కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎందుకు ఇన్ని బాధలు?

ఎందుకు ఇన్ని బాధలు?

ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయో, వాటిని రూపుమాపడానికి ఇప్పటి వరకు మనుషులు చేసిన ప్రయత్నాలు ఎందుకు గురి తప్పాయో అర్థంచేసుకోవాలంటే వీటన్నిటి వెనక ఉన్న అసలు కారణాల్ని తెలుసుకోవాలి. చిక్కుముడిలాంటి వేర్వేరు కారణాలు ఉన్నా, వాటిని గుర్తించడానికి బైబిలు మనకు సహాయం చేస్తుందని తెలుసుకొని మనం ఊపిరి పీల్చుకోవచ్చు. మనం పడే బాధలకు గల ఐదు ప్రాథమిక కారణాలను ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ఈ ముఖ్యమైన సమస్య గురించి దేవుని వాక్యం ఏమి చెబుతుందో జాగ్రత్తగా పరిశీలించమని, అస్సలు కారణాల్ని స్పష్టంగా అర్థంచేసుకోవడానికి అది మనకెలా సాయం చేస్తుందో ఆలోచించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. —2 తిమోతి 3:16, 17.

చెడ్డ ప్రభుత్వం వల్ల మనుషులు పడుతున్న అగచాట్లు

‘దుష్టుడు ఏలుతున్నప్పుడు ప్రజలు నిట్టూరుస్తారు.’—సామెతలు 29:2.

చరిత్రంతా, పౌరుల జీవితాల్లో విషాదం మిగిల్చిన క్రూర నియంతలే. ఒకవేళ కాస్తోకూస్తో మంచివాళ్లున్నా వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. సాటి మనిషికి మేలు చేయాలనే లక్ష్యం కొంతమందికి ఉంటుంది. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చాక, తమ పార్టీలో జరిగే గొడవల వల్ల, పదవీ కోసం జరిగే కొట్లాటల వల్ల తమ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోతున్నాయని వాళ్లకు అర్థమౌతుంది. ఇంకొందరేమో తమ అధికారాన్ని అడ్డంపెట్టుకొని చేయరాని పనులు చేస్తారు, అది ప్రజలకు ముప్పు తెచ్చిపెడుతుంది. యు.ఎస్‌. సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ హెన్రీ కిస్సింగర్‌ ఇలా అన్నాడు: “చరిత్రంతా నెరవేరని ఆశయాలూ విఫలయత్నాల గాథలే.”

“తన అడుగులు సరిగా వేయడం మనిషి తరం కాదు” అని బైబిలు కూడా అంటోంది. (యిర్మీయా 10:23, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) సొంత వ్యవహారాలు చక్కబెట్టుకునే తెలివి గానీ ముందుచూపు గానీ అపరిపూర్ణ మనుషులకు లేదు. సొంత అడుగుల్ని నిర్దేశించుకోవడమే చేతకానివాళ్లు ఇక దేశాన్ని ఏమి ఉద్ధరిస్తారు? మానవ పాలకులు బాధలను ఎందుకు తీసివేయలేకపోతున్నారో మీకు అర్థమౌతోందా? నిజమేంటంటే, చాలావరకు చెడ్డ ప్రభుత్వం లేదా చెడ్డ పరిపాలనే బాధలకు కారణం!

అబద్ధమతం సృష్టిస్తున్న అల్లకల్లోలం

‘మీరు ఒకరి యెడల ఒకరు ప్రేమగలవారైతే దీనిబట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు.’—యోహాను 13:35.

