ప్రార్థనలు ఆలకించే దేవునికి దగ్గరవ్వండి
ప్రార్థనలు ఆలకించే దేవునికి దగ్గరవ్వండి
దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకునే చాలామంది తమ నమ్మకానికి సరైన ఆధారం ఏమిటో చెప్పలేరు. మతం వల్ల ఎక్కువగా చెడే ఎందుకు జరుగుతోందో, దేవుడు బాధల్ని ఎందుకు తీసివేయడం లేదో కూడా వాళ్లు చెప్పలేరు. వాళ్లు చేయగలిగిందల్లా, తమకు తెలియని దేవునికి ప్రార్థన చేయడమే.
కానీ మీరు దేవునికి దగ్గరవ్వవచ్చు. ఆయన గురించి తెలుసుకుని ఆయనపై విశ్వాసాన్ని పెంచుకుంటే మీరు ఆయన్ని ప్రేమించగలుగుతారు, గౌరవించగలుగుతారు. నిజమైన విశ్వాసానికి రుజువులే ఆధారం. (హెబ్రీయులు 11:1) మీరు దేవుని గురించి సత్యం నేర్చుకుంటే, ఆయనను తెలుసుకోగలుగుతారు, ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడగలుగుతారు. దేవుడు ఉన్నాడో లేడో తెలియకపోయినా అలవాటుగా ప్రార్థన చేసిన కొంతమంది ఏమి చెబుతున్నారో వినండి.
◼ దటి ఆర్టికల్‌లో ప్రస్తావించిన పట్రీష. “ఒకరోజు నేను, దాదాపు పదిమంది స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు వాళ్లు మతం గురించి చర్చించడం మొదలుపెట్టారు. అప్పుడు నేను, మా ఇంటికి వచ్చిన ఒక యెహోవాసాక్షితో నాస్తికుడైన మా నాన్న చర్చిస్తుండగా అక్కడ ఉండడం ఇష్టంలేక బయటకు వచ్చేశానని వాళ్లతో చెప్పాను. దాంతో ఒక స్నేహితుడు ‘బహుశా యెహోవాసాక్షులు చెప్పేది సత్యమేమో!’ అన్నాడు.
“ ‘వాళ్ల కూటానికి వెళ్లి చూద్దాం’ అని ఒక స్నేహితురాలు అంది. మేము వెళ్లాం. అక్కడ విన్నది మేము పూర్తిగా నమ్మకపోయినా, సాక్షులు స్నేహపూర్వకంగా మాట్లాడడం వల్ల మాలో కొంతమందిమి క్రమంగా వెళ్లేవాళ్లం.
“కానీ ఒక ఆదివారం నేను విన్న ప్రసంగం నాలో మార్పు తెచ్చింది. ప్రజలు ఎందుకు బాధలు అనుభవిస్తున్నారో ప్రసంగీకుడు వివరించాడు. దేవుడు సృష్టించినప్పుడు మనిషి పరిపూర్ణుడని, ఒక మనిషి వల్లే పాపం, మరణం మొదలై మనుషులందరికీ వ్యాపించాయని నాకు అప్పటివరకు తెలియదు. మొదటి మనిషి పోగొట్టుకున్నదాన్ని మానవజాతి అంతటికీ తిరిగి ఇవ్వడానికి యేసు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో కూడా ప్రసంగీకుడు వివరించాడు. a (రోమీయులు 5:12, 18, 19) ఒక్కసారిగా నా కళ్లు తెరుచుకున్నాయి. ‘మనల్ని పట్టించుకునే దేవుడు నిజంగానే ఉన్నాడు’ అని నేననుకున్నాను. నేను బైబిలు అధ్యయనం కొనసాగించాను, కొంతకాలం తర్వాత నా జీవితంలో మొదటిసారిగా నిజమైన దేవునికి ప్రార్థించాను.”
◼ మొదటి ఆర్టికల్‌లో ప్రస్తావించిన అలెన్. “ఒకరోజు యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చారు. భూమ్మీద నిరంతరం జీవించడం గురించి వాళ్లు చెప్పింది నా భార్యకు
నచ్చి, వాళ్లను లోపలికి ఆహ్వానించింది. నాకు చిరాకేసింది. దాంతో, నా భార్యను వంట గదిలోకి తీసుకెళ్లి, ‘నీకేమైనా పిచ్చా? వాళ్ల మాటలు నమ్మితే మోసపోతావు’ అన్నాను.“అప్పుడు నా భార్య, ‘అయితే ఓ పని చేయండి. మీరే వాళ్లతో మాట్లాడి వాళ్ళు చెప్పేది తప్పని నిరూపించండి’ అంది.
