కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆఫ్రికా అమెరికాల మధ్య జరిగిన బానిసల వ్యాపారం చాలా లాభాలు తెచ్చేది

బానిసత్వం నుండి విడుదల​—⁠అప్పుడు, ఇప్పుడు

బానిసత్వం నుండి విడుదల​—⁠అప్పుడు, ఇప్పుడు

అల్క a అనే అమ్మాయికి బ్యూటీపార్లర్‌లో పని ఇప్పిస్తామని ఎవరో ఆమెను యూరప్‌కు తెచ్చారు. తర్వాత వాళ్లు, ఆమెను పదిరోజులపాటు కొడుతూ, ఇంటిదగ్గరున్న కుటుంబ సభ్యులను హింసిస్తామని బెదిరిస్తూ, బలవంతంగా వేశ్యావృత్తిలోకి దించారు.

పూర్వం ఐగుప్తులో బంధించిన బానిసలను చూపిస్తున్న చిత్రం

అల్క, ఆ వేశ్యాగృహం యజమానురాలికి ఇవ్వాల్సిన 40,000 యూరోల అప్పు తీర్చడానికి, ఒక్క రాత్రికి 200 నుండి 300 యూరోల డబ్బు సంపాదించాల్సి ఉంది. b “నేను చాలాసార్లు పారిపోవాలని అనుకున్నాను, కానీ నా కుటుంబాన్ని ఏం చేస్తారో అని భయపడేదాన్ని. నాకు బయటపడే దారి లేకుండా చేశారు” అని అల్క అంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న సెక్స్‌ బిజినెస్‌ వల్ల బలైపోయిన దాదాపు 40 లక్షల మంది కథల్లో ఆమెది ఒకటి.

సుమారు 4000 సంవత్సరాల క్రితం యోసేపు అనే యువకుడిని అతని అన్నలు అమ్మేశారు. తర్వాత అతను బాగా పేరున్న ఒక ఐగుప్తీయుని ఇంట్లో బానిస అయ్యాడు. అల్కలా యోసేపును ముందు నుండే యజమాని హింసించలేదు. కానీ యజమాని భార్య యోసేపును లోపర్చుకోవాలని చేసిన ప్రయత్నాలను అతను తిప్పి కొట్టినప్పుడు తనను బలాత్కారం చేయబోయాడని అన్యాయంగా నింద వేసింది. అప్పుడు అతనిని జైల్లో పడేసి, సంకెళ్లు వేశారు.—ఆదికాండము 39:1-20; కీర్తన 105:17, 18.

యోసేపు పూర్వకాలంలో ఉన్న బానిస. అల్క 21వ శతాబ్దంలో ఉన్న బానిస. కానీ అనాదిగా మనుషులతో చేస్తున్న వ్యాపారాలకు ఇద్దరూ బలి అయిన వాళ్లే. ఈ వ్యాపారంలో మనుషుల్ని వస్తువుల్లా చూస్తారు, డబ్బు సంపాదించడం తప్ప వేరే ఏదీ పట్టించుకోరు.

యుద్ధం వల్ల బానిస వ్యాపారం చాలా పెరుగుతుంది

బానిసల్ని సంపాదించుకోవడానికి కొన్ని దేశాలకు యుద్ధం సులువైన మార్గం. ఐగుప్తు రాజైన తుత్‌మోస్‌ III కనానులో చేసిన ఒక యుద్ధం తర్వాత దాదాపు 90,000 మందిని బానిసలుగా తెచ్చుకున్నాడని చెప్తారు. వాళ్లను గనుల్లో పనిచేయడానికి, గుళ్లు కట్టడానికి, కాలువలు త్రవ్వించడానికి ఐగుప్తీయులు వాడుకునేవాళ్లు.

రోమా సామ్రాజ్యంలో కూడా యుద్ధాల వల్ల పుష్కలంగా బానిసలు దొరికేవాళ్లు. కొన్నిసార్లు బానిసల్ని సంపాదించుకోవడం కోసమే యుద్ధాలు చేసేవాళ్లు. మొదటి శతాబ్దం వచ్చే సరికి రోములో దాదాపు సగం జనాభా బానిసలే ఉండి ఉంటారని అంచనా. చాలామంది ఐగుప్తీయులు, రోమీయులు బానిసల్ని ఘోరంగా హింసించి చాకిరి చేయించేవాళ్లు. రోమా గనుల్లో పనిచేసే బానిసల జీవితకాలం చాలా తక్కువ. 30 సంవత్సరాలకన్నా ఎక్కువ బ్రతికేవాళ్లు కాదు.

