ఎందుకిన్ని ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి?
ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా విపత్తుల గురించే వింటున్నాం. ముందెన్నటికన్నా ఎక్కువమంది నేడు ఏదో ఒక విపత్తు బారినపడుతున్నారు. ఒక్క 2010వ సంవత్సరంలోనే 373 విపత్తులు సంభవించాయని, వాటివల్ల 2,96,000 కన్నా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారని బెల్జియంలోని సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ది ఎపిడీమియాలజీ ఆఫ్ డిసాస్టర్స్ నివేదించింది.
గత కొన్ని దశాబ్దాల్లో, నివేదించబడిన విపత్తుల సంఖ్య కూడా గమనార్హంగా పెరిగింది. ఉదాహరణకు, 1975 నుండి 1999 మధ్యకాలంలో ప్రతీ సంవత్సరం దాదాపు 300 విపత్తులు నమోదయ్యాయి. అయితే, 2000 నుండి 2010 మధ్యకాలంలో సంవత్సరానికి సగటున 400 వరకు నమోదయ్యాయి. బహుశా మీరు కూడా చాలామందిలా, ‘నేడు ఎందుకిన్ని విపత్తులు సంభవిస్తున్నాయి?’ అని ఆలోచిస్తుండవచ్చు.
ప్రజలు తరచూ అలాంటి విపత్తులను “దేవుని కార్యాలు” అంటారు, కానీ అది పచ్చి అబద్ధం. నేడు సంభవిస్తున్న విపత్తులకు దేవుడు కారణం కాదు. కానీ, అలాంటి సంఘటనలు మనకాలంలో జరుగుతాయని బైబిలు ముందే చెప్పింది. ఉదాహరణకు, మత్తయి 24:7, 8లో యేసు ఇలా చెప్పాడు: ‘అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం.’ యేసు ఎందుకు అలా చెప్పాడు? వాటికి ఏ ప్రాముఖ్యత ఉంది?
‘ఈ యుగసమాప్తికి సూచన ఏమిటి?’ అని శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ దేవుని కుమారుడైన యేసు అలా అన్నాడు. (మత్తయి 24:3) పైన పేర్కొన్న విపత్తులేకాదు వేరే సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయని ఆయన చెప్పాడు. తర్వాత ఆయన వాళ్లకు ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేశాడు: ‘మీరు ఈ సంగతులు జరగడం చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపమైందని తెలుసుకోండి.’ (లూకా 21:31) కాబట్టి, అలాంటి ప్రకృతి విపత్తులకున్న ప్రాముఖ్యతను మనం తెలుసుకోవడం చాలా అవసరం. అతి త్వరలో జరగబోయే గొప్ప మార్పులకు అవి సూచనగా ఉన్నాయి.
విపత్తులకు కారణమేమిటి?
విపత్తులకు కారణం దేవుడు కాకపోతే మరెవరు లేదా మరేది అని చాలామంది అడుగుతారు. దాని జవాబును అర్థంచేసుకోవాలంటే ముందు మనం బైబిల్లోని ఈ సత్యాన్ని గ్రహించాలి: “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహాను 5:19) ఈ వచనం బట్టి, లోకంలో ఉన్న కలవరపర్చే పరిస్థితులకు దేవుడు కారకుడు కాదని, చాలా సందర్భాల్లో వాటికి కారణం దేవుని శత్రువైన ‘దుష్టుడని’ అర్థమౌతోంది. అతన్నే బైబిలు “అపవాది” అని కూడా అంటోంది.—ప్రకటన 12:9, 12.
