మీ పిల్లలకు నేర్పించండి
దేవుడు కూడా నొచ్చుకుంటాడు—మనమెలా ఆయనను సంతోషపెట్టవచ్చు?
మీరెప్పుడైనా ఏడ్చేంతగా నొచ్చుకున్నారా?— a బహుశా మనందరికీ అలా జరిగేవుంటుంది. అయితే కొన్నిసార్లు, మనం బాధ తట్టుకోలేక ఏడుస్తాం. వేరేవాళ్లు మన గురించి పుకార్లు పుట్టించవచ్చు. అది మనల్ని నొప్పిస్తుంది కదా? — దేవుడు కూడా తన గురించి ఎవరైనా అబద్ధాలు చెప్పినప్పుడు నొచ్చుకుంటాడు. ఇప్పుడు మనం ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ, దేవుణ్ణి బాధపెట్టకుండా ఆయనను సంతోషపెట్టడం ఎలాగో చూద్దాం.
దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకున్న కొందరు ఆయనను ‘నొప్పించారు’ అని బైబిలు చెబుతోంది. అవును, ఆయనను ‘వాళ్లు బాధపెట్టారు!’ అయితే, యెహోవాను ఎవ్వరూ కొట్టి గాయపర్చలేరు. ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి, మనం తన మాట విననప్పుడు యెహోవా ఎందుకు నొచ్చుకుంటాడో ఇప్పుడు చూద్దాం.
యెహోవా సృష్టించిన మొట్టమొదటి మనుషులిద్దరు ఆయనను ఎంతో బాధపెట్టారు. వాళ్లను దేవుడు “ఏదెను తోట” అనే అందమైన ప్రదేశంలో ఉంచాడు. ఆ ఇద్దరు మనుషులు ఎవరు?— ఊఁ, వాళ్లు ఆదాముహవ్వలు. వాళ్లు ఏమి చేసి యెహోవాను బాధపెట్టారో ఇప్పుడు చూద్దాం.
యెహోవా వాళ్లను ఏదెను తోటలో పెట్టిన తర్వాత, ఆ తోటను చక్కగా చూసుకోమని చెప్పాడు. పిల్లాపాపలతో కలిసిమెలిసి కలకాలం జీవించే అవకాశం తమకుందని కూడా యెహోవా వాళ్లకు చెప్పాడు. కానీ, ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టకముందే, ఓ ఘోరం జరిగిపోయింది. అదేంటో తెలుసా?— ముందు హవ్వ, ఆ తర్వాత ఆదాము యెహోవాకు ఎదురుతిరిగేలా ఓ దేవదూత వాళ్లను ప్రేరేపించాడు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఆ దేవదూత ఓ పాము మాట్లాడుతున్నట్లు కనిపించేలా చేశాడు. ఆమె ‘దేవునిలా అవుతుంది’ అని ఆ పాము చెప్పిన మాట హవ్వకు నచ్చింది. అందుకే ఆమె పాము చెప్పినట్టే చేసింది. ఇంతకీ ఆమె ఏమి చేసిందో తెలుసా?—
తినొద్దని యెహోవా ఆదాముకు చెప్పిన చెట్టు పండ్లనే హవ్వ తింది. హవ్వను సృష్టించకముందు దేవుడు ఆదాముకు ఇలా చెప్పాడు: ‘ఈ తోటలో ఉన్న ప్రతీ వృక్ష ఫలాల్ని నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు; అయితే మంచి చెడ్డల తెలివిని ఇచ్చే వృక్ష ఫలాల్ని తినొద్దు; నువ్వు వాటిని తిన్న దినాన నిశ్చయంగా చస్తావు.’
ఆ ఆజ్ఞ గురించి హవ్వకు తెలుసు. అయినా, ఆమె ఆ చెట్టును అలాగే చూస్తూ ఉండి పోయింది. అలా అది ‘ఆహారానికి మంచిదిగా, కళ్లకు అందంగా ఉండటం . . . చూసినప్పుడు ఆమె దాని ఫలాల్లో కొన్ని తీసికొని తింది’. ఆ తర్వాత, ఆదాముకు కూడా ఇచ్చింది, ‘అతడు కూడా తిన్నాడు.’ ఆయన ఎందుకు అలా చేసివుంటాడు?— ఎందుకంటే, ఆదాముకు యెహోవా మీద ఉన్న ప్రేమకన్నా హవ్వ మీద ఉన్న ప్రేమే ఎక్కువ. దేవునికి నచ్చింది చేయాల్సిందిపోయి తన భార్యకు నచ్చిందే ఆయన చేయాలనుకున్నాడు. కానీ, వేరే ఎవ్వరికన్నా యెహోవాకు లోబడడమే అత్యంత ప్రాముఖ్యం!
హవ్వతో మాట్లాడిన పాము మీకు గుర్తుందా? ఓ వ్యక్తి ఒక తోలుబొమ్మ మాట్లాడుతున్నట్లు కనిపించేలా చేయగలిగినట్లే, ఎవరో ఆ పాము మాట్లాడుతున్నట్లు కనిపించేలా చేశారు. పాము నుండి వచ్చిన ఆ స్వరం ఎవరిది?— ఆ స్వరం ‘అపవాది, సాతాను అనే పేరున్న ఆది సర్పానిది.’
యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చో మీకు తెలుసా?— అన్ని సందర్భాల్లో ఆయనకు నచ్చిందే చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఆయనను సంతోషపెట్టవచ్చు. తాను ఆడించినట్లు ఆడేలా ప్రతీ ఒక్కరిని బురిడీ కొట్టించగలనని సాతాను విర్రవీగుతున్నాడు. కాబట్టి యెహోవా మనల్ని ఇలా అభ్యర్థిస్తున్నాడు: ‘నా కుమారుడా [లేదా కుమార్తె], జ్ఞానాన్ని సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు. అప్పుడు నన్ను నిందించే వాళ్లతో నేను ధైర్యంగా మాట్లాడతాను.’ సాతాను యెహోవాను నిందిస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. యెహోవాను సేవించకుండా ప్రతీ ఒక్కరిని తిప్పేయగలనని సాతాను అంటున్నాడు. కాబట్టి యెహోవా మాట వింటూ, ఆయనను సేవిస్తూ ఆయనను సంతోషపెట్టండి! అందుకోసం మీరు గట్టిగా ప్రయత్నిస్తారా?— (w13-E 09/01)
మీ బైబిల్లో చదవండి
a మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే గీత ఉన్నచోట ఆగి, అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.