కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు
మీ పిల్లవాడు వైకల్యంతో బాధపడుతుంటే ...
కార్తీక్: a “మా బాబు అఖిల్‌కి డౌన్ సిండ్రోమ్ వ్యాధి ఉంది. వాడి బాగోగులు చూసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా చాలా నీరసించిపోతాం. ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని చూసుకోవడానికే ఎంతో శక్తి కావాలి, అలాంటిది ఈ వ్యాధితో బాధపడే పిల్లల్ని చూసుకోవాలంటే దానికి వందరెట్ల శక్తి కావాలి. దీనివల్ల కొన్నిసార్లు నాకు, మా ఆవిడకు మధ్య గొడవలు కూడా అవుతుంటాయి.”
మనీషా: “అఖిల్‌కి చిన్నచిన్న విషయాలు నేర్పించాలన్నా చాలాసార్లు చెప్పాలి, అందుకు మాకు కొండంత ఓపిక అవసరమౌతుంది. నేను బాగా అలసిపోయినప్పుడు ఊరకే చిరాకొస్తుంది, దాంతో మా ఆయన మీద కూడా అరిచేస్తాను. కొన్నిసార్లు మా ఇద్దరి అభిప్రాయాలు కలవవు, అప్పుడు మేము వాదులాడుకుంటాం.”
మీ పిల్లవాడు పుట్టిన క్షణాలను ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఆ పసికందును ఎత్తుకోవాలని మీరు ఎంతో ఆత్రంగా ఎదురుచూసి ఉంటారు. అయితే కార్తీక్, మనీషాల్లాంటి తల్లిదండ్రులకైతే బిడ్డ పుట్టాడనే సంతోషం, వాడు వైకల్యంతో పుట్టాడనే ఆందోళన వల్ల నీరుగారిపోతుంది.
మీ పిల్లవాడు వైకల్యంతో బాధపడుతున్నాడా? వాణ్ణి ఎలా పెంచాలాని మీరు ఆందోళన చెందుతున్నారా? అలాగైతే, నిరాశపడకండి. మీలాంటి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చక్కగా పెంచగలిగారు. అలాంటి పిల్లల్ని పెంచుతున్నప్పుడు సాధారణంగా ఎదురయ్యే మూడు సవాళ్లను గమనించండి. వాటిని ఎదుర్కోవడానికి బైబిలు జ్ఞానం మీకెలా సహాయం చేస్తుందో పరిశీలించండి.
మొదటి సవాలు: వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉండవచ్చు.
సాధారణంగా, తమ బిడ్డ వైకల్యంతో పుట్టాడని తెలియగానే తల్లిదండ్రుల గుండెలు బద్దలౌతాయి. మెక్సికోలో ఉంటున్న జూలీయానా
ఇలా అంది: “మా అబ్బాయి సాంట్యాగోకి పక్షవాతం ఉందని డాక్టర్ చెప్పినప్పుడు అస్సలు నమ్మలేకపోయాను . . . నేను ఒక్కసారిగా కుప్పకూలిపోయాను.” ఇంకొంతమందికి, ఇటలీలో ఉంటున్న విలానాకు అనిపించినట్లే అనిపించవచ్చు. ఆమె ఇలా అంటుంది: “ఈ వయసులో పిల్లల్ని కంటే సమస్యలు వస్తాయని తెలిసినా నేను తల్లిని అవ్వాలనుకున్నాను . . . కానీ ఇప్పుడు మా బాబు డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడడం చూస్తుంటే తప్పు చేశానేమో అనిపిస్తుంది.”ఒకవేళ మీరూ అలాంటి భావాలతో నలిగిపోతుంటే, అలా అనిపించడం సహజమేనని గుర్తుంచుకోండి. మనం రోగాలతో బాధపడాలని దేవుడు మనల్ని పుట్టించలేదు. (ఆదికాండము 1:27, 28) సహజంకాని దాన్ని ఇట్టే జీర్ణించుకునే సామర్థ్యాన్ని దేవుడు తల్లిదండ్రులకు ఇవ్వలేదు. ఒకవిధంగా, మీరు పోగొట్టుకున్నదాన్ని బట్టి అంటే మీ పిల్లవాడి ఆరోగ్యాన్ని బట్టి మీకు తట్టుకోలేనంత దుఃఖం కలగడం సహజమే. అలాంటి పరిస్థితిని అర్థం చేసుకొని సర్దుకుపోవడానికి సమయం పడుతుంది.
