అద్వితీయ సత్య దేవునిగా యెహోవాను ఘనపరచండి
అధ్యాయం రెండు
అద్వితీయ సత్య దేవునిగా యెహోవాను ఘనపరచండి
1. అద్వితీయ సత్య దేవుడు ఎవరు?
దేవతలుగా దృష్టించబడేవారు అనేకులున్నప్పటికి “మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 8:5, 6) ఆ “ఒక్కడే దేవుడు” యెహోవా, ఆయనే సమస్తానికి సృష్టికర్త. (ద్వితీయోపదేశకాండము 6:4; ప్రకటన 4:11) యేసు ఆయనను ‘నా దేవుడు మీ దేవుడు’ అని పేర్కొన్నాడు. (యోహాను 20:17) ‘యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరి ఒకడు లేడు’ అని అంతకుపూర్వం చెప్పిన మోషేతో ఆయన ఏకీభవించాడు. (ద్వితీయోపదేశకాండము 4:35) ఆరాధించబడే విగ్రహాలు, దేవతలుగా పరిగణించబడే మనుష్యులు లేదా “ఈ యుగ సంబంధమైన దేవత,” దేవుని శత్రువు అయిన అపవాదియగు సాతాను కంటే యెహోవా ఎంతో ఉన్నతుడు. (2 కొరింథీయులు 4:3, 4) వీటన్నింటికి విరుద్ధంగా యేసు పిలిచినట్లు యెహోవా ‘అద్వితీయ సత్య దేవుడు.’—యోహాను 17: 3.
2. మనం దేవుని గురించి నేర్చుకుంటుండగా మన జీవితాలు ఎలా ప్రభావితమవ్వాలి?
2 దేవుని మనోహరమైన లక్షణాలతోపాటు, ఆయన మన కోసం చేసినవాటి గురించి, భవిష్యత్తులో చేసేవాటి గురించి తెలుసుకున్న కృతజ్ఞతగల ప్రజలు ఆయనకు సన్నిహితులౌతారు. యెహోవాపట్ల వారి ప్రేమ అధికమవుతుండగా వారు ఆయనను ఘనపరచడానికి ప్రేరేపించబడతారు. ఎలా? ఒక విధానమేమిటంటే, ఆయన గురించి ఇతరులకు చెప్పడం. ‘ఒకడు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును’ అని రోమీయులు 10:10 చెబుతోంది. మరో విధానం, మాటల్లోనూ క్రియల్లోనూ ఆయనను అనుకరించడం. “ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి” అని ఎఫెసీయులు 5: 1 చెబుతోంది. మనమలా మరింత సంపూర్ణంగా చేయడానికి, యెహోవా నిజమైన స్వభావం గురించి తెలుసుకోవాలి.
3. దేవుని ప్రధాన లక్షణాలు ఏవి?
3 బైబిలంతటా, దేవుని విశిష్ట లక్షణాలను గుర్తించే అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆయన నాలుగు ప్రధాన లక్షణాలు జ్ఞానము, న్యాయము, శక్తి, ప్రేమ. ‘జ్ఞానము ఆయనయొద్ద ఉన్నది.’ (యోబు 12:13) ‘ఆయన చర్యలన్ని న్యాయములు.’ (ద్వితీయోపదేశకాండము 32: 4) ‘ఆయన బలాతిశయము కలవాడు.’ (యెషయా 40:26) ‘దేవుడు ప్రేమా స్వరూపి.’ (1 యోహాను 4: 8) అయితే దేవుని నాలుగు ప్రధాన లక్షణాల్లో అత్యంత విశిష్టమైన లక్షణం, ఆయన ఎలాంటి దేవుడో ఇతర లక్షణాలకంటే ఎక్కువగా గుర్తించే లక్షణం ఏది?
“దేవుడు ప్రేమాస్వరూపి”
4. విశ్వాన్ని, సమస్త ప్రాణులను సృష్టించడానికి దేవుణ్ణి ఏ లక్షణం పురికొల్పింది?
