కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రార్థనలు ఆలకించే దేవుడు బాధల్ని ఎందుకు తీసివేయడం లేదు?

ప్రార్థనలు ఆలకించే దేవుడు బాధల్ని ఎందుకు తీసివేయడం లేదు?

ప్రార్థనలు ఆలకించే దేవుడు బాధల్ని ఎందుకు తీసివేయడం లేదు?

కొంతమంది ప్రార్థన చేస్తారు గానీ, దేవుడున్నాడో లేడో అని సందేహిస్తారు. ఎందుకు? బహుశా ఈ లోకంలో ఉన్న బాధల్ని చూసి వాళ్లు అలా సందేహిస్తుండవచ్చు. దేవుడు బాధల్ని ఎందుకు తీసివేయడం లేదని మీరెప్పుడైనా ఆలోచించారా?

దేవుడు మానవుల్ని సృష్టించినప్పుడే ఇలా అపరిపూర్ణులుగా బాధలు అనుభవించాలని చేశాడా? మనం బాధలు అనుభవించాలని కోరుకునే దేవుణ్ణి గౌరవించలేము. ఒకసారి దీనిగురించి ఆలోచించండి: మీరు ఒక కొత్త కారును చూసి ముగ్ధులై దాని చుట్టూ తిరిగి పరిశీలిస్తున్నారు, అయితే ఒక మూల సొట్ట కనిపించింది, ఉత్పత్తిదారుడు దాన్ని అలాగే చేశాడని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా అనుకోరు! ఉత్పత్తిదారుడు దాన్ని బాగానే చేశాడు కానీ, ఆ తర్వాత ఎవరివల్లో లేదా దేనివల్లో ఆ సొట్ట పడిందని మీరు అర్థం చేసుకుంటారు.

అలాగే ప్రకృతిలోని ప్రతీదీ ఎంతో పద్ధతిగా చక్కని ఆకృతిలో ఉండడం చూసిన మనం, మానవ కుటుంబంలో ఇంత గందరగోళం, అవినీతి ఉండడం చూసి ఏమనుకోవాలి? దేవుడు మొదటి స్త్రీపురుషులను పరిపూర్ణులుగానే సృష్టించాడని, కానీ వాళ్లే తమకు తాము నష్టం కలుగజేసుకున్నారని బైబిలు చెబుతోంది. (ద్వితీయోపదేశకాండము 32:4, 5) అయితే సంతోషకరమైన విషయమేమిటంటే, దేవుడు ఆ నష్టాన్ని పూరిస్తానని అంటే విధేయత చూపించే మనుషులను మళ్లీ పరిపూర్ణులుగా చేస్తానని మాటిచ్చాడు. మరి ఆయన ఇంతకాలం ఎందుకు ఆగాడు?

ఎందుకు ఇంతకాలం?

దాని జవాబు, మానవజాతిని ఎవరు పరిపాలించాలి అనే ప్రశ్నతో ముడిపడివుంది. మనుషులు తమను తామే పరిపాలించుకోవాలనేది యెహోవా ఉద్దేశం కాదు. ఆయనే వాళ్లను పరిపాలించాలి. బైబిలు ఇలా చెబుతోంది: ‘తమ మార్గాన్ని ఏర్పరచుకోవడం నరులవశంలో లేదు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించడం వారి వశంలో లేదు.’ (యిర్మీయా 10:23) విచారకరంగా, మొదటి మానవులు దేవుని పరిపాలనకు ఎదురుతిరిగారు. అలా ఆయన ఆజ్ఞను అతిక్రమించి వాళ్లు పాపులయ్యారు. (1 యోహాను 3:4) ఫలితంగా వాళ్లు తమ పరిపూర్ణతను పోగొట్టుకొని, తమకు తాము నష్టం కొనితెచ్చుకున్నారు, తమ సంతానానికీ నష్టం వాటిల్లజేశారు.

అప్పటినుండి వేలాది సంవత్సరాలుగా, తమను తాము పరిపాలించుకునే అవకాశం యెహోవా మనుషులకు ఇచ్చాడు. కానీ అలా పరిపాలించుకునే సామర్థ్యం మనుషులకు లేదని చరిత్ర నిరూపించింది. దాన్నిబట్టి, మానవ ప్రభుత్వాలన్నీ బాధలకు కారణమయ్యాయని తెలుస్తుంది. యుద్ధాల్ని, నేరాల్ని, అన్యాయాల్ని, రోగాల్ని ఏ ప్రభుత్వమూ అంతం చేయలేకపోయింది.

దేవుడు ఆ నష్టాన్ని ఎలా పూరిస్తాడు?

దేవుడు త్వరలోనే నీతియుక్తమైన కొత్త లోకాన్ని తీసుకొస్తాడని బైబిలు వాగ్దానం చేస్తోంది. (2 పేతురు 3:13) ఇతరులను ప్రేమించడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి తమకున్న స్వేచ్ఛను ఉపయోగించుకునే వాళ్లు మాత్రమే అక్కడ జీవించే అవకాశం పొందుతారు.​—ద్వితీయోపదేశకాండము 30:15, 16, 19, 20.

వేగంగా దూసుకొస్తున్న ‘తీర్పు రోజున’ దేవుడు బాధను, దానికి కారణమైన వాళ్లను అంతం చేస్తాడని కూడా బైబిలు చెబుతోంది. (2 పేతురు 3:7) అప్పుడు దేవుడు నియమించిన రాజైన యేసుక్రీస్తు విధేయులైన మానవులపై పరిపాలన చేస్తాడు. (దానియేలు 7:13, 14) యేసు పరిపాలన ఏ మార్పులు తీసుకొస్తుంది? బైబిలు ఇలా చెబుతోంది: ‘దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహు క్షేమము కలిగి సుఖిస్తారు.’​—కీర్తన 37:11.

“జీవపు ఊట” అయిన యెహోవా మీద మనుషులు తిరుగుబాటు చేయడం వల్ల వచ్చిన అనారోగ్యం, వృద్ధాప్యం, మరణంతో సహా అన్ని కష్టాలనూ పరలోక రాజైన యేసు తొలగిస్తాడు. (కీర్తన 36:9) యేసు తన ప్రేమపూర్వక పరిపాలనకు లోబడే వాళ్లందరినీ స్వస్థపరుస్తాడు. బైబిలు చేసిన ఈ వాగ్దానాలు ఆయన పరిపాలనలో నెరవేరతాయి:

◼ “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.”​—యెషయా 33:24.

◼ “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”​—ప్రకటన 21:4.

బాధలన్నిటినీ అంతమొందిస్తానని చేసిన వాగ్దానాన్ని దేవుడు త్వరలోనే నెరవేరుస్తాడని తెలుసుకోవడం మనకెంత ఓదార్పునిస్తుందో కదా! దేవుడు తాత్కాలికంగా బాధల్ని అనుమతిస్తున్నా, మన ప్రార్థనలు వింటాడనే నమ్మకాన్ని మాత్రం మనం కోల్పోనవసరం లేదు.

దేవుడున్నాడు. ఆయన మీ ప్రార్థనలను, మీరు దుఃఖంతో తనకు చెప్పుకునే బాధల్ని వింటాడు. అంతేకాదు మీ సందేహాలు తీరిపోయి, బాధలు తొలగిపోయి మీరు ఆనందంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (w 12-E 07/01)