కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెక్స్‌కి సంబంధించిన పది ప్రశ్నలకు సమాధానాలు

సెక్స్‌కి సంబంధించిన పది ప్రశ్నలకు సమాధానాలు

సెక్స్‌కి సంబంధించిన పది ప్రశ్నలకు సమాధానాలు

1 ఏదెను తోటలో ఆదాముహవ్వలు చేసిన మొట్టమొదటి పాపం సెక్సేనా?

▪ సమాధానం: ఏదెను తోటలో, దేవుడు తినవద్దన్న పండు లైంగిక సంబంధాలను సూచిస్తోందని చాలామంది అనుకుంటారు. కానీ, బైబిల్లో అలా లేదు.

దీన్ని పరిశీలించండి: హవ్వను సృష్టించకముందే, “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు” అని దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు. (ఆదికాండము 2:15-18) ఆ సమయానికి దేవుడు ఇంకా హవ్వను సృష్టించలేదు కాబట్టి ఆ ఆజ్ఞ లైంగిక సంబంధాలను సూచించడం లేదని చెప్పవచ్చు. అంతేకాదు, దేవుడు ఆదాముహవ్వలకు ఈ స్పష్టమైన ఆజ్ఞ కూడా ఇచ్చాడు: ‘మీరు ఫలించి, అభివృద్ధిపొంది, విస్తరించి భూమిని నిండించండి.’ (ఆదికాండము 1:28) అలా జరగాలంటే వాళ్లిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉండాలి. మరి ప్రేమగల దేవుడు మొదటి దంపతులకు ‘భూమిని నిండించండి’ అని ముందు ఆజ్ఞాపించి, ఆ తర్వాత దాన్ని పాటించినందుకు వాళ్లకు మరణశిక్ష వేస్తాడా?—1 యోహాను 4:8.

అదీగాక, తన భర్త తనతో లేనప్పుడు హవ్వ ‘దాని [నిషేధించబడిన] ఫలాల్లో కొన్ని తీసుకొని తిన్నది.’ ఆ తర్వాత, ‘తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు.’—ఆదికాండము 3:6.

ఆదాముహవ్వలు లైంగిక సంబంధం వల్ల పిల్లలను కన్నప్పుడు దేవుడు వాళ్లనేమీ గద్దించలేదు. (ఆదికాండము 4:1, 2) కాబట్టి, ఆదాముహవ్వలు తిన్న పండు లైంగిక సంబంధాలను సూచించడం లేదని, అది ఒక చెట్టుకు కాసిన మామూలు పండేనని తెలుస్తోంది.

2 లైంగిక సుఖం అనుభవించడం బైబిలు ప్రకారం తప్పా?

▪ సమాధానం: దేవుడే మనుషులను ‘స్త్రీనిగా, పురుషునిగా సృజించాడు’ అని బైబిల్లోని మొదటి పుస్తకం చెబుతోంది. తను చేసిన సృష్టి ‘చాలా మంచిగా’ ఉందని కూడా దేవుడు చెప్పాడు. (ఆదికాండము 1:27, 31) ఆ తర్వాత, ‘నీ యౌవనకాలపు భార్యతో సంతోషించు. ఆమె రొమ్ములవల్ల ఎల్లప్పుడు తృప్తిపొందుతూ ఉండు’ అని భర్తలకు ఉపదేశించమని దేవుడు ఒక బైబిలు రచయితను ప్రేరేపించాడు. (సామెతలు 5:18, 19) ఈ మాటలను బట్టి, లైంగిక సుఖం అనుభవించడాన్ని బైబిలు ఖండిస్తోందని మీకు అనిపిస్తోందా?

లైంగిక అవయవాలను, పిల్లలను కనే విధంగా మాత్రమే కాదుగానీ భార్యాభర్తలిద్దరూ ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలు వ్యక్తం చేసుకుంటూ, సుఖం అనుభవించే విధంగా దేవుడు తయారుచేశాడు. అలా ఒకరికొకరు ప్రేమతో దగ్గరవడం వల్ల భార్యాభర్తలిద్దరి శారీరక, భావోద్వేగ అవసరాలు కూడా తీరతాయి.

