దేవునికి దగ్గరవ్వండి
“దయచేసి మమ్మల్ని తిరిగి రానివ్వు”
మీరు ఒకప్పుడు యెహోవా సేవచేసి తర్వాత మానేశారా? మళ్లీ ఆయన సేవచేయాలని అనిపించినా ఆయన మిమ్మల్ని అంగీకరిస్తాడో లేదో అని అనుకుంటున్నారా? దయచేసి ఈ ఆర్టికల్‌ను, తర్వాతి ఆర్టికల్‌ను జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే, మిమ్మల్ని మనసులో ఉంచుకునే వీటిని తయారుచేశాం.
క్రై స్తవ కుటుంబంలో పెరిగి, ఒకానొక సమయంలో ఆ మార్గం నుండి పూర్తిగా పక్కకుమళ్లిన ఓ స్త్రీ ఇలా అంది: “దయచేసి నన్ను తన దగ్గరకు రానివ్వమని, తనను నొప్పించినందుకు నన్ను క్షమించమని యెహోవాకు ప్రార్థించాను.” ఆమె మీద మీకు జాలి కలుగుతోందా? మీకు ఇలాంటి ప్రశ్నలు రావచ్చు: ‘ఒకప్పుడు తన సేవ చేసి తర్వాత మానేసిన వాళ్ల గురించి దేవుడు ఏమనుకుంటాడు? ఆయన వాళ్లను గుర్తుంచుకుంటాడా? వాళ్లు “తిరిగి రావాలని” కోరుకుంటాడా?’ వాటికి జవాబులు తెలుసుకోవడానికి, యిర్మీయా రాసిన మాటలను పరిశీలిద్దాం. అవి తప్పకుండా మీకు ఊరట కలిగిస్తాయి.—యిర్మీయా 31:18-20 చదవండి.
యిర్మీయా ఎలాంటి పరిస్థితుల మధ్య ఆ మాటలు రాశాడో గమనించండి. యిర్మీయా పుట్టడానికి చాలా సంవత్సరాల ముందు, అంటే క్రీ.పూ. 740లో, పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని అష్షూరీయులు చెరపట్టేందుకు యెహోవా అనుమతించాడు. a తన ప్రవక్తల ద్వారా పదేపదే హెచ్చరించినా పట్టించుకోకుండా తన ప్రజలు ఘోరమైన పాపాలు చేయడం మొదలుపెట్టారు, కాబట్టి వాళ్లను సరిదిద్దాలనే దేవుడు అలా చేశాడు. (2 రాజులు 17:5-18) తమ దేవునికి, స్వదేశానికి దూరంగా చెరలో ఉండి అనుభవించిన కష్టాల వల్ల వాళ్ల వైఖరి ఏమైనా మారిందా? యెహోవా వాళ్ల గురించి పూర్తిగా మర్చిపోయాడా? ఎప్పటికైనా వాళ్లను తిరిగి రానిస్తాడా?
‘నేను పశ్చాత్తాపపడ్డాను’
దేవుని ప్రజలు, చెరలో ఉన్నప్పుడు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డారు. వాళ్లు చూపించిన నిజమైన పశ్చాత్తాపాన్ని యెహోవా గుర్తించాడు. చెరలో ఉన్న ఇశ్రాయేలీయులందర్నీ కలిపి ఎఫ్రాయీము అని పిలుస్తూ వాళ్ల వైఖరిని, వాళ్ల భావాలను యెహోవా ఎలా వర్ణిస్తున్నాడో గమనించండి.
యెహోవా ఇలా అన్నాడు: ‘ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను విన్నాను.’ (18వ వచనం) తాము చేసిన పాపాల వల్ల కలిగిన పర్యవసానాలను బట్టి ఇశ్రాయేలీయులు విలపించడాన్ని ఆయన విన్నాడు. ‘అంగలార్చడం’ అనే పదం, తల “అటూఇటూ ఊపడాన్ని” సూచించవచ్చని ఒక పండితురాలు చెబుతోంది. తాను చేసిన తప్పుల వల్ల తనకు వచ్చిన కష్టాల గురించి ఆలోచిస్తూ, ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటూ బాధతో తల ఊపే చెడ్డ కుమారునిలా వాళ్లు ఉన్నారు. (లూకా 15:11-17) ఇంతకీ ఆ ప్రజలు ఏమంటున్నారు?