మీ పిల్లవాడి వైకల్యానికి మీరే కారణం అనిపిస్తే అప్పుడేమిటి? జన్యు లోపాలు, చుట్టూవున్న పరిస్థితులు, ఇతర విషయాలు పిల్లవాడి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఎవరికీ పూర్తిగా తెలియదని గుర్తుంచుకోండి. మరికొందరేమో, తమ పిల్లవాడి వైకల్యానికి భాగస్వామిని నిందిస్తుంటారు. మీరు అలాంటి పొరపాటు చేయకండి. మీ భాగస్వామిని నిందించే బదులు తనతో సహకరిస్తూ మీ పిల్లవాడి బాగోగుల మీద శ్రద్ధపెడితే ప్రయోజనం ఉంటుంది.—ప్రసంగి 4:9, 10.
సలహా: మీ పిల్లవాడి పరిస్థితి గురించి తెలుసుకోండి. ‘జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది, వివేచన వల్ల అది స్థిరపర్చబడుతుంది’ అని బైబిలు చెబుతోంది.—సామెతలు 24:3.
మీ పిల్లవాడి వ్యాధి గురించి డాక్టర్లను అడగండి, లేదా నమ్మదగిన పుస్తకాలు చదివి తెలుసుకోండి. అలా తెలుసుకోవడం ఒక కొత్త భాష నేర్చుకోవడం లాంటిది. మొదట్లో కష్టంగానే ఉంటుంది, కానీ మెల్లమెల్లగా మీరు నేర్చుకోగలుగుతారు.
ఈ ఆర్టికల్ ప్రారంభంలో మాట్లాడిన కార్తీక్, మనీషాలు వాళ్ల బాబు గురించి తమ డాక్టర్‌ని అడిగారు, అలాంటి వ్యాధికి చికిత్స చేయడంలో పేరొందిన ఒక సంస్థను కూడా సంప్రదించారు. వాళ్లు ఇలా అంటున్నారు: “దానివల్ల, ఆ వ్యాధితో వచ్చే సమస్యల గురించే కాక, ఆ వ్యాధి ఉన్నవాళ్లు చేయగలిగే పనుల గురించి కూడా తెలుసుకున్నాం. మా బాబు చాలా విషయాల్లో మిగతా పిల్లల్లాగే ఉంటాడని మాకర్థమైంది. అది మాకు ఎంతో ఊరటనిచ్చింది.”
ఇలా చేసి చూడండి: మీ పిల్లవాడు ఏమి చేయగలడో వాటిపైనే దృష్టిపెట్టండి. కుటుంబమంతా కలిసి పాల్గొనేలా కొన్ని కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోండి. మీ పిల్లవాడు ఏ చిన్న పని సరిగ్గా చేసినా వెంటనే మెచ్చుకోండి, వాడితోపాటు మీరూ సంతోషించండి.
రెండవ సవాలు: మీరు బాగా అలసిపోయారని, మీ బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరని అనిపించవచ్చు.
అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లవాణ్ణి చూసుకోవడానికే శక్తంతా అయిపోతోందని మీకనిపిస్తుండవచ్చు. న్యూజిలాండ్‌లో ఉంటున్న జెన్నీ ఇలా అంది: “మా బాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిశాక కొన్ని సంవత్సరాల వరకు, ఇంట్లో ఏ కాస్త ఎక్కువ పని చేసినా బాగా అలసిపోయి, ఏడవడం మొదలుపెట్టేదాన్ని.”
ఇంకో సవాలు ఏమిటంటే, మీ బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరని అనిపించడం. మోహన్ వాళ్ల అబ్బాయి కండరాల బలహీనతతో, మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. మోహన్ ఇలా చెబుతున్నాడు: “మా జీవితం ఎలా ఉంటుందో చాలామందికి ఎప్పటికీ అర్థంకాదు.” మీ గోడు ఎవరితోనైనా చెప్పుకోవాలని మీకనిపిస్తుంది. కానీ మీ స్నేహితుల్లో చాలామందికి ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఉంటారు కాబట్టి, మీ బాధ వాళ్లతో చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉండవచ్చు.