“నేను ఏమీ నిరూపించలేకపోయాను. వాళ్లు మాత్రం చాలా దయగా మాట్లాడారు, జీవం పరిణామం వల్ల వచ్చిందా లేక సృష్టి వల్ల వచ్చిందా అనేదానికి సంబంధించిన ఒక పుస్తకం నాకు ఇచ్చి వెళ్లారు. అందులోని సమాచారం అనేక ఆధారాలతో ఎంతో స్పష్టంగా, ఎంతో చక్కగా ఉంది, అందుకే నేను దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. సాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించాను. బైబిలు చెప్పేదానికి, మతం గురించి ఇంతకాలం నేను ఊహించుకున్నదానికి ఎంతో తేడా ఉందని నాకు కొద్దికాలానికే అర్థమైంది. నేను యెహోవా గురించి తెలుసుకునేకొద్దీ నా ప్రార్థనల్లో స్పష్టత పెరిగింది. నాలో కొన్ని చెడ్డ వైఖరులు ఉండేవి, వాటిని వదిలించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థించేవాణ్ణి. యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడని నేను నమ్మకంగా చెప్పగలను.”
◼ ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న ఆండ్రూ. “నాకు విజ్ఞానశాస్త్రం అంటే ఎంతో ఆసక్తి, దానికి సంబంధించిన కొన్ని విషయాలపై బలమైన అభిప్రాయాలు ఉన్నా, పరిణామ సిద్ధాంతం
వాస్తవమని అందరూ అంటున్నారు కాబట్టే నేనూ దానిని నమ్మాను. జరుగుతున్న చెడు విషయాలను చూసి నాకు దేవుని మీద నమ్మకం పోయింది.“అయినా నేను ఒక్కోసారి ఇలా అనుకునేవాణ్ణి, ‘ఒకవేళ దేవుడనేవాడు నిజంగా ఉంటే, పరిస్థితి ఎందుకిలా ఉంది? ఇన్ని నేరాలు, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి?’ కష్టాలొచ్చినప్పుడు కొన్నిసార్లు సహాయం కోసం ప్రార్థన కూడా చేసేవాణ్ణి. కానీ నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలిసేదికాదు.
“అప్పుడు, యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ లోకం నిలుస్తుందా? అనే కరపత్రాన్ని ఎవరో నా భార్యకు ఇచ్చారు. సరిగ్గా అదే ప్రశ్న నా మదిలో మెదులుతూ ఉండేది. ఆ కరపత్రం చదివాక, ‘బైబిలు ఇచ్చే జవాబులు నమ్మవచ్చేమో?’ అని నేను అనుకున్నాను. కొంతకాలానికి నేను సెలవులకు ఊరెళ్లినప్పుడు, ఒకాయన నాకు బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) b అనే పుస్తకాన్ని ఇచ్చాడు. నిజమైన విజ్ఞానశాస్త్రంతో బైబిలు ఏకీభవిస్తోందని గ్రహించినప్పుడు నేను బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాను. అందుకే, ఒక యెహోవాసాక్షి నాతో బైబిలు అధ్యయనం చేస్తానన్నప్పుడు నేను అంగీకరించాను. యెహోవా సంకల్పం నాకు అర్థమయ్యేకొద్దీ, ఆయన నాకు నిజమైన వ్యక్తిగా అనిపించేవాడు, ఆయనకు ఏదైనా చెప్పుకోవచ్చు అనిపించేది.”
◼ లండన్‌లో, ప్రొటస్టెంట్ కుటుంబంలో పెరిగిన జేన్. “మతంలో కనిపిస్తున్న వేషధారణ, లోకంలో ఉన్న బాధలు చూసి నేను నా మతాన్ని వదిలేశాను. నేను కాలేజీకి వెళ్లడం కూడా మానేసి పాటలు పాడుతూ, గిటార్ వాయిస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు పాట్ పరిచయమయ్యాడు. అతడు క్యాథలిక్ కుటుంబంలో పెరిగాడు, నాలాగే తను కూడా మతాన్ని వదిలేశాడు.
“మేము పాడుబడిన ఒక ఇంట్లో ఉండేవాళ్లం, మాతోపాటు మాలాగే చదువు మానేసిన కొంతమంది కూడా ఉండేవాళ్ళు, వాళ్లకు తూర్పు దేశాల మతాలంటే ఆసక్తి. మేమంతా కలిసి జీవిత పరమార్థం గురించి అర్థరాత్రి వరకు గంటల తరబడి తీవ్రంగా చర్చించుకునేవాళ్లం. నాకూ పాట్‌కూ దేవుని మీద నమ్మకం లేకపోయినా, ‘జీవ శక్తి’ ఏదో ఉందని మాకనిపించేది.
