దేవునికి దగ్గరవ్వండి
“మునుపటివి మరువబడును”
జ్ఞాపకాలు ఒక వరం. ఆత్మీయులతో కలిసి గడిపిన మధురక్షణాలను గుర్తుచేసుకుంటే మన హృదయానికి ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ కొన్నిసార్లు, జ్ఞాపకాలు మనకు శాపంలా అనిపించవచ్చు. గతానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు మిమ్మల్ని పట్టిపీడిస్తున్నాయా? అలాగైతే, ‘ఈ చేదు జ్ఞాపకాలు నా మదిలో నుండి ఎప్పటికైనా తొలగిపోతాయా?’ అని మీరనుకోవచ్చు. ఈ విషయంలో యెషయా ప్రవక్త రాసిన మాటలు మనకు ఎంతో అభయాన్నిస్తాయి.—యెషయా 65:17 చదవండి.
చేదు జ్ఞాపకాలను కూకటివేళ్లతోసహా పెకలించాలన్నదే యెహోవా ఉద్దేశం. ఆయన దాన్నెలా చేస్తాడు? ఆయన ఈ దుష్టలోకాన్నీ, అందులోని బాధలనూ తీసేసి ఎంతో చక్కని పరిస్థితులను ఈ భూమ్మీదకు తీసుకువస్తాడు. “ఇదిగో, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను” అని ఆయన యెషయా ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని అర్థంచేసుకుంటే మన హృదయంలో భవిష్యత్తు మీద ఆశ చిగురిస్తుంది.
కొత్త ఆకాశం అంటే ఏమిటి? బైబిల్లో ఉన్న రెండు విషయాలను బట్టి దాన్ని మనం తెలుసుకోవచ్చు. మొదటిది, కొత్త ఆకాశం గురించి మరిద్దరు బైబిలు రచయితలు కూడా రాశారు. ఆ రెండు సందర్భాల్లోనూ వాళ్లు, భూమ్మీద ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకోవడం గురించి రాశారు. (2 పేతురు 3:13; ప్రకటన 21:1-4) రెండవది, బైబిల్లో “ఆకాశము” అనే పదం కొన్నిసార్లు పరిపాలనను లేక ప్రభుత్వాన్ని సూచిస్తుంది. (యెషయా 14:3, 4, 12; దానియేలు 4:25, 26) కొత్త ఆకాశం అనేది భూమ్మీద నీతియుక్తమైన పరిస్థితులను స్థాపించగల ఒక కొత్త ప్రభుత్వాన్ని సూచిస్తుంది. అయితే ఒకేఒక్క ప్రభుత్వం అదంతా చేయగలదు, అదే దేవుని రాజ్యం. యేసు ప్రార్థన చేయమని నేర్పించింది ఆ పరలోక ప్రభుత్వం గురించే. అది, నీతియుక్తమైన దేవుని చిత్తం ఈ భూమంతటా జరిగేలా చేస్తుంది.—మత్తయి 6:9, 10.
కొత్త భూమి అంటే ఏమిటి? లేఖనాల్లోని రెండు విషయాలను గమనిస్తే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. మొదటిది, బైబిల్లో “భూమి” అనే పదం కొన్నిసార్లు భూగోళాన్ని కాదుగానీ ప్రజలను సూచిస్తుంది. (కీర్తన 76:9) రెండవది, దేవుని పరిపాలనలో నమ్మకస్థులైన మానవులు నీతిని నేర్చుకుంటారు, అలా భూమంతటా నీతి విలసిల్లుతుంది. (యెషయా 26:9) కాబట్టి, కొత్త భూమి అనేది దేవుని పరిపాలనకు లోబడుతూ, ఆయన నీతియుక్త ప్రమాణాలకు అనుగుణంగా జీవించే మానవ సమాజాన్ని సూచిస్తుంది.
యెహోవా, చేదు జ్ఞాపకాలను కూకటివేళ్లతోసహా ఎలా పెకలిస్తాడో ఇప్పుడు మీకు మెల్లమెల్లగా అర్థమౌతుండవచ్చు. యెహోవా త్వరలోనే నీతియుక్తమైన నూతన లోకాన్ని స్థాపించి, కొత్త ఆకాశములను, కొత్త భూమిని తీసుకొస్తాననే తన వాగ్దానాన్ని పూర్తిగా నెరవేరుస్తాడు. a చేదు జ్ఞాపకాలకు కారణం అయ్యేవి ఏవీ అంటే శారీరక, మానసిక, భావోద్వేగ బాధలేవీ ఆ కొత్త లోకంలో ఉండవు. అప్పుడు నమ్మకస్థులైన మానవులు జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారు, ప్రతీరోజు ఎన్నో తీపి జ్ఞాపకాలను సొంతం చేసుకుంటారు.
ప్రస్తుతం మన గుండెలను బరువెక్కించే మానసిక, భావోద్వేగ బాధల విషయమేమిటి? యెషయా ద్వారా యెహోవా ఇంకా ఇలా వాగ్దానం చేశాడు: “మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు.” ఈ పాత లోకంలో మనం అనుభవించిన ఎలాంటి బాధనైనా మనం మెల్లమెల్లగా మరచిపోతాం. ఆ తలంపు మీకు మంచిగా అనిపిస్తుందా? అయితే, అలాంటి దివ్యమైన భవిష్యత్తును వాగ్దానం చేసిన దేవునికి ఎలా మరింత దగ్గర కావచ్చో తెలుసుకోండి. (w12-E 03/01)
[అధస్సూచి]
a దేవుని రాజ్యం గురించి, అది త్వరలో ఏమి సాధిస్తుందనే దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 3, 8, 9 అధ్యాయాలను చూడండి. దీన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.