బైబిలు జీవితాలను మారుస్తుంది
“నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది”
-
జననం: 1981
-
దేశం: అమెరికా
-
ఒకప్పుడు: దారితప్పిన కుమారుడు
నా గతం:
నేను అమెరికాలోని ఉత్తర వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఓహాయో నదీ తీరాన ప్రశాంతమైన మౌండ్స్విల్ పట్టణంలో పుట్టాను. మేము నలుగురు పిల్లలం, అందులో ముగ్గురం అబ్బాయిలమే, నేను రెండోవాణ్ణి. మా ఇల్లు నిశ్శబ్దంగా ఉండడం దాదాపు జరగని పని. మా అమ్మానాన్న కష్టజీవులు, సాటివాళ్లను ప్రేమించే నిజాయితీపరులు. మేము పెద్ద ఉన్నవాళ్లమేమీ కాకపోయినా మాకు ఎప్పుడూ ఏ లోటూ రాలేదు. యెహోవాసాక్షులైన మా తల్లిదండ్రులు మా చిన్నతనంలోనే బైబిలు సూత్రాలను మా హృదయాల్లో నాటడానికి చేయగలిగినదంతా చేశారు.
ఎదిగే వయసు వచ్చేసరికే నా హృదయం తప్పుదారి పట్టడం మొదలైంది. బైబిలు సూత్రాలు పాటిస్తే జీవితంలో ఏదైనా కోల్పోతానేమో అనే అనుమానం నాకు వచ్చింది. నాకు నచ్చినట్టు జీవిస్తేనే సంతోషంగా ఉంటానని అనుకున్నాను. అప్పటికే క్రైస్తవ కూటాలకు వెళ్లడం మానేశాను. మా అన్నయ్య, చెల్లీ నాలాగే తయారయ్యారు. మమ్మల్ని మార్చడానికి మా తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు, కానీ అవన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.
నేను కోరుకున్న స్వేచ్ఛ నన్ను ఎన్నో వ్యసనాలకు బానిసను చేస్తుందని నేను ఊహించలేదు. ఒకరోజు స్కూలు నుండి ఇంటికి వస్తుంటే దారిలో ఒక స్నేహితుడు సిగరెట్ ఇచ్చి కాల్చమన్నాడు. నేను కాల్చాను. ఆరోజు మొదలు, ఎన్నో పాడు అలవాట్లకు లొంగిపోయాను. రానురాను మత్తుమందులు తీసుకోవడం, తాగడం, చెడు తిరుగుళ్లు తిరగడం ఇదే నా జీవితం అయిపోయింది. కొన్ని సంవత్సరాలకు, మరింత ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను వాడి చూశాను. వాటిల్లో చాలావాటికి బానిసైపోయాను. ఎంతగా అంటే, వాటిని కొనడానికి మత్తుమందుల అమ్మకం కూడా మొదలుపెట్టాను.
నేను చేసేది తప్పని నా మనస్సాక్షి పదేపదే నన్ను వేధించేది, కానీ నేను దాని నోరు నొక్కేయడానికి ప్రయత్నించేవాడిని. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది, చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏంలాభం అనిపించింది. పార్టీల్లో, మ్యూజికల్ ప్రోగ్రామ్లలో చుట్టూ ఎంతమంది జనమున్నా ఏదో వెలితిగా అనిపించేది, తెలియని ఒంటరితనం వేధించేది. మా అమ్మానాన్నలు ఎంత మంచివాళ్లో, ఎంత పద్ధతి ఉన్న వాళ్లో నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుండేది, కానీ నేనేంటి ఇలా తయారయ్యాను అనిపించేది.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .
నామీద నేను ఆశలు వదిలేసుకున్నాను, కొంతమంది మాత్రం వదులుకోలేదు. 2000 సంవత్సరంలో మా అమ్మానాన్న యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి నన్ను రమ్మన్నారు. వెళ్లాలనిపించకపోయినా వెళ్లాను. అక్కడ నా కళ్లను నేను నమ్మలేకపోయాను, నాలాగే తయారైన మా అన్నయ్య, చెల్లీ కూడా వచ్చారు!
