మీతో మాట్లాడవచ్చా?
దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది?–1వ భాగం
యెహోవా సాక్షులకు, పొరుగువాళ్లకు సాధారణంగా జరిగే చర్చను ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అశోక్ అనే యెహోవాసాక్షి కిషోర్ ఇంటికి వెళ్లాడని అనుకుందాం.
తెలివిని ‘వెదుకుతూ’ ఉండండి
అశోక్: కిషోర్‌గారు, మీతో బైబిలు విషయాలు మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. a పోయినసారి కలిసినప్పుడు మీరు దేవుని రాజ్యం గురించి ఒక ప్రశ్న అడిగారు. 1914లో దేవుని రాజ్య పరిపాలన మొదలైందని యెహోవా సాక్షులు ఎందుకు నమ్ముతారు? అని అడిగారు కదా.
కిషోర్: అవును. మీ పుస్తకం ఒకటి చదువుతుంటే, దేవుని రాజ్యం 1914లో పరిపాలించడం మొదలుపెట్టిందని అందులో ఉంది. మీరన్నీ బైబిలు నుంచే చెబుతారు కదా, అందుకే దీని గురించి కూడా తెలుసుకోవాలనిపించింది.
అశోక్: అవును, మేమన్నీ బైబిల్లోంచే చెబుతాము.
కిషోర్: మరి నేను బైబిలు అంతా చదివాను, కానీ నాకు ఎక్కడా 1914 కనబడలేదు. ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ బైబిల్లో కూడా “1914” కోసం వెదికాను. కాని “0 ఫలితాలు” అని వచ్చింది.
అశోక్: కిషోర్‌గారు మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీరు బైబిలంతా చదివారు. మీకు నిజంగా దేవుని వాక్యం మీద ప్రేమ ఉందని అర్థమౌతుంది.
కిషోర్: అవునండి. బైబిల్లాంటి పుస్తకం మరొకటి లేదు.
అశోక్: నిజమే కిషోర్‌గారు. తెలివిని ‘వెదుకుతూ’ ఉండమని బైబిల్లో ఉంది. అలాగే, మీరు కూడా ప్రశ్నకు జవాబు కోసం బైబిల్లో వెదికారు. b అలా చూడడం చాలా మంచిది.
కిషోర్: థాంక్స్ అండి. నాకు ఇంకా నేర్చుకోవాలనుంది. అందుకే మనం చదువుతున్న పుస్తకంలో కూడా 1914 గురించి వెదికాను. అక్కడ ఒక రాజుకు వచ్చిన కల గురించి, ఒక పెద్ద చెట్టును నరికి వేయడం, అది మళ్లీ పెరగడం లాంటివన్నీ ఉన్నాయి.
అశోక్: అవునండి. అది దానియేలు నాల్గవ అధ్యాయంలో ఉన్న ప్రవచనం. అందులో రాజైన నెబుకద్నెజరుకు వచ్చిన కల గురించి ఉంది.
కిషోర్: అవును అదే. ఆ ప్రవచనాన్ని నేను మళ్లీమళ్లీ చదివాను. కాని నిజం చెప్పాలంటే ఆ ప్రవచనంతో దేవుని రాజ్యానికి, 1914కి ఉన్న సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు.
అశోక్: చెప్పాలంటే కిషోర్‌గారు, దేవుడు చెప్పింది రాసిన దానియేలుకు కూడా అది పూర్తిగా అర్థం కాలేదు!
కిషోర్: నిజంగానా?
అశోక్: అవును దానియేలు 12:8లో “నేను వింటినిగాని గ్రహింపలేకపోతిని” అని దానియేలు అంటాడు.
కిషోర్: అయితే అర్థం కానిది నాకొక్కడికే కాదన్నమాట. అయితే ఫర్వాలేదు.
అశోక్: మనుషులు ఆ విషయాలు గురించి తెలుసుకోవడానికి అది సమయం కాదని దేవునికి అనిపించింది కాబట్టే,
దానియేలుకు ఈ విషయాలు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు, మన కాలంలో వాటిని పూర్తిగా అర్థం చేసుకోగలం.కిషోర్: అలా ఎలా చెప్పొచ్చు?
అశోక్: తర్వాత వచనం చూడండి. దానియేలు 12:9లో “ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి” అని ఉంది. అంటే ఈ ప్రవచనాలు చాలాకాలం తర్వాత, “అంత్యకాలము”లో అర్థమవుతాయి అన్నమాట. మనం ఆ కాలంలోనే జీవిస్తున్నామన్న రుజువు మన బైబిలు అధ్యయనంలో త్వరలోనే చూస్తాం. c
కిషోర్: మరి ఇప్పుడు నాల్గవ అధ్యాయంలోని ప్రవచనం గురించి చెప్తారా?
