కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

“నేను చూశాను కానీ గ్రహించలేకపోయాను”

“నేను చూశాను కానీ గ్రహించలేకపోయాను”

అది 1975. నాకప్పుడు సరిగ్గా రెండేళ్లు. నాలో ఏదో లోపం ఉందని మా అమ్మ గుర్తించింది కూడా అప్పుడే. ఒకరోజు మా అమ్మ నన్ను ఎత్తుకున్నప్పుడు, తన స్నేహితురాలు ఒకామె పెద్ద వస్తువును కిందపడేసింది. అంత పెద్ద శబ్దం వచ్చినా, నాలో ఏ చలనం లేకపోవడం అమ్మ గమనించింది. మూడేళ్లు వచ్చినా నాకింకా మాటలు రాలేదు. అప్పుడు, డాక్టర్లు చెప్పిన మాటలు విని మా కుటుంబమంతా తల్లడిల్లిపోయింది. పుట్టుకతోనే నాకు వినికిడి లోపం ఉందని వాళ్లు తేల్చిచెప్పారు.

నా పసితనంలోనే మా అమ్మనాన్నలు విడిపోయారు. దాంతో నన్ను, మా ఇద్దరు అన్నలను, అక్కను అమ్మే పెంచింది. ఫ్రాన్స్‌లో, నా చిన్నప్పుడు బధిరులకు విద్య నేర్పిన పద్ధతికీ ఇప్పటి పద్ధతికీ చాలా తేడా ఉంది. అప్పటి పద్ధతులు చాలా కఠినంగా ఉండేవి. అయినా, చాలామంది బధిరులకు లేని ఒక ఆశీర్వాదం నాకుండేది. అదేమిటో మీకు చెబుతాను.

నేను ఐదేళ్ల వయసులో

అప్పట్లో, ఉపాధ్యాయుల పెదవుల కదలికల్నిబట్టి వాళ్లు చెప్పేది అర్థంచేసుకోవాలనీ తర్వాత దాన్ని తిరిగి చెప్పాలనీ బధిర పిల్లల్ని బలవంతం చేసేవాళ్లు. నిజానికి ఫ్రాన్స్‌లోని స్కూళ్లలో, సంజ్ఞా భాష అస్సలు మాట్లాడకూడదనే నియమం ఉండేది. అందుకే, పాఠాలు చెప్పేటప్పుడు బధిర పిల్లల్లో కొందరిని చేతులు వెనక్కి కట్టేసి కూర్చోబెట్టేవాళ్లు.

నా చిన్నతనంలో కొన్నేళ్లపాటు, వారంలో చాలా గంటలు ఉచ్చారణ మెరుగుపర్చే నిపుణురాలి (స్పీచ్‌ థెరపిస్ట్‌) దగ్గరే గడిపేవాణ్ణి. తను నా దవడనో తలనో పట్టుకుని, నాకస్సలు వినపడని శబ్దాలను మళ్లీమళ్లీ పలకమని బలవంతం చేసేది. నా మనసులోని మాటల్ని మిగతా పిల్లలతో పంచుకోలేకపోయేవాణ్ణి. ఆ సంవత్సరాలన్నిటిలో నేను పడిన బాధ అంతా ఇంతా కాదు.

ఆరేళ్ల వయసప్పుడు, నన్ను బధిరుల పాఠశాలలో వేశారు. అక్కడే మొట్టమొదటిసారి నాలాంటి ఇంకొందరు పిల్లలను కలుసుకున్నాను. కానీ అక్కడ కూడా సంజ్ఞా భాష మాట్లాడడం నిషేధించారు. ఒకవేళ తరగతిలో ఎవరైనా సంజ్ఞలు చేసుకుంటే, వాళ్ల చేతి కీళ్లపై కొట్టేవాళ్లు లేదా జట్టు పట్టుకొని లాగేవాళ్లు. అయినా, మేము మాత్రం సొంతగా కనిపెట్టిన సంజ్ఞలతో చాటుగా మాట్లాడుకునేవాళ్లం. అలా చివరికి, నేను కూడా సంజ్ఞలు చేస్తూ ఇతర పిల్లలతో మాట్లాడగలిగాను. దాంతో, నాలుగేళ్లు సంతోషంగా గడిచిపోయాయి.