కాలం గడిచే కొద్దీ బానిసల జీవితం తేలిక కాలేదు. 16వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు, ఆఫ్రికా అమెరికాల మధ్య జరిగిన బానిసల వ్యాపారం మిగతా వ్యాపారాల కన్నా చాలా లాభాలు తెచ్చింది. ‘దాదాపు 250 నుండి 300 లక్షల పురుషుల్ని, స్త్రీలని, పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి అమ్మేసేవాళ్లు’ అని UNESCO రిపోర్టు చెప్తుంది. అట్లాంటిక్‌ సముద్రం దాటుతూ కొన్ని లక్షల మంది చనిపోయి ఉంటారని చెప్తారు. అప్పుడు ప్రాణాలతో బయటపడిన ఓలౌడా ఇక్వియానో అనే ఒక బానిస ఇలా చెప్తున్నాడు: “స్త్రీల ఆర్తనాదాలతో, చనిపోయే వాళ్ల మూలుగులతో ఆ దృశ్యం చెప్పలేనంత భయంకరంగా ఉంది.”

బానిసత్వం చరిత్రలో ఎప్పుడో అంతమైపోయిన విషాధ గాథ కాదు. దాదాపు 210 లక్షల స్త్రీపురుషులు, పిల్లలు ఇంకా బానిసలుగా వెట్టిచాకిరి చేస్తున్నారు. వాళ్లకు చాలా తక్కువ డబ్బులు ఇస్తారు లేదా అసలు ఇవ్వరు అని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెప్తుంది. ఇప్పుడున్న బానిసలు గనుల్లో, నేత పరిశ్రమల్లో, ఇటుకల ఫ్యాక్టరీల్లో, బ్రోతల్‌ గృహాల్లో, ఇళ్లల్లో పని చేస్తారు. చట్ట విరుద్ధం అయినప్పటికీ, ఇలాంటి బానిసత్వం చాలా ఎక్కువైపోతుంది.

లక్షలమంది ఇంకా బానిసలుగా వెట్టిచాకిరి చేస్తున్నారు

స్వేచ్ఛ కోసం పోరాటం

క్రూరమైన అణచివేత వల్ల చాలామంది బానిసలు స్వేచ్ఛ కోసం పోరాడారు. క్రీ.పూ. మొదటి శతాబ్దంలో స్పార్టాకస్‌ అనే గ్లాడియేటర్‌తో పాటు దాదాపు 1,00,000 మంది బానిసలు కలిసి రోముకు వ్యతిరేకంగా తిరగబడ్డారు గానీ గెలవలేకపోయారు. 18వ శతాబ్దంలో, కరీబియన్‌ దీవి అయిన హిస్పాన్యోలాలో బానిసలు యజమానులకు వ్యతిరేకంగా లేచారు. చెరుకు తోటల్లో పనిచేసే బానిసలతో ఘోరంగా వ్యవహరించడం వల్ల 13 సంవత్సరాలు అంతర్యుద్ధం జరిగింది. దాని ఫలితంగా 1804లో హయిటీ స్వతంత్ర దేశంగా ఏర్పడింది.

ఇశ్రాయేలీయులకు, ఐగుప్తు నుండి వచ్చిన విడుదల చరిత్రలోనే బానిసత్వం నుండి వచ్చిన అతి విజయవంతమైన విడుదల అని చెప్పవచ్చు. బహుశా 30 లక్షల ప్రజలు, అంటే ఒక పూర్తి దేశం, ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందారు. వాళ్లు ఆ స్వేచ్ఛకు నిజంగా అర్హులు. ఎందుకంటే ఐగుప్తులో వాళ్ల జీవితం గురించి బైబిలు ఇలా చెప్తుంది, “వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను.” (నిర్గమకాండము 1:11-14) ఇశ్రాయేలీయుల జనాభా పెరగకుండా చేయడానికి ఒక ఫరో దేశంలో వాళ్ల చంటి పిల్లలందరినీ చంపించాలని ఆజ్ఞ ఇచ్చాడు.—నిర్గమకాండము 1:8-22.