సలహా: సహాయం అడగండి. అది దొరికినప్పుడు తీసుకోండి. ఇంతకుముందు మాట్లాడిన జూలీయానా ఇలా చెప్పింది: “కొన్నిసార్లు, సహాయం అడగాలంటే నాకూ మావారికీ చిన్నతనంగా అనిపించేది . . . కానీ మాకు ఇతరుల సహాయం అవసరమని గుర్తించాం. ఎవరైనా సహాయం చేసినప్పుడు, మేము ఒంటరివాళ్లమని మాకు అంతగా అనిపించదు.” మీరు కూటాల్లో ఉన్నప్పుడు లేదా పార్టీకి వెళ్లినప్పుడు, మీ సన్నిహిత స్నేహితుడు గానీ బంధువు గానీ మీ పిల్లవాడితో కూర్చుంటానని అడిగితే సంతోషంగా ఒప్పుకోండి. ‘నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అలాంటి వాడు సహోదరునిలా ఉంటాడు’ అని బైబిల్లో ఒక సామెత చెబుతుంది.—సామెతలు 17:17.
మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండాలంటే ఆంబులెన్స్‌లో ఎప్పటికప్పుడు ఇంధనం నింపుతుండాలి. అలాగే మీ పిల్లవానికి అవసరమైన సహాయం అందిస్తూ ఉండాలంటే మీరు మంచి పౌష్టికాహారం, విశ్రాంతి తీసుకుంటూ వ్యాయామం చేస్తూ శక్తి పుంజుకోవాలి. శేఖర్ వాళ్ల అబ్బాయి అవిటితనంతో బాధపడుతున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “మా అబ్బాయి నడవలేడు కాబట్టి వాణ్ణి అటూఇటూ తిప్పాలంటే ముందు నేను బాగా తినాలి. ఎంతైనా, నా కాళ్లే వాడి కాళ్లు కదా!”
మీ ఆరోగ్యం చూసుకోవడానికి సమయం ఎలా దొరుకుతుంది? కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లవాణ్ణి వంతులవారిగా చూసుకుంటారు. అలా ఒకరు పిల్లవాణ్ణి చూసుకుంటుంటే, మరొకరు వేరే పనులు చేసుకోవడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి వీలౌతుంది. అదంత సులువు కాకపోవచ్చు. అయినా, అంతగా ప్రాముఖ్యం కాని పనులను పక్కనపెట్టి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి. ఇండియాలో ఉంటున్న మాయూరీ ఇలా అంది: “మెల్లమెల్లగా అది మీకు అలవాటైపోతుంది.”
నమ్మదగిన స్నేహితునితో మనసువిప్పి మాట్లాడండి. కొన్నిసార్లు, ఆరోగ్యంగా ఉండే పిల్లలున్న వాళ్లు కూడా మీ బాధను చక్కగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు, మీరు యెహోవాకు ప్రార్థించవచ్చు. అలా ప్రార్థిస్తే ఏమైనా మంచి జరుగుతుందా? లలితకు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలున్నారు. ఆమె ఇలా అంటోంది: “కొన్నిసార్లు ఎంత ఒత్తిడి ఉంటుందంటే, ఇక తట్టుకోలేనేమో అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో ఊరట కోసం, బలం కోసం యెహోవాకు ప్రార్థిస్తాను. అప్పుడు మనసు కాస్త కుదుటపడుతుంది.”—ఇలా చేసి చూడండి: మీరేమి తింటున్నారో, ఎప్పుడు వ్యాయామం చేస్తున్నారో, ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటున్నారో ఒకసారి చూసుకోండి. మీ ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోగలిగేలా, అంత ప్రాముఖ్యంకాని ఏయే పనులను పక్కనపెట్టవచ్చో ఆలోచించండి. ఈ విషయాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉండండి.
మూడవ సవాలు: కుటుంబంలో మిగతా పిల్లల కన్నా వైకల్యమున్న వాడిపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుండవచ్చు.
కుటుంబంలో ఒక్క పిల్లవాడికి బాగోలేకపోయినా ఆ ప్రభావం కుటుంబమంతటిపై ఉంటుంది. వెళ్లాలనుకున్న చోటికి వెళ్లలేరు, తినాలనుకున్నవి తినలేరు. పైగా తల్లిదండ్రులు మిగతా పిల్లలతో అంతగా సమయం గడపలేరు. దానివల్ల, తల్లిదండ్రులు తమను పట్టించుకోవడం లేదని మిగతా పిల్లలకు అనిపించవచ్చు. అలా శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు రావచ్చు. లైబీరియాలో ఉంటున్న లయనెల్ ఇలా చెబుతున్నాడు: “పిల్లల్ని చూసుకునే పనంతా తన మీదే పడుతోందని, నేను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మా ఆవిడ అప్పుడప్పుడు విసుక్కుంటుంది. అలాంటప్పుడు, తను నన్ను చులకనగా చూస్తోందనిపించి నేను కూడా కటువుగా మాట్లాడుతుంటాను.”
