కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు
ఎదుగుతున్న మీ అబ్బాయి మీ మత నమ్మకాలను ప్రశ్నిస్తే ...
చాలామంది పిల్లలు యుక్తవయస్సు వచ్చేసరికి తమ తల్లిదండ్రుల మతాన్నే అవలంబిస్తారు. (2 తిమోతి 3:14, 15) కానీ కొంతమంది పిల్లలు అలా చేయరు. ఎదుగుతున్న మీ అబ్బాయి మీ మత నమ్మకాలను ప్రశ్నిస్తే మీరేం చేయవచ్చు? ఆ సవాలును యెహోవాసాక్షులు ఎలా ఎదుర్కొంటారో ఈ ఆర్టికల్ వివరిస్తోంది.
“మా అమ్మానాన్నల మతంలో ఉండడం నాకు ఇష్టంలేదు. ఆ మతాన్ని వదిలేయాలనిపిస్తుంది.”—కావ్య, 18. a
మీ మతం దేవుని గురించి సత్యం చెబుతుందని, బైబిలు సూత్రాలను పాటిస్తే జీవితం చాలా బావుంటుందని మీరు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి, మీ నమ్మకాలను మీ అబ్బాయి మనసులో నాటాలనుకోవడం సహజమే. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) కానీ ఎదిగేకొద్దీ, మీ అబ్బాయికి దేవుని విషయాలమీద ఆసక్తి తగ్గిపోతోందా? b చిన్నప్పుడు తను ఎంతో ఇష్టంగా అంగీకరించిన విషయాల్నే ఇప్పుడు సందేహిస్తున్నాడా?—గలతీయులు 5:7.
అలాగైతే, క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు ఓడిపోయారని అనుకోకండి. అందుకు వేరే కారణాలు కూడా ఉండవచ్చు. అవేమిటో మనం చూద్దాం. ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ అబ్బాయి మీ మతంవైపు మొగ్గుచూపుతాడా లేక దానికి దూరమౌతాడా అనేది ఎక్కువగా తన ప్రశ్నలకు మీరెలా జవాబిస్తారు అనేదాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మీ అబ్బాయితో గొడవపడ్డారంటే పరిస్థితి ఇంకా విషమంగా తయారౌతుంది, చివరికి తను మీ మతాన్ని వదిలిపెట్టేసే అవకాశముంది.—కొలొస్సయులు 3:21.
అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ హెచ్చరికను లక్ష్యపెట్టడం చాలా మంచిది. ‘ప్రభువు దాసుడు జగడమాడక అందరియెడల సాధువుగా, బోధింప సమర్థుడుగా, కీడును సహించువాడిగా ఉండాలి.’ (2 తిమోతి 2:24-26) మీ అబ్బాయి మీ నమ్మకాల్ని ప్రశ్నించినప్పుడు, మీరు ‘బోధించడానికి సమర్థులని’ నిరూపించుకోవడం ఎలా?
అర్థం చేసుకోండి
ముందు, మీ అబ్బాయి అలా ఆలోచించడానికి కారణాలేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు:
-
మీ అబ్బాయి, సంఘంలో తనకు స్నేహితుల్లేరని, తను ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నాడా? “నాకు స్నేహితులు కావాలి కాబట్టి మా స్కూల్లో చాలామందితో స్నేహం చేశాను. దానివల్ల చాలాకాలంపాటు దేవునికి దగ్గరవ్వలేకపోయాను. చెడు స్నేహాలవల్ల, దేవుని విషయాలమీద
నాకున్న ఆసక్తి చాలావరకు తగ్గిపోయింది. దానికి ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను.”—హారిక, 19. -
తనలో ఆత్మవిశ్వాసం లోపించడంవల్ల తన నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడలేకపోతున్నాడా? “నేను చదువుకునే రోజుల్లో, తోటి విద్యార్థులతో నా మతం గురించి మాట్లాడడానికి భయపడేవాణ్ణి. వాళ్లు నన్ను వింతగా చూస్తారేమోనని, ‘పేద్ద భక్తిపరుడు’ అంటూ ఎగతాళి చేస్తారేమోనని భయపడేవాణ్ణి. ఎవరైనా వేరుగా కనిపిస్తే వాళ్లను కలుపుకునేవారు కాదు, నా విషయంలో అలా జరగడం నాకిష్టం లేదు.”—అఖిల్, 23.
