కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రార్థనలు ఆలకించేది ఎవరు?

ప్రార్థనలు ఆలకించేది ఎవరు?

ప్రార్థనలు ఆలకించేది ఎవరు?

మన ప్రార్థనలు ఆలకించే వారెవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన సృష్టికర్తే అయ్యుండాలి. మానవ మెదడును రూపొందించినవాడు కాక ఇంకెవరు మన ఆలోచనలను చదవగలరు? మన ప్రార్థనలు విని మనకు సహాయం చేయడానికి ఆయన తప్ప ఇంకెవరున్నారు? కానీ, ‘సృష్టికర్త ఉన్నాడని నమ్మడం తెలివైన పనేనా?’ అని మీకు అనుమానం రావచ్చు.

సృష్టికర్తను నమ్మాలంటే ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని పక్కనపెట్టాలని చాలామంది అనుకుంటారు. కానీ దేవుని మీద నమ్మకం, విజ్ఞానశాస్త్రం ఒకదానితో ఒకటి పొసగవు అనుకోవడం సరికాదు. ఈ విషయాలు పరిశీలించండి.

◼ అమెరికాలోవున్న, పేరుగాంచిన 21 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1,646 మంది ప్రొఫెసర్‌లను ఈ విషయం అడిగినప్పుడు, దాదాపు 550 మంది మాత్రమే తమకు “దేవుని మీద నమ్మకం లేదు” అని చెప్పారు.

దీన్నిబట్టి, చాలామంది శాస్త్రజ్ఞులకు దేవుని మీద నమ్మకం ఉందని అర్థమౌతుంది.

సృష్టికర్త ఉన్నాడనడానికి రుజువు

ప్రార్థనలు వినే దేవుడు ఉన్నాడని ఎలాంటి ఆధారాలూ లేకుండానే నమ్మాలా? అవసరం లేదు. రుజువులు లేకపోయినా నమ్మడమే విశ్వాసం అన్న ఆలోచన తప్పు. ‘అదృశ్యమైనవి ఉన్నాయని నిరూపించే రుజువులను’ నమ్మడమే విశ్వాసమని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 11:1) విశ్వాసమంటే, “మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగ ఉండుట” అని మరో అనువాదం చెబుతోంది. (పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) ఉదాహరణకు, రేడియో తరంగాలు మన కంటికి కనిపించవు. కానీ మన సెల్‌ఫోన్‌ పనిచేస్తుంటే, స్వరాన్ని చేరవేసే ఆ అదృశ్య తరంగాలు నిజంగా ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి అలాంటి తరంగాలు ఉనికిలో ఉన్నాయని మనం ఒప్పుకుంటాం. అలాగే, ప్రార్థనలు వినే దేవుణ్ణి మనం చూడలేకపోయినా, ఆయన ఉన్నాడని దృఢంగా నమ్మడానికి కావలసిన రుజువును మనం పరిశీలించవచ్చు.

దేవుడు ఉన్నాడనడానికి రుజువు ఎక్కడుంది? ఎక్కడో కాదు మన చుట్టూనే ఉంది. బైబిలు ఇలా తర్కిస్తుంది: ‘ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరిచేత కట్టబడుతుంది; సమస్తాన్ని కట్టినవాడు దేవుడే.’ (హెబ్రీయులు 3:3, 4) మీరు ఆ మాటలతో ఏకీభవిస్తారా? ఈ విశ్వంలో ఉన్న క్రమాన్ని, జీవానికి మూలాన్ని, భూమ్మీదున్నవాటిలోకెల్లా అత్యంత సంక్లిష్టమైన మానవ మెదడు రూపకల్పనను పరిశీలిస్తే మనుషులకంటే ఉన్నతుడున్నాడని అర్థమవుతుంది.

అయితే కేవలం సృష్టిని చూసి మనం దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేం. ఈ సృష్టిని చూసి దేవుడున్నాడని తెలుసుకోవడానికి ప్రయత్నించడం, మూసివున్న తలుపుకు అవతల వైపున నడిచి వస్తున్న వ్యక్తి అడుగుల చప్పుడు వినడం లాంటిది. అక్కడ ఎవరో ఉన్నారని తెలుస్తుంది, కానీ ఎవరనేది తెలియదు. అది తెలుసుకోవాలంటే తలుపు తెరవాలి. సమస్తాన్ని సృష్టించిందెవరో తెలుసుకోవడానికి కూడా మనం అలాంటి పనే చేయాలి.

దేవుని గురించి తెలుసుకోవాలంటే బైబిలు అనే తలుపు తెరవాలి. మీరు ఆ తలుపు తెరిచి అందులో సవివరంగా ఉన్న కొన్ని ప్రవచనాలను, వాటి నెరవేర్పులను పరిశీలిస్తే దేవుడున్నాడు అనడానికి రుజువు మీకు దొరుకుతుంది. a అంతకంటే ముఖ్యంగా, దేవుడు ప్రజలతో ఎలా వ్యవహరించాడో చెప్పే వృత్తాంతాలను చదివితే, మన ప్రార్థన ఆలకించే దేవుడు ఎలాంటివాడో కూడా తెలుస్తుంది.

ప్రార్థనలు ఆలకించే దేవుడు ఎలా ఉంటాడు?