అశోక్: సరే, ప్రయత్నిస్తాను.
నెబుకద్నెజరు కల
అశోక్: ముందు, నెబుకద్నెజరు కలలో ఏమి చూశాడో చూద్దాం. తర్వాత దాని అర్థం ఏమిటో మాట్లాడుకుందాం.
కిషోర్: సరే.
అశోక్: నెబుకద్నెజరు కలలో ఆకాశమంత ఎత్తున్న ఒక పెద్ద చెట్టును చూశాడు. తర్వాత ఒక దేవదూత చెట్టును నరికివేయమని ఆజ్ఞ ఇవ్వడం విన్నాడు. కానీ చెట్టు మొదలును భూమిలోనే ఉంచమని దేవుడు చెప్పాడు. ఏడు కాలములు గడిచాక ఆ చెట్టు మళ్లీ పెరుగుతుంది. d ఈ ప్రవచనం మొదట, రాజైన నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. ఆకాశమంత ఎత్తున్న ఆ చెట్టులా చాలా గొప్ప రాజైన ఆయన్ని “ఏడు కాలముల” వరకు కొట్టివేశారు. అప్పుడు ఏమైందో మీకు గుర్తుందా?
కిషోర్: గుర్తులేదు.
అశోక్: ఫర్లేదు. నెబుకద్నెజరు ఏడు సంవత్సరాలు పిచ్చివాడై తిరిగాడని బైబిలు చెబుతుంది. ఆ సమయంలో ఆయన రాజుగా పరిపాలించలేకపోయాడు. కానీ ఏడు కాలాలు పూర్తయ్యాక పిచ్చి తగ్గిపోయి మళ్లీ పరిపాలించడం మొదలుపెట్టాడు. e
కిషోర్: అర్థం అయింది, కానీ దీనంతటికి దేవుని రాజ్యానికి, 1914కి ఏంటి సంబంధం?
అశోక్: ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రవచనం రెండు విధాలుగా నెరవేరింది. మొదటిసారి, రాజైన నెబుకద్నెజరు పరిపాలనకు ఆటంకం కలిగినప్పుడు నెరవేరింది. రెండవసారి, దేవుని పరిపాలనకు ఆటంకం కలిగినప్పుడు నెరవేరింది. ఈ రెండవదే దేవుని రాజ్యానికి సంబంధించింది.
కిషోర్: ఆ రెండవది దేవుని రాజ్యానికి సంబంధించిందని ఎలా చెప్పగలం?
అశోక్: ఎలాగో ఆ ప్రవచనంలోనే ఉంది. దానియేలు 4:17లో ఆ ప్రవచనం ఇలా ఉంది: “మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు . . . మనుష్యులందరు తెలిసికొనునట్లు.” ఇక్కడ “మానవుల రాజ్యము” అనే మాట చూశారా?
కిషోర్: చూశాను. “మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి” అని ఉంది.
అశోక్: అవును, ఈ ప్రవచనం కేవలం నెబుకద్నెజరు గురించి మాత్రమే కాదుగానీ, “మానవుల రాజ్యము” అంటే మనుషులను దేవుడు పరిపాలించడం గురించి కూడా చెబుతుంది. దీన్ని తెలుసుకోవడానికి దానియేలు పుస్తకం ముఖ్యాంశం ఏంటో చూద్దాం.
కిషోర్: సరే చూద్దాం.
దానియేలు పుస్తకం ముఖ్యాంశం
అశోక్: దానియేలు పుస్తకమంతా ఒకే విషయాన్ని పదేపదే చెబుతుంది. భవిష్యత్తులో దేవుని కుమారుడైన యేసు రాజుగా దేవుని రాజ్యం స్థాపించబడుతుందని చెబుతుంది. ఒకసారి దానియేలు 2:44 చదువుతారా?
కిషోర్: సరే. “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”
అశోక్: థాంక్యూ. ఈ వచనం దేవుని రాజ్యం గురించి చెబుతుందంటారా?
కిషోర్: ఏమో, తెలీదు.
అశోక్: ఆ రాజ్యం “యుగముల వరకు నిలుచును” అని ఉంది. దేవుని రాజ్యం గురించి మాత్రమే అలా చెప్పగలం కానీ మానవ ప్రభుత్వాల గురించి అలా చెప్పగలమా?
కిషోర్: చెప్పలేమనుకుంట.
అశోక్: దేవుని రాజ్యం గురించి దానియేలు రాసిన ఇంకొక ప్రవచనాన్ని దానియేలు 7:13, 14లో చూద్దాం. రాబోయే పరిపాలకుని గురించి అక్కడ ఉంది: “సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” ఇక్కడ దేని గురించి ఉంది?
కిషోర్: ఒక రాజ్యం గురించి ఉంది.