ఐగుప్తులో ఇశ్రాయేలీయులకు జరిగిన అన్యాయం నుండి వాళ్లకు వచ్చిన విడుదల చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే దానికి కారణం దేవుడు. “వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి,” ‘వారిని విడిపించుటకు . . . దిగివచ్చి యున్నాను’ అని దేవుడు మోషేతో అన్నాడు. (నిర్గమకాండము 3:7, 8) ఈ రోజు వరకు, యూదులు అన్నిచోట్ల ఆ విడుదలను గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం పస్కా అనే పండుగను చేస్తారు.—నిర్గమకాండము 12:14.

బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించడం

“మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు” అని బైబిలు చెప్తుంది. అంతేకాదు దేవుడు మారలేదు అనే అభయాన్ని కూడా ఇస్తుంది. (2 దినవృత్తాంతములు 19:7; మలాకీ 3:6) “బందీలకు విడుదల కలుగుతుందని . . . ప్రకటించడానికి; అణచివేయబడిన వాళ్లను విడిపించడానికి” దేవుడు యేసును పంపించాడు. (లూకా 4:18) అంటే ప్రతి బానిసకు స్వాతంత్ర్యం దొరుకుతుందని దాని అర్థమా? కాదు. యేసు ప్రజలను పాపం, మరణం అనే బానిసత్వం నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయన తర్వాత ఇలా ప్రకటించాడు, “ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది.” (యోహాను 8:32) ఈ రోజు కూడా యేసు నేర్పించిన సత్యం ప్రజలను చాలా విధాలుగా విడుదల చేస్తుంది.—“ మరో రకమైన బానిసత్వం నుండి విడుదల” అనే బాక్సు చూడండి.

నిజంగా బానిసత్వం నుండి తప్పించుకోవడానికి దేవుడు యోసేపుకు, అల్కకు వేర్వేరు విధాలుగా సహాయం చేశాడు. యోసేపు అసాధారణ కథను మీరు బైబిలు పుస్తకమైన ఆదికాండము 39 నుండి 41 అధ్యాయాల్లో చూడవచ్చు. స్వేచ్ఛ కోసం అల్క చేసిన ప్రయత్నం కూడా అసాధారణమైనది.

యూరప్‌లో ఆమె ఉన్న దేశం నుండి బయటకు పంపించబడ్డాక అల్క స్పెయిన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె యెహోవాసాక్షులను కలుసుకుని వాళ్ల దగ్గర బైబిలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆమె జీవితాన్ని సరిచేసుకోవాలని నిశ్చయించుకుని, ఒక మంచి ఉద్యోగం చూసుకుంది. ఆమె యజమానురాలికి నెలనెలా ఇవ్వాల్సిన డబ్బుల్ని కాస్త తగ్గించేలా ఒప్పించుకుంది. ఒక రోజు అల్కకు ఆమె యజమానురాలి నుండి ఫోన్‌ వచ్చింది. ఆమె అల్క ఇవ్వాల్సిన అప్పును మాఫీ చేసి క్షమాపణ అడిగింది. అలా ఎలా జరిగింది? ఆమె కూడా యెహోవాసాక్షుల దగ్గర బైబిలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. “సత్యం ఎన్నో అద్భుత రీతుల్లో మనల్ని విడుదల చేస్తుంది” అని అల్క అంటుంది.

యెహోవా దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయుల మీద జరిగే దౌర్జన్యాన్ని చూసి చాలా బాధపడ్డాడు. ఈ రోజుల్లో జరిగే అన్యాయాలను చూసి కూడా ఆయన అలానే బాధ పడాలి కదా. అన్ని రకాల బానిసత్వాన్ని తీసేయాలంటే మానవ సమాజంలో చాలా పెద్ద మార్పే రావాలి. దేవుడు అలాంటి మార్పును తీసుకువస్తానని మాట ఇస్తున్నాడు. “అయితే మనం ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశం కోసం, కొత్త భూమి కోసం ఎదురుచూస్తున్నాం; వాటిలో ఎప్పుడూ నీతి ఉంటుంది.”—2 పేతురు 3:13

a అసలు పేరు కాదు.

b అంటే అల్క ఒక్కో రాత్రి కనీసం 14,000 నుండి 21,000 రూపాయలు సంపాదించి, దాదాపు 29,00,000 రూపాయల అప్పు తీర్చాల్సి ఉంది.