4 విశ్వాన్ని, బుద్ధిసూక్ష్మతగల ఆత్మ ప్రాణులను, మానవులను సృష్టించడానికి యెహోవాను పురికొల్పినదేమిటో పరిశీలించండి. జ్ఞానము లేదా శక్తి ఆయనను పురికొల్పిందా? లేదు, దేవుడు వాటిని ఉపయోగించాడు కాని ఆయనను పురికొల్పినవి అవి కావు. ఆయన న్యాయ లక్షణం ప్రకారం జీవ వరాన్ని ఆయన ఇతరులతో పంచుకోవలసిన అవసరం లేదు. బదులుగా, బుద్ధిసూక్ష్మతగల వ్యక్తిగా ఉనికిలోవుండే ఆనందాలను పంచుకోవడానికి దేవుని గొప్ప ప్రేమే ఆయనను పురికొల్పింది. విధేయతచూపే మానవాళి పరదైసులో నిరంతరం జీవించాలని సంకల్పించడానికి ఆయనను ప్రేమే కదిలించింది. (ఆదికాండము 1:28; 2:15) ఆదాము పాపం మానవాళికి తెచ్చిన దండనను ఆయన తీసివేసే ఏర్పాటు చేయడానికి ప్రేమే కారణమైంది.
5. బైబిలు ప్రకారం యెహోవా ఏ లక్షణానికి ప్రతిరూపం, ఎందుకు?
5 కాబట్టి, దేవుని లక్షణాలన్నింటిలో అత్యంత విశిష్టమైనది ఆయన ప్రేమ. అది ఆయన వ్యక్తిత్వ సారం లేదా స్వభావం. ఆయన జ్ఞానము, న్యాయము, శక్తి కూడా ముఖ్యమైన లక్షణాలే అయినా బైబిలు ఎన్నడూ యెహోవా ఆ లక్షణాల రూపి అని చెప్పలేదు. కాని ఆయన ప్రేమా స్వరూపి అని అది చెబుతోంది. అవును, యెహోవా ప్రేమకు ప్రతిరూపం. ఈ ప్రేమ భావావేశాన్నిబట్టి కాదుగాని సూత్రానుసారంగా నడిపించబడుతుంది. దేవుని ప్రేమ సత్యానికి, నీతికి సంబంధించిన సూత్రాలచేత నిర్వర్తించబడుతుంది. స్వయంగా యెహోవా దేవునిలోనే ఉదహరించబడినట్లుగా అది అత్యంత ఉన్నతమైన ప్రేమ. ఆ ప్రేమ సంపూర్ణ నిస్వార్థంతో వ్యక్తంచేయబడి, అన్ని సందర్భాల్లో స్పష్టమైన చర్యలతో మిళితమై ఉంటుంది.
6. దేవుడు మనకంటే ఎంతో ఉన్నతుడైనప్పటికి, మనమాయనను అనుకరించడాన్ని ఏది సాధ్యం చేస్తుంది?
6 ఈ అద్భుత లక్షణమైన ప్రేమే, ఆ దేవుణ్ణి మనం అనుకరించేలా చేస్తుంది. అల్పులుగా, అపరిపూర్ణులుగా, అపరాధ మానవులుగా మనం దేవుణ్ణి విజయవంతంగా ఎన్నడూ అనుకరించలేమని మనం భావించవచ్చు. అయితే యెహోవా గొప్ప ప్రేమకు మరొక ఉదాహరణ చూడండి: ఆయన మన పరిమితులను గుర్తిస్తాడు, మన నుండి పరిపూర్ణతను కోరడు. మనం ప్రస్తుతం పరిపూర్ణతకు చాలా దూరంలో ఉన్నామని ఆయనకు తెలుసు. (కీర్తన 51: 5) అందుకే కీర్తన 130:3, 4 వచనాలు ఇలా చెబుతున్నాయి: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? . . . నీయొద్ద క్షమాపణ దొరుకును.” అవును యెహోవా “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల” దేవుడు. (నిర్గమకాండము 34: 6) ‘యెహోవా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు.’ (కీర్తన 86: 5) ఎంత ఓదార్పుకరం! ఆశ్చర్యకరుడైన ఈ దేవుణ్ణి సేవించడం, ఆయన ప్రేమపూర్వకమైన, దయాపూర్వకమైన శ్రద్ధను అనుభవించడం ఎంత ఉపశమనాన్నిస్తుందో కదా!
7. యెహోవా సృష్టికార్యాల్లో ఆయన ప్రేమను ఎలా చూడవచ్చు?
