కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పునరుత్థానం— చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు

పునరుత్థానం— చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు

చనిపోయినవాళ్లు పునరుత్థానం అవుతారని, అంటే మళ్లీ బ్రతుకుతారని బైబిల్లో ఉన్న వాగ్దానాన్ని మీరు నమ్ముతారా? a చనిపోయిన మన ప్రియమైన వాళ్లను మళ్లీ కలుసుకోవాలని మనలో ప్రతీ ఒక్కరం తప్పక కోరుకుంటాం. కానీ చనిపోయినవాళ్లు నిజంగానే మళ్లీ బ్రతుకుతారా? దానికి జవాబు తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు అపొస్తలుల ఉదాహరణ సహాయం చేస్తుంది.

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారని అపొస్తలులు బలంగా నమ్మేవాళ్లు. దానికి కనీసం రెండు కారణాలున్నాయి. మొదటిది, వాళ్ల నమ్మకం ముఖ్యంగా ఈ వాస్తవం మీద ఆధారపడివుంది: స్వయంగా యేసే చనిపోయి మళ్లీ బ్రతికాడు. పునరుత్థానమైన యేసును అపొస్తలులు, 500 కన్నా ఎక్కువమంది శిష్యులు చూశారు. (1 కొరింథీయులు 15:6) అంతేకాదు, యేసు నిజంగా పునరుత్థానమయ్యాడనే విషయాన్ని చాలామంది అంగీకరించినట్లు బైబిల్లోని నాలుగు సువార్తలు చూపిస్తున్నాయి.—మత్తయి 27:62–28:20; మార్కు 16:1-8; లూకా 24:1-53; యోహాను 20:1–21:25.

రెండవది, యేసు ముగ్గుర్ని పునరుత్థానం చేయడం అపొస్తలులు చూశారు. వాళ్లలో ఒకర్ని నాయీనులో, రెండవ వ్యక్తిని కపెర్నహూములో, మూడవ వ్యక్తిని బేతనియలో పునరుత్థానం చేశాడు. (లూకా 7:11-17; 8:49-56; యోహాను 11:1-44) ఈ మూడవ వ్యక్తి కుటుంబంతో యేసుకు ప్రత్యేక అనుబంధం ఉండేది. ఆ పునరుత్థానం గురించి ముందటి ఆర్టికల్లో కొంతవరకు చూశాం, ఇప్పుడు ఇంకాస్త పరిశీలిద్దాం.

“పునరుత్థానమును . . . నేనే”

యేసు మార్తతో ఇలా అన్నాడు: “నీ సహోదరుడు మరల లేచును.” కానీ అప్పటికే ఆమె సహోదరుడు లాజరు చనిపోయి నాలుగు రోజులైంది. యేసు ఏమంటున్నాడో మార్తకు మొదట్లో అర్థంకాలేదు. లాజరు ఎప్పుడో భవిష్యత్తులో మళ్లీ బ్రతుకుతాడని అనుకుంటూ మార్త, ‘అతడు లేచునని యెరుగుదును’ అని అంది. కానీ యేసు, “పునరుత్థానమును జీవమును నేనే” అని చెప్పి, ఆమె సహోదరుణ్ణి మళ్లీ బ్రతికించాడు. అది చూసినప్పుడు ఆమె ఎంత ఆశ్చర్యపోయి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి!—యోహాను 11:23-25.

ఇంతకీ, చనిపోయిన ఆ నాలుగు రోజులు లాజరు ఎక్కడున్నాడు? ఆ సమయంలో తాను ఇంకెక్కడో బ్రతికివున్నానని సూచించే మాటలేవీ లాజరు అనలేదు. అవును, లాజరులో అమర్త్యమైన ఆత్మ అంటూ ఏదీ లేదు, అది పరలోకానికి వెళ్లనూ లేదు. కాబట్టి, యేసు లాజరును పునరుత్థానం చేసినప్పుడు, పరలోకంలో దేవుని సన్నిధిలో ఎంతో ఆనందంగా జీవిస్తున్న లాజరును బలవంతంగా మళ్లీ భూమ్మీదకు లాక్కొని రాలేదు. మరైతే ఆ నాలుగు రోజులు లాజరు ఎక్కడున్నాడు? ఆయన సమాధిలో నిద్రిస్తున్నాడు.—ప్రసంగి 9:5, 10.