అశోక్: అవును. ఏదోక రాజ్యం గురించి కాదు. ఆ రాజ్యం ‘జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువాళ్లను’ పరిపాలిస్తుంది. అంటే ఈ రాజ్యానికి ప్రపంచమంతటి పైన అధికారముంటుంది.
కిషోర్: అవును మీరు చెప్పింది నిజమే, నేను గమనించలేదు.
అశోక్: ఇంకా ఈ వచనంలో “ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు” అని ఉంది. దానియేలు 2:44లో ఉన్న ప్రవచనంలానే ఉంది కదా?
కిషోర్: అవును.
అశోక్: ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. దానియేలు నాల్గవ అధ్యాయంలోని ప్రవచనం ‘మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై అధికారియై ఉన్నాడని’ మనకు చెబుతోంది. ఈ ప్రవచనం నెబుకద్నెజరు గురించి మాత్రమే కాదుగానీ మరో ప్రాముఖ్యమైన విషయం గురించి కూడా చెబుతుందని తెలుసుకున్నాం. దానియేలు పుస్తకమంతటిలో, దేవుని కుమారుడు రాజుగా ఉండే దేవుని రాజ్య స్థాపన గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయని కూడా చూశాం. కాబట్టి దానియేలు నాల్గవ అధ్యాయంలో ఉన్న ప్రవచనం దేవుని రాజ్యం గురించేనని చెప్పొచ్చా?
కిషోర్: చెప్పొచ్చేమో. కానీ దీనికి, 1914కు ఉన్న సంబంధం నాకు ఇంకా అర్థం కాలేదు.
“ఏడు కాలములు గడచువరకు”
అశోక్: మళ్లీ రాజైన నెబుకద్నెజరు గురించి చూద్దాం. ప్రవచనం మొదటి నెరవేర్పులో ఆ చెట్టు రాజైన నెబుకద్నెజరుకు గుర్తుగా ఉంది. ఆ చెట్టును నరికి ఏడు కాలాలు విడిచిపెట్టినప్పుడు అంటే నెబుకద్నెజరు కొంతకాలం పిచ్చివాడై తిరిగినప్పుడు అతని పరిపాలనకు అంతరాయం కలిగింది. నెబుకద్నెజరు మళ్లీ మామూలువాడై తిరిగి పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఆ ఏడు కాలములు ముగిశాయి. ఈ ప్రవచనం రెండవ నెరవేర్పులో దేవుని పరిపాలనకు కొంతకాలం అంతరాయం కలుగుతుంది, కానీ ఈ అంతరాయం దేవునిలో లోపం ఉన్నందువల్ల రాలేదు.
కిషోర్: అంటే?
అశోక్: యెరూషలేమును పరిపాలించిన ఇశ్రాయేలు రాజులు “యెహోవా సింహాసనమందు” కూర్చున్నట్లు బైబిలు చెబుతుంది. f ఆ రాజులు దేవుని ప్రతినిధులుగా ఆయన ప్రజలను పరిపాలించారు. అంటే ఆ రాజుల పరిపాలనను దేవుని పరిపాలనని చెప్పొచ్చు. కానీ కాలక్రమేణా చాలామంది రాజులు దేవుని మాట వినలేదు, వాళ్లను చూసి ప్రజలు కూడా చెడుగా తయారయ్యారు. అందుకని దేవుడు వాళ్లను సా.శ.పూ. 607లో బబులోనీయుల చేతిలో ఓడిపోనిచ్చాడు. అప్పటినుండి యెరూషలేములో ఏ రాజులూ యెహోవా ప్రతినిధులుగా లేరు. ఆ విధంగా దేవుని పరిపాలనకు అంతరాయం కలిగింది. ఇక్కడివరకు మీకు అర్థం అయింది కదా?
కిషోర్: అర్థమైంది.
అశోక్: సా.శ.పూ. 607తో ఏడుకాలములు మొదలయ్యాయి. అంటే, అప్పటినుండి దేవుని పరిపాలనకు అంతరాయం కలిగింది. ఏడు కాలముల చివర్లో, దేవుడు తన ప్రతినిధిగా ఒక కొత్త రాజును నియమిస్తాడు. అయితే ఈసారి పరలోకంలో నియమిస్తాడు. ఆ సమయంలోనే దానియేలు పుస్తకంలో మనం చదివిన మిగతా ప్రవచనాలన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ఏడు కాలములు ఎప్పుడు ముగుస్తాయి? ఈ ప్రశ్నకు జవాబు కనుక్కుంటే దేవుని రాజ్యం ఎప్పుడు పరిపాలించడం మొదలుపెట్టిందో తెలుస్తుంది.
కిషోర్: ఓ అవునా! అంటే ఏడు కాలములు ముగిసింది 1914లోనేనా?
