కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన విశ్వాసి, బాధ్యతగల పౌరుడు ఈ రెండు పాత్రల్ని ఒకేసారి ఎలా పోషించవచ్చు?

నిజమైన విశ్వాసి, బాధ్యతగల పౌరుడు ఈ రెండు పాత్రల్ని ఒకేసారి ఎలా పోషించవచ్చు?

నిజమైన విశ్వాసి, బాధ్యతగల పౌరుడు ఈ రెండు పాత్రల్ని ఒకేసారి ఎలా పోషించవచ్చు?

యేసు పరిచర్యకు సంబంధించి ప్రాముఖ్యంగా కనిపించే రెండు అంశాలు ఏమిటి? మొదటిది, యేసు మనుష్యుల హృదయాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడే కానీ రాజకీయ విధానాల్లో కాదు. ఉదాహరణకు, కొండమీద యేసు ఇచ్చిన ప్రసంగంలో ఏ విషయం గురించి నొక్కి చెప్పాడో గమనించండి. లోకానికి ఉప్పు, వెలుగు అయ్యుండమని చెప్పడానికి కాస్త ముందు, ‘తమ ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించేవాళ్ళకు’ నిజమైన సంతోషం లభిస్తుందని ఆయన తన శ్రోతలతో చెప్పాడు. ‘సాత్వికులు, హృదయశుద్ధిగలవారు, సమాధానపరచువారు సంతోషంగా ఉంటారు’ అని కూడా ఆయన చెప్పాడు. (మత్తయి 5:1-11, NW) మంచి చెడుల విషయంలో దేవుని ప్రమాణాలకు అనుగుణంగా తమ ఆలోచనల్ని, భావాల్ని మార్చుకోవడం, హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోవడానికి యేసు తన అనుచరులకు సహాయం చేశాడు.

రెండవది, తోటి మానవులు బాధలు అనుభవించడం చూసినప్పుడు యేసు కనికరంతో ఆ బాధను తగ్గించేవాడు. బాధలన్నిటినీ పూర్తిగా తొలగించేయాలన్నది ఆయన లక్ష్యం కాదు. (మత్తయి 20:30-34) ఆయన రోగుల్ని బాగుచేశాడు కానీ, రోగమే లేకుండా పోలేదు. (లూకా 6:17-19) అణచివేతకు గురైనవాళ్ళకు ఉపశమనం కలిగించాడు, కానీ అన్యాయం పూర్తిగా తొలగిపోలేదు. ఆకలిగా ఉన్నవాళ్ళకు ఆహారం పెట్టాడు కానీ, ఇప్పటికీ కరువు మానవజాతిని పీడిస్తూనేవుంది.​—మార్కు 6:41-44.

హృదయాల్లో మార్పు తెచ్చాడు, బాధల్ని తాత్కాలికంగా తొలగించాడు

యేసు రాజకీయ విధానాల్లో మార్పు తేవడానికో బాధను శాశ్వతంగా తొలగించడానికో కాకుండా హృదయాల్లో మార్పు తీసుకురావడానికి, బాధల్ని తాత్కాలికంగా తొలగించడానికి ఎందుకు ప్రాధాన్యతనిచ్చాడు? ఎందుకంటే దేవుడు, భవిష్యత్తులో తన రాజ్యాన్ని ఉపయోగించి మానవ ప్రభుత్వాల్ని నిర్మూలించి, ప్రజల బాధలకు కారణమైన వాటిని శాశ్వతంగా తొలగించాలని సంకల్పించినట్లు యేసుకు తెలుసు. (లూకా 4:43; 8:1) అందుకే ఒక సందర్భంలో శిష్యులు రోగులను స్వస్థపర్చడానికి మరింత సమయం వెచ్చించమని యేసును అడిగినప్పుడు ఆయన, ‘ఇతర సమీప గ్రామాల్లోనూ నేను ప్రకటించునట్లు వెళదాం రండి; ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చాను’ అన్నాడు. (మార్కు 1:32-38) యేసు చాలామందిని స్వస్థపరిచి వాళ్ల బాధను తగ్గించాడు, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, బోధించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు.

