తప్పుగా అర్థం చేసుకుంటే ప్రమాదం ఉందా?
ఒక చిన్నపాప, ఫ్యాక్టరీ నుండి బయటకు వస్తున్న పొగ చిన్నచిన్న మబ్బుల్లా ఏర్పడడాన్ని చూసింది. ఆమె చూసిన దాన్నిబట్టి ఆ ఫ్యాక్టరీ మబ్బులు తయారు చేసే ఫ్యాక్టరీ అనుకుంది. ఆ పాప అలా తప్పుగా అనుకున్నా ఫర్లేదు. కానీ అదే పెద్దపెద్ద విషయాలను సరిగ్గా అర్థం చేసుకోకపోయినా లేదా తప్పుగా అర్థం చేసుకున్నా చాలా నష్టం కలగవచ్చు. ఉదాహరణకు ఒక మెడిసిన్ బాటిల్ మీదున్న లేబుల్ని తప్పుగా చదివితే ఎంత ప్రమాదం.
ఆధ్యాత్మిక విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రమాదం. ఉదాహరణకు కొంతమంది యేసు చెప్పిన విషయాలను తప్పుగా అర్థం చేసుకున్నారు. (యోహాను 6:47-68) యేసు దగ్గర ఎక్కువ విషయాలు నేర్చుకునే బదులు వాళ్లు ఆయన చెప్పిన విషయాలన్నిటిని ప్రక్కన పెట్టేశారు. ఎంత నష్టం!
మీరు మార్గనిర్దేశం కోసం బైబిల్ని చదువుతారా? అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. కానీ మీరు చదివే వాటిని ఒకవేళ మీరు తప్పుగా అర్థం చేసుకుంటే? చాలామందికి అలా జరిగింది. అలాంటి మూడు విషయాలను ఇప్పుడు చూద్దాం.
-
కొంతమంది ‘దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి’ అనే మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే దేవుని ముందు గడగడ వణుకుతూ భయపడుతూ ఉండాలి అనుకుంటారు. (ప్రసంగి 12:13) కానీ ఆయన్ని ఆరాధించే వాళ్లు అలా అనుకోవాలని దేవుడు కోరుకోవడం లేదు. “నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే” అని దేవుడు చెప్తున్నాడు. (యెషయా 41:9, 10) దేవునికి భయపడడం అంటే దేవుడు ఎంతో గొప్పవాడని గ్రహించి, ఆయనకు ప్రగాఢ గౌరవం చూపించడమని అర్థం.
-
కొంతమంది ఈ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు: “ప్రతిదానికి సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు.” (ప్రసంగి 3:1, 2) ఈ మాటల్ని బట్టి ప్రతి మనిషి ఎప్పుడు మరణిస్తాడో దేవుడు ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించి పెట్టాడని అనుకుంటారు. కానీ నిజానికి జీవితంలో వేర్వేరు దశల గురించి చెప్తూ, చివరికి ప్రతి ఒక్కరూ మరణిస్తారు అనే వాస్తవం గురించి ఆ మాటల్లో ఉంది. అయితే, మనం తీసుకునే నిర్ణయాలు కూడా మనం జీవించే వయసుపై ప్రభావం చూపిస్తాయని దేవుని వాక్యం నేర్పిస్తుంది. ఉదాహరణకు “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము” అని మనం చదువుతాం. (సామెతలు 10:27; కీర్తన 90:10; యెషయా 55:3) అంటే దేవుని వాక్యం మీద గౌరవంతో ఆరోగ్యాన్ని పాడు చేసే త్రాగుబోతుతనం, తిరుగుబోతుతనం లాంటి వాటికి దూరంగా ఉండడం వల్ల అది సాధ్యమౌతుంది.—1 కొరింథీయులు 6:9, 10.
-
కొంతమంది ఆకాశం, భూమి ‘అగ్నికొరకు నిలువచేయబడ్డాయి’ అని బైబిల్లో ఉన్న మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని దేవుడు ఈ గ్రహాన్ని నాశనం చేస్తాడని అనుకుంటారు. (2 పేతురు 3:7) కానీ దేవుడు భూగ్రహాన్ని ఎప్పుడూ నాశనం కానివ్వనని చెప్పాడు. “భూమి యెన్నటికిని కదలకుండునట్లు” దేవుడు ‘దానిని పునాదులమీద స్థిరపరిచాడు.’ (కీర్తన 104:5; యెషయా 45:18) ఈ లోకంలో చెడిపోయిన ప్రజలు అగ్నితో కాల్చినట్లు పూర్తిగా నాశనం అవుతారు కానీ భూమి కాదు. ఆకాశం అంటే అసలు అర్థం చూస్తే నిజమైన ఆకాశం కావచ్చు, నక్షత్రాలు నిండిన విశ్వం కావచ్చు, లేదా దేవుడు ఉండే పరలోకం కావచ్చు. ఇవేవి నాశనం కావు.
బైబిల్ని ఎందుకు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారు?
ఈ ఉదాహరణలన్నీ చూపిస్తున్నట్లు, బైబిల్లో కొన్ని భాగాలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ దేవుడు అలా ఎందుకు జరగనిస్తున్నాడు? కొంతమంది ‘దేవునికి చాలా జ్ఞానం ఉంది, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా రాసి ఉన్న పుస్తకాన్ని ఎందుకు ఇవ్వలేదు? దేవుడు అలా ఎందుకు చేయలేదు?’ అంటారు. బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడానికి మూడు కారణాలు చూద్దాం.