యేసు ఇంతకుముందు మరణాన్ని నిద్రతో పోల్చాడని, చనిపోయినవాళ్లు తాను పునరుత్థానం చేసినప్పుడు మేల్కొంటారని చెప్పడం మీకు గుర్తుందా? ఆ వృత్తాంతం గురించి బైబిలు ఇలా చెబుతుంది: “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా శిష్యులు—ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు—లాజరు చనిపోయెను . . . అని స్పష్టముగా వారితో చెప్పెను.” (యోహాను 11:11-15) లాజరును పునరుత్థానం చేసినప్పుడు యేసు ఆయన జీవాన్ని ఆయనకు తిరిగిచ్చాడు, దాంతో లాజరు మళ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవించగలిగాడు. ఆ కుటుంబానికి యేసు ఎంతటి అద్భుతమైన బహుమానం ఇచ్చాడో కదా!

యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసిన పునరుత్థానాలు, భవిష్యత్తులో ఆయన దేవుని రాజ్యానికి రాజుగా వచ్చినప్పుడు ఏమి చేస్తాడో రుచి చూపించాయి. b అప్పుడు యేసు పరలోకం నుండి భూమిని పరిపాలిస్తాడు, మరణనిద్రలో ఉన్నవాళ్లకు జీవాన్నిచ్చి తిరిగి లేపుతాడు. అందుకే ఆయన, “పునరుత్థానమును . . . నేనే” అని అన్నాడు. చనిపోయి మళ్లీ బ్రతికిన మీ ఆత్మీయులను కలుసుకున్నప్పుడు మీకెంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి! అలా మళ్లీ బ్రతికినవాళ్లకు ఇంకెంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి!—లూకా 8:56.

మళ్లీ బ్రతికిన మీ ఆత్మీయులను కలుసుకున్నప్పుడు మీకెంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి!

నిరంతరం జీవించడానికి కావాల్సిన విశ్వాసం

మార్తతో యేసు ఇలా అన్నాడు: “నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.” (యోహాను 11:25, 26) వెయ్యేళ్ల పరిపాలనలో యేసు బ్రతికించే వాళ్లు ఆయన మీద నిజంగా విశ్వాసం చూపించినంత కాలం చనిపోకుండా ఎప్పటికీ జీవిస్తామనే నమ్మకంతో ఉండవచ్చు.

“నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.”—యోహాను 11:25

పునరుత్థానం గురించి ఆ మాటలు చెప్పాక యేసు మార్తను ఇలా అడిగాడు: “ఈ మాట నమ్ముచున్నావా?” దానికి ఆమె, “అవును ప్రభువా, నీవు . . . దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను” అని అంది. (యోహాను 11:26, 27) పునరుత్థానం మీద మార్తకు ఉన్నంత బలమైన విశ్వాసాన్ని మీరూ పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా? అలాగైతే, మీరు చేయాల్సిన మొదటి పని, మానవజాతి విషయంలో దేవుని ఉద్దేశం గురించి తెలుసుకోవడమే. (యోహాను 17:3; 1 తిమోతి 2:4) అలా తెలుసుకుంటే విశ్వాసం ఏర్పడుతుంది. ఈ విషయం గురించి బైబిలు ఏమి బోధిస్తుందో చూపించమని మీరు యెహోవాసాక్షులను అడగవచ్చు. పునరుత్థానమనే అద్భుతమైన ఏర్పాటు గురించి మీతో చర్చించడానికి వాళ్లెంతో సంతోషిస్తారు. (w14-E 01/01)

a 6వ పేజీలోని “చనిపోతే అంతా అయిపోయినట్లు కాదు!” అనే ఆర్టికల్‌ చూడండి.

b భవిష్యత్తులో జరగనున్న పునరుత్థానానికి సంబంధించిన బైబిలు వాగ్దానం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 7వ అధ్యాయం చూడండి.