సలహా: పిల్లలందరికీ నచ్చే ఆటవిడుపును ఏర్పాటు చేయండి, అలా మీకు వాళ్లపై శ్రద్ధవుందని భరోసా ఇవ్వండి. పైన చెప్పుకున్న జెన్నీ ఇలా అంటోంది: “కొన్నిసార్లు మేము మా పెద్దబ్బాయికి నచ్చేవి చేసేందుకు ప్రయత్నిస్తాం, కనీసం వాడికి నచ్చిన హోటల్‌కైనా తీసుకెళ్లి భోజనం చేస్తాం.”
మీ వివాహబంధం బలంగా ఉండాలంటే, మీ భాగస్వామితో మాట్లాడడానికి, కలిసి దేవునికి ప్రార్థించడానికి సమయం కేటాయించండి. ఇండియాలో ఉంటున్న ఆసీమ్ వాళ్ల అబ్బాయి మూర్ఛ రోగంతో బాధపడుతున్నాడు. ఆసీమ్ ఇలా అంటున్నాడు: “నేను, నా భార్య కొన్నిసార్లు బాగా అలసిపోవడం వల్ల, మాకు చిరాగ్గా ఉంటుంది. అయినా, మేము సమయం తీసుకొని మాట్లాడుకుంటాం, కలిసి ప్రార్థిస్తాం. ప్రతీరోజు ఉదయం మా పిల్లలు నిద్రలేవకముందే, నేనూ మా ఆవిడా కలిసి ఒక బైబిలు వచనాన్ని చర్చించుకుంటాం.” ఇంకొందరు దంపతులు, నిద్రపోయే ముందు కాసేపు మనసువిప్పి మాట్లాడుకుంటారు. అలా ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకుంటూ హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థిస్తే, తీవ్రమైన ఒత్తిడి ఎదురైనప్పుడు కూడా మీ వివాహబంధం బలంగా ఉంటుంది. (సామెతలు 15:22) ఒక జంట ఇలా చెబుతుంది: “మా జీవితంలోని మధుర క్షణాల్లో కొన్ని, కష్టాలొచ్చినప్పుడు మేము కలిసి గడిపినవే.”
ఇలా చేసి చూడండి: అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లవాడికి మీ మిగతా పిల్లలు ఏదైనా సహాయం చేస్తే, వాళ్లను మెచ్చుకోండి. భాగస్వామిపై, పిల్లలపై మీకున్న ప్రేమను, మెప్పుదలను ఎప్పటికప్పుడు వాళ్లకు తెలియజేస్తూ ఉండండి.
సానుకూలంగా ఆలోచించండి
చిన్నాపెద్దా తేడా లేకుండ అందర్నీ పట్టిపీడిస్తున్న రోగాలు, వైకల్యాలన్నిటినీ దేవుడు త్వరలోనే తీసేస్తాడని బైబిలు మనకు అభయాన్నిస్తోంది. (ప్రకటన 21:3, 4) అప్పుడు, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” b—యెషయా 33:24.
ఈలోగా, వైకల్యంతో బాధపడుతున్న మీ పిల్లల్ని మీరు చక్కగా పెంచవచ్చు. ఆర్టికల్ మొదట్లో మాట్లాడిన కార్తీక్, మనీషాలు ఇలా అంటున్నారు: “ఏదీ మీరనుకున్నట్లు జరగడం లేదని మీకనిపిస్తుంటే అస్సలు నిరుత్సాహపడకండి. మీ పిల్లవాడిలో ఉన్న చక్కని విషయాలు చూడండి, అలాంటివి ఎన్నో ఉంటాయి!” (w13-E 02/01)
a ఈ ఆర్టికల్‌లో ఉన్నవి అసలు పేర్లు కావు.
b సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాననే దేవుని వాగ్దానం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 3వ అధ్యాయం చూడండి.
ఇలా ప్రశ్నించుకోండి . . .
-
నా ఆరోగ్యాన్ని, మనసును, దేవునితో నా సంబంధాన్ని సాధ్యమైనంత చక్కగా ఉంచుకోవడానికి నేనేమి చేస్తున్నాను?
-
మా మిగతా పిల్లలు సహాయం చేసినప్పుడు ఈమధ్య కాలంలో ఎప్పుడు మెచ్చుకున్నాను?