7 యెహోవా సృష్టి కార్యాల్లో కూడా ఆయన ప్రేమను చూడవచ్చు. మన ఆనందం కోసం యెహోవా సృష్టించిన కనులకింపైన పర్వతాలు, అడవులు, సరస్సులు, మహాసముద్రాలవంటి అనేక అందమైనవాటిని గురించి ఆలోచించండి. మన జిహ్వ సంతృప్తి కోసం, మన పోషణ కోసం ఆయన ఎన్నో రకాల ఆహారపదార్థాలను దయచేశాడు. అంతేకాక యెహోవా ఎన్నో రకాల అందమైన, పరిమళాలను వెదజల్లే పువ్వులను, ఆకర్షణీయమైన జంతు ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన చేయవలసిన అవసరం లేకపోయినా మానవులకు ఆనందాన్నిచ్చే వాటిని ఆయన సృష్టించాడు. నిజమే, మనం ప్రస్తుత అపరిపూర్ణ స్థితిలో జీవిస్తూ ఈ దుష్ట లోకంలో ఆయన సృష్టిని పూర్తిగా ఆనందించలేము. (రోమీయులు 8:22) అయితే పరదైసులో యెహోవా మన కోసం పరదైసులో చేసేవాటి గురించి ఒక్కసారి ఊహించుకోండి! కీర్తనకర్త మనకిలా హామీ ఇస్తున్నాడు: “నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి [సరైన] కోరికను తృప్తి పరచుచున్నావు.”—కీర్తన 145:16.
8. యెహోవా మనపట్ల చూపిన ప్రేమకు అత్యంత విశిష్టమైన ఉదాహరణ ఏమిటి?
8 యెహోవా మానవాళిపట్ల చూపిన ప్రేమకు అత్యంత విశిష్టమైన ఉదాహరణ ఏమిటి? బైబిలు ఇలా వివరిస్తోంది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) మానవుల మంచితనాన్ని బట్టి యెహోవా అలా చేశాడా? రోమీయులు 5:8 దానికిలా సమాధానమిస్తోంది: “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” అవును మనలను పాపమరణాల దండననుండి విడిపించేందుకు విమోచన క్రయధనముగా ప్రాణాన్నివ్వడానికి దేవుడు తన పరిపూర్ణ కుమారుణ్ణి భూమికి పంపించాడు. (మత్తయి 20:28) అది దేవుణ్ణి ప్రేమించే ప్రజలు నిత్యజీవం పొందేందుకు మార్గం తెరిచింది. సంతోషదాయకంగా, దేవుని చిత్తం చేయాలని ఇష్టపడే వారందరిని ఆయన ప్రేమిస్తాడు, ఎందుకంటే బైబిలు మనకిలా చెబుతోంది: “దేవుడు పక్షపాతి కాడు . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.
9. యెహోవా తన కుమారుణ్ణి మన కోసం విమోచన క్రయధనంగా ఇచ్చాడనే వాస్తవం మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి?
9 యెహోవా తన కుమారుణ్ణి మన కోసం విమోచన క్రయధనముగా ఇచ్చి తద్వారా మనకు నిత్యజీవ మార్గం తెరిచాడనే వాస్తవం, ప్రస్తుతం మనం మన జీవితాలనెలా ఉపయోగిస్తున్నామనే దానిపై ఎలాంటి ప్రభావం చూపించాలి? అది సత్య దేవుడైన యెహోవాపట్ల మన ప్రేమను ఎక్కువ చేయాలి. అదే సమయంలో, దేవునికి ప్రాతినిధ్యం వహించే యేసు మాటలు వినాలని మనం కోరుకునేలా చేయాలి. “జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన [యేసు] అందరికొరకు మృతిపొందెను.” (2 కొరింథీయులు 5:15) యెహోవా ప్రేమను, కనికరాన్ని అనుకరించడంలో మాదిరికర్తయైన యేసు అడుగుజాడల్లో నడవడం ఎంత ఆనందాన్నిస్తుందో కదా! యేసు నమ్రతగలవారికి చెప్పిన విషయంలో అది స్పష్టమౌతోంది: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:28-30.
ఇతరులపట్ల ప్రేమ చూపడం
10. మనం తోటి క్రైస్తవులపట్ల ప్రేమ చూపగల కొన్ని మార్గాలు ఏమిటి?
10 యెహోవాకు, యేసుకు మనపై ఉన్నటువంటి ప్రేమే, మనకు మన తోటి క్రైస్తవులపై ఉందని మనమెలా చూపించవచ్చు? మనమలా చూపించగల అనేక మార్గాలను గమనించండి: “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.”—1 కొరింథీయులు 13:4-8; 1 యోహాను 3:14-18; 4:7-12.
11. మనం ఇంకా ఎవరిపట్ల ప్రేమ చూపించాలి, ఎలా చూపించాలి?
