కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి దగ్గరవ్వండి

“ఆయన సజీవులకే దేవుడు”

“ఆయన సజీవులకే దేవుడు”

మరణం దేవునికన్నా బలమైందా? ఎంతమాత్రం కాదు! ‘సర్వశక్తిగల దేవుని’ కన్నా ఎక్కువ బలం, మరణానికే కాదు మరే ‘శత్రువుకూ’ లేదు. (1 కొరింథీయులు 15:26; నిర్గమకాండము 6:3) చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించి, మరణాన్ని పూర్తిగా లేకుండా చేసే శక్తి దేవునికి ఉంది. అంతేకాదు, తాను తీసుకువచ్చే కొత్త లోకంలో అలా చేస్తానని ఆయన మాటిచ్చాడు. a ఆ వాగ్దానాన్ని ఎంతవరకు నమ్మవచ్చు? దీని గురించి ఆయన సొంత కుమారుడైన యేసు చెప్పిన మాటలు, మన హృదయాల్లో ఆశను నింపుతాయి.—మత్తయి 22:31-33 చదవండి.

చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికిస్తాననే దేవుని వాగ్దానాన్ని నమ్మని సద్దూకయ్యులతో మాట్లాడుతున్నప్పుడు, యేసు ఇలా చెప్పాడు: ‘మృతుల పునరుత్థానం గురించి—నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గానీ మృతులకు దేవుడు కాడు.’ దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, మండుతున్న పొద దగ్గర దేవుడు మోషేతో మాట్లాడిన మాటలనే యేసు ఎత్తి చెప్పాడు. (నిర్గమకాండము 3:1-6) “నేను . . . అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను” అని యెహోవా మోషేతో అన్నాడు. చనిపోయినవాళ్లను తిరిగి లేపుతానని యెహోవా చేసిన వాగ్దానం ఎంత ఖచ్చితంగా నెరవేరుతుందో ఆ మాటలు రుజువు చేస్తున్నాయని యేసు అంటున్నాడు. ఎలా?

ఒకసారి యెహోవా మోషేతో మాట్లాడిన సందర్భాన్ని గమనించండి. అప్పటికి, మోషే పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు చనిపోయి చాలా కాలమైంది. అబ్రాహాము చనిపోయి 329 ఏళ్లు, ఇస్సాకు చనిపోయి 224 ఏళ్లు, యాకోబు చనిపోయి 197 ఏళ్లు గడిచిపోయాయి. అయినా, యెహోవా తాను వాళ్ల ‘దేవుడనై ఉన్నాను’ అన్నాడు కానీ ‘ఉండేవాడిని’ అనలేదు. అంటే, అప్పటికి ఆ ముగ్గురు పూర్వీకులు ఇంకా బ్రతికి ఉన్నట్లే యెహోవా మాట్లాడాడు. ఎందుకని?

“ఆయన [యెహోవా] సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు” అని యేసు వివరించాడు. ఆ మాటల అర్థమేమిటో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ చనిపోయినవాళ్లను యెహోవా తిరిగి లేపకపోతే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఎప్పటికీ మరణపు కోరల్లోనే చిక్కుకొని ఉంటారు. అలాగైతే, యెహోవా శవాలకు దేవుడౌతాడు. అప్పుడు, మరణం దేవునికంటే బలమైనదన్నట్లు, ఆయన తన నమ్మకమైన సేవకులను కూడా మరణం గుప్పిట్లో నుండి విడిపించలేని అసమర్థుడన్నట్లు కనిపిస్తుంది.

మరైతే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల గురించి, ఇప్పటివరకు చనిపోయిన ఇతర నమ్మకమైన సేవకుల గురించి మనమేమి చెప్పవచ్చు? వాళ్ల గురించి యేసు ఈ శక్తిమంతమైన మాటలను చెప్పాడు: “ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారు.” (లూకా 20:37, 38) చనిపోయిన తన నమ్మకమైన సేవకుల్ని తిరిగి లేపాలనే తన ఉద్దేశాన్ని యెహోవా తప్పకుండా నెరవేరుస్తాడు కాబట్టే, వాళ్లు ఇంకా జీవిస్తున్నట్లే ఆయన భావిస్తున్నాడు. (రోమీయులు 4:16, 17) అలా తిరిగి బ్రతికించే సమయం వచ్చేవరకు వాళ్లందర్నీ యెహోవా తన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఆయన జ్ఞాపకశక్తి అపరిమితమైనది.

మరణం కంటే యెహోవా ఎంతో బలవంతుడు

చనిపోయిన మీ ఆత్మీయులను తిరిగి కలుసుకోవడమనే ఆలోచన మీ హృదయాన్ని ఆనందంతో నింపుతోందా? అలాగైతే, మరణం కంటే యెహోవా ఎంతో బలవంతుడని గుర్తుంచుకోండి. చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికిస్తాననే తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఏదీ ఆయనను ఆపలేదు. కాబట్టి ఆ వాగ్దానం గురించి, దాన్ని నెరవేర్చే దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి. అలాచేస్తే, ‘సజీవులకు దేవుడైన’ యెహోవాకు మీరు తప్పకుండా మరింత దగ్గరౌతారు. ▪ (w13-E 02/01)

ఏప్రిల్‌- జూన్‌ నెలల్లో ఈ బైబిలు భాగం చదవండి:

లూకా 7అపొస్తలుల కార్యములు 10 అధ్యాయాలు

a చనిపోయినవాళ్లను, నీతి నివసించే కొత్త లోకంలో మళ్లీ బ్రతికిస్తానని దేవుడు చేసిన వాగ్దానం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 7వ అధ్యాయం చూడండి.