-
క్రైస్తవ ప్రమాణాల ప్రకారం జీవించడం చాలా కష్టమనుకుంటున్నాడా? “దేవుడు ఇస్తానన్న నిత్యజీవం అల్లంత ఎత్తులో ఉందని, అక్కడికి తీసుకెళ్లే మెట్లలో కనీసం మొదటి మెట్టు కూడా నేను ఎక్కలేదని నాకనిపిస్తుంది. నేను వాటికి చాలాచాలా దూరంలో ఉన్నాను. వాటిని ఎక్కడానికి నేనెంత భయపడేదాన్నంటే, ఒక్కోసారి నా నమ్మకాల్ని విడిచిపెట్టేయాలని కూడా అనిపించేది.”—శృతి, 16.
మాట్లాడి తెలుసుకోండి
ఇంతకీ మీ అబ్బాయిని వేధిస్తున్న అసలు సమస్య ఏమిటి? అది తెలుసుకోవడానికి తనని అడగడమే సరైన పద్ధతి. ఆచితూచి మాట్లాడండి, వాదనకు దిగకండి. యాకోబు 1:19లోని ఈ సలహాను పాటించండి: ‘వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి, కోపించడానికి నిదానించండి.’ ఓపిక చూపించండి. బయటివాళ్లతో ఎలా మాట్లాడతారో అలా ‘సంపూర్ణమైన దీర్ఘశాంతంతో,’ నేర్పుగా మాట్లాడండి.—2 తిమోతి 4:2.
ఉదాహరణకు, మీ అబ్బాయి కూటాలకు రావడానికి ఇష్టపడకపోతుంటే, తనని కలవరపెడుతున్నదేమిటో కనుక్కోండి. అయితే ఓపిగ్గా వ్యవహరించండి. కింది సన్నివేశంలో తండ్రి తన కొడుకు హృదయాన్ని చేరుకోలేకపోయాడు.
కొడుకు: కూటాలకు రావడం నాకు ఇష్టం లేదు.
తండ్రి: [గద్దింపు స్వరంతో] ఇష్టం లేదా? ఏఁ, ఎందుకని?
కొడుకు: నాకు బోరు కొడుతోంది, అంతే!
తండ్రి: దేవుని మీద నీకున్న గౌరవం అదేనా? ఆయనంటే నీకు బోరు కొడుతోందా? అది చాలా తప్పు. చూడూ, నువ్వు మాతో ఉన్నంతకాలం నీకు ఇష్టమున్నా లేకపోయినా మాతోపాటు కూటాలకు రావాల్సిందే!
తన గురించి తల్లిదండ్రులు పిల్లలకు బోధించాలని, పిల్లలు వాళ్లకు లోబడాలని దేవుడు కోరుతున్నాడు. (ఎఫెసీయులు 6:1) కానీ, మీ అబ్బాయి గుడ్డిగా మీ మతాన్ని పాటించాలని, ఇష్టం లేకపోయినా మీతోపాటు కూటాలకు రావాలని మీరు కోరుకోరు. తను వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, ఇష్టపూర్వకంగా రావాలనేదే మీ కోరిక.
దానికోసం, మీ అబ్బాయి అలా ఆలోచించడానికి వెనకున్న అసలు కారణమేమిటో మీరు తెలుసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని, పై సన్నివేశంలోని తండ్రి మరింత చక్కగా ఎలా మాట్లాడవచ్చో చూడండి.
కొడుకు: కూటాలకు రావడం నాకు ఇష్టం లేదు.
తండ్రి: [ప్రశాంతంగా] నీకు ఎందుకలా అనిపిస్తుంది?
కొడుకు: నాకు బోరు కొడుతోంది, అంతే!
తండ్రి: నిజమే, కదలకుండా గంటా, రెండు గంటలు కూర్చోవడం బోరుగానే అనిపిస్తుంది. ఇంతకీ నీకు బాగా కష్టంగా అనిపించేది ఏంటి?
కొడుకు: ఏమో. నాకు కూటంలో ఉండాలనిపించట్లేదు, ఇంకెక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది.
తండ్రి: నీ స్నేహితులకు కూడా అలాగే అనిపిస్తోందా?
కొడుకు: అదే నా సమస్య! అక్కడ నాకు ఒక్క స్నేహితుడు కూడా లేడు. నా సన్నిహిత స్నేహితుడు వెళ్లిపోయిన తర్వాత, మాట్లాడడానికి ఎవరూ లేరనిపిస్తుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. నేను మాత్రం ఒంటరివాణ్ణి అయిపోయానని అనిపిస్తుంది!
