కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిల్లో ఉన్న విషయాలు నాకు సంతృప్తిని ఇచ్చాయి

బైబిల్లో ఉన్న విషయాలు నాకు సంతృప్తిని ఇచ్చాయి
  • పుట్టిన సంవత్సరం:1987

  • పుట్టిన దేశం: అజర్‌బైజాన్‌

  • వివరాలు: నాన్న ముస్లిం, అమ్మ యూదురాలు

నా గతం:

నేను అజర్‌బైజాన్‌ రాజధాని బాకు నగరంలో పుట్టాను. మా నాన్న ముస్లిం, అమ్మ యూదురాలు. నాకు ఒక అక్క ఉంది. మా అమ్మానాన్నల మతాలు వేర్వేరయినా వాళ్లిద్దరు ప్రేమగా ఉండేవాళ్లు. ఒకరి మతనమ్మకాలను ఒకరు గౌరవించేవాళ్లు. నాన్న రంజాన్‌ పండుగలో ఉపవాసం ఉన్నప్పుడు అమ్మ సహాయం చేసేది, అమ్మ యూదుల పండుగ పస్కా చేసేటప్పుడు నాన్న సహాయం చేసేవాడు. మా ఇంట్లో ఖురాన్‌, తోరహ్‌ అనే యూదుల గ్రంథం, బైబిలు ఉండేవి.

నేను ముస్లిం మతాన్ని పాటించే దాన్ని. దేవుడు ఉన్నాడా? అనే సందేహం నాకు లేకపోయినా కొన్ని విషయాలు నాకు అర్థమయ్యేవి కావు. ‘దేవుడు మనుషులను ఎందుకు చేశాడు?’ ‘ఎలాగూ చనిపోయాక నరకంలో నిరంతరం బాధపడతాం, మరి ఇప్పుడు కష్టాలు ఎందుకుపడాలి?’ దేవుడు చెప్పినట్లే అన్నీ జరుగుతున్నాయని అందరూ అంటారు. ‘దేవుడు మనుషులను తోలుబొమ్మల్లా చేసి కష్టాలు పెడుతూ, వాళ్లు బాధపడుతుంటే చూసి ఆనందిస్తున్నాడా?’ అని అనుకునే దాన్ని.

నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నమాజ్‌ అంటే ముస్లింలు రోజుకు ఐదుసార్లు చేసే ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాను. అప్పటికి మా నాన్న నన్ను, మా అక్కను యూదుల పాఠశాలకు పంపించారు. అక్కడ వేరే విషయాలతోపాటు తోరహ్‌లో ఉన్న ఆచారాలు, హీబ్రూ భాష నేర్పించేవాళ్లు. ప్రతీరోజు స్కూలు మొదలయ్యేముందు యూదుల ఆచారం ప్రకారం ప్రార్థన చేయాలి. ఉదయం ఇంట్లో నమాజ్‌ చేసేదాన్ని, తర్వాత స్కూలుకు వెళ్లాక యూదుల ప్రార్థనలు చేసేదాన్ని.

నాకున్న ప్రశ్నలకు జవాబుల కోసం చాలా వెదికాను. “దేవుడు మనుషులను ఎందుకు చేశాడు? మా నాన్న ముస్లిం కాబట్టి దేవుడు ఆయనను ఎలా చూస్తాడు? ఆయన మంచివాడు కదా మరి యూదుల ప్రకారం ఆయన ఎందుకు అపవిత్రుడు? దేవుడు ఆయనను ఎందుకు చేశాడు?” అని మా స్కూల్లో ఉన్న రబ్బీలను అంటే యూదుల మతనాయకులను చాలాసార్లు అడిగాను. నాకు దొరికిన జవాబులు అర్థంకాలేదు, నమ్మేలా కూడా లేవు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .

2002లో దేవుని మీద నా నమ్మకం చెదిరిపోయింది. మేము జర్మనీ దేశానికి వెళ్లిపోయిన వారానికే మా నాన్నకు స్ట్రోక్‌ వచ్చి కోమాలోకి వెళ్లిపోయాడు. మా కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఎన్నో ఏళ్లుగా ప్రార్థించాను. జీవమరణాల మీద దేవునికి మాత్రమే అధికారం ఉందనే నమ్మకంతో మా నాన్న బ్రతకాలని దేవున్ని రోజూ బ్రతిమిలాడేదాన్ని. ‘ఒక చిన్న అమ్మాయి కోరిక తీర్చడం దేవునికి కష్టమేమి కాదు’ అనుకున్నాను. నేను అడిగింది ఇస్తాడని ఖచ్చితంగా నమ్మాను. కానీ, మా నాన్న చనిపోయాడు.

దేవుడు పట్టించుకోకపోవడంతో నా హృదయం బద్దలైపోయింది. ‘నేను సరిగ్గా ప్రార్థించలేదా? లేక దేవుడు లేడా?’ అని నాకు అనిపించింది. ఆ దిగులుతో ఇక నమాజ్‌ చేయలేకపోయాను. వేరే మతాలు చెప్పేవి కూడా నాకు అంతగా నచ్చలేదు, కాబట్టి దేవుడు లేడని నిర్ణయించుకున్నాను.

