2012లో భూమి నాశనమౌతుందా?
మా పాఠకుల ప్రశ్న
2012లో భూమి నాశనమౌతుందా?
▪ “అంతం రాబోతుందని నమ్మిన చాలామంది ఒక ఫ్రెంచ్ గ్రామానికి వచ్చారు . . . ప్రాచీన మాయా క్యాలెండరులోని 5,125 ఏళ్ల సుదీర్ఘ కాలచక్రం ముగింపున, అంటే 2012 డిసెంబరు 21న, లోకం అంతమౌతుందని వాళ్ల నమ్మకం.”—బీబీసీ న్యూస్.
మతనాయకులు, శాస్త్రజ్ఞులమని చెప్పుకునేవాళ్లు, భవిష్యత్తు గురించి చెప్పే 21వ శతాబ్దానికి చెందిన మరితరులు లోకం అంతమౌతుందని చెప్పినా భూమి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అవును, 2012లో భూమి నాశనం కాదు. నిజం చెప్పాలంటే, ఆ సంవత్సరంలోనే కాదు ఆ తర్వాత కూడా భూగ్రహానికి ఏమీకాదు.
‘తరము వెంబడి తరము గతించి పోతుంది. భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిలిచి ఉంటుంది’ అని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 1:4) అంతేకాదు యెషయా 45:18 ఏమి చెబుతుందో చూడండి: ‘యెహోవా దేవుడు భూమిని కలుగజేసి, దాన్ని సిద్ధపరచి, స్థిరపరిచాడు. నిరాకారంగా ఉండేలా ఆయన దాన్ని సృజించలేదు, నివాసస్థలం అయ్యేలా దాన్ని సృజించాడు. ఆయన సెలవిచ్చేదేమిటంటే—యెహోవాను నేనే మరి ఏ దేవుడు లేడు.’
తన పాప మోములో ఆనందం చూడాలని ఎన్నో గంటలు కష్టపడి ఒక బొమ్మను తయారుచేసిన ప్రేమగల తండ్రి, పాపకు ఆ బొమ్మనిచ్చి వెంటనే దాన్ని నాశనం చేసేస్తాడా? అలాచేస్తే అది క్రూరత్వమే అవుతుంది! అలాగే, దేవుడు ఈ భూమిని ముఖ్యంగా మనుషుల ఆనందం కోసం సృష్టించాడు. ‘మీరు ఫలించి అభివృద్ధిపొంది, విస్తరించి, భూమిని నిండించి, దాన్ని లోపర్చుకోండి’ అని దేవుడు మొదటి మానవులైన ఆదాముహవ్వలకు చెప్పాడు. ఆ తర్వాత, ‘దేవుడు తాను చేసినదంతా చూసినప్పుడు, అది చాలా మంచిదిగా ఉండెను.’ (ఆదికాండము 1:27, 28, 31) భూమిపట్ల తనకున్న ఉద్దేశాన్ని దేవుడు మర్చిపోలేదు, ఆయన భూమిని నాశనం కానివ్వడు. తాను చేసిన వాగ్దానాల గురించి యెహోవా ఖచ్చితంగా ఇలా చెబుతున్నాడు: ‘నిష్ఫలముగా నాయొద్దకు మరలక నాకు అనుకూలమైనదానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.’—యెషయా 55:11.
‘భూమిని నశింపజేసేవారిని నశింపజేయాలన్నది’ యెహోవా ఉద్దేశం. (ప్రకటన 11:18) తన వాక్యంలో ఆయన ఈ వాగ్దానం చేశాడు: ‘యథార్థవంతులు దేశంలో నివసిస్తారు. లోపం లేనివాళ్లు దానిలో నిలిచి ఉంటారు. భక్తిహీనులు దేశంలో ఉండకుండ నిర్మూలమౌతారు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడతారు.’—సామెతలు 2:21, 22.
ఇది ఎప్పుడు జరుగుతుంది? ఏ మానవునికీ తెలియదు. ‘ఆ దినం గురించి, ఆ గడియ గురించి తండ్రి తప్ప ఏ మనిషైనా, పరలోకంలోని దూతలైనా, కుమారుడైనా ఎరుగరు’ అని యేసు చెప్పాడు. (మార్కు 13:32) దేవుడు ఏ తేదీన దుష్టులను నాశనం చేస్తాడో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రయత్నించరు. అంతానికి సంబంధించిన ‘గుర్తు’ విషయంలో వాళ్లు అప్రమత్తంగా ఉంటారు, బైబిలు ప్రకారం నేడు మనం ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామని నమ్ముతారు. కానీ ‘అంతం’ ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో వాళ్లు తెలుసుకోలేరు. (మార్కు 13:4-8, 33; 2 తిమోతి 3:1) అది ఎప్పుడు సంభవిస్తుందో తమ పరలోక తండ్రికి, ఆయన కుమారునికి మాత్రమే తెలుసని వాళ్లు అర్థంచేసుకుంటారు.
ఈలోపు, యెహోవాసాక్షులు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు. ఆ పరలోక ప్రభుత్వం ఈ భూమిని పరిపాలించి దాన్ని శాంతి విలసిల్లే అందమైన తోటగా మారుస్తుంది. అప్పుడు ‘నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, దానిలో నిత్యం నివసిస్తారు.’—కీర్తన 37:29. (w11-E 12/01)
[10వ పేజీలోని క్రెడిట్ లైను]
Image Science and Analysis Laboratory, NASA-Johnson Space Center