ఈ సన్నివేశంలోని తండ్రి తన కొడుకును మనసువిప్పి మాట్లాడేలా చేసి, ఒంటరితనమే తన కొడుకును వేధిస్తున్న అసలు సమస్య అని తెలుసుకున్నాడు. “ఓపిక చూపించండి” అనే బాక్సు చూడండి.
అంతేకాదు, తన కొడుకుకు తన మీద నమ్మకం ఏర్పడేలా చేశాడు. అలా మరిన్ని విషయాలు తనతో చెప్పుకునే అవకాశం కల్పించాడు.—చాలామంది పిల్లలు, దేవునికి దగ్గరవ్వకుండా చేసే సమస్యలను అధిగమించినప్పుడు తమ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, దేవుని మీదున్న నమ్మకం కూడా పెరుగుతుందని గ్రహించారు. ముందు చెప్పుకున్న అఖిల్ విషయమే తీసుకోండి, తనొక క్రైస్తవుణ్ణని తోటి విద్యార్థులతో చెప్పడానికి చాలా భయపడ్డాడు. అయితే, తన నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు వాళ్లు ఎగతాళి చేసినా, అది తను భయపడినంత పెద్ద సమస్యేమీ కాదని అఖిల్ చివరకు అర్థంచేసుకున్నాడు. ఆయనిలా అంటున్నాడు:
“ఒకసారి మా స్కూల్లో ఒక అబ్బాయి నా మతం గురించి నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. తరగతిలోని వాళ్లంతా అది వింటున్నారు, నాకు చెమటలు పట్టేశాయి. అప్పుడు అవధానం అతని మీదికి మళ్లించాలని, తన మత నమ్మకాల గురించి అడిగాను. ఆశ్చర్యమేమిటంటే, తను నాకన్నా ఎక్కువ కంగారుపడ్డాడు! అప్పుడు నాకనిపించింది, నా వయసు వాళ్లలో చాలామందికి మత నమ్మకాలు ఉంటాయి, కానీ వాటి గురించి వాళ్లకు అంతగా తెలీదని. నాకైతే కనీసం నా నమ్మకాల గురించి వివరించడం వచ్చు. నిజానికి, మతం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కంగారుపడాల్సింది వాళ్లే కానీ, నేను కాదు!”
ఇలా చేసి చూడండి: ఒక క్రైస్తవుడిగా ఉండడం ఎలా అనిపిస్తుందో మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి. దానిలో ఉన్న ప్రయోజనాలను, సవాళ్లను చెప్పమనండి. ప్రయోజనాలతో పోలిస్తే సవాళ్లు చిన్నగా కనిపిస్తున్నాయా? అలాగైతే, ఎందుకో వివరించమనండి. (మార్కు 10:29, 30) ఓ కాగితం తీసుకుని దానిమీద ఎడమవైపు సవాళ్లను, కుడివైపు ప్రయోజనాలను రాయమనండి. అలా తను రాసిన దాన్ని చూసి, మీ అబ్బాయి తన సమస్యేమిటో తెలుసుకుని, పరిష్కరించుకోగలుగుతాడు.
మీ అబ్బాయి ఆలోచనా సామర్థ్యం
ఆలోచించే విషయంలో చిన్నపిల్లలకు, ఎదిగే పిల్లలకు చాలా తేడా ఉందని తల్లిదండ్రులు, నిపుణులు గమనించారు. (1 కొరింథీయులు 13:11) చిన్నపిల్లలు ఫలానిది తప్పా, ఒప్పా అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఎదిగే పిల్లలు కాస్త లోతుగా ఆలోచించడం మొదలుపెడతారు, ప్రతీదానికి కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, చిన్నపిల్లలకు దేవుడే అన్నిటినీ చేశాడని చెబితే సరిపోతుంది. (ఆదికాండము 1:1) కానీ ఎదిగే పిల్లల మనసుల్లో ఇలాంటి ప్రశ్నలు మెదులుతుంటాయి: ‘దేవుడున్నాడని నేనెలా నమ్మాలి? ప్రేమగల దేవుడు చెడును చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? దేవుడు అన్నికాలాల్లో ఉన్నాడా, అదెలా?’—కీర్తన 90:2.
మీ అబ్బాయి అలాంటి ప్రశ్నలు అడిగితే, తన విశ్వాసం సన్నగిల్లుతోందని మీకనిపించవచ్చు. కానీ తన అపొస్తలుల కార్యములు 17:2, 3.
