యెహోవా నా కళ్ళు తెరిచాడు
యెహోవా నా కళ్ళు తెరిచాడు
ప్యాట్రీస్ ఓయేక చెప్పినది
మధ్యాహ్నం దాటింది. గుడ్డితనంతో, ఒంటరిగా, రేడియోలో ఏది వస్తుంటే అది వింటూ గాఢాంధకారంలో మరో రోజు గడిచిపోయింది. దుర్భరమైన ఈ జీవితాన్ని ఇక అంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఒక కప్పు నీళ్ళలో విషపూరిత పదార్థం కలిపి టేబుల్‌పై నా ముందు పెట్టుకున్నాను. ప్రాణాంతకమైన ఆ పానీయాన్ని తాగి చనిపోవడానికి ముందు చివరిసారిగా స్నానం చేసి చక్కగా తయారవ్వాలనుకున్నాను. నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను? కానీ ఈ రోజు మీకు ఈ కథ చెప్పడానికి నేనింకా ఎలా బ్రతికేవున్నాను?
నే ను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని కాసై ఓరీయంటల్లో 1958 ఫిబ్రవరి 2న జన్మించాను. నాకు తొమ్మిదేళ్ళు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు, దానితో మా అన్నయ్యే నన్ను పెంచాడు.
నేను పాఠశాల విద్య ముగించి రబ్బరు తోటల్లో ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. 1989లో ఒకరోజు ఉదయం నేను నా ఆఫీసులో కూర్చొని రిపోర్టు తయారుచేస్తుండగా, హఠాత్తుగా నా చుట్టూ చీకటి కమ్ముకుంది. మొదట్లో కరెంటు పోయిందేమో అనుకున్నాను, కానీ నాకు జనరేటర్ శబ్దం వినిపిస్తూనే ఉంది, అంతేగాక అది పట్టపగలు. నేను భయంతో వణికిపోయాను, నాకు ఏమీ కనిపించడం లేదు, నా ఎదురుగావున్న నోట్సు కూడా నేను చూడలేకపోతున్నానని గ్రహించాను.
నేను వెంటనే నా కింద పనిచేస్తున్న ఒక వ్యక్తిని పిలిచి నన్ను ఆ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళమన్నాను. కానీ ఆ డాక్టర్ నగరంలో ఉన్న మరింత అనుభవజ్ఞుడైన డాక్టర్ దగ్గరకు వెళ్ళడం మంచిదన్నాడు. నా రెండు కళ్ళ రెటినా పొరలు దెబ్బతిన్నాయని, నా పరిస్థితి విషమంగా ఉందని ఆయన నన్ను రాజధాని నగరమైన కిన్షాసాకు పంపించాడు.
కిన్షాసాలో జీవితం
కిన్షాసాలో నేను చాలామంది నేత్ర వైద్యులను కలిశాను, కానీ ఎవ్వరూ నాకు సహాయం చేయలేకపోయారు. నేను ఆసుపత్రిలో 43 రోజులు గడిపిన తర్వాత, జీవితాంతం అంధుడిగా కొనసాగక తప్పదని డాక్టర్లు చెప్పారు. దానితో నా కుటుంబ సభ్యులు అద్భుతంగా స్వస్థత జరగాలని నన్ను అన్ని రకాల చర్చీలకు తీసుకువెళ్ళారు, కానీ ఫలితం శూన్యం.
చివరికి, చూపు వస్తుందన్న ఆశ వదులుకున్నాను. నా జీవితమంతా అంధకారమయమైపోయింది. నా చూపు పోయింది, ఉద్యోగం పోయింది. నా భార్య కూడా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను నలుగురితో కలవడానికి ఎంతో సిగ్గుపడేవాణ్ణి. నాలుగు గోడల మధ్య బంధీనైపోయాను. సన్యాసిలా జీవిస్తూ నేనెందుకూ పనికిరాను అనుకునేవాణ్ణి.
రెండుసార్లు ఆత్మహత్యకు పాల్పడ్డాను. రెండవసారి నేను చేసిన ప్రయత్నం గురించే ఆర్టికల్ ప్రారంభంలో చెప్పాను. అప్పుడు మా కుటుంబంలోని ఒక అబ్బాయి నన్ను కాపాడాడు. నేను స్నానానికి వెళ్ళినప్పుడు, నేను కలిపి పెట్టుకున్న ఆ విషపూరిత పానీయాన్ని ఆ అబ్బాయి బయట పారబోసేశాడు. ఇంకా నయం, ఆ పానీయాన్ని ఆ అబ్బాయి తాగేయలేదు! కానీ వాడు దాన్ని పడేసినందుకు నేనెంతో నిరాశ చెందాను. ఆ తర్వాత నేను దాని కోసం ఎందుకు వెదుకుతున్నానో, దానితో ఏమి చేయాలనుకున్నానో నా కుటుంబ సభ్యులకు చెప్పాను.
నా గురించి శ్రద్ధ తీసుకున్నందుకు నేను దేవునికి, నా కుటుంబానికి రుణపడివున్నాను. ఆత్మహత్య చేసుకోవాలన్న నా ప్రయత్నం విఫలమైంది.
