కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి దగ్గరవ్వండి

‘నీవు ఈ సంగతుల్ని పసిబాలలకు బయలుపర్చావు’

‘నీవు ఈ సంగతుల్ని పసిబాలలకు బయలుపర్చావు’

మీరు దేవుని గురించిన సత్యాన్ని అంటే ఆయనెవరు, ఆయన ఇష్టాయిష్టాలు ఏమిటి, ఆయన సంకల్పమేమిటి వంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? యెహోవా దేవుడు తన గురించిన సత్యమంతా బైబిల్లో రాయించాడు. అలాగని బైబిలును చదివి, ఆ సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అందరివల్లా కాదు. ఎందుకని? ఎందుకంటే, అలాంటి ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించడం ఒక అరుదైన అవకాశం; అది అందరికీ దొరికేది కాదు. దీని గురించి యేసు ఏమి చెప్పాడో పరిశీలిద్దాం.మత్తయి 11:25 చదవండి.

‘ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా’ అనే మాటలతో ఆ వచనం మొదలౌతుంది. అంటే, యేసు ఇప్పుడు మాట్లాడబోయేది బహుశా అంతకు ముందు జరిగిన దాని గురించి కావచ్చు. తాను ఎన్నో అద్భుతాలు చేసిన మూడు గలిలయ పట్టణాల్లో సత్యానికి స్పందించని ప్రజలను ఆయన అంతకుముందే గద్దించాడు. (మత్తయి 11:20-24) అయితే, ‘యేసు చేసిన అద్భుతాల్ని చూసి కూడా ఆయన చెప్పిన సత్యానికి స్పందించని ప్రజలుంటారా?’ అని మీకు అనిపించవచ్చు. వాళ్ల మొండి వైఖరి వల్లే వాళ్లు స్పందించలేదు.—మత్తయి 13:10-15.

బైబిల్లోని ఆధ్యాత్మిక సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు రెండు విషయాలు అవసరమని యేసుకు తెలుసు. మొదటిది దేవుని సహాయం, రెండోది సరైన హృదయ వైఖరి. యేసు ఇలా వివరించాడు: ‘తండ్రీ ఆకాశానికి, భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతుల్ని మరుగుచేసి పసిబాలలకు బయలుపర్చావని నిన్ను స్తుతిస్తున్నాను.’ బైబిల్లోని ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించడం అరుదైన అవకాశమని ఎందుకు అనుకోవాలో మీకు అర్థమౌతుందా? యెహోవా దేవుడు ఆకాశానికి, భూమికి ప్రభువు, సత్యాన్ని ఎవరికి బయల్పర్చాలో, ఎవరికి మరుగుచేయాలో నిర్ణయించుకునే హక్కు ఆయనకు ఉంది. అలాగని దేవుడు పక్షపాతం చూపించడు. అయితే సత్యాన్ని ఎవరికి బయల్పర్చాలి, ఎవరికి మరుగుచేయాలి అనేదాన్ని ఆయన దేని ఆధారంగా నిర్ణయిస్తాడు?

యెహోవాకు వినయంగా ఉండేవాళ్లంటే ఇష్టం, అహంకారులంటే ఆయనకు ఇష్టం లేదు. (యాకోబు 4:6) ఆయన ‘జ్ఞానులకు, వివేకులకు’ సత్యాన్ని మరుగు చేస్తాడు. అంటే సొంత తెలివితేటల మీద ఆధారపడుతూ, దేవుని సహాయం తమకు అక్కర్లేదనుకునే గర్విష్ఠులైన ఈ లోక జ్ఞానులకు, విద్యావంతులకు ఆయన దాన్ని వెల్లడిచేయడు. (1 కొరింథీయులు 1:19-21) కానీ ఆయన దాన్ని ‘పసిబాలలకు’ వెల్లడిచేస్తాడు. అంటే చిన్నపిల్లల్లా వినయంతో, నిజంగా తెలుసుకోవాలనే కోరికతో తన సహాయాన్ని అర్థించేవాళ్లకు వెల్లడిచేస్తాడు. (మత్తయి 18:1-4; 1 కొరింథీయులు 1:26-28) దేవుని కుమారుడైన యేసు ఈ రెండు రకాల ప్రజల్నీ చూశాడు. ఆయన సందేశాన్ని విద్యావంతులైన, గర్విష్ఠులైన మత నాయకులు అర్థం చేసుకోలేదు గానీ, వినయస్థులైన జాలర్లు అర్థం చేసుకున్నారు. (మత్తయి 4:18-22; 23:1-5; అపొస్తలుల కార్యములు 4:13) అయితే, నిజమైన వినయం చూపించిన కొందరు సంపన్నులైన విద్యావంతులు కూడా యేసు శిష్యులయ్యారు.—లూకా 19:1, 2, 8; అపొస్తలుల కార్యములు 22:1-3.

మొదట్లో అడిగిన ప్రశ్న దగ్గరకు మళ్లీ వెళ్దాం: మీరు దేవుని గురించిన సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ లోకంలో తెలివైనవాళ్లమని అనుకునే వారిమీద దేవుని అనుగ్రహం ఉండదని తెలుసుకున్నప్పుడు మీరు ఊరటపొంది ఉంటారు. నిజానికి లోకపరంగా తెలివైనవాళ్ల చిన్నచూపుకి గురయ్యే వినయస్థుల మీద ఆయన అనుగ్రహం ఉంటుంది. మీరు సరైన వైఖరితో వినయంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తే, ఆయన మీకు కూడా సత్యం గురించిన అవగాహన అనే అమూల్యమైన బహుమానం ఇస్తాడు. ఆ సత్యాన్ని గ్రహిస్తే మీ జీవితానికి ఒక అర్థం చేకూరుతుంది, దేవుడు త్వరలో తీసుకొస్తానని మాటిచ్చిన నీతి విలసిల్లే కొత్త లోకంలో నిరంతర జీవితం అనే అసలుసిసలైన జీవితం మీ సొంతమవుతుంది. a1 తిమోతి 6:12, 18, 19; 2 పేతురు 3:13. ▪ (w13-E 01/01)

జనవరి - మార్చి నెలల్లో ఈ బైబిలు భాగం చదవండి:

మత్తయి 1లూకా 6 అధ్యాయాలు

a మీరు దేవుని గురించిన సత్యాన్ని, ఆయన సంకల్పాన్ని తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు సంతోషంగా సహాయం చేస్తారు. వాళ్లు బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకాన్ని ఉపయోగించి మీతో ఉచితంగా గృహ బైబిలు అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.