ప్రార్థనలు ఆలకించే దేవుడు మీరు తెలుసుకోగల ఒక వ్యక్తి అని బైబిలు చెబుతోంది. వ్యక్తి అయితేనే ప్రార్థనలు విని అర్థం చేసుకోగలడు కదా! ‘ప్రార్థన ఆలకించేవాడా, సర్వశరీరులు నీ వద్దకు వస్తారు’ అనే మాటలు మనకు భరోసా ఇస్తున్నాయి. (కీర్తన 65:2) తన మీద నమ్మకంతో ప్రార్థించేవాళ్ల ప్రార్థనలు ఆయన వింటాడు. ఆయనకు ఒక పేరు ఉంది. బైబిలు ఇలా చెబుతోంది: “భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.”​—సామెతలు 15:29.

యెహోవాకు భావాలున్నాయి. ఆయన ‘ప్రేమగల దేవుడు,’ ‘సంతోషంగల దేవుడు’ అని బైబిలు చెబుతోంది. (2 కొరింథీయులు 13:11; 1 తిమోతి 1:8, NW) చెడుతనం ప్రబలినప్పుడు ఆయన ‘హృదయంలో నొచ్చుకొన్నాడు’ అని కూడా చెబుతోంది. (ఆదికాండము 6:5, 6) మనుషుల్ని పరీక్షించడానికి దేవుడు వాళ్లను బాధపెడతాడనే మాట వాస్తవం కాదు. బైబిలు ఇలా అంటోంది: ‘దేవుడు అన్యాయం చేయడం అసంభవం.’ (యోబు 34:10) అలాంటప్పుడు, ‘దేవుడు సర్వశక్తిగల సృష్టికర్త అయితే, మనుష్యులు ఇన్ని బాధలు అనుభవిస్తున్నా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు?’ అనే అనుమానం మీకు రావచ్చు.

యెహోవా మనకు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చాడు, దీన్నిబట్టి కూడా దేవుడు ఎలాంటివాడో మనకు తెలుస్తుంది. ఎలా జీవించాలో ఎంచుకునే స్వేచ్ఛ మనకుంటే దాన్ని మనమెంతో జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం! కానీ చాలామంది తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ కష్టాలు కొనితెచ్చుకుంటారు, ఎదుటివాళ్లనూ బాధపెడతారు. ఇప్పుడు మనం ఈ ప్రశ్న గురించి లోతుగా ఆలోచించాలి: మనిషి స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించకుండానే దేవుడు బాధల్ని ఎలా అంతం చేస్తాడు? ఈ ప్రశ్నకు జవాబును మనం తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. (w12-E 07/01)

[అధస్సూచి]

a బైబిలు దేవుడు ప్రేరేపించి రాయించిన గ్రంథం అనడానికి రుజువుల కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషుర్‌ను చూడండి.

[5వ పేజీలోని బాక్సు]

మీ సందేహానికి మతమే కారణమా?

ప్రార్థనలు వినే దయగల దేవుడున్నాడనే విషయాన్ని చాలామంది సందేహించడానికి మతమే కారణమవడం విచారకరం. యుద్ధాల్లోనూ, తీవ్రవాదంలోనూ మతం భాగం వహిస్తోంది, పిల్లలపై జరిగే అత్యాచారాల విషయంలో మౌనంగా ఉంటోంది, అందుకే చాలామంది ప్రార్థన చేస్తున్నప్పటికీ “నాకు దేవుని మీద నమ్మకం లేదు” అంటున్నారు.

మతం వల్ల చెడే ఎక్కువగా ఎందుకు జరుగుతోంది? ఒక్కమాటలో చెప్పాలంటే, మతం ముసుగులో చెడ్డ ప్రజలు చెడ్డ పనులు చేశారు. కొందరు క్రైస్తవ మతాన్ని తమ అదుపులో పెట్టుకుని దాన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటారని బైబిలు ముందే చెప్పింది. అపొస్తలుడైన పౌలు క్రైస్తవ పర్యవేక్షకులకు ఇలా చెప్పాడు: ‘శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికే మనుషులు మీలోనే బయలుదేరతారు.’​—అపొస్తలుల కార్యములు 20:29, 30.

దేవుడు అబద్ధమతాన్ని అసహ్యించుకుంటున్నాడు. నిజానికి, ‘భూమ్మీద వధింపబడిన వారందరి రక్తానికి’ మతానిదే బాధ్యతని దేవుని వాక్యమైన బైబిలు ప్రకటిస్తోంది. (ప్రకటన 18:24) అబద్ధమతం ప్రేమాస్వరూపి అయిన సత్య దేవుని గురించి ప్రజలకు బోధించడం లేదు, అందుకే అది దేవుని దృష్టిలో రక్తాపరాధి.​—1 యోహాను 4:8.

ప్రార్థనలు వినే దేవుడు, అబద్ధమతపు ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న ప్రజల్ని చూసి బాధపడుతున్నాడు. దేవుడు త్వరలోనే మానవజాతి మీదున్న ప్రేమతో, మతం ముసుగులో చెడుపనులు చేసే వాళ్లందరికీ యేసు ద్వారా తీర్పు తీర్చబోతున్నాడు. యేసు ఇలా అన్నాడు: “ఆ దినమందు అనేకులు నన్ను చూచి​—ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? . . . అని చెప్పుదురు. అప్పుడు​—నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.”​—మత్తయి 7:22, 23.