3 చట్టబద్ధంగా వివాహం చేసుకోకుండానే స్త్రీపురుషులు సహజీవనం సాగించడం గురించి బైబిలు ఏమి చెబుతోంది?

▪ సమాధానం: ‘జారత్వం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు’ అని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (హెబ్రీయులు 13:4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) జారత్వం అని అనువదించబడిన పోర్నియా అనే గ్రీకు పదానికి విస్తృతార్థం ఉంది. దంపతులుకాని వాళ్లు తమ లైంగిక అవయవాలను దురుపయోగం చేయడాన్ని అది సూచిస్తుంది. * కాబట్టి, ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వాళ్లు పెళ్లికాకుండా సహజీవనం చేయడం దేవుని దృష్టిలో తప్పు.

ఒక అమ్మాయి, ఒక అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నా, పెళ్లి చేసుకున్న తర్వాతే వాళ్ల మధ్య లైంగిక సంబంధం ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ప్రేమించే సామర్థ్యంతో దేవుడే మనల్ని సృష్టించాడు. ప్రేమ దేవుని ప్రధాన లక్షణం. కాబట్టి, భార్యాభర్తల మధ్య మాత్రమే లైంగిక సంబంధం ఉండాలని చెప్పడానికి ఆయనకు మంచి కారణమే ఉంది.

4 ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకోవచ్చా?

▪ సమాధానం: దేవుడు కొంతకాలంపాటు బహుభార్యాత్వాన్ని అనుమతించాడు. (ఆదికాండము 4:19; 16:1-4; 29:18–30:24) కానీ ఆయన దాన్ని ఏర్పాటు చేయలేదు. ఆదాముకు ఆయన ఒకే భార్యను ఇచ్చాడు.

ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండాలన్న తన మొదటి ప్రమాణాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు తిరిగి స్థాపించాడు. (యోహాను 8:28) వివాహం గురించి కొందరు తనను ప్రశ్నించినప్పుడు యేసు ఇలా చెప్పాడు: ‘సృజించినవాడు ఆదినుండి వారిని పురుషుడిగా, స్త్రీగా సృజించాడు. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏకశరీరంగా ఉంటారని [దేవుడు] చెప్పాడు.’—మత్తయి 19:4, 5.

ఆ తర్వాత యేసు శిష్యుల్లో ఒకరు దేవుని ప్రేరణతో ఇలా రాశారు: ‘ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.’ (1 కొరింథీయులు 7:2) క్రైస్తవ సంఘంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించే ప్రతీ వివాహిత వ్యక్తి, “ఏకపత్నీ పురుషుడు” అయ్యుండాలని కూడా బైబిలు చెబుతోంది.—1 తిమోతి 3:2, 12.

5 దంపతులు గర్భనిరోధకాలను ఉపయోగించడం తప్పా?

▪ సమాధానం: తన అనుచరులు పిల్లలను కనాలనిగానీ కనకూడదనిగానీ యేసు ఆజ్ఞాపించలేదు. అలాగే, ఆయన తొలి శిష్యుల్లో ఎవరూ అలాంటి నిర్దేశాన్ని ఇవ్వలేదు. బైబిలు కూడా కుటుంబ నియంత్రణను సూటిగా ఖండించడం లేదు.

పిల్లలను కనాలా, వద్దా? ఒకవేళ కంటే, ఎంతమందిని కనాలి? ఎప్పుడు కనాలి? అనేవి నిర్ణయించుకునే స్వేచ్ఛ దంపతులకు ఉంది. గర్భస్రావం జరగకుండానే గర్భం రాకుండా చేసే గర్భనిరోధకాలు కొన్ని ఉంటాయి. దంపతులెవరైనా వాటిని ఉపయోగించాలనుకుంటే అది వాళ్ల వ్యక్తిగత విషయం, దానికి వాళ్లదే బాధ్యత. * వాళ్ల నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టకూడదు.—రోమీయులు 14:4, 10-13.