జీవితంలో మళ్ళీ సంతోషాన్ని పొందడం
1992లో ఒక ఆదివారం నేను ఇంట్లో ఉండి పొగత్రాగుతుండగా, ఇంటింటి పరిచర్య చేస్తూ ఇద్దరు యెహోవాసాక్షులు నా దగ్గరకు వచ్చారు. నాకు కళ్ళు కనిపించవని గమనించి, “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును” అని చెబుతున్న యెషయా 35:5 చదివి వినిపించారు. ఆ మాటలు వినగానే నేను సంతోషంతో ఉప్పొంగిపోయాను. చర్చీల్లోని వాళ్ళలా యెహోవాసాక్షులు అద్భుతంగా స్వస్థత చేస్తామని అనలేదు. కానీ దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలో నేను తిరిగి చూపు పొందవచ్చని, దానికోసం నేను దేవుని గురించి తెలుసుకుంటే చాలని వాళ్ళు వివరించారు. (యోహాను 17:3) నేను వెంటనే మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలో నుండి యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నేను రాజ్యమందిరంలో క్రైస్తవ కూటాలన్నిటికీ హాజరవడం కూడా మొదలుపెట్టి నా జీవితంలో మార్పులు చేసుకున్నాను. పొగత్రాగడం మానేశాను.
కానీ నా అంధత్వం నా ప్రగతికి అడ్డంకిగా తయారయ్యింది. కాబట్టి నేను బ్రెయిలీ చదవడం, రాయడం నేర్చుకోవడానికి బ్రెయిలీ నేర్పించే ఇన్స్టిట్యూట్కు వెళ్ళడం మొదలుపెట్టాను. దానితో నేను రాజ్యమందిరంలో పరిచర్యకు సంబంధించి ఇచ్చే శిక్షణలో భాగం వహించగలిగాను. త్వరలోనే నేను మా ఇరుగుపొరుగు వాళ్ళకు ప్రకటించడం మొదలుపెట్టాను. నా జీవితంలో మళ్ళీ సంతోషం చిగురించింది. నేను యెహోవా దేవుని గురించి మరింత జ్ఞానం సంపాదించుకుంటూ ఆయనకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నేను 1994 మే 7న బాప్తిస్మం తీసుకున్నాను.
యెహోవా పట్ల, ప్రజల పట్ల నాకున్న ప్రేమ పెరిగే కొద్దీ నేను పూర్తికాల సేవ మొదలుపెట్టాలని కోరుకున్నాను. నేను 1995 డిసెంబరు 1న క్రమ పయినీరుగా పూర్తికాల సేవ మొదలుపెట్టాను. 2004 ఫిబ్రవరి నుండి సంఘ పెద్దగా సేవ చేసే గొప్ప అవకాశం పొందాను. కొన్నిసార్లు మా ప్రాంతంలోని వేరే సంఘాల వాళ్ళు ప్రసంగమివ్వడానికి నన్ను పిలుస్తుంటారు. ఈ ఆశీర్వాదాలన్నీ నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి, వాటి వల్లే యెహోవా దేవుని సేవ చేయాలన్న మన కోరిక నెరవేరడానికి ఎలాంటి వైకల్యమూ అడ్డుకాదని గ్రహించగలిగాను.
యెహోవా నాకు “కళ్ళు” ఇచ్చాడు
ముందు చెప్పినట్లుగా, నా అంధత్వం మూలంగా నా భార్య నన్ను వదిలేసింది. కానీ యెహోవా నాకు మరో ఆశీర్వాదాన్నిచ్చాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో యెహోవా నాకు “కళ్ళు” ఇచ్చాడు. నాకు వైకల్యం ఉన్నప్పటికీ ఆనీ మొవంబూ నన్ను భర్తగా అంగీకరించి నాకు “కళ్ళు” అయింది. ఆమె కూడా పూర్తికాల పరిచర్య చేస్తోంది కాబట్టి పరిచర్యలో ఎప్పుడూ నా వెంటే ఉంటుంది. నేను నా ప్రసంగాల కోసం బ్రెయిలీలో నోట్సు రాసుకోవడానికి వీలుగా ఆమె సమాచారాన్ని చదివి వినిపిస్తుంది. ఆమె నాకొక ప్రత్యేకమైన ఆశీర్వాదమని చెప్పవచ్చు. ఆమె మూలంగా నేను “గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము” అని చెబుతున్న సామెతలు 19:14లోని మాటల్లో ఎంత నిజముందో గ్రహించాను.
యెహోవా మమ్మల్ని మరింత ఆశీర్వదించాడు, మాకు ఒక బాబు, పాప పుట్టారు. నూతనలోకంలో వాళ్ళ ముఖాలు చూడాలని నేనెంతో కోరుకుంటున్నాను. మరో ఆశీర్వాదం ఏమిటంటే, తన స్థలంలో నివసించడానికి మమ్మల్ని అనుమతించిన మా అన్నయ్య బైబిలు సత్యాన్ని అంగీకరించి, బాప్తిస్మం తీసుకున్నాడు. మేమంతా ఒకే సంఘంలో ఉన్నాం.
దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు కాబట్టి నాకు వైకల్యమున్నా నేను దేవుని సేవ మరింతగా చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. (మలాకీ 3:10) ఆయన రాజ్యం రావాలని, భూమ్మీదున్న బాధలన్నీ తొలగించాలని నేను ప్రతీరోజు ప్రార్థిస్తాను. యెహోవాను తెలుసుకోగలిగాను కాబట్టి నేను ధైర్యంగా ఇలా చెప్పగలను: ‘యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. దానితోపాటు ఆయన ఏ బాధలూ రానివ్వడు.’—సామెతలు 10:22, NW. (w12-E 06/01)
[30వ పేజీలోని చిత్రాలు]
ప్రసంగం ఇస్తున్నప్పుడు; నా భార్యాపిల్లలు, మా అన్నయ్య