నేడు యెహోవాసాక్షులు ప్రకటనాపనిలో యేసును అనుకరించడానికి కృషిచేస్తారు. అవసరంలో ఉన్నవాళ్ళకు సహాయం చేయడం ద్వారా వాళ్ళ బాధలను తాత్కాలికంగా తొలగించడానికి ప్రయత్నిస్తారు. కానీ సాక్షులు లోకంలో జరుగుతున్న అన్యాయాలను శాశ్వతంగా తొలగించడానికి పాటుపడరు. ప్రజల బాధలకు కారణమైన వాటిని దేవుని రాజ్యం తొలగిస్తుందని వాళ్ళు నమ్ముతారు. (మత్తయి 6:9, 10) యేసులాగే వాళ్ళు కూడా రాజకీయ విధానాల్లో కాదుగానీ హృదయాల్లో మార్పు తీసుకురావడానికి కృషిచేస్తారు. ఇది సరైనదే, ఎందుకంటే మనిషికున్న అసలు సమస్యలు రాజకీయ సంబంధమైనవి కావు, నైతిక విలువలకు సంబంధించినవి.

బాధ్యతగల పౌరులు

అదే సమయంలో, మంచి పౌరులుగా ఉండడం క్రైస్తవ బాధ్యత అని యెహోవాసాక్షులు నమ్ముతారు. అందుకే వాళ్ళు ప్రభుత్వ అధికారాన్ని గౌరవిస్తారు. చట్టానికి లోబడి ఉండమని తమ ప్రచురణల ద్వారా, ప్రకటనాపని ద్వారా ప్రజల్ని ప్రోత్సహిస్తారు. ప్రభుత్వం దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనదాన్ని చేయమన్నప్పుడు మాత్రం సాక్షులు దానికి లోబడరు, కానీ ‘మనుషులకు కాదు దేవునికే లోబడాలి’ అనే ఆజ్ఞను పాటిస్తారు.​—అపొస్తలుల కార్యములు 5:29; రోమీయులు 13:1-7.

యెహోవాసాక్షులు తమ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కలిసి ఆసక్తి చూపించిన వాళ్ళకు ఉచితంగా బైబిలు విద్య అందిస్తారు. అలాంటి విద్య వల్ల కొన్ని లక్షలమంది హృదయాల్లో మార్పువచ్చింది. పొగత్రాగడం, మద్యపానీయాలు అధికంగా సేవించడం, మత్తుపదార్థాలు తీసుకోవడం, జూదమాడడం, లైంగిక విచ్ఛలవిడితనం వంటి హానికరమైన అలవాట్లను మానుకోవడానికి యెహోవాసాక్షులు ప్రతీ సంవత్సరం కొన్ని లక్షలమందికి సహాయం చేస్తున్నారు. వాళ్ళు బైబిలు సూత్రాల ప్రకారం జీవించడం నేర్చుకుంటున్నారు, కాబట్టి సమాజంలో నైతిక విలువలు గల వ్యక్తులుగా తయారవుతున్నారు.

అంతేగాక, ఈ బైబిలు అధ్యయనం వల్ల ఎన్నో కుటుంబాల్లోని సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు, భార్యాభర్తలు ఒకరితో ఒకరు చక్కగా సంభాషించుకుంటున్నారు, తల్లిదండ్రులు పిల్లలు, అలాగే పిల్లలు కూడా ఒకరితో ఒకరు చక్కగా సంభాషించుకుంటున్నారు. దాని వల్ల కుటుంబ బంధాలు బలపడుతున్నాయి. కుటుంబాలు పటిష్ఠంగా ఉంటే సమాజాలు కూడా పటిష్ఠంగా ఉంటాయి.

ఈ రెండు ఆర్టికల్స్‌ చదివిన తర్వాత మీకేమనిపిస్తోంది? నిజ క్రైస్తవులు బాధ్యతగల పౌరులుగా ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. ఎలా ఉండవచ్చు? లోకానికి ఉప్పు, వెలుగు అయ్యుండమని యేసు ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించడం ద్వారా అలా ఉండవచ్చు.

క్రీస్తు ఇచ్చిన ఈ ఆచరణాత్మక నిర్దేశాల్ని పాటించడానికి ప్రయత్నించేవాళ్ళు తమకుతాము ప్రయోజనం చేకూర్చుకుంటారు, తమ కుటుంబాలకు, తమ సమాజాలకు ప్రయోజనం చేకూరుస్తారు. మీ ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న బైబిలు విద్యా కార్యక్రమం గురించి మరింత సమాచారం అందించడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు. a

(w12-E 05/01)

[అధస్సూచి]

a కావాలంటే, www.pr418.com వెబ్‌సైట్‌లో కూడా యెహోవాసాక్షులను సంప్రదించవచ్చు

[18వ పేజీలోని బ్లర్బ్‌]

యేసు మనుష్యుల హృదయాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడే కానీ రాజకీయ విధానాల్లో కాదు

[19వ పేజీలోని బ్లర్బ్‌]

మంచి పౌరులుగా ఉండడం తమ బాధ్యత అని యెహోవాసాక్షులు నమ్ముతారు