-
వినయంగా, నేర్చుకోవాలనే మనసు ఉన్నవాళ్ల కోసం బైబిలు తయారు చేయబడింది. యేసు తండ్రితో ఇలా లూకా 10:21) సరైన మనసుతో చదివిన వాళ్లకు మాత్రమే అర్థమయ్యేలా బైబిల్ని రాశారు. జ్ఞానులు, వివేకుల్లో గర్వం ఎక్కువగా ఉంటుంది. వాళ్లలా గర్వంతో చదివితే బైబిల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ. కానీ చిన్నపిల్లల్లా వినయంగా, నేర్చుకోవాలనే మనసుతో బైబిల్ని చదివే వాళ్లకు దేవుని సందేశాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలా దేవుడు బైబిల్ని ఎంత నేర్పుగా తయారు చేశాడో కదా!
అన్నాడు: “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.” ( -
దేవుని సహాయంతో అర్థం చేసుకోవాలని నిజంగా కోరుకునే వాళ్లకోసం బైబిల్ రాయబడింది. యేసు నేర్పించిన విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలనుకునే వాళ్లకు సహాయం అవసరమని ఆయన చూపించాడు. మరి ఆ సహాయం వాళ్లకు ఎలా అందుతుంది? యేసు ఇలా వివరించాడు: ‘ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును.’ (యోహాను 14:26) కాబట్టి దేవుడు తన శక్తిని, అంటే పరిశుద్ధాత్మను ఇచ్చి బైబిల్లో చదివిన విషయాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. కానీ అలా దేవుని సహాయం మీద ఆధారపడకుండా ఉండేవాళ్లకు దేవుడు తన పరిశుద్ధాత్మను ఇవ్వడు కాబట్టి బైబిలు వాళ్లకు అర్థం కాదు. బైబిల్ని అర్థం చేసుకోవాలనుకునే వాళ్లకు సహాయం చేసేలా పరిశుద్ధాత్మ జ్ఞానమున్న క్రైస్తవులను కూడా కదిలించగలదు.—అపొస్తలుల కార్యములు 8:26-35.
-
సమయం వచ్చినప్పుడు మాత్రమే కొన్ని బైబిలు భాగాలను మనుషులు అర్థం చేసుకోగలరు. ఉదాహరణకు, దానియేలు ప్రవక్త భవిష్యత్తుకు సంబంధించి ఒక సందేశాన్ని రాయాల్సి వచ్చింది. ఒక దూత అతనితో, “ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊరకుండుమని” చెప్పాడు. శతాబ్దాలుగా దానియేలు పుస్తకాన్ని ప్రజలు చదివారు కాని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. తను స్వయంగా రాసిన కొన్ని విషయాలను దానియేలు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే వినయంగా: “నేను వింటినిగాని గ్రహింపలేకపోతిని” అన్నాడు. కానీ దానియేలు చెప్పిన దేవుని ప్రవచనాన్ని ఒక సమయం వచ్చాక ప్రజలు సరిగ్గా అర్థం చేసుకుంటారు. అదీ దేవుడు నిర్ణయించిన సమయంలోనే. ఆ దూత ఇంకా ఇలా అన్నాడు: “నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము.” మరి ఈ సందేశాలను ఎవరు అర్థం చేసుకుంటారు? “ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.” (దానియేలు 12:4, 8-10) కాబట్టి దేవుడు తగిన సమయం వచ్చేవరకు బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను బయలుపర్చడు.
సరైన సమయం కాకపోవడం వల్ల యెహోవాసాక్షులు బైబిల్ని ఎప్పుడైనా తప్పుగా అర్థం చేసుకున్నారా? అవును. కానీ దేవుడు అనుకున్న సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు స్పష్టమయ్యాక సాక్షులు, వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్న వాటిని వెంటనే సరిచేసుకున్నారు. అలా చేస్తూ వాళ్లు క్రీస్తు అపొస్తలులను అనుసరిస్తున్నామని నమ్ముతారు. వాళ్లు కూడా యేసు సరిచేసిన వెంటనే వినయంగా వాళ్ల ఆలోచనలను సరిచేసుకున్నారు.—అపొస్తలుల కార్యములు 1:6, 7.
మబ్బులు ఎలా వస్తున్నాయనే విషయంలో ఆ పాప ఊహలు తప్పే అయినా వాటి వల్ల పెద్ద నష్టం ఉండదు. కానీ బైబిలు బోధిస్తున్న విషయాలు మాత్రం అలా కాదు, అవి చాలా ముఖ్యం. బైబిల్ని చదువుకుని సొంత ప్రయత్నాలతో అర్థం చేసుకుంటే ప్రమాదమే. కాబట్టి మీరు చదువుతున్న వాటిని అర్థం చేసుకోవడానికి సహాయం తీసుకోండి. వినయ మనస్సుతో బైబిల్ని చదివేవాళ్లకోసం, అర్థం చేసుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మ పైన నిజంగా ఆధారపడే వాళ్లకోసం వెదకండి. ఈ కాలంలో బైబిల్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది నిజమని నమ్ముతున్న వాళ్లకోసం వెదకండి. యెహోవాసాక్షులతో మాట్లాడడానికి లేదా jw.org వెబ్సైట్లో ఎంతో జాగ్రత్తగా పరిశోధన చేసి పెట్టిన విషయాలు చదవడానికి వెనకాడకండి. “తెలివికై మొఱ్ఱపెట్టినయెడల . . . దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును” అని బైబిలు వాగ్దానం చేస్తుంది.—సామెతలు 2:3-5.