11 ఇంకా ఎవరిపట్ల మనం ప్రేమ చూపించాలి, ఎలా చూపించాలి? యేసు ఇలా చెప్పాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) అంటే ఇంకా మన తోటి క్రైస్తవులుగా మారనివారితో, దేవుడు తీసుకురానున్న పరదైసు పరిస్థితులుగల నూతనలోకం గురించిన సువార్తను మనం పంచుకోవాలి. మనలాంటి నమ్మకాలుగల ప్రజలకే మన ప్రేమ పరిమితం కాకూడదని యేసు స్పష్టంగా చూపించాడు, ఎందుకంటే ఆయనిలా చెప్పాడు: “మీరు [కేవలం] మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.”—మత్తయి 5:46, 47; 24:14; గలతీయులు 6:10.
‘యెహోవా నామమును స్మరిస్తూ నడవండి’
12. దేవుని నామము కేవలం ఆయనకు మాత్రమే ఎందుకు తగినది?
12 సత్య దేవుణ్ణి ఘనపరచడంలోని మరొక ప్రాముఖ్యమైన అంశం, యెహోవా అనే ఆయన విశిష్ట నామమును తెలుసుకోవడం, ఉపయోగించడం, దానిని ఇతరులకు నేర్పించడం. కీర్తనకర్త తన హృదయపూర్వక అభిలాషను ఇలా వ్యక్తం చేశాడు: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.” (కీర్తన 83:18) యెహోవా అనే నామమునకు “తానే కర్త అవుతాడు” అని అర్థం. ఆయన గొప్ప సంకల్పకర్త, ఆయన తన సంకల్పాలను ఎల్లప్పుడూ విజయవంతంగా నెరవేరుస్తాడు. ఆ నామము కలిగివుండగల హక్కు కేవలం సత్య దేవునికి మాత్రమే ఉంది, ఎందుకంటే మానవులు తమ ప్రయత్నాలు సఫలమౌతాయని నిశ్చయంగా ఎన్నడు చెప్పలేరు. (యాకోబు 4:13, 14) తన వాక్కును దేనికోసం పంపుతాడో ఆ పనిని అది తప్పక “సఫలముచేయును” అని యెహోవా మాత్రమే చెప్పగలడు. (యెషయా 55:11) అనేకులు తమ బైబిళ్ళలో మొదటిసారి దేవుని నామమును చూసి, దాని భావమేమిటో నేర్చుకున్నప్పుడు ఎంతో పులకించిపోయారు. (నిర్గమకాండము 6: 3) అయితే, వారు ‘యెహోవా నామమును ఎల్లప్పుడు స్మరిస్తూ నడుచుకొన్నప్పుడే’ ఆ జ్ఞానం నుండి ప్రయోజనం పొందుతారు.—మీకా 4: 5.
13. యెహోవా నామమును తెలుసుకోవడంలో, ఆయన నామమును స్మరిస్తూ నడవడంలో ఏమి చేరివుంది?
13 దేవుని నామము గురించి కీర్తన 9: 10 ఇలా నివేదిస్తోంది: “నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.” అంటే కేవలం యెహోవా అనే నామము తెలుసుకోవడం కాదు, అలా నామము తెలుసుకున్నంత మాత్రాన ఆయనపై నమ్మకముంచడమని దానర్థం కాదు. దేవుని నామము తెలుసుకోవడమంటే, యెహోవా ఎలాంటి దేవుడో అర్థంచేసుకొని కృతజ్ఞత చూపించడం, ఆయన అధికారాన్ని గౌరవించడం, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడం, అన్ని విషయాల్లోను ఆయనపై నమ్మకముంచడం అని అర్థం. (సామెతలు 3:5, 6) అదేవిధంగా, యెహోవా నామమును స్మరిస్తూ నడుచుకోవడమంటే, ఆయనకు సమర్పించుకొని ఆయన ఆరాధకుల్లో ఒకరిగా ఆయనకు ప్రాతినిధ్యం వహించడం, దేవుని చిత్తానికి అనుగుణంగా మన జీవితాన్ని నిజంగా ఉపయోగించడం అని అర్థం. (లూకా 10:27) మీరలా చేస్తున్నారా?
14. మనం యెహోవాను నిరంతరం సేవించాలనుకుంటే, విధ్యుక్త ధర్మమనే భావమే కాక ఇంకా ఏమి అవసరం?