విశ్వాసం బలపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడేమో? నిజానికి ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలంటే ప్రశ్నలు అడగడం ముఖ్యం కదా!—అంతేకాదు, మీ అబ్బాయి తన ‘ఆలోచనా సామర్థ్యాన్ని’ ఉపయోగించడం కూడా నేర్చుకుంటున్నాడు. (రోమీయులు 12:1, 2, NW) ఆ విధంగా, తను చిన్నప్పుడు చేయలేని పనిని ఇప్పుడు చేస్తున్నాడు. అంటే, తన నమ్మకాల ‘వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో’ అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. (ఎఫెసీయులు 3:15-18) మీ అబ్బాయి తన నమ్మకాలను విశ్లేషించుకుని, తన విశ్వాసాన్ని బలపర్చుకునేందుకు సహాయం చేయాల్సిన సమయమిదే.—సామెతలు 14:15; అపొస్తలుల కార్యములు 17:11.
ఇలా చేసి చూడండి: ఇంతకుముందు మీరూ, మీ అబ్బాయీ అంత లోతుగా ఆలోచించకుండానే సత్యమని నమ్మిన కొన్ని ప్రాథమిక విషయాలను ఇప్పుడు ఇద్దరూ కలిసి పరిశీలించండి. ఉదాహరణకు, ‘దేవుడున్నాడని నేను ఎందుకు నమ్ముతున్నాను? దేవునికి నా మీద శ్రద్ధ ఉందని నాకెలా తెలుసు? దేవుని ఆజ్ఞలు పాటించడం ఎప్పుడూ నా మంచికేనని నేనెందుకు అనుకుంటున్నాను?’ వంటి ప్రశ్నల గురించి తనను ఆలోచించమనండి. మీ అభిప్రాయాలను మీ అబ్బాయి మీద రుద్దకుండా జాగ్రత్తపడండి. తన నమ్మకాల గురించి తనే బాగా ఆలోచించి నిర్ణయించుకునేలా సహాయం చేయండి. అలాచేస్తే తన మతం మీద విశ్వాసాన్ని పెంచుకోవడం తనకు తేలికౌతుంది.
‘రూఢియని తెలుసుకున్నాడు’
యువకుడైన తిమోతికి ‘బాల్యం నుండే’ పరిశుద్ధ లేఖనాలు తెలుసని బైబిలు చెబుతోంది. అయినా అపొస్తలుడైన పౌలు తిమోతితో ఇలా చెప్పాడు: ‘నువ్వు నేర్చుకొని రూఢియని తెలుసుకున్న వాటిలో నిలకడగా ఉండు.’ (2 తిమోతి 3:14, 15) తిమోతిలాగే మీ అబ్బాయి కూడా చిన్నప్పటి నుండే బైబిలు ప్రమాణాలను నేర్చుకుని ఉంటాడు. అయితే ఇప్పుడు, తన నమ్మకాలను రూఢిపర్చుకోవడానికి మీరు తనకు సహాయం చేయాలి.
యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం), 1వ సంపుటి ఇలా చెబుతోంది: “మీ అబ్బాయి మీతో కలిసి ఉన్నంతకాలం ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో మీతోపాటు పాల్గొనాలని కోరుకునే హక్కు మీకుంది. అయితే తను మొక్కుబడిగా వాటిలో పాల్గొనాలనేది కాదుగానీ, తన హృదయంలో దేవుని పట్ల ప్రేమను నాటాలనేదే మీ లక్ష్యం.” ఆ లక్ష్యాన్ని మనసులో ఉంచుకుంటే, మీ అబ్బాయి ‘విశ్వాసంలో స్థిరంగా’ ఉండేలా సహాయం చేయగల్గుతారు. అప్పుడు, మీ మతం మీ జీవన విధానమే కాదు తనది కూడా అవుతుంది. c—1 పేతురు 5:9. (w12-E 02/01)
a ఈ ఆర్టికల్‌లోనివి అసలు పేర్లు కావు.
b ఈ ఆర్టికల్‌లో అబ్బాయి అని ప్రస్తావించినా, ఇందులోని విషయాలు అమ్మాయిలకు కూడా వర్తిస్తాయి.
c ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, కావలికోట అక్టోబరు 1, 2009, 10-12 పేజీలు, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం), 1వ సంపుటి, 315-318 పేజీలు చూడండి.
ఇలా ప్రశ్నించుకోండి . . .
-
మా అబ్బాయి నా మత నమ్మకాలను ప్రశ్నిస్తే నేనెలా స్పందిస్తాను?
-
నేను స్పందించే తీరును మెరుగుపర్చుకోవడానికి ఈ ఆర్టికల్‌లోని సమాచారం ఎలా ఉపయోగపడుతుంది?