ప్రేమ చూపించాలని, ఐక్యంగా ఉండాలని ప్రతీ మతంలోని నాయకులు బోధిస్తారు. కానీ వాస్తవమేమిటంటే, పక్షపాతాన్ని తుడిచిపెట్టేంత బలమైన ప్రేమను తమ అనుచరుల్లో పెంపొందించడం వాళ్లకు చేతకాలేదు. మతాలు ప్రేమను పెంపొందించాల్సిందిపోయి ఎక్కువశాతం విభజనలను, మతదురభిమానాన్ని, ప్రజల మధ్య జనాంగాల మధ్య కొట్లాటలను సృష్టిస్తున్నాయి. క్రిస్టియానిటి అండ్‌ వరల్డ్‌ రిలీజన్స్‌ అనే తన పుస్తకం చివర్లో మత పండితుడైన హాన్స్‌ కూంగ్‌ ఇలా రాశాడు: “అత్యంత క్రూరమైన, విపరీతమైన రాజకీయ పోరాటాలను రేపింది, ప్రేరేపించింది, న్యాయబద్ధం చేసింది మతమే.”

దానికితోడు పెళ్లికి ముందే లైంగిక సంబంధాల్ని, అక్రమ సంబంధాల్ని, స్వలింగ సంపర్కాన్ని చాలా మతాలకు చెందిన నాయకులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అది వ్యాధులకు, అబార్షన్లకు, అవాంఛిత గర్భధారణలకు, వివాహాలూ కుటుంబాలూ విచ్ఛిన్నం కావడానికి దారితీస్తున్నాయి. అది చివరకు మానిపోని గాయాలను, తీరని దుఃఖాన్ని మిగిలిస్తోంది.

మనుషుల అపరిపూర్ణత, స్వార్థ కోరికలు

‘ప్రతివాడు తన స్వకీయ దురాశతో ఈడ్వబడి మరులుకొల్పబడి శోధింపబడతాడు. దురాశ గర్భం ధరించి పాపాన్ని కన్నప్పుడు, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది.’—యాకోబు 1:14, 15.

వారసత్వంగా వచ్చిన పాపం వల్ల మనమందరం తప్పులు, పొరపాట్లు చేస్తుంటాం. కాబట్టి, ‘శరీరాశలే’ లోకమనిపించే ఆలోచనకు విరుద్ధంగా మనం అనుక్షణం పోరాడాలి. (ఎఫెసీయులు 2:3) అయితే, చెడ్డ కోరికల్ని తీర్చుకునే అవకాశం మన ముందుకు వచ్చినప్పుడు ఆ పోరాటం మరీ కష్టంగా ఉంటుంది. ఒకవేళ మనం దానికి తలవంచితే ఫలితాలు దారుణంగా ఉంటాయి.

పి. డి. మేటా అనే రచయిత ఇలా రాశాడు: “మన సొంత వ్యామోహం, సుఖభోగాల కోసం అమితమైన ఆరాటం, నచ్చింది చేయడం, దురాశ, వ్యక్తిగత ఆశయాలే ఎన్నో బాధలకు కారణమౌతున్నాయి.” సమాజం గౌరవించే మహానుభావులు కూడా మద్యం, మాదకద్రవ్యాలు, జూదం, లైంగిక విచ్చలవిడితనం వంటివాటి కోసం వెంపర్లాడుతూ వాటికి బానిసలై తమ జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. అలాగే తమ కుటుంబాలకు, స్నేహితులకు, ఇతరులకు ఎంతో మనోవ్యథను మిగిల్చారు. మనుషుల అపరిపూర్ణత దృష్ట్యా, బైబిలు చెబుతున్న ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే: ‘ప్రస్తుతం జీవకోటంతా విశ్వవ్యాప్తంగా ఉన్న ఒక విధమైన వేదనతో మూలుగుతోందని కళ్లు ఉన్న ఎవరికైనా తేటగా కనబడుతుంది.’—రోమీయులు 8:22, జె. బి. ఫిలిప్స్‌ అనువదించిన ద న్యూ టెస్టమెంట్‌ ఇన్‌ మాడర్న్‌ ఇంగ్లీష్‌.

దురాత్మల అజమాయిషీ

సాతాను “ఈ యుగ సంబంధమైన దేవత” అనీ, శక్తిమంతమైన దయ్యాలు సాతానుతో చేతులు కలిపారు అనీ బైబిలు వెల్లడిస్తోంది.—2 కొరింథీయులు 4:4; ప్రకటన 12:9.