ఆరు నెలలు తర్వాత మా ఇంటికి యెహోవాసాక్షులు వచ్చారు. మాకు క్రైస్తవత్వం అంటే పెద్దగా గౌరవం లేదు కాబట్టి వాళ్లు తప్పు అని నేను, మా అక్క వాళ్లకు మర్యాదగా చెప్పాలనుకున్నాం. “బైబిల్లో ఉన్న పది ఆజ్ఞలకు వ్యతిరేకంగా క్రైస్తవులు యేసును, సిలువను, మరియను, ఇతర విగ్రహాలను ఎందుకు ఆరాధిస్తారు?” అని అడిగాము. అప్పుడు సాక్షులు, నిజ క్రైస్తవులు విగ్రహారాధన అస్సలు చేయకూడదని, దేవునికి మాత్రమే ప్రార్థించాలని బైబిలు నుండి చూపించారు. అది విని చాలా ఆశ్చర్యపోయాను.

ఆ తర్వాత “మరి త్రిత్వం విషయమేమిటి? యేసే దేవుడైతే, ఆయన భూమ్మీద జీవించడం ఏమిటి, మనుషుల చేతుల్లో చనిపోవడం ఏమిటి?” అని అడిగాము. ఈసారి కూడా వాళ్లు బైబిలు నుండే జవాబు ఇచ్చారు. యేసు దేవుడు కాదు, దేవునితో సమానం కాదు అని చూపించారు. ఈ కారణం వల్లనే వాళ్లు త్రిత్వాన్ని నమ్మరని చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ‘ఈ క్రైస్తవులు చాలా వింతగా ఉన్నారే’ అని అప్పుడు అనుకున్నాను.

అయితే, మనుషులు ఎందుకు చనిపోతున్నారు, దేవుడు బాధలను ఎందుకు తీసివేయట్లేదు అనే విషయాలను తెలుసుకోవాలనుకున్నాను. నిత్యజీవానికి నడిపించే జ్ఞానము a అనే పుస్తకాన్ని సాక్షులు చూపించారు. ఆ పుస్తకంలో నా ప్రశ్నలన్నిటికి జవాబులు ఉన్నాయి. వాళ్లు నాకు బైబిల్లో విషయాలు నేర్పించడం మొదలుపెట్టారు.

వాళ్లు నేర్పించేవన్నీ నమ్మగలిగేలా ఉన్నాయి, ప్రతీది బైబిలు నుండి చెప్పేవారు. దేవుని పేరు యెహోవా అని తెలుసుకున్నాను. (కీర్తన 83:18) ఆయన ముఖ్య లక్షణం నిస్వార్థమైన ప్రేమ. (1 యోహాను 4:8) జీవం అనే వరాన్ని అందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆయన మనుషులను సృష్టించాడు. దేవుడు అన్యాయాన్ని ఇప్పుడు తీసివేయకపోయినా ఆయనకు అన్యాయం అంటే అసహ్యమని, త్వరలోనే దాన్ని పూర్తిగా తీసివేస్తాడని తెలుసుకున్నాను. ఆదాముహవ్వలు తిరగబడ్డారు కాబట్టే మనుషులందరు కష్టాల్లో పడ్డారు అని కూడా అర్థమైంది. (రోమీయులు 5:12) అలా వచ్చిన కష్టాల్లో ఒకటి మా నాన్న చనిపోయినట్లే మనకు ఇష్టమైనవాళ్లు చనిపోవడం. కానీ రాబోయే కొత్త లోకంలో దేవుడు ఈ బాధలన్నీ తీసేస్తాడు, చనిపోయినవాళ్లందరు తిరిగి బ్రతుకుతారు.—అపొస్తలుల కార్యములు 24:15.

బైబిల్లో ఉన్న విషయాలు నాకు సంతృప్తిని ఇచ్చాయి. దేవుని మీద నమ్మకం తిరిగి వచ్చింది. యెహోవాసాక్షుల గురించి ఇంకా తెలుసుకున్నప్పుడు, వాళ్లు అన్ని దేశాల్లో ఉన్నా, ఒకే కుటుంబంలా ఉన్నారని తెలుసుకున్నాను. వాళ్ల మధ్య ఐక్యత, ప్రేమ నాకు చాలా నచ్చింది. (యోహాను 13:34, 35) యెహోవా గురించి తెలుసుకున్న విషయాలు ఆయనను ఆరాధించాలనే కోరిక నాలో కలిగించాయి, కాబట్టి నేను యెహోవాసాక్షి అవ్వాలని నిర్ణయించుకున్నాను. జనవరి 8, 2005⁠లో బాప్తిస్మం తీసుకున్నాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . .

బైబిలు నుండి నేర్చుకున్న విషయాలు జీవితం గురించి నా ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. దేవుని వాక్యంలో ఉన్న వివరణ నాకు మనశ్శాంతిని ఇచ్చింది. చనిపోయిన వాళ్లందరు భవిష్యత్తులో మళ్లీ బ్రతికినప్పుడు, మా నాన్నను మళ్లీ చూస్తాను అనే ఆశ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.—యోహాను 5:28, 29.

నాకు పెళ్లయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది. నా భర్త జానతన్‌కు కూడా దేవుడు అంటే చాలా భక్తి. దేవుని గురించిన విషయాలు చాలా లాజికల్‌గా, అర్థం చేసుకోవడానికి సులువుగా ఉన్నాయి. అవి వెలకట్టలేనివి అని మేమిద్దరం తెలుసుకున్నాం. అందుకే మా విశ్వాసం గురించి, మాకున్న నిరీక్షణ గురించి వేరేవాళ్లకు చెప్తుంటాం. యెహోవాసాక్షులు “వింతగా” ఉన్న క్రైస్తవులు కారు కానీ నిజమైన క్రైస్తవులు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ▪ (w15-E 01/01)

a యెహోవాసాక్షులు ప్రచురించారు, కానీ ఇప్పుడు ముద్రించడం లేదు.