“సంగీతకారులుగా పని వెతుక్కుంటూ మేము అక్కడి నుండి ఉత్తర ఇంగ్లాండ్‌కు మకాం మార్చాం, అక్కడ మాకొక బాబు పుట్టాడు. ఒక రాత్రి వాడికి జబ్బు చేసింది, అప్పుడు నేను అనుకోకుండా, దేవుని మీద నమ్మకం లేకపోయినా ఆయనకు ప్రార్థన చేశాను. కొంతకాలం తర్వాత నాకూ పాట్‌కూ గొడవైంది, నేను బాబును తీసుకుని ఇల్లు వదిలి వచ్చేశాను. ఎవరో ఒకరు వింటారనే చిన్ని ఆశతో, నేను మళ్లీ ప్రార్థన చేశాను. అప్పటికి నాకు తెలియదు కానీ పాట్ కూడా ప్రార్థన చేశాడట.
“సరిగ్గా అదే రోజు ఇద్దరు యెహోవాసాక్షులు పాట్ ఉంటున్న ఇంటికి వచ్చి, బైబిల్లోవున్న కొన్ని చక్కని సలహాలు చూపించారట. అప్పుడు పాట్ నాకు ఫోన్‌చేసి తనతో కలిసి యెహోవాసాక్షుల దగ్గర బైబిలు అధ్యయనం చేయడం ఇష్టమో లేదో చెప్పమన్నాడు. యెహోవాను సంతోషపెట్టాలంటే మేము మా వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవాలని కొద్దికాలానికే మాకు తెలిసింది. ‘ఇష్టమున్నంత కాలం కలిసుందాం, ఆ తర్వాత విడిపోదాం’ అన్నట్లు జీవిస్తున్న మాకు అలా చేయడం చాలా కష్టమైన పనిలా అనిపించింది.
“బైబిలు ప్రవచనాల నెరవేర్పు, బాధలకు కారణం, దేవుని రాజ్యమంటే ఏమిటి వంటి విషయాల గురించి మేమింకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాం. దేవునికి ఎంతో శ్రద్ధ ఉందని మాకు మెల్లమెల్లగా అర్థమైంది, మేము ఆయన చెప్పినట్లు చేయాలనుకున్నాం. అందుకే పెళ్లి చేసుకున్నాం. దేవుని వాక్యంలోని జ్ఞానం వల్ల మేము మా ముగ్గురు పిల్లల్ని చక్కగా పెంచాం. యెహోవా మా ప్రార్థనలు విన్నాడని మేము నమ్ముతున్నాం.”
రుజువును స్వయంగా పరిశీలించండి
ఈ ఆర్టికల్‌లో మనం చూసినవాళ్లే కాకుండా ఇంకా లక్షలాదిమంది అబద్ధ మత బోధల వల్ల మోసపోకుండా దేవుడు బాధల్ని ఎందుకు తీసివేయడం లేదో తెలుసుకున్నారు. మనం ఇంతవరకూ పరిశీలించిన వాళ్లందరూ బైబిలును ఖచ్చితంగా అర్థం చేసుకోవడం వల్లే, యెహోవా ప్రార్థనలు ఆలకిస్తాడనే నిర్ధారణకు వచ్చారని మీరు గమనించారా?
దేవుడు ఉన్నాడనడానికి రుజువును మీరు పరిశీలించాలని అనుకుంటున్నారా? అయితే మీకు యెహోవాను గురించిన సత్యాన్ని, ‘ప్రార్థనలు ఆలకించేవానికి’ ఎలా దగ్గరవ్వవచ్చనే విషయాన్ని తెలియజేయడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.—కీర్తన 65:2. (w 12-E 07/01)
[అధస్సూచీలు]
a యేసు మరణానికున్న విమోచనా విలువ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 5వ అధ్యాయాన్ని చూడండి. ఈ పుస్తకాన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.
b యెహోవాసాక్షులు ప్రచురించారు.
[10వ పేజీలోని బ్లర్బ్]
“యెహోవా సంకల్పం నాకు అర్థమయ్యేకొద్దీ, ఆయన నాకు నిజమైన వ్యక్తిగా అనిపించేవాడు, ఆయనకు ఏదైనా చెప్పుకోవచ్చు అనిపించేది”
[9వ పేజీలోని చిత్రం]
దేవుడున్నాడని నిజంగా నమ్మాలంటే రుజువులు పరిశీలించాలి, ఆయన గురించిన సత్యం తెలుసుకోవాలనే తపన ఉండాలి