అక్కడ కూర్చున్నప్పుడు, దాదాపు సంవత్సరం క్రితం అదే స్థలంలో మ్యూజికల్ ప్రోగ్రామ్ జరగడం నాకు గుర్తొచ్చింది. దానికి దీనికీ ఉన్న తేడా చూసి నా మనసు చలించిపోయింది. ఇదే స్థలం మ్యూజికల్ ప్రోగ్రామ్ సమయంలో సిగరెట్ల కంపుతో, చెత్తాచెదారంతో నిండిపోయింది. ఆ ప్రోగ్రామ్కి వచ్చినవాళ్లకు మంచీమర్యాదలు లేవు, ఆ పాటల్లోని భావం మనసును కృంగదీసేలా ఉండేది. ఈ సమావేశంలో అయితే ఎటు చూసినా సంతోషంగా ఉండే ప్రజలున్నారు. వాళ్లు నన్ను చూసి ఎన్నో సంవత్సరాలైనా ఆప్యాయంగా పలకరించారు. చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి, భవిష్యత్తు మీద ఆశ చిగురింపజేసే సందేశం వేదిక మీద నుండి వినిపిస్తుంది. బైబిలు సత్యంతో వచ్చే సానుకూల ప్రభావం చూసినప్పుడు దాన్ని నేను ఎందుకు జారవిడుచుకున్నానా అని బాధేసింది.—యెషయా 48:17, 18.
“మత్తు పదార్థాల వాడకం, అమ్మకం మానేయడానికి బైబిలు నాకు శక్తినిచ్చింది, సమాజంలో ఒక మంచి పౌరుడిగా నన్ను తీర్చిదిద్దింది”
సమావేశం అయిపోయిన వెంటనే క్రైస్తవ సంఘానికి తిరిగి వెళ్లాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను. సమావేశంలో ఎదురైన మంచి అనుభవంతో మా అన్నయ్య, చెల్లీ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. మేము ముగ్గురం బైబిలు అధ్యయనం చేయడానికి ఒప్పుకున్నాం.
“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని చెబుతున్న యాకోబు 4:8లోని మాటలు నన్ను బాగా కదిలించాయి. దేవునికి దగ్గరవ్వాలంటే, నా పాత జీవితానికి స్వస్తి చెప్పాలని గ్రహించాను. పొగ తాగడం, మత్తుమందులు తీసుకోవడం, మందు కొట్టడం మానేయాలని ఇంకా వేరే మార్పులు కూడా చేసుకోవాలని నాకు అర్థమైంది.—2 కొరింథీయులు 7:1.
పాత స్నేహాలను వదిలిపెట్టి, యెహోవా ఆరాధకుల్లో కొత్త స్నేహితులను సంపాదించుకున్నాను. నాతో బైబిలు అధ్యయనం చేసిన సంఘ పెద్ద నాకు చాలా సహాయం చేశారు. నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసేవారు, మా ఇంటికి కూడా వచ్చేవారు. ఇప్పుడు నాకున్న మంచి స్నేహితుల్లో ఆయనొకరు.
2001 వసంతకాలంలో దేవునికి సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాను. మా అన్నయ్య, చెల్లీ కూడా బాప్తిస్మం తీసుకున్నారు. మా కుటుంబంలో అందరూ యెహోవా సేవలో ఒకటవడం చూసినప్పుడు మా అమ్మానాన్నలకు, నమ్మకంగా ఉన్న మా తమ్ముడికి పట్టలేనంత ఆనందం కలిగింది.
నేనెలా ప్రయోజనం పొందానంటే . . .
బైబిలు సూత్రాలు మనుషుల్ని కట్టడి చేస్తాయని ఒకప్పుడు అనుకునేవాణ్ణి. కానీ అవి మనకు రక్షణ కల్పిస్తాయని ఇప్పుడు నమ్ముతున్నాను. మత్తు పదార్థాల వాడకం, అమ్మకం మానేయడానికి బైబిలు నాకు శక్తినిచ్చింది, సమాజంలో ఒక మంచి పౌరుడిగా నన్ను తీర్చిదిద్దింది.
ఐక్యంగా యెహోవాను ఆరాధిస్తున్న అంతర్జాతీయ సహోదర బృందంలో ఇప్పుడు నేనూ ఒకడిని! యెహోవా సేవకులు ఎంతో ప్రేమగా ఉంటారు, ఐక్యంగా దేవుణ్ణి సేవిస్తారు. (యోహాను 13:34, 35) అలాంటి వాళ్లలో నుండి ఒక మంచి బహుమానం నాకు దొరికింది. అదెవరో కాదు, నేను ప్రాణప్రదంగా ప్రేమిస్తూ మురిపెంగా చూసుకుంటున్న నా భార్య అడ్రియన్. మేమిద్దరం ఎంతో ఆనందంగా సృష్టికర్తను సేవిస్తున్నాం.
ఇప్పుడు నేను స్వార్థం చూసుకునే వ్యక్తిని కాను, స్వచ్ఛందంగా పూర్తికాల సేవను చేస్తున్నాను. ఆ సేవలో భాగంగా దేవుని వాక్యం నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో ప్రజలకు బోధిస్తున్నాను. ఈ పని నాకు అన్నిటికన్నా ఎంతో సంతోషాన్నిచ్చింది. బైబిలు నా జీవితాన్ని మార్చేసిందని పూర్తి నమ్మకంతో దృఢంగా చెప్పగలను. నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది. ▪ (w13-E 01/01)