడి ప్రజలకు, రాజ్యాలకు సంబంధించిన ప్రవచన సందేశాలను వినిపించారు. అలాగే మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు, ప్రవచించే దేవుడైన యెహోవాకు ప్రతినిధులుగా ప్రజల ముందుకు వెళ్లారు, తమ సందేశాన్ని విన్నవాళ్లకు గొప్ప లాభం చేకూర్చారు.

నేడు యెహోవాసాక్షులు ప్రపంచమంతటా ప్రవచన సందేశమైన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు, “యుగసమాప్తి” గురించి యేసు చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేరుతోందని చెబుతున్నారు. (మత్తయి 24:3, 14) ఆ ప్రవచనం ఏమిటో, అది మీపై ఎలా ప్రభావం చూపిస్తుందో మీకు తెలుసా? బైబిల్లోని అత్యంత గొప్ప ప్రవచనాల్లో ఒకటైన దీన్ని అర్థం చేసుకునేలా, దీన్నుండి ప్రయోజనం పొందేలా మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు ఎంతో సంతోషిస్తారు. (w11-E 12/01)

[అధస్సూచీలు]

^ పేరా 2 ఫ్రుగియ రాజధాని గార్డీయమ్‌. ఆ పట్టణాన్ని స్థాపించిన గార్డీయస్‌ రథాన్ని చిక్కుముడితో ఒక స్తంభానికి కట్టేశారని, ఆసియా అంతటినీ పరిపాలించబోయే వ్యక్తి మాత్రమే దాన్ని విప్పగలుగుతాడని గ్రీకు పురాణం చెబుతోంది.

^ పేరా 19 కావలికోట (ఆంగ్లం) మే 1, 2011 సంచికలోని “నేడు నెరవేరుతున్న ఆరు బైబిలు ప్రవచనాలు” అనే ముఖపత్ర శీర్షికలు చూడండి.

[12, 13 పేజీల్లోని చిత్రాలు]

ప్రవచనాల అర్థాన్ని వివరిస్తున్నప్పుడు యోసేపు, దానియేలు ఇద్దరూ దేవునికి ఘనతనిచ్చారు