నాకు పదేళ్లు వచ్చాక, మామూలు పిల్లలు చదివే ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. దాంతో చాలా నిరాశపడ్డాను! ప్రపంచంలోని బధిర పిల్లలందరూ చనిపోయి నేనొక్కడినే మిగిలినట్లు అనిపించేది. స్పీచ్‌ థెరపిస్ట్‌ దగ్గర నేర్చుకున్నదంతా ఎక్కడ మర్చిపోతానో అనే భయంతో డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు మా ఇంట్లో ఎవ్వరూ సంజ్ఞా భాష నేర్చుకోలేదు. పైగా నన్ను కూడా ఇతర బధిర పిల్లలతో కలవనిచ్చే వాళ్లు కాదు. ఒకసారి నన్ను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడం నాకింకా గుర్తుంది. ఆయన బల్ల మీద ఒక సంజ్ఞా భాష పుస్తకం ఉంది. దానిమీద ఉన్న చిత్రాలను చూడగానే “నాకది కావాలి!” అని దానివైపు చూపించాను. వెంటనే ఆయన ఆ పుస్తకాన్ని తీసి దాచేశాడు. a

బైబిలు సత్యాల పరిచయం

మా అమ్మ, మాలో క్రైస్తవ సూత్రాలు నాటడానికి కృషిచేసింది. మమ్మల్ని బోర్డో దగ్గర మేరీన్యాక్‌లో జరిగే యెహోవాసాక్షుల కూటాలకు తీసుకెళ్లేది. నా చిన్నతనంలో, కూటాల్లో చెప్పే విషయాలు నాకు పెద్దగా అర్థమయ్యేవి కావు. కానీ సహోదరులు వంతులవారిగా నా పక్కన కూర్చొని, కూటాల్లో చెప్పేదంతా నాకోసం నోట్సు రాసేవాళ్లు. వాళ్లు చూపించిన ప్రేమ, శ్రద్ధ నన్నెంతో కదిలించాయి. ఇంట్లో, మా అమ్మ నాతో బైబిలు అధ్యయనం చేసేది కానీ తను చెప్పేది నాకెప్పుడూ పూర్తిగా అర్థమయ్యేది కాదు. దూత దగ్గర ప్రవచనం అందుకున్నప్పుడు దానియేలు ప్రవక్త, ‘నేను విన్నాను కానీ గ్రహించలేకపోయాను’ అన్నాడు. నాకూ అలాగే అనిపించేది. (దానియేలు 12:8) కాకపోతే, “నేను చూశాను కానీ గ్రహించలేకపోయాను.”

అయినప్పటికీ, ప్రాథమిక బైబిలు సత్యాలు నా మనసులో నాటుకుపోయాయి. నాకు స్పష్టంగా అర్థమైనవాటిని విలువైనవిగా ఎంచుతూ వాటిని పాటించడానికి ప్రయత్నించేవాణ్ణి. ఇతరుల ప్రవర్తన చూసి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఉదాహరణకు, మనం ఓపిక కలిగివుండాలని బైబిలు చెబుతోంది. (యాకోబు 5:7, 8) అంతకుముందు, ఓపికంటే ఏమిటో నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. కానీ, తోటి సహోదరసహోదరీలను చూసినప్పుడు ఓపిక అంటే ఏమిటో అర్థమైంది. నిజంగా, క్రైస్తవ సంఘం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందాను.

తీవ్రమైన నిరుత్సాహం, పట్టలేనంత సంతోషం

బైబిలును అర్థం చేసుకోవడానికి స్టేఫాన్‌ నాకు సహాయం చేశాడు

నేను టీనేజీలో ఉన్నప్పుడు ఒకరోజు, కొంతమంది బధిరులు వీధిలో నిలబడి సంజ్ఞా భాషలో మాట్లాడుకుంటున్నారు. నేను ఎవరికీ తెలియకుండా వాళ్లతో సహవాసం చేస్తూ ఫ్రెంచ్‌ సంజ్ఞా భాష నేర్చుకున్నాను. నేను క్రైస్తవ కూటాలకు కూడా హాజరయ్యేవాణ్ణి. అందులో స్టేఫాన్‌ అనే యువ సాక్షి నాపై ఎంతో శ్రద్ధ చూపించేవాడు. ఆయన నాతో మాట్లాడడానికి ఎంతో ప్రయాసపడేవాడు, అలా మేము ప్రాణ స్నేహితులమయ్యాం. కానీ, కొంతకాలానికే నాకు తీవ్రమైన నిరుత్సాహం ఎదురైంది. సైన్యంలో చేరడానికి ఒప్పుకోలేదని స్టేఫాన్‌ని జైల్లో వేశారు. దాంతో, నేను చాలా కృంగిపోయాను! తను జైల్లో ఉన్నన్ని రోజులు తీవ్రమైన నిరుత్సాహానికి గురయ్యాను, కూటాలకు వెళ్లడం దాదాపు మానేశాను.