అశోక్: అవును.
కిషోర్: కానీ 1914 అని మనకెలా తెలుస్తుంది?
అశోక్: యేసు భూమ్మీద పరిచర్య చేసే సమయానికి ఏడుకాలములు ఇంకా పూర్తి కాలేదని ఆయనే చెప్పాడు. g అంటే ఆ ఏడు కాలముల నిడివి చాలా పెద్దదై ఉండాలి. ఆ ఏడు కాలములు యేసు భూమ్మీదకు రావడానికి వందల సంవత్సరాల క్రితమే మొదలై, యేసు పరలోకానికి వెళ్లిన తర్వాత కొంతకాలం వరకు కొనసాగాయి. అంతేకాదు “అంత్యకాలము” వరకు దానియేలు ప్రవచనాలు స్పష్టంగా అర్థం కావు అని కూడా చూశాం. h అయితే, 18వ శతాబ్దం చివర్లో బైబిలును ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది ఈ ప్రవచనాలతో పాటు ఇతర ప్రవచనాలను, వాటి అర్థాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. ఏడు కాలములు 1914తో ముగుస్తాయని వాళ్లు గ్రహించారు. 1914 నుండి ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు కూడా ఆ సంవత్సరంలోనే దేవుని రాజ్యం పరలోకంలో పరిపాలన మొదలుపెట్టిందని రుజువు చేశాయి. ఆ సంవత్సరంలోనే ప్రపంచం అంత్యదినాల్లోకి లేదా చివరి రోజుల్లోకి అడుగుపెట్టింది. ఇవన్నీ ఒకేసారి అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది.
కిషోర్: నిజమే, నేను ఈ విషయాలన్నీ మళ్లీ చదివి బాగా అర్థం చేసుకోవాలి.
అశోక్: ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నాకూ కొంత సమయం పట్టింది. ఏదేమైనా మన చర్చ వల్ల యెహోవా సాక్షులు దేవుని రాజ్యం గురించి కూడా బైబిల్లో ఉన్నదే నమ్ముతారని మీకు అర్థమైందనుకుంటున్నాను.
కిషోర్: ఖచ్చితంగా! మీరు బైబిల్లో ఉన్నవే నమ్ముతారు. ఆ విషయం నాకు నచ్చుతుంది.
అశోక్: మీరు కూడా బైబిల్లో ఉన్నవే నమ్ముతారని నాకు తెలుసు. మీకు ఇంకా కొన్ని సందేహాలు ఉండొచ్చు. ఇవన్నీ ఒకేసారి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఏడు కాలములు దేవుని రాజ్యానికి సంబంధించినవని, సా.శ.పూ. 607లో మొదలయ్యాయని ఇప్పటివరకు చూశాం. అయితే ఏడు కాలములు 1914తో ముగిసాయని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? i
కిషోర్: అవును నేను కూడా అదే ఆలోచిస్తున్నాను.
అశోక్: ఏడు కాలములంటే ఖచ్చితంగా ఎంత సమయమో నిర్ణయించడానికి మనం బైబిల్లో చూద్దాం. మళ్లీ కలిసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందామా?
కిషోర్: తప్పకుండా. j ▪ (w14-E 10/01)
మీకు అర్థం కాని బైబిలు విషయాలు ఏమైనా ఉన్నాయా? యెహోవాసాక్షుల నమ్మకాల గురించి గానీ పద్ధతుల గురించి గానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే యెహోవాసాక్షులతో మాట్లాడండి. వాళ్లు మీకు సంతోషంగా వివరిస్తారు.
a యెహోవా సాక్షులు పొరుగువాళ్లతో బైబిలు గురించిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం చర్చిస్తుంటారు.
c యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 9వ అధ్యాయం చూడండి. www.pr418.com/te వెబ్‌సైట్‌లో కూడా ఈ పుస్తకం చూడొచ్చు.
g అంత్యదినాల గురించిన ప్రవచనంలో యేసు, “అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు [దేవుని పరిపాలనకు గుర్తుగా ఉన్న] యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును” అని చెప్పాడు. (లూకా 21:24) దేవుని పరిపాలనకు వచ్చిన అంతరాయం యేసు కాలంలోనూ ఉంది, అంత్యదినాల వరకు కొనసాగింది.
i బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో అనుబంధంలోని “1914–బైబిలు ప్రవచనాల్లో గమనార్హమైన సంవత్సరం” అంశాన్ని చూడండి. www.pr418.com/te వెబ్‌సైట్‌లో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.
j తర్వాత శీర్షికలో ఏడు కాలములంటే ఖచ్చితంగా ఎంత సమయమో చెప్పే బైబిలు వచనాలు పరిశీలిస్తాం.