14 మనం యెహోవాను నిరంతరం సేవించాలనుకుంటే మనం కేవలం విధ్యుక్త ధర్మమనే భావంచేత పురికొల్పబడకూడదు. అనేక సంవత్సరాలుగా యెహోవాకు సేవచేస్తున్న తిమోతికి, అపొస్తలుడైన పౌలు ఇలా ఉద్బోధించాడు: “దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.” (1 తిమోతి 4: 7) ఒక వ్యక్తిపట్ల కృతజ్ఞతాభావం నిండిన హృదయంనుండి భక్తి పుడుతుంది. “దేవభక్తి” యెహోవాపట్ల వ్యక్తిగతమైన ప్రగాఢ పూజ్యభావాన్ని వ్యక్తపరుస్తుంది. ఆయనపట్ల, ఆయన మార్గాలపట్ల ఉండే అమితమైన అభిమానం వల్ల ఆయనతో ఏర్పడే ప్రేమపూర్వక సాన్నిహిత్యాన్ని అది వెల్లడిచేస్తుంది. ప్రతిఒక్కరు ఆయన నామమును ఉన్నతంగా ఎంచాలని మనం కోరుకునేలా అది మనలను పురికొల్పుతుంది. మనం అద్వితీయ సత్యదేవుడైన యెహోవా నామమును నిరంతరం స్మరిస్తూ నడవాలనుకుంటే మన జీవితాల్లో దేవభక్తిని తప్పకుండా పెంపొందించుకోవాలి.—కీర్తన 37: 4; 2 పేతురు 3:11.
15. మనం దేవునికి అవిభాగిత భక్తిని ఎలా చూపవచ్చు?
15 దేవుణ్ణి అంగీకారయోగ్యంగా సేవించాలంటే మనం ఆయనను అవిభాగితంగా ఆరాధించాలి ఎందుకంటే ఆయన ‘రోషముగల దేవుడు.’ (నిర్గమకాండము 20:5) మనం దేవుణ్ణి ప్రేమిస్తూ అదే సమయంలో సాతాను దేవుడుగా ఉన్న ఈ దుష్ట లోకాన్ని ప్రేమించలేము. (యాకోబు 4: 4; 1 యోహాను 2:15-17) మనలో ప్రతిఒక్కరు ఎలాంటి వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారో యెహోవాకు ఖచ్చితంగా తెలుసు. (యిర్మీయా 17:10) మనం నిజంగా నీతిని ప్రేమిస్తే ఆయన దాన్ని గమనించి మన దైనందిన పరీక్షలను సహించడానికి మనకు సహాయం చేస్తాడు. ఆయన తన శక్తిమంతమైన పరిశుద్ధాత్మతో మనలను బలపరచి ఈ లోకంలోని విశృంఖల దుష్టత్వంపై విజయం సాధించడానికి మనకు సహాయం చేస్తాడు. (2 కొరింథీయులు 4: 7) పరదైసు భూమిపై నిత్యం జీవించాలనే మన బలమైన నిరీక్షణను కాపాడుకోవడానికి కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. అదెంత అద్భుతమైన ఉత్తరాపేక్షో కదా! మనమా ఉత్తరాపేక్ష విషయమై ప్రగాఢ కృతజ్ఞతతో ఉండి దానిని సాధ్యపరచిన సత్యదేవుడైన యెహోవాకు మనస్ఫూర్తిగా సేవచేయాలి.
16. లక్షలాదిమంది ఇతరులతోపాటు మీరు కూడా ఏమి చేయాలని కోరుకోవాలి?
16 నేడు భూవ్యాప్తంగా లక్షలాదిమంది కీర్తనకర్త ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించారు, ఆయనిలా వ్రాశాడు: “నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.” (కీర్తన 34: 3) అలా చేస్తున్నవారు అన్ని దేశాల్లోను అంతకంతకూ అధికమవుతున్నారు, మీరు కూడా వారిలో ఒకరై ఉండాలని యెహోవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు.
పునఃసమీక్షా చర్చ
• యెహోవా ఎలాంటి వ్యక్తి? ఆయన లక్షణాలను స్పష్టంగా అర్థంచేసుకోవడం వల్ల మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
• మనం ఇతరులపట్ల ప్రేమ ఎలా చూపించవచ్చు?
• యెహోవా నామము తెలుసుకొని, ఆయన నామమును స్మరిస్తూ నడుచుకోవడంలో ఏమి చేరివుంది?
[అధ్యయన ప్రశ్నలు]
[14వ పేజీలోని చిత్రాలు]
యెహోవా గొప్ప ప్రేమతో ‘తన గుప్పిలి విప్పి ప్రతిజీవి కోరికను తృప్తిపరుస్తాడు’