దేవుని శత్రువు, స్వార్థపరుడు అయిన అపవాది దృష్టిలో ప్రజలు వాడుకుని పారేసే వస్తువుల్లాంటివాళ్లు. లోకమంతా అతని గుప్పిట్లో ఉంది కాబట్టి, ప్రజల్లో కూడా అదే వైఖరిని నూరిపోస్తున్నాడు. నిజానికి, బైబిలు ఆ విషయాన్నే ఇలా చెబుతోంది: ‘అంత్యదినాల్లో మనుష్యులు స్వార్థప్రియులుగా, ధనాపేక్షులుగా, బింకములాడువారిగా, అహంకారులుగా ఉంటారు.’ (2 తిమోతి 3:1, 2) కాబట్టి, ఇలాంటి చెడు లక్షణాలతో అంతకంతకూ బలపడుతున్న ఒక ప్రపంచవ్యాప్త వ్యవస్థనే అపవాది సృష్టించాడంటే అందులో ఆశ్చర్యంలేదు. అతడు స్వార్థపరులు, అత్యాశపరులు సహజ వనరులను దుర్వినియోగం చేసేలా చేస్తున్నాడు, దానివల్ల ప్రజలకు ఘోరమైన ముప్పు వాటిల్లుతోంది.
విపత్తులకు నేటి స్వార్థపూరిత వ్యవస్థ ఎలా కారణమౌతోంది? భూవ్యాప్త విపత్తుల గురించి రూపొందించిన ఒక నివేదికలో ఐక్యరాజ్యసమితి ఇలా వ్యాఖ్యానించింది: “లోతట్టు ప్రాంతాల వంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లోనే ఎక్కువమంది నివసిస్తున్నారు. అడవుల నరికివేత వల్ల, చిత్తడినేలలను పాడుచేయడం వల్ల పర్యావరణం విపత్తులను తట్టుకునే సామర్థ్యం కోల్పోతోంది. వీటన్నిటికి పైగా, భూ వాతావరణాన్ని వేడెక్కించే వాయువులను మనుషులు గాల్లోకి ఎక్కువగా విడిచిపెట్టడం వల్ల భూవ్యాప్త వాతావరణంలో మార్పు వచ్చే ప్రమాదముంది, సముద్రమట్టం పెరిగే అవకాశముంది.” “మనుషులు చేసే” ఈ పనులు ఎక్కువగా ఆర్థికాభివృద్ధి కోసమేనని చెప్పుకున్నా, నిజానికి అవన్నీ లోకమంతటా వ్యాపించివున్న స్వార్థం, అత్యాశ వల్లే జరుగుతున్నాయి.
విపత్తులు సంభవించినప్పుడు ఎక్కువ నష్టం వాటిల్లేది మనుషులు విచక్షణ లేకుండా చేసే పనులవల్లేనని నేడు చాలామంది నిపుణులు అంటున్నారు. నిజానికి, మనుషులు అపవాది చేతిలో కీలుబొమ్మలై, విపత్తుల నష్టాన్ని తీవ్రతరం చేసే అతని వ్యవస్థకు మద్దతునిస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే, చాలా విపత్తులకు కారణం మనుషుల నిర్లక్ష్య వైఖరే అని మనకు అర్థమౌతోంది. కొన్నిసార్లు విపత్తులవల్ల జరిగే నష్టం అవి సంభవించే ప్రాంతాలను బట్టి ఉంటుంది. లోకంలోవున్న సామాజిక, ఆర్థిక అసమానతల కారణంగా ఎక్కువమంది ముప్పువాటిల్లే ప్రాంతాల్లో నివాసమేర్పర్చుకోవడం వల్ల, అవినీతిపరుల వల్ల చాలా ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సృష్టించే నష్టం ఎక్కువౌతోంది. అయితే కొంతమంది, ఎవరో ఒకరి పొరపాటు లేదా నిర్లక్ష్యం వల్ల కాదుగానీ ‘కాలవశము చేత, అనూహ్యంగా’ జరిగే సంఘటనల వల్ల బాధలను అనుభవిస్తున్నారు.—ప్రసంగి 9:11, NW.
కారణమేదైనా, మీరు ఒకవేళ విపత్తు బాధితులైతే పరిస్థితిని ఎలా తాళుకోవచ్చో, ప్రకృతి విపత్తులవల్ల ఎక్కువ నష్టం జరగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం. (w11-E 12/01)