మా పాఠకుల ప్రశ్న
బలవంతులు బలహీనులను అణచివేస్తున్నా దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు?
బలవంతులు బలహీనులను అణచివేసిన కొన్ని హృదయవిదారక సంఘటనల గురించి బైబిల్లో ఉంది. ఉదాహరణకు, నాబోతు విషయం మీకు గుర్తుకురావచ్చు. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలు రాజ్యాన్ని అహాబు అనే రాజు పరిపాలించేవాడు. అతను నాబోతు ద్రాక్షతోటను తన వశం చేసుకోవాలనుకున్నాడు; అతని కోసం అతని భార్య యెజెబెలు నాబోతును, ఆయన కుమారులను చంపించింది. అయినా అహాబు ఆమెకు అడ్డుచెప్పలేదు. (1 రాజులు 21:1-16; 2 రాజులు 9:26) వాళ్లు అంత ఘోరంగా తమ అధికారాన్ని దుర్వినియోగం చేసినా దేవుడు ఎందుకు ఊరుకున్నాడు?
‘దేవుడు అబద్ధమాడనేరడు.’—తీతు 1:1-4
అందుకు ఒక ముఖ్యమైన కారణమేమిటంటే, దేవుడు అబద్ధం చెప్పలేడు. (తీతు 1:1-4) దానికీ, అణచివేతను అడ్డుకోకపోవడానికీ సంబంధం ఏమిటి? మనుషులను సృష్టించిన తొలి రోజుల్లోనే, తనకు ఎదురుతిరిగితే బాధాకరమైన పర్యవసానాన్ని ఎదుర్కొంటారని (చనిపోతారని) దేవుడు హెచ్చరించాడు. అదే జరిగింది. ఏదెను తోటలో తిరుగుబాటు జరిగిన దగ్గరనుండి, మరణం మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది. మొదట చనిపోయిన వ్యక్తి హేబెలు. ఆయనను బలి తీసుకున్నది కూడా అణచివేతే. స్వయాన ఆయన అన్న కయీనే ఆయనను చంపేశాడు.—ఆదికాండము 2:16, 17; 4:8.
అప్పటినుండి మానవ చరిత్రంతా, బైబిలు చెబుతున్నట్లు ఇలా ఉంది: ‘మనిషి మనిషి మీద అధికారం చెలాయిస్తూ హాని చేస్తున్నాడు.’ (ప్రసంగి 8:9, NW) అది నిజమేనా? యెహోవా ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం తమకు రాజు కావాలని ఆయనను అడిగినప్పుడు, ఆ వచ్చే రాజులు వాళ్లను అణచివేస్తారని, దానివల్ల ప్రజలు తనకు మొరపెట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. (1 సమూయేలు 8:11-18) అంతెందుకు, జ్ఞానియైన సొలొమోను రాజు కూడా అధిక మొత్తంలో పన్ను వసూలు చేస్తూ తన ప్రజలను అణచివేశాడు. (1 రాజులు 11:43; 12:3, 4) ఇక అహాబు లాంటి దుష్ట రాజుల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దీని గురించి ఆలోచించండి: అలాంటి అధికార దుర్వినియోగాలన్నిటినీ దేవుడు అడ్డుకొనివుంటే, ఆయన తన మాటను తానే అబద్ధం చేసుకున్నట్లు అవ్వదా?
‘మనిషి మనిషి మీద అధికారం చెలాయిస్తూ హాని చేస్తున్నాడు.’ —ప్రసంగి 8:9, NW
పైగా, ప్రజలు స్వార్థంతోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నారని సాతాను ఆరోపిస్తున్నాడు. (యోబు 1:9, 10; 2:4) మరి, తన ప్రజల్లో ఏ ఒక్కరూ ఎలాంటి అణచివేతకూ గురికాకుండా దేవుడు కాపాడితే, సాతాను ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవ్వదా? ఇక దేవుడు అందర్నీ అన్నిరకాల అణచివేతల నుండి కాపాడితే, ఇంకో పెద్ద అబద్ధానికి ఊతమిచ్చినట్లు అవుతుంది. అప్పుడిక, దేవుని అవసరం లేకుండానే తమను తాము చక్కగా పరిపాలించుకోగలమని మనుషులు అపోహపడే ప్రమాదముంది. అయితే, మనిషికి తనను తాను పరిపాలించుకునే సామర్థ్యం లేనేలేదని దేవుని వాక్యం చెబుతుంది. (యిర్మీయా 10:23) దేవుని రాజ్యం రావాల్సిందే; అప్పుడే అన్యాయాలన్నీ లేకుండా పోతాయి.
అంటే, అణచివేత విషయంలో దేవుడు ఏమీ చేయడం లేదని దానర్థమా? కాదు. ఆయన చేస్తున్న రెండు పనులను పరిశీలించండి. ఒకటి, దేవుడు అణచివేతను బట్టబయలు చేస్తున్నాడు. ఉదాహరణకు, నాబోతు మీద యెజెబెలు పన్నిన కుట్రలోని ప్రతీ అంశాన్ని దేవుని వాక్యం బయటపెడుతోంది. పైగా, అలాంటి చెడ్డ పనులు చేసేలా ప్రజల్ని ప్రేరేపిస్తూ తెరవెనుక దాక్కున్న శక్తిమంతుడైన పరిపాలకుని ముసుగును అది తొలగిస్తోంది. (యోహాను 14:30; 2 కొరింథీయులు 11:14) అతడే అపవాదియైన సాతానని బైబిలు చెబుతుంది. దేవుడు దుష్టత్వాన్ని, అణచివేతను, వాటి సూత్రధారిని బట్టబయలు చేయడం వల్ల, మనం దుష్టత్వానికి దూరంగా ఉండేందుకు ఒకరకంగా సహాయం చేస్తున్నాడు. అలా, మన శాశ్వత జీవితాన్ని భద్రంగా కాపాడుతున్నాడు.
రెండు, అణచివేత అంతమౌతుందని భరోసా ఇస్తూ దేవుడు మనలో ఆశ నింపుతున్నాడు. అహాబు, యెజెబెలు, అలాంటి చాలామంది జరిగించిన దుష్టత్వాన్ని బయటపెట్టి, వాళ్లకు తీర్పుతీర్చి, వాళ్లను శిక్షించాడు. ఆ విధంగా, ఏదోక రోజు దుష్టులందర్నీ శిక్షిస్తానని తాను చేసిన వాగ్దానాన్ని నమ్మడానికి మనకు తగిన ఆధారాన్ని ఇస్తున్నాడు. (కీర్తన 52:1-5) తనను ప్రేమించేవాళ్లకు దుష్టత్వం వల్ల ఎదురైన చేదు పర్యవసానాలన్నిటినీ తీసేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. a కాబట్టి, దేవునికి నమ్మకంగా ఉన్న నాబోతు, ఆయన కుమారులు అన్యాయపు ఛాయలన్నీ తొలగిపోయి అందమైన తోటగా మారే ఈ భూమ్మీద ఎల్లకాలం జీవిస్తారు.—కీర్తన 37:34. (w14-E 02/01)
a యెహోవాసాక్షులు ప్రచురించిన, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 11వ అధ్యాయం చూడండి.