కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి దగ్గరవ్వండి

‘అడుగుతూ ఉండండి, మీరు పొందుతారు’

‘అడుగుతూ ఉండండి, మీరు పొందుతారు’

“ప్రభువా, ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించు” అని ఒక శిష్యుడు యేసును అడిగాడు. (లూకా 11:1, NW) దానికి జవాబుగా యేసు, రెండు ఉపమానాల్ని చెప్పి ప్రార్థన ఎలా చేయాలో, దేవుడు మన ప్రార్థనల్ని వినాలంటే మనం ఏం చేయాలో బోధించాడు. మీ ప్రార్థనలు దేవుడు వినడం లేదేమోనని మీకు అనిపిస్తే, యేసు ఇచ్చిన సమాధానం మీ ఆసక్తిని చూరగొంటుంది.—లూకా 11:5-13 చదవండి.

మొదటి ఉపమానం, ప్రార్థించే వ్యక్తి గురించి మాట్లాడుతోంది. (లూకా 11:5-8) ఉపమానంలో, ఒక వ్యక్తి ఇంటికి అర్థరాత్రి వేళలో ఓ అతిథి వస్తాడు, అతనికి పెట్టడానికి ఇంట్లో ఏమీ ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్లకు వెంటనే తినడానికి ఏమైనా ఇవ్వాలి. వేళకాని వేళయినా, రొట్టెను అరువు తీసుకునేందుకు, ఆ వ్యక్తి తన స్నేహితుని ఇంటికి వెళ్తాడు. అయితే, ఆ స్నేహితుడు, అతని కుటుంబం మంచి నిద్రలో ఉండడంవల్ల, ఆయన లేవడానికి మొదట్లో ఇష్టపడడు. అయినా సరే సిగ్గు విడిచి ఆ వ్యక్తి పట్టుదలగా అడుగుతూనే ఉండడంతో ఆ స్నేహితుడు లేచి కావాల్సినవి ఇస్తాడు. a

ఈ ఉపమానంలో ప్రార్థన గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం పట్టుదలతో ఉండాలని అంటే అడుగుతూ, వెదుకుతూ, తడుతూ ఉండాలని యేసు నొక్కి చెబుతున్నాడు. (లూకా 11:5-13) పట్టుదల అవసరమని యేసు ఎందుకు చెబుతున్నాడు? మన ప్రార్థనలు వినడం దేవునికి ఇష్టం లేదని ఆయన చెప్పాలనుకున్నాడా? కానేకాదు. సహాయం చేయడానికి వెంటనే ముందుకురాని ఆ స్నేహితునిలా కాక, విశ్వాసంతో తనకు ప్రార్థించేవాళ్లు అడిగే సముచిత కోరికల్ని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడని యేసు చెబుతున్నాడు. అలాంటి విశ్వాసాన్ని చూపించాలంటే మనం పట్టుదలగా ప్రార్థించాలి. మనం దేనిగురించైనా పదేపదే ప్రార్థిస్తే అది మనకు నిజంగా అవసరమని, యెహోవా చిత్తమైతే ఆయన దాన్ని అనుగ్రహిస్తాడనే నమ్మకం మనకు ఉందని చూపిస్తాం.—మార్కు 11:24; 1 యోహాను 5:14.

రెండో ఉపమానం “ప్రార్థన ఆలకించు” యెహోవా గురించి మాట్లాడుతోంది. (కీర్తన 65:2) యేసు ఇలా అడిగాడు: “మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పాము నిచ్చునా? గుడ్డు నడిగితే తేలు నిచ్చునా?” ప్రేమగల ఏ తండ్రీ తన పిల్లలకు హానికరమైనవి ఇవ్వడని మనకు ఖచ్చితంగా తెలుసు. ఉపమాన భావాన్ని యేసు ఆ తర్వాత వివరించాడు. మానవమాత్రులైన అపరిపూర్ణ తండ్రులే పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు, పరలోకంలో ఉన్న మన తండ్రి తన పిల్లలమైన మనం అడిగినప్పుడు అన్నిటికంటే శ్రేష్ఠమైన బహుమతిని అంటే పరిశుద్ధాత్మను ‘ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు!’ bలూకా 11:11-13; మత్తయి 7:11.

విశ్వాసంతో తనకు ప్రార్థించేవాళ్లు అడిగే సముచిత కోరికల్ని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు

“ప్రార్థన ఆలకించు” యెహోవా గురించి ఆ ఉపమానం మనకేమి బోధిస్తుంది? యెహోవా దేవుడు, తన పిల్లల అవసరాలను తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ప్రేమగల తండ్రి అని యేసు మనల్ని అర్థం చేసుకోమంటున్నాడు. కాబట్టి, దేవుని సేవకులు తమ విన్నపాలను నిరభ్యంతరంగా యెహోవాకు తెలియజేయవచ్చు. ఆయనెప్పుడూ తమ మంచినే కోరుకుంటాడని వాళ్లకు తెలుసు కాబట్టి, ఒకవేళ ఆయన ఇచ్చిన జవాబు తాము ఊహించింది కాకపోయినా వాళ్లు దాన్ని సంతోషంగా అంగీకరిస్తారు. c (w13-E 04/01)

జూలై నెలలో ఈ బైబిలు భాగం చదవండి:

అపొస్తలులు కార్యములు 11-28 అధ్యాయాలు

a యేసు ఉపమానంలో, అప్పటి ప్రజల రోజువారీ జీవితంలోని ఆచార వ్యవహారాలు కనిపిస్తున్నాయి. అతిథికి మర్యాదలు చేయడం అప్పటి యూదులకు చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతీ ఇంట్లోను రోజుకు సరిపడినన్ని రొట్టెలు మాత్రమే వండుకునేవాళ్లు. కాబట్టి అవి అయిపోతే ఎవరినైనా అరువు అడగడం అప్పట్లో మామూలే. పేద కుటుంబాల్లో అందరూ ఒకే గదిలో నేల మీద పడుకునేవాళ్లు.

b యేసు తరచూ ‘ఎంతో నిశ్చయముగా’ వంటి మాటల్ని ఉపయోగించి, మామూలు విషయాల్ని గొప్పవాటితో పోలుస్తూ తను చెప్పేవాటిని నిరూపించేవాడు. ఆ విధమైన తర్కం గురించి ఓ విద్వాంసుడు ఇలా వివరించాడు: “ఈ పద్ధతిలో తర్కం, ‘మొదటి విషయం నిజమైతే, రెండో విషయం కూడా ఎంతో నిశ్చయంగా నిజమవ్వాలి’ అన్నట్లు సాగుతుంది.”

c ప్రార్థన ఎలా చేయాలో, దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనం ఏం చేయాలో అనే వాటి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 17వ అధ్యాయం చూడండి.