సాతానులాగే, అతని దయ్యాలు కూడా ప్రజలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటూ పక్కదారి పట్టిస్తున్నారు. ఆ విషయం గురించే మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “మనం పోరాడుతున్నది రక్త మాంసాలున్నవారితో కాదు గాని ప్రస్తుత అంధకారాన్ని ఏలుతున్న లోక నాథులతో, ప్రధానులతో, అధికారులతో, పరమ స్థలాలలో ఉన్న ఆత్మ రూపులైన దుష్టశక్తుల సేనలతో.”—ఎఫెసీయులు 6:12, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

దయ్యాలు ప్రజలను పీడించడంలో ఆనందం పొందుతున్నా అదే వాళ్ల ముఖ్య లక్ష్యం కాదు. ప్రజల్ని సర్వలోకంలో మహోన్నతుడైన యెహోవా నుండి దూరం చేయాలన్నదే వాళ్ల తపన. (కీర్తన 83:18) ప్రజలను మోసగించడానికి, నియంత్రించడానికి దయ్యాలు ఉపయోగించుకునే వాటిలో జ్యోతిష్యం, ఇంద్రజాలం, మంత్రాలు, సోదె చెప్పడం వంటివి కొన్ని మాత్రమే. అందుకే యెహోవా ఆ ప్రమాదాల గురించి మనల్ని హెచ్చరిస్తున్నాడు, అంతేకాక సాతానును, అతని దయ్యాలను ఎదిరించే వాళ్లకు సంరక్షణ ఇస్తున్నాడు.—యాకోబు 4:7.

మనం ‘చివరి రోజుల్లో’ జీవిస్తున్నాం

దాదాపు 2000 సంవత్సరాల క్రితమే బైబిలు ఇలా చెప్పింది: “ఈ సంగతి తెలుసుకో—చివరి రోజులలో మహా కష్టమైన సమయాలు వస్తాయి.”

కాలాలు ఇంత దుర్భరంగా మారడానికి కారణం ఏమిటో వివరిస్తూ ఆ లేఖనం ఇంకా ఇలా చెబుతోంది, “ఎందుకంటే మనుషులు ఇలా ఉంటారు: స్వార్థప్రియులు, డబ్బంటే ప్రేమ గలవారు, బడాయికోరులు, అహంకారులు, . . . ప్రేమ లేనివారు, తీరని పగ గలవారు, అపనిందలు ప్రచారం చేసేవారు, తమను అదుపులో పెట్టుకోనివారు, క్రూరులు, మంచి అంటే గిట్టనివారు, ద్రోహులు, జాగ్రత్త లేని మూర్ఖులు, గర్విష్ఠులు, దేవునికి బదులు సుఖాన్నే ప్రేమించేవారు.” నిశ్చయంగా, మనం నేడు చూస్తున్న బాధలన్నిటికీ ఓ ముఖ్య కారణమేమిటంటే, మనం జీవిస్తున్నది “చివరి రోజులలో.”—2 తిమోతి 3:1-4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

మనుషులకు సదుద్దేశాలున్నా బాధలను ఎందుకు తీసివేయలేకపోతున్నారో మనం ఇప్పటిదాకా చర్చించుకున్న విషయాలను బట్టి స్పష్టంగా అర్థమౌతోంది. మరైతే, మనకు సాయం ఎక్కడ దొరుకుతుంది? “అపవాది క్రియలను,” అతని దయ్యాల క్రియలను ‘లయపరుస్తానని’ మాటిచ్చిన మన సృష్టికర్త దగ్గరే. (1 యోహాను 3:8) బాధలకు కారణమైన వాటన్నిటినీ వేళ్లతో సహా పెకిలించేందుకు దేవుడు ఏమి చేస్తాడో మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. (w13-E 09/01)