6 గర్భస్రావం చేయించుకోవడం తప్పా?

▪ సమాధానం: జీవం దేవుని దృష్టిలో పవిత్రమైంది. పిండాన్ని కూడా దేవుడు జీవమున్న వ్యక్తిగా చూస్తాడు. (కీర్తన 139:16) ఇంకా జన్మించని శిశువుకు హాని చేసే వ్యక్తి తనకు లెక్క ఒప్పజెప్పాలని దేవుడు అన్నాడు. కాబట్టి గర్భంలోవున్న శిశువును చంపడం దేవుని దృష్టిలో హత్యతో సమానం.—నిర్గమకాండము 20:13; 21:22, 23.

కొన్నిసార్లు, ప్రసవ సమయంలో తల్లీబిడ్డల్లో ఒకరిని మాత్రమే కాపాడగలమనే పరిస్థితే ఏర్పడితే అప్పుడేమిటి? అలాంటి సందర్భంలో, ఎవరిని కాపాడాలనేది దంపతులే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. *

7 విడాకులను బైబిలు అనుమతిస్తోందా?

▪ సమాధానం: అనుమతిస్తోంది. అయితే, ఒకే ఒక్క కారణంతో విడాకులు తీసుకోవచ్చని చెబుతూ యేసు ఇలా అన్నాడు: ‘వ్యభిచారం [వివాహేతర సంబంధం] నిమిత్తమే తప్ప తన భార్యను విడిచిపెట్టి మరియొకతెను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. విడిచిపెట్టబడినదాన్ని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.’—మత్తయి 19:9.

మోసంతో లేదా నమ్మకద్రోహంతో విడాకులు తీసుకోవడం దేవునికి అసహ్యం. చిన్నచిన్న కారణాలను బట్టి, ముఖ్యంగా ఇంకో వ్యక్తిని పెళ్లిచేసుకోవాలనే ఉద్దేశంతో విడాకులు తీసుకునే వాళ్లను దేవుడు లెక్క అడుగుతాడు.—మలాకీ 2:13-16; మార్కు 10:9.

8 సలింగ సంయోగాన్ని దేవుడు ఆమోదిస్తున్నాడా?

▪ సమాధానం: సలింగ సంయోగం కూడా జారత్వంలో భాగమే కాబట్టి బైబిలు స్పష్టంగా దాన్ని కూడా ఖండిస్తోంది. (రోమీయులు 1:26, 27; గలతీయులు 5:19-21) అలాంటి జీవన విధానాన్ని దేవుడు ఇష్టపడడం లేదని బైబిలు ఖచ్చితంగా చెబుతోంది. అయితే, ‘దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని మీద విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందేలా ఆయనను అనుగ్రహించాడు’ అని కూడా మనకు తెలుసు.—యోహాను 3:16.

నిజమైన క్రైస్తవులు సలింగ సంయోగాన్ని ఆమోదించరు, అయినా ప్రజలందరి పట్ల దయ చూపిస్తారు. (మత్తయి 7:12) దేవుడు, ‘అందర్నీ సన్మానించండి’ అని మనకు చెబుతున్నాడు. కాబట్టి నిజమైన క్రైస్తవులు సలింగ సంయోగులను అసహ్యించుకోరు.—1 పేతురు 2:17.

9 ఫోన్‌ సెక్స్‌, “సెక్స్‌టింగ్‌,” సైబర్‌ సెక్స్‌ తప్పా?