పదకొండు నెలల తర్వాత స్టేఫాన్‌ విడుదలై ఇంటికి వచ్చాడు. తను నాతో సంజ్ఞా భాషలో మాట్లాడుతుంటే ఎంత ఆశ్చర్యపోయానో ఒక్కసారి ఊహించండి. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను! ఏం జరిగిందంటే, జైల్లో ఉన్నప్పుడు తను ఫ్రెంచ్‌ సంజ్ఞా భాష నేర్చుకున్నాడు. నేను తన చేతి కదలికలు, ముఖకవళికలు గమనిస్తూ, తను ఫ్రెంచ్‌ సంజ్ఞా భాష నేర్చుకోవడం వల్ల నాకు జరిగే మేలు గురించి ఆలోచించినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు.

చివరకు బైబిలు సత్యాన్ని అర్థంచేసుకున్నాను

స్టేఫాన్‌ నాతో బైబిలు అధ్యయనం ప్రారంభించాడు. దాంతో, అప్పటివరకు నేర్చుకున్న విషయాలను ఒకచోట చేరుస్తూ బైబిలు సత్యాలను అర్థం చేసుకోగలిగాను. చిన్నతనంలో, బైబిలు ప్రచురణల్లోని చిత్రాలను చూసి వాటిలోని వ్యక్తులను సరిపోల్చుకుంటూ, ఇచ్చిన వివరాలన్నీ పరిశీలిస్తూ ఆ కథలను గుర్తుపెట్టుకునేవాణ్ణి. నాకు అబ్రాహాము గురించి, ఆయన ‘సంతానం’ గురించి, ‘గొప్ప సమూహం’ గురించి కొంత అవగాహన ఉండేది, కానీ వాటిని సంజ్ఞా భాషలో నాకు వివరించినప్పుడే వాటి పూర్తి అర్థాన్ని గ్రహించాను. (ఆదికాండము 22:15-18; ప్రకటన 7:9) నా సహజ భాష, నా హృదయాన్ని తాకే భాష అదేనని నాకర్థమైంది.

అప్పటి నుండి, కూటాల్లో చెప్పేది నాకు బాగా అర్థమయ్యేది. అది నా హృదయాన్ని చేరి, ఇంకా తెలుసుకోవాలనే కోరికను నాలో కలిగించింది. స్టేఫాన్‌ సహాయంతో, నాకున్న బైబిలు సత్యాల అవగాహన పెరుగుతూ వచ్చింది. దాంతో, 1992లో నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్నాను. అంత ప్రగతి సాధించినా, చిన్నప్పుడు ఇతరులతో మాట్లాడలేకపోయాను కాబట్టి నలుగురిలో కలవాలంటే ఇబ్బందిపడేవాణ్ణి.

పిరికితనంతో పోరాటం

కొంతకాలానికి, మా చిన్న బధిరుల గుంపును బోర్డో పరిసర ప్రాంతమైన పెసాక్‌లోని ఒక సంఘంతో కలిపేశారు. అది చాలా మంచిదైంది. దానివల్ల నేను సత్యంలో చక్కగా ఎదుగుతూ వచ్చాను. అప్పటికీ, ఇతరులతో మాట్లాడాలంటే కష్టపడేవాణ్ణి. అయితే వినే సామర్థ్యం ఉన్న నా స్నేహితులు, కూటాల్లో చెప్పే ప్రతీ విషయాన్ని నాకు అర్థమయ్యేలా వివరించేవాళ్లు. ఝీల్‌, ఏలోడీ దంపతులు నాతో మాట్లాడడానికి చాలా కృషి చేసేవాళ్లు. తరచూ, కూటం అయ్యాక భోజనానికో కాఫీకో ఇంటికి పిలిచేవాళ్లు. అలా వాళ్లతో మంచి స్నేహం ఏర్పడింది. దేవునిలాగే ప్రేమతో నడుచుకునే ప్రజల మధ్య ఉండడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా!

నా భార్య వనెస్స నాకు మంచి సహకారి

ఆ సంఘంలోనే, వనెస్స అనే అందమైన సహోదరిని కలిశాను. ఆమె సున్నితమైన మనస్సు, చక్కని వివేచన నన్ను ఆకట్టుకున్నాయి. నాకున్న వినికిడి లోపాన్ని ఆమె ఎన్నడూ ఒక అడ్డంకిగా చూడలేదు. బదులుగా, నాలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి అదొక అవకాశం అనుకునేది. ఆమె నా మనసు గెలుచుకుంది, దాంతో 2005లో మేమిద్దరం పెళ్లిచేసుకున్నాం. నేను ఇతరులతో మాట్లాడడానికి చాలా ఇబ్బందిపడేవాణ్ణి. నా పిరికితనాన్ని పోగొట్టుకుని, ఇతరులతో ధైర్యంగా మాట్లాడేందుకు వనెస్స ఎంతో సహాయం చేసింది. నా బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించేలా ఆమె ఇస్తున్న మద్దతును కూడా ఎప్పటికీ మర్చిపోలేను.

యిహోవా ఇచ్చిన మరో బహుమానం

మా పెళ్లయిన సంవత్సరమే మాకు ఒక ఆహ్వానం అందింది. అనువాద పనిలో నెల రోజులపాటు శిక్షణ పొందడానికి రమ్మని ఫ్రాన్స్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం మమ్మల్ని పిలిచింది. అప్పట్లో, డీవీడీల రూపంలో ఎన్నో ఫ్రెంచ్‌ సంజ్ఞా భాష ప్రచురణలను తయారుచేయడానికి ఆ బ్రాంచి చాలా కృషిచేసింది. చేయాల్సిన పని ఎంతో ఉంది కాబట్టి, ఇంకా ఎక్కువమంది అనువాదకులు అవసరమయ్యారు. అందుకే, అనువాద విభాగంలో సేవ చేయడానికి నన్ను పిలిచారు.

ఫ్రెంచ్‌ సంజ్ఞా భాషలో బైబిలు ప్రసంగం ఇస్తున్నాను

బ్రాంచి కార్యాలయంలో పని చేయడం నాకు దొరికిన అతి గొప్ప అవకాశం, అది యెహోవా ఇచ్చిన బహుమానం. కానీ, మా సంజ్ఞా భాష గుంపు పరిస్థితి ఏమిటి? మా ఇంటిని ఏమి చేయాలి? వనెస్సకు అక్కడ ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా? అని మొదట్లో మేము భయపడ్డాం. కానీ యెహోవా అద్భుతరీతిలో మా సమస్యలన్నిటినీ తీర్చేశాడు. మా పట్ల, బధిరుల పట్ల యెహోవాకు ఎంత ప్రేమవుందో నాకు అర్థమైంది.

ఐక్యతగల ప్రజల మద్దతు

నేను అనువాద పనిలో ఉండడం వల్ల, బధిరులు దేవుణ్ణి తెలుసుకునేలా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో స్పష్టంగా అర్థం చేసుకోగల్గుతున్నాను. చాలామంది తోటి పనివాళ్లు నాతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. వాళ్లు కొన్ని సంజ్ఞలను నేర్చుకోవడం, వాటిని ఉపయోగించి నాతో మాట్లాడడం నా హృదయాన్ని కదిలిస్తుంది. ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదనే ఆలోచన ఎన్నడూ రాదు. ప్రేమతో వాళ్లు చేసే ఈ పనులు, యెహోవా ప్రజల మధ్య ఉండే అసాధారణ ఐక్యతకు రుజువులు.—కీర్తన 133:1.

బ్రాంచి కార్యాలయంలోని అనువాద విభాగంలో పనిచేస్తూ

క్రైస్తవ సంఘంలో ఎవరో ఒకరిని ఉపయోగించి నాకు ఎల్లప్పుడూ సహాయం అందేలా చూస్తున్న యెహోవాకు నేనెంతో రుణపడివున్నాను. ప్రేమగల సృష్టికర్తను తెలుసుకుని, ఆయనకు దగ్గరవ్వడానికి నాలాంటి బధిరులకు సహాయం చేసే పనిలో నాకున్న చిన్న అవకాశాన్నిబట్టి కూడా చాలా సంతోషిస్తున్నాను. మాట్లాడడానికున్న అడ్డంకులన్నీ పోయి, ప్రపంచంలో అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా “స్వచ్ఛమైన భాష” అంటే యెహోవా గురించిన, ఆయన సంకల్పాల గురించిన సత్యం మాట్లాడే రోజు కోసం నేను ఆశతో ఎదురుచూస్తున్నాను.—జెఫన్యా 3:9, NW.▪ (w13-E 03/01)

a 1991 వరకూ, బధిర పిల్లలకు సంజ్ఞా భాషలో చదువు చెప్పడాన్ని ఫ్రెంచ్‌ ప్రభుత్వం అధికారికం చేయలేదు.