ముఖపత్ర అంశం: మోషే నుండి మనం ఏమి నేర్చుకుంటాం?
మోషే ఎవరు?
మోషేను మీరెలా ఊహించుకుంటారు?
-
ఒక తల్లి నైలునదిలో మెల్లగా వదిలిన పెట్టెలోని పసిబిడ్డలానా?
-
ఐగుప్తు రాజకుటుంబంలో విలాసవంతంగా పెరిగినా ఇశ్రాయేలీయుణ్ణనే విషయం మర్చిపోని బాలుడిగానా?
-
మిద్యానులో 40 ఏళ్లపాటు గొర్రెల్ని కాసిన కాపరిగానా?
-
మండుతున్న పొద దగ్గర యెహోవాతో a మాట్లాడిన వ్యక్తిగానా?
-
ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుండి విడుదల చేయమని ఐగుప్తు రాజును అడిగిన ధైర్యవంతునిగానా?
-
సత్యదేవుణ్ణి ఫరో అగౌరవపర్చినందుకు, దేవుని ఆజ్ఞ ప్రకారం ఐగుప్తు మీద పది తెగుళ్లు ప్రకటించిన వ్యక్తిగానా?
-
ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకువచ్చిన నాయకుడిగానా?
-
ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా విడదీయడానికి దేవుడు ఉపయోగించుకున్న మనిషిగానా?
-
దేవుడిచ్చిన పది ఆజ్ఞల్ని ఇశ్రాయేలీయులకు అందజేసిన మధ్యవర్తిగానా?
అవును, మోషే జీవితంలో అవన్నీ జరిగాయి, వాటితో పాటు మరెన్నో జరిగాయి. విశ్వాసానికి పేరుగాంచిన మోషేను క్రైస్తవులు, యూదులు, ముస్లింలు ఎంతో గౌరవిస్తారు.
మోషే ఎన్నో “శక్తివంతమైన ఆశ్చర్యకార్యాలు” చేసిన ప్రవక్త అనడంలో సందేహం లేదు. (ద్వితీయోపదేశకాండము 34:10-12, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) దేవుడు మోషేతో ఎన్నో అద్భుతకార్యాలు చేయించాడు. అయినా మోషే కూడా ఒక మామూలు మనిషే. యేసు పరిచర్య కాలంలోని ఒక దర్శనంలో ఏలీయా ప్రవక్తతో పాటు కనిపించిన మోషే ‘మనలాంటి స్వభావంగల’ మనిషే. (యాకోబు 5:17; మత్తయి 17:1-9) నేడు మనకొచ్చే కష్టాలే మోషేకు కూడా వచ్చాయి, అయినా వాటిని ఆయన జయించాడు.
ఆయన వాటిని ఎలా జయించాడో మీకు తెలుసుకోవాలనుందా? మోషే చూపించిన మూడు మంచి లక్షణాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం, ఆయన జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. (w13-E 02/01)
a దేవుని పేరు యెహోవా అని బైబిలు తెలియజేస్తోంది.