‘కాడికి అలవాటుకాని కోడెను [శిక్షించినట్లుగా] నన్ను శిక్షించావు.’ (18వ వచనం) తమకు దిద్దుబాటు అవసరమేనని ఆ ప్రజలు ఒప్పుకున్నారు. ఎందుకంటే, వాళ్లు కాడికి అలవాటుపడని కోడెలా ఉన్నారు. ఆ పోలిక, ‘కేవలం కాడికి ఎదురుతన్నినందువల్లే మునికోల దెబ్బలు తిన్న’ ఎద్దులా వాళ్లు ఉన్నారని సూచిస్తుండవచ్చని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది.
“నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును.” (18వ వచనం) నలిగిన హృదయాలతో ఆ ప్రజలు యెహోవాకు మొరపెట్టారు. పాపపు మార్గాన్ని అనుసరించి వాళ్లు దారితప్పిపోయారు, కానీ ఇప్పుడు మళ్లీ తన ఆమోదం పొందేందుకు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకున్నారు. ఒక అనువాదం ఇలా చెబుతోంది: “నీవే మా దేవుడవు—దయచేసి మమ్మల్ని తిరిగి రానివ్వు.”—కంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్.
19వ వచనం) పాపం చేసినందుకు ప్రజలు బాధపడ్డారు. నిందను భరించి, తమ తప్పును ఒప్పుకున్నారు. అంతేకాదు, వాళ్లు అవమానంగా భావించారు, సిగ్గుపడ్డారు.—లూకా 15:18, 19, 21.
‘నేను పశ్చాత్తాపపడితిని, అవమానమునొంది సిగ్గుపడితిని.’ (ఆ ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడ్డారు. వాళ్లు బాధతో నిండిపోయారు, దేవుని దగ్గర తమ పాపాలు ఒప్పుకుని తమ తప్పుడు ప్రవర్తన విడిచిపెట్టారు. వాళ్ల పశ్చాత్తాపం చూసి దేవుని హృదయం కరిగిందా? ఆయన వాళ్లను తిరిగి రానిచ్చాడా?
‘నేను తప్పక అతణ్ణి కరుణిస్తాను’
ఇశ్రాయేలీయులతో యెహోవాకు ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. ఆయనిలా అన్నాడు: ‘నేను ఇశ్రాయేలునకు తండ్రిని, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు.’ (యిర్మీయా 31:9) నిజమైన పశ్చాత్తాపం చూపించి తిరిగి రావాలనుకుంటున్న కొడుకును ప్రేమగల ఏ తండ్రైనా ఎలా ఆపుతాడు? తన ప్రజలపట్ల తనకున్న తండ్రి ప్రేమను యెహోవా ఎలా వ్యక్తం చేశాడో గమనించండి.
“ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా? నాకు ముద్దుబిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది.” (20వ వచనం) ఆ మాటల్లో ఎంత సున్నితత్వం ఉంది! ప్రేమగలవాడే అయినా స్థిరంగా ఉండే తండ్రిలా దేవుడు తన ప్రజలకు ‘విరోధంగా’ మాట్లాడాల్సి వచ్చింది, వాళ్ల పాపాల గురించి పదేపదే వాళ్లను హెచ్చరించాల్సి వచ్చింది. వాళ్లు మొండిగా తిరస్కరించినప్పుడు అష్షూరీయులు వాళ్లను చెరలోకి తీసుకువెళ్లేందుకు అనుమతించాడు, మరో మాటలో చెప్పాలంటే, తనను వదిలి వెళ్లనిచ్చాడు. వాళ్లను శిక్షించాల్సి వచ్చినా ఆయన వాళ్లను మర్చిపోలేదు. ఎప్పటికీ మర్చిపోలేడు కూడా. ప్రేమగల తండ్రి తన పిల్లలను మర్చిపోడు. మరి, తన పిల్లలు నిజమైన పశ్చాత్తాపం చూపించినప్పుడు యెహోవాకు ఎలా అనిపించింది?
“అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును.” (20వ వచనం) యెహోవా తన పిల్లల గురించి ఎంతగానో పరితపించాడు. వాళ్లు చూపించిన నిజమైన పశ్చాత్తాపం ఆయన హృదయాన్ని కదిలించింది, వాళ్లు తన దగ్గరకు తిరిగి రావాలని ఆయన ఎంతో కోరుకున్నాడు. తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమానంలోని తండ్రిలా యెహోవా “కనికరపడి,” ఇంటికి తిరిగివచ్చే తన పిల్లలను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.—లూకా 15:20.
“యెహోవా నన్ను తిరిగి రానిచ్చాడు!”
యిర్మీయా 31:18-20 లోని మాటలు యెహోవా వాత్సల్యాన్ని, కనికరాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఒకప్పుడు తన సేవ చేసిన వాళ్లను దేవుడు మర్చిపోడు. అలాంటివాళ్లు ఆయన దగ్గరకు తిరిగి రావాలనుకుంటే అప్పుడేమిటి? దేవుడు ‘క్షమించడానికి సిద్ధంగా’ ఉన్నాడు. (కీర్తన 86:5) పశ్చాత్తాపపడి తన దగ్గరకు వచ్చే వాళ్లను ఆయన ఎప్పటికీ కాదనడు. (కీర్తన 51:17) నిజానికి, వాళ్లను తిరిగి చేర్చుకోవడమంటే ఆయనకు చాలా సంతోషం.—లూకా 15:22-24.
పైన ప్రస్తావించిన స్త్రీ మళ్లీ యెహోవాకు దగ్గరవడానికి చొరవ తీసుకుని, స్థానికంగా ఉన్న యెహోవాసాక్షుల సంఘానికి వెళ్లింది. మొదట్లో ఆమె తనలోని ప్రతికూల భావాలను అధిగమించాల్సి వచ్చింది. ఆమె ఇలా అంటోంది, “సేవ చేయడానికి నాకు అర్హతలేదని అనిపించింది.” కానీ సంఘ పెద్దలు ఆమెను ప్రోత్సహించి, మళ్లీ యెహోవాతో మంచి సంబంధం కలిగివుండేందుకు ఆమెకు సహాయం చేశారు. కృతజ్ఞత నిండిన హృదయంతో ఆమె ఇలా అంటోంది, “యెహోవా నన్ను తిరిగి రానిచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది!”
మీరు ఒకప్పుడు యెహోవా సేవచేసి, కొంతకాలానికి మానేశారా? ఇప్పుడు మళ్లీ ఆయన సేవ చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షుల సంఘానికి వెళ్లమని మిమ్మల్ని కోరుతున్నాం. పశ్చాత్తాపం చూపించిన వాళ్లు, “దయచేసి మమ్మల్ని తిరిగి రానివ్వు” అని యెహోవాను వేడుకున్నప్పుడు ఆయన దయతో, కనికరంతో చేరదీస్తాడని గుర్తుంచుకోండి. (w12-E 04/01)
[అధస్సూచి]
a అప్పటికి కొన్ని శతాబ్దాల ముందు, అంటే క్రీ.పూ. 997లో ఇశ్రాయేలీయులు రెండు రాజ్యాలుగా విడిపోయారు. మొదటిది, యూదా అనే రెండు గోత్రాల దక్షిణ రాజ్యం. రెండవది, ఇశ్రాయేలు అనే పది గోత్రాల ఉత్తర రాజ్యం. దాని ప్రముఖ గోత్రం ఎఫ్రాయీము కాబట్టి ఆ పేరుతో కూడా దాన్ని పిలిచేవారు.