▪ సమాధానం: ఫోన్‌లో లైంగిక కోరికలను రేకెత్తించేలా మాట్లాడడం లేదా అలాంటి మాటలు వినడమే ఫోన్‌ సెక్స్‌. “సెక్స్‌టింగ్‌” అంటే రెచ్చగొట్టే అశ్లీల దృశ్యాలను, మెసేజ్‌లను సెల్‌ఫోన్‌లో ఇతరులకు పంపించడం. అదే, ఇంటర్నెట్‌ చాట్‌ రూమ్‌లలో శృంగార సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకుంటే దాన్ని సైబర్‌ సెక్స్‌ అంటారు.

ఇలాంటి ఆధునిక అలవాట్ల గురించి బైబిలు ప్రత్యేకంగా ఏమీ చెప్పడం లేదు. కానీ ‘మీలో జారత్వమేగాని, ఏ విధమైన అపవిత్రతేగాని, లోభత్వమేగాని, వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మీరు బూతులైనా, పోకిరి మాటలైనా, సరసోక్తులైనా ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు’ అని బైబిలు చెబుతోంది. (ఎఫెసీయులు 5:3, 4) ఫోన్‌ సెక్స్‌, “సెక్స్‌టింగ్‌,” సైబర్‌ సెక్స్‌ వంటివి సెక్స్‌ విషయంలో తప్పుడు అభిప్రాయం కలిగిస్తాయి, వివాహానికి ముందే లైంగిక సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకునేలా రెచ్చగొడతాయి. ప్రజల్లో కలిగే లైంగిక కోరికలను అదుపు చేయవుగాని వాటిని ఎలాగైనా తీర్చుకోవాలనే కోరికను రేకెత్తిస్తాయి.

10 హస్తప్రయోగం గురించి బైబిలు ఏమి చెబుతోంది?

▪ సమాధానం: హస్తప్రయోగం అంటే లైంగిక సుఖం కోసం మర్మాంగాలను స్వయంగా ప్రేరేపించుకోవడం. దాని గురించి బైబిలు ప్రత్యేకంగా ఏమీ చెప్పడం లేదు. అయితే క్రైస్తవులకు అది ఇలా ఆజ్ఞాపిస్తోంది: ‘భూమ్మీదున్న మీ అవయవాలను, అనగా జారత్వాన్ని, అపవిత్రతను, [అనుచితమైన] కామాతురతను చంపి వేయండి.’కొలొస్సయులు 3:5.

హస్తప్రయోగం అలవాటు ఉన్నవాళ్లు సెక్స్‌ విషయంలో స్వార్థపూరిత ధోరణి కలిగివుంటారు. తమ శరీర అవయవాలను దేవుడు ఉద్దేశించిన విధంగా కాకుండా తప్పుగా ఉపయోగిస్తారు. ఈ అలవాటును మానుకోవడానికి హృదయపూర్వకంగా కృషిచేసే వాళ్లకు దేవుడు “బలాధిక్యము” ఇవ్వగలడని బైబిలు మనకు అభయమిస్తోంది.—2 కొరింథీయులు 4:7; ఫిలిప్పీయులు 4:13. (w11-E 11/01)

[అధస్సూచీలు]

^ పేరా 11 పోర్నియా అనే పదం, లైంగిక అవయవాలను దేవుడు ఉద్దేశించినట్లు కాకుండా వేరే విధాలుగా ఉపయోగించడాన్ని సూచిస్తోంది. అక్రమ సంబంధం, సలింగ సంయోగం, జంతు సంయోగం వంటివి ఆ కోవలోకే వస్తాయి.

^ పేరా 19 పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకోవడం గురించి బైబిల్లో ఉన్న నిర్దేశాన్ని తెలుసుకోవడానికి దయచేసి కావలికోట జూన్‌ 15, 1999, 27-28 పేజీల్లోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.

^ పేరా 22 అత్యాచారానికి గురైన స్త్రీ గర్భస్రావం చేయించుకోవడంలో తప్పులేదా? అనే దాని గురించి తెలుసుకోవడానికి తేజరిల్లు! సెప్టెంబరు 8, 1993, 10